నేను సైతం! - పద్మావతి దివాకర్ల

Nenu saitam

రమేష్‌కి తన చిన్ననాటి స్నేహితులను, క్లాస్ మేట్సును చాలా రోజుల తర్వాత కలుసుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందర్నీ కలిసి పాతికేళ్ళు దాటిపోయిందేమో! పదో తరగతి వరకూ ఆ స్కూల్లోనే చదువుకున్న రమేష్ ఆ తర్వాత తన తండ్రికి వేరే ఊరికి బదిలీ అవడంతో కాలేజీ చదువులు ఇంకో ఊళ్ళో సాగాయి. ప్రస్తుతం బెంగుళూరులో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కాలేజీలో చదివేటప్పుడు, ఇంజినీరింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది స్నేహితులున్నా చిన్ననాటి స్నేహితుల విషయమే వేరు, ఆ ముచ్చట్లే వేరు.

ట్రైన్‌లో బెర్తుపై పడుక్కున్న రమేష్‌కి నిద్రపట్టలేదు. తన చిన్న నాటి విషయాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఓ రోజు స్కూల్ ఎగ్గొట్టి తన క్లాస్‌మేట్స్ శ్రీరాం, మోహన్‌తో కలసి మేట్నీ సినిమాకి వెళ్ళి తన తండ్రికి దొరికిపోయి తన్నులు తిన్న సంగతి గుర్తుకొచ్చింది. తమకు మార్కులు తక్కువ వేసాడని ఎప్పుడూ తెల్లటి బట్టలు వేసుకొనే షోషల్ టీచర్ బట్టలపై వెనకనుంచి ఇంకు జల్లడం, అది ఇంకో క్లాస్‌మేట్ చందు కళ్ళల్లో పడటం ఆ తర్వాత ఆ మాస్టర్ తమ ముగ్గురి భరతం పట్టడం కూడా జ్ఞప్తికి వచ్చింది. పదవ తరగతి చదువుతున్నప్పుడు ప్రేమానందం తమ క్లాస్‌మేటైన ప్రమీలకి ప్రేమలేఖ రాయడం గుర్తుకువచ్చి నవ్వు వచ్చింది. ఆ ప్రేమలేఖ క్లాస్ టీచర్, హెడ్‌మాస్టర్ దృష్టిలో పడనే పడింది, ప్రమీల కంప్లైంట్ ఇవ్వడంతో. గట్టిగా చీవాట్లు పెట్టడమే కాక, పదిమంది ముందు ప్రేమానందం రాసిన ఆ ప్రేమలేఖ చదవడం అందరికీ నవ్వు తెప్పించింది. ఆ పదిలైన్ల ప్రేమలేఖలో పాతికపైగా తప్పులున్నాయి. అందరూ నవ్వడంతో పాపం ప్రేమానందం మొహం నల్లగా మాడిపోయింది. క్లాస్ మేట్స్ అందరి ముందు తల కొట్టేసినట్లైంది. ఆ తర్వాత చాలారోజుల వరకూ ఎవరికీ మొహం చూపించలేకపోయాడు. అలాంటి సంఘటనలు తలంపుకు వచ్చి, తమ కుర్ర చేష్టలకు తెగ నవ్వు వస్తోంది రమేష్‌కి. ఇప్పుడు ఎక్కడున్నాడో ఆ ప్రేమానందం. పదవ తరగతి తర్వాత అతని గురించి మరి తెలియనేలేదు.

ఏడాది క్రితం శ్రీరాం కలిసేంతవరకూ చాలా మంది చిన్ననాటి స్నేహితుల గురించి తనకి తెలియనే లేదు. తనతో పాటు కాలేజీ చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న మహా అయితే ఏ ఇద్దరు ముగ్గురు గురించి మాత్రమే తెలుసు. అయితే శ్రీరాం అలా కాదు. వాడికి స్నేహితులంటే ప్రాణం. తను ఓ ప్రముఖ కంపెనీలో సేల్స్ రెప్రజెంటేటివ్‌గా ఊళ్ళు పట్టుకు తిరగడంతో వెళ్ళిన ప్రతీ ఊళ్ళో తన స్నేహితుడెవరైనా ఉన్నారా అని వాకబు చేసేవాడు. అలా చాలా మంది చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వాళ్ళ వివరాలు తెలుసుకునేవాడు. ప్రస్తుతం అందుబాటులో సాంకేతిక సౌలభ్యం వల్ల అతని పని చాలా సులభమైంది. రెండేళ్ళ క్రితం ముందు తనకి తెలిసిన కొద్దిమంది స్నేహితులతో వాట్సప్‌గ్రూప్ ప్రారంభించాడు. ఆ స్నేహితులకు టచ్‌లో ఉన్న స్నేహితులూ కూడారు. మెల్లగా అది విస్తరించుకుంటూ పోయి ఇప్పుడు దాదాపు వందమంది సభ్యులు ఉన్నారు ఆ గ్రూప్‌లో. ఏడాది క్రితం వరకూ తీరికలేని ఉద్యోగ బాధ్యతలతో రమేష్ ఎవరితోనూ టచ్‌లో లేడు. అయితే అకస్మాత్తుగా కిందటి ఏడు ఓ పెళ్ళిలో తనను కలసిన శ్రీరామే ముందు తనను గుర్తు పట్టాడు. చాలా రోజుల తర్వాత శ్రీరాంని చూసి సంతోషం పట్టలేకపోయాడు రమేష్. ఆ రోజంతా వాళ్ళు చాలా విశేషాలు చెప్పుకున్నారు. రమేష్ కాంటాక్ట్ నంబర్ తెలుసుకొని తన 'చిన్ననాటి స్నేహితులు ' వాట్సప్ గ్రూప్‌లో మెంబర్ని చేసాడు. ఆ తర్వాత చాలా మంది గురించిన విషయాలు రమేష్‌కి తెలిసాయి. ఇంకా ఓ పాతిక మంది గురించిన వివరాలు మాత్రమే తెలియాలి, అంతే!

గత రెండేళ్ళుగా పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుతున్నా తనకు ఇదే మొదటి సారి కావడంతో చాలా ఉద్విగ్నతతో ఉన్నాడు రమేష్. ట్రైన్ ఉదయం ఏడు గంటలకి తన గమ్యం చేరుకుంది.

స్టేషన్లో తన కోసం ఎదురుచూస్తున్న శ్రీరాం కనపడగానే చేయి ఊపాడు రమేష్. శ్రీరాం కూడా నవ్వుతూ ట్రైన్ దిగిన రమేష్‌ని పలకరించాడు. ఆ తర్వాత శ్రీరాంకారులో ఇద్దరూ అతిథి భవనం చేరుకున్నారు. రమేష్‌ని చూడగానే అతనికి ఎదురొచ్చి ఆహ్వానించారు మోహన్, జగన్నాథ్, ప్రభాకర్, భాస్కర్ తదితరులు. బాల్య స్నేహితులతో ముచ్చటించుకుంటే సమయం అసలు తెలియలేదు. బ్రేక్‌ఫాస్ట్ అయినాక అందరూ సమావేశ స్థలంకి వెళ్ళారు. తాము చదువుకున్నస్కూల్ పక్కనే ఉన్న ఓ అడిటోరియంలో ఏర్పాట్లన్నీ జరిగాయి.

అక్కడ ప్రేమానందంని చూసి ఆశ్చర్యపోయాడు రమేష్. "అదేంటి నువ్వు ఎక్కడున్నావో నీ గురించి అసలు తెలియలేదని అన్నాడు శ్రీరాం." అన్నాడు సంతోషంగా స్నేహితుడితో కరచాలనం చేస్తూ.

"జస్ట్ రెండు రోజుల క్రితమే వాడి గురించి తెలిసింది. అందర్నీ ఆశ్చర్య పరుద్దామని చెప్పలేదు." అన్నాడు శ్రీరాం.

"నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా టెంత్ క్లాసులో నువ్వు రాసిన ప్రేమలేఖే గుర్తొచ్చి నవ్వొస్తుందిరా, ఇంతకీ మన క్లాస్ మేట్ ఆ ప్రమీల గురించి ఏమైనా తెలిసిందా? ఆమె ఇప్పుడు ఎక్కడుందో?" అన్నాడు రమేష్.

"ఇప్పుడు ఆ ప్రమీలను చూడాలనుకుంటున్నారా? రండి పరిచయం చేస్తాను!" అన్నాడు శ్రీరాం ముందుకి దారి తీస్తూ. అందరూ సంభ్రమశ్చర్యాలతో కుతూహలంతో అతనివెంట నడిచారు. దూరంగా కుర్చీలో ఒక్కర్తీ కూర్చొని సెల్‌ఫోన్ చూసుకుంటున్న ప్రమీల కనపడింది.

"మీట్ మిసెస్ ప్రమీల ప్రేమానంద్!" అన్నాడు ఆమెని అందరికీ పరిచయం చేస్తూ శ్రీరాం.

'ఆఁ...!' అని అందరూ ఒక్కసారి నోర్లు తెరిచారు. మరుక్షణం అందరూ తమ దృష్టి ప్రేమానందంవైపు సారించారు ఆశ్చర్యంగా.

"ఆ ప్రేమలేఖ రాసిన పదేళ్ళ తర్వాత మా బంధం ముడిపడిందిరా!" అని ప్రమీల వైపు చూసి, "ఆ ప్రేమలేఖే నా కొంప ముంచింది. ఈ రాక్షసిని పెళ్ళాడవలసి వచ్చింది." అన్నాడు చిలిపిగా.

ప్రమీల చిరుకోపంతో, "యూ...!" అంటూ అక్కడే ఉన్న పేపరుతో ప్రేమానందం వీపుపై చిన్నగా తట్టింది.

"చూసారా...చూసారా...అందరి ముందు ఎలా కొట్టిందో నన్ను. ఇక్కడే ఇలా ఉంటే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి." అన్నాడు నవ్వుతూ.

అలా నవ్వులతో ఆ రోజంతా గడిచిపోయింది. ఆ మరుసటిరోజు ఉదయం అందరూ తాము చదివిన స్కూలుకి వెళ్ళారు. క్లాస్ రూముల్లోకి వెళ్ళి కొద్దిసేపు విద్యార్థులనడుమ గడిపారు. అక్కడ బెంచీపైన కూర్చుంటే మళ్ళీ పాత రోజులు తిరిగివచ్చాయా అని అనిపించింది. కొద్దిసేపు అందరూ చిన్నపిల్లలై పోయారు. ఆ జ్ఙాపకాలని పదిలపర్చుకోవాలని ఫోటోలు, సెల్ఫీలు దిగారు.

ఆ తర్వాత స్కూలు ఆడిటోరియంకి చేరుకున్నారందరూ. ఆ సమావేశంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అవినాష్ పేరుపేరునా అందరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అల్పాహారం తీసుకున్న తర్వాత వారందరితో మాట్లాడుతూ, "ఈ స్కూల్లో చదివి జీవితంలో బాగా పైకి వచ్చినందుకు మీకందరికీ నా అభినందనలు. మన స్కూలు చదువులకే కాక ఆటలకి, క్రీడలకీ కూడా మన రాష్ట్రంలోనే పేరుపొందింది. మీరు చదివే రోజుల్లో ఈ స్కూలుకి ఉన్న ప్రతిష్ట నిలుపుకోవడానికి నేను, నా సహోద్యోగలందరమూ నిరంతరం కృషి సల్పుతూనే ఉన్నాం. ఇప్పటికే మీ స్నేహితులలో ఇక్కడ స్థిరపడిన శ్రీరాంగారూ, క్రిష్ణగారు మాకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తున్నారు. అలాగే ఈ స్కూల్లో చదివిన ఒకప్పటి స్టేట్ ఛాంపియన్ అయిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు శ్రీధర్‌గారు మన స్కూలు విద్యార్థులకు అన్ని క్రీడల్లో, ఆటల్లో కోచింగ్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. నిధుల కొరతవల్ల స్కూలు లాబరీటరీకి కావలసిన పరికరాలు లేవు. అలాగే వర్షాలవల్ల కొన్ని రూములు పాడయ్యాయి. మరమ్మత్తులకు ప్రభుత్వం నుండి కావలసినంత నిధులు అందడం లేదు. వివిధ క్రీడలకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి నిధులు లేవు. మీరందరూ ఈ స్కూల్లో చదువుకొని జీవితంలో ఎంతో పైకి వచ్చారు. మీ అందరికీ మీ స్కూలుపై ఉండే అభిమానమే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మీరందరూ కలసి ఓ చెయ్యవేస్తే స్కూలు మరమత్తులు అవీ సులభంగా చేయించవచ్చు. మీ స్కూలుకి మీ వంతు సాయం చేసినట్లు ఉంటుంది." అన్నాడు.

అవినాష్ మాటలు విన్న రమేష్ తదితరులు ఆలోచనలో పడ్డారు. "ఇక్కడ చదుకువుకున్న చదువు మా భావి జీవితానికి పునాది వేసింది. మేము చదువుకున్న మా స్కూలుకి ఉడుతాభక్తిగా సహాయం చెయ్యడం మా కర్తవ్యం. ఆ విధంగా ఈ స్కూలుకి మా ఋణం తీర్చుకున్నట్లు ఉంటుంది. నా వంతుగా నేను లక్షరూపాయాలు ఈ మహత్కార్యానికి వినియోగించదలిచాను. అందరూ తలో చెయ్యవేస్తే స్కూలు మరమత్తులన్నీ పూర్తి చేయవచ్చు. వచ్చే సంవత్సరం మనం మళ్ళీ ఇక్కడే సమావేశమై ఆనందంగా గడపవచ్చు." అన్నాడు రమేష్. వెంటనే మిగతా అందరూ కూడా తమ వంతు ఆ కార్యంలో భాగం పంచుకునేందుకు తమ అంగీకారం తెలియపరచారు.

'నేను సైతం' అని అందరూ ముందుకు వచ్చారు. ఆ డబ్బులన్నీ స్కూల్ అభివృద్ధికోసం కేటాయించిన ప్రత్యేక ఖాతాలో జమ చేసారు. అందర్నించీ మంచి స్పందన వచ్చినందుకు అవినాష్ చాలా సంతోషించాడు.

శ్రీరాం లేచి నిలబడి, "ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరమూ ఇక్కడ కలుసుకోవడం ఆ సంతోషానికి ఒక కారణమైతే, మనల్ని మనిషిగా నిలబెట్టిన స్కూల్ ఋణం తీర్చుకోవడానికి ఈ అవకాశం రావడం ఇంకో కారణం. మనలాగే పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదివిన స్కూళ్ళని మరిచిపోకుండా తమ ఇతోధిక సహాయం అందిస్తే మన విద్యావ్యవస్థ మంచి అభివృద్ధి సాధిస్తుంది." అన్నాడు సంతోషంగా.

రమేష్ దృష్టి అక్కడ ఒంటరిగా విచారంగా కూర్చున్న కూర్మారావుపై పడింది. ఏమైంది అని రమేష్ తరచి తరచి అడిగితే, "మీరందరూ స్కూల్ కోసం ఆర్థిక సహాయం చేసారు. నాకు కూడా మీలా చెయ్యాలని ఉన్నా నా ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. నాకా అవకాశమే లేదు." అన్నాడు విచార వదనంతో.

అనునయంగా కూర్మారావు భుజం తట్టాడు రమేష్. "నీకు అవకాశం లేదని ఎవరన్నారు? పై చదువులు చదివే అవకాశంలేని నువ్వు టూషన్స్ చెప్పుకుంటూ ఇంటి బాధ్యతలు మోస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని తెలుసు. అయినా నువ్వు కూడా నీ వంతు సహాయం చెయ్యవచ్చు. నీ విరామ సమయంలో ఈ స్కూల్లో క్లాసులు తీసుకొని విద్యార్థులని తీర్చి దిద్దవచ్చు. నీకు లెక్కల్లో మంచి ప్రవేశం ఉంది. మేము మా డౌట్లు నీ దగ్గరే తీర్చుకొనేవాళ్ళం కదా! ఆ విధంగా మా అందరికన్న నువ్వే స్కూల్‌కి ఎక్కువ సహాయపడగలవు." అన్నాడు.

ఆ మాటలు వింటూనే కూర్మారావు ముఖం వికసించింది. లేచి ఆ విషయమే ప్రకటించాడు అందరిముందు. అతని నిర్ణయానికి అందరూ హర్షం వెలిబుచ్చారు. ఆ స్నేహితులందరికీ ఓ మంచి పని చేస్తున్నామన్న తృప్తి కలిగింది.

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.