ఇంగ్లీషు పిచ్చోడు - సి.హెచ్.ప్రతాప్

english pichchodu

సమాజంలో రకరకాల పిచ్చోళ్ళు వుంటారు.సినిమా పిచ్చి, రాజకీయాల పిచ్చి, మందు పిచ్చి, పుస్తకాల పిచ్చి, సినిమా, సీరియళ్ళ పిచ్చి వగైరా వగైరా. కాని టి వెంకటేశ్వర్లు అనే నామధేయం గల మన కధానాయకుడికి ఇంగ్లీషు పిచ్చి వుంది. ఒకానొక సందర్భంలో హైస్కూలులో అంగ్లం సబ్జెక్టులో నూటికి ఇరవై మార్కులు మాత్రం వచ్చి ఫెయిల్ అయితే, ఇంగ్లీష్ టీచర్ అతగాడిని క్లాసు నడిబొడ్డులో అందరి ముందు నిలబెట్టి నా వంటి ఘనాపాటి అంత చక్కగా ఇంగ్లీషు చెప్పినా నువ్వు దారుణంగా ఫెయిల్ అయ్యావంటే నువ్వు దున్నపోతుతో , అడ్డగాడిదతో సమానం. ఇంగ్లీషు రాని పల్లెటూరి బైతుతో సమానం. నువ్వొక్కడివే ఈ క్లాసులో చెడచేరావు. ఎంచక్కా చదువు వదిలేసి మీ పల్లెటూరికి వెళ్ళి గొడ్లు కాచుకో అని ఇష్టానుసారంగా తిడితే వెంకటేశ్వర్లు ముఖం కందిగడ్డలా అయ్యింది. అందునా క్లాసులో వున్న అమ్మాయిలందరూ తననే చూసి ఫక్కున నవ్వడం, ఇంగ్లీషు రాని పల్లెటూరి గొడ్డు, మట్టి పిసుక్కునే చవట అన్నట్లుగా కామెడీగా చూసేసరికి వెంకటేశ్వర్లుకు ఎలాగైనా ఇంగ్లీషు పై ప్రావీణ్యం సంపాదించాలన్న కసి పెరిగింది. పోయున చోటే వెతుక్కోవాలంటారు, నేను తిట్లు అతి ఘోరంగా అవమానింపబడిన చోటే అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడి గౌరవాలు అందుకుంటాను అని చాణక్య శపధం చేసాడు. నాటితో వెంకటేశ్వర్లుకు ఆంగ్లం నేర్చుకునే ప్రహసనం మొదలయ్యింది. ఈ యాత్రను భాగంగా ఇంగ్లీషు పుస్తకాలు చదవడం, ఇంగ్లీషులో రాయడం తో ప్రారంభించగా కొన్నాళ్ళకు ఇంగ్లీషులో మాత్రమే చదవదం, రాయడం, ఇంగ్లీషు సినిమాలే చూడడం, అర్ధం కాని ఇంగ్లీషు పాటలు పాడడం వరకు వెళ్ళింది. నిద్రలో కూడా ఇంగ్లీషులోనే కలవరించేవాడని వాళ్ళమ్మ అందరికీ చెబుతూ కళ్ళొత్తుకునేది. ఇప్పుడు ఇ స్పీక్ ఇంగ్లీష్, ఈ టాక్ ఇంగ్లీష్, ఇ ఈట్ ఇంగ్లీష్ ఐ డ్రింక్ ఇంగ్లీష్,ఇంగ్లీష్ ఈస్ మై బర్త్ రైట్ అండ్ ఇ షల్ హావ్ ఇట్ వంటి స్వంత పదాల ప్రయోగం వరకూ వెళ్ళింది. ఈ ప్రహసనంలో మాతృభాషకు తీరని ద్రోహం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు మాటిమాటికీ బాధ పడుతుండేవారు.

టి వెంకటేశ్వర్లుకు ఇంతింత వటుడింతై అన్న చందాన ఇంగిలిపీసు భాషా పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడసాగింది. వస్త్రధారణ కూడా ఇంగ్లీషు వారిలా వేసుకోవడం మొదలెట్టాడు. పొడవాటి జుత్తు, చిందర వందరగా గడ్డం మీసాలు పెంచడం, సినిమాలు , షాపింగులకు వెళ్ళెట్టప్పుడు టోపీ పెట్టుకోవడం,చిన్న చిన్న బెర్ముడాలు, టైట్ గా వుండే తీషర్టులు వేసుకోవడం చేస్తున్నాడు. ఇంగ్లీషు సినిమాలు చూస్తూ అందులో హీరో వేష భాషలను అనుకరించసాగాడు. డిగ్రీ పూర్తయి అదృష్టవశ్శాత్తు ఉద్యోగంలో చేరాక వెంటనే తన పేరు టి.వి.లు కింద మార్చేసుకున్నాడు. బ్యాంకుకు వచ్చే కస్టమర్లందరితో , వారి ముందు వెనుకలు చూడకుండా కూడా ఆంగ్లంలో మాట్లాడడం చేస్తున్నాడు. అసలే వచ్చీ రాని భాష, అందులో వ్యాకరణ , ఉచ్చారణ దోషాలు ఎన్నో. అయినా సరే మాట్లాడుతూ..మాట్లాడుతూ పోతుంటే ఎప్పటికైనా అందులో ప్రావీణ్యం వచ్చి తప్పులు లేకుండా మట్లాడడం సాధ్యపడుతుందన్న తన స్నేహితుడి సలహాతో ఇష్టానుసారంగా ఏకధాటిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. కాస్త చదువుకున్న కస్టమర్లకైతే ఫరవాలేదు, కాని అసలు ఇబ్బంది అంతా ఇంగ్లీష్ రాని వేళ్ళతోనే. ఏమిటంటున్నారు బాబు, నాకైతే ఒక్క ముక్క కూడా అర్ధం కావడం లేదని ఎవరైనా ఖాతాదారులు అంటే , మీ కూడా ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వారిని తెచ్చుకోండి , అంతే తప్ప నన్ను ఇంగ్లీషేతర భాషల్లో మాట్లాడమని అడక్కండి అని ఖరాఖండీగా చెప్పేస్తున్నాడు. ఇక తప్పదన్నట్లు వారికూడా అనువాదకులను తెచ్చుకుంటే, కూన్ని సందర్ర్భాలలో ఆ అనువాదకులకు టివిలు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాక, బుర్ర గోక్క్కోవడం కూడా జరుగుతొంది.

అతని ఈ ఆంగ్ల భాష విన్యాసాలు తట్టుకోలేక చాలా మంది బ్యాంక్ మేనేజర్ కు ఫిర్యాదు కూడా చేసారు. అయితే టివిలు పై వచ్చిన ఫిర్యాదు పై ఏ బ్యాంకు నిబంధన ప్రకారం చర్య తీసుకోవాలో అర్ధం కాక కౌన్సలింగ్ చేసాడు. కాస్త అందరికీ అర్ధమయ్యే భాషలో మాట్లాడమని చెప్పిసూసినా టివిలు వినలేదు. ఇంగ్లీష్ మన బిజినెస్ లాంగ్వేజ్ కనుక దానిలోనే మాట్లాడుతానని ఖరాఖండీ గా చెప్పాడు.పైగా అలా అడిగినప్పుడల్లా ఇంగ్లీషు భాష ప్రావీణ్యం పై పెద్దగా లెక్చర్ కూడా ఇచ్చేవాడు.

టివి లు కు ఇప్పుడు పెళ్ళీ చేసుకునే వయస్సు వచ్చింది. అయితే ఈ ఇంగ్లీషు పిచ్చోడిని అసలు ఏ పిల్ల అయినా ఇష్టపడి పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని వాళ్ళమ్మ ఒకటే ఆందోళన పడుతోంది.

మొదటి పెళ్ళిచూపులలో టివిలు చూపించిన తన ఇంగ్లీషు భాషా పాండిత్యానికి భయపడి పెళ్ళికూతురు నో అని బిగ్గరగా అరిచింది. ఆమె ఉద్రేకానికి భయపడ్డ పెళ్ళికూతురు తండ్రి వెంకటేశ్వర్లును మెడపట్టీ బయటకు గెంటినంత పని చేసాడు. పిచ్చోడిని నా కూతురికి కట్టబెట్టి ఆమె జీవితాన్ని నాశనం చెయ్యలేనని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు.

అలా మొదలైన పెళ్ళిచూపుల తంతు ఒక ఇరవై సార్లు అప్రతిహతంగా సాగింది. అన్ని చోట్లా అదే సీను రిపీటయ్యింది.టి వి లు ఇంగ్లీషు పాండిత్యానికి అవతలివారు హడిలిపోతున్నారు.

జరుగుతున్న పరిణామాలతో టివిలు వాళ్ళమ్మ తీవ్రమైన నిర్వేదానికి లోనతోంది. ఇదివరకట్లో ఆడపిల్లలు మెడకు గుదిబండ అనేవారు. ఇప్పుడు మగపిల్లలు గుదిబండలా తయారవుతున్నారు.

కొడుక్కి ఎలాగైనా పెళ్ళంటూ జరిగితే నడిచి నీ కొండకు వస్తానని ఆ ఏడుకొండలవాడికి మొక్కుకుంది ఆవిడ.టివిలు నాన్న మాత్రం తనకేం పట్టనట్లు అదేదో సినిమాలో అంతేగా .. అంతేగా అనే తండ్రిలా భార్య చెప్పినదానికి తల ఊపడమే తప్ప తన స్వంత అభిప్రాయం ఏనాడూ బయట ఓట్టే సాహసం చెయ్యలేదు.

ఒక సందర్భంలో ఒక పెళ్ళిలో ఆవిడకు చిన్ననాటి స్నేహితురాలు కలిసింది. మాటల్లో కొడుకు యొక్క పెళ్ళి వ్యవహారం స్నేహితురాలికి చెప్పి కళ్ళలో నీరు కక్కుకుంది ఆవిడ.

దీనినే వైద్య భాషలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటారని, ఇది వున్నవారు దేనిని పట్టుకుంటే దానిలో అసాంతం మునిగిపోయి ఒకే పని లేదా అలవాటును పదే పదే చేయడాన్ని నియంత్రించుకోలేకపోవడాన్ని (కంపల్సివ్‌) స్థూలంగా ఓసీడీ వ్యాధిగా చెబుతారని, ఓసీడీతో బాధపడుతున్న ప్రముఖులు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మొన్నటి వరకు అమెరికాను పాలించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఓసీడీ బాధితుడే. స్కూల్లో, కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన టీచర్‌ డెస్క్‌ ల వద్దకు కూడా వెళ్లేవారు కాదట.

ట్రంఫ్‌ టీచర్లకు షేక్‌ హ్యాండ్‌ కూడా ఇచ్చేవారు కాదట. ఎందుకంటే చేతిపై పదిహేడు వేల బ్యాక్టిరియా ఉంటుందని భయపడేవారట. ట్రంప్‌ ఆ భయం పోయేందుకు చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత ఓసీడీ తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా మాత్రం నయం కాలేదు అని ఆయమ్మ ఉపనస్యసించింది..

కొడుక్కి వచ్చిన సంబంధం గురించి వాకబు చేస్తే అది చాలా మంచి సంబంధం అని తెలిసింది. పెళ్ళి కూతురు సీత నిజంగా సీతా దేవిలా, శాస్త్రీయంగా, సంస్కారవంతంగా, లక్షణంగా వుంది. వారి కుటుంబం కుదా సంప్రదాయబద్ధమైన కుటుంబం అని తెలిసింది. ఈ సంబంధం కలుపుకుంటే నిజంగా తమకు ఎంతో మేలు జరుగుతుందనిపించింది ఆవిడకు. తన స్నేహితురాలు చెప్పిన ప్లాన్ ప్రకారం కాబోయే కొడలిని రహస్యంగా కలిసి విషయం అంతా చెప్పింది. వెంకటేశ్వరులు గాని నిజంగా ఆమెకు నచ్చితే, పెళ్ళి చచేసుకునే ఉద్దేశ్యం గనక వుంటే వాడి ఇంగ్లీషు పిచ్చి మానిపించేందుకు తనకు సహకరించాలని కోరింది. ఒకవేళ నచ్చకపోతే ఇక సమస్యే లేదు.

ఒక శుభముహూర్తాన టి వి లు కు మేరేజ్ లుక్స్ ఫిక్స్ అయ్యాయి. ఇంగ్లీష్ దొరలా మేకప్ చేసికొని పెళ్ళివారింటికి తల్లిదండ్రులతో వచ్చాడు టివిలు.

పెళ్ళి చూపుల్లో అన్ని ఇంగ్లీషు వారి వంటకాలే వడ్డించబడ్డాయి. బర్గర్, పిజ్జా, జాం బ్రెడ్, గ్రీన్ టీ మొదలైనవి. తినడానికి స్పూన్స్, ఫోర్కులు ఇచ్చారు.

అమ్మాయి తల్లిదండ్రులు ఇంగ్లీషులోనే మాట్లాడారు. మధ్యలో వారి పనిమనిషి అదే మేయిడ్ సర్వెంట్ వచ్చి ఇంగ్లిషులో హాయ్ చెప్పి వెళ్ళింది. బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఇంగ్లిష్ పాట అతి కర్ణకఠోరంగా వినిపిస్తుంటే అమ్మాయి తాలూకు వారందరూ బ్యాలే స్టెప్పులు వెస్తున్నట్లు తన్మయత్వంతో ఊగిపోతున్నారు.

ఇక ప్రైవేట్ మీటింగులో పెళ్ళికూతురు సీత అతి మోడ్రన్ గా డ్రస్ చెసుకుంది. వెంకటేశ్వర్లును పక్కా ఇంగ్లిష్ అమ్మాయిలా హాయ్ , హౌ ఆర్ యు గై, ఫీల్ ఫ్రీ ఇన్ థిస్ డేట్ అంటూ ఇంగ్లీషులో దంచేసింది.

ఆ ఇంగ్లీషు వాతావరణానికి ఇంప్రెస్ అయిపోయి లు పెళ్ళికి వొ కె చెప్పేసాడు.

ఇద్దరికీ సాంప్రదాయబద్ధంగా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళి కూడా ఇంగ్లీషు వారి పద్ధతిలో చేసుకుందామనుకున్నాడు కాని వాళ్ళమ్మ నూతి లోకి దూకుతానని భయపెట్టేసరికి కిమ్మనకుండా తెలుగు వారి సంప్రదాయ పద్ధతిలోనే పెళ్ళికి ఒప్పుకున్నాడు.అంతేకాకుండా ఇంగ్లీషు పెళ్ళిళ్లలో జరిగే విధంగా పిళ్ళికూతురిని ఇంగ్లీషు ముద్దు పెట్టుకుందామన్న తన కోరికను కూడా పెద్దవాళ్ళు కొట్టిపడెయ్యడంతో ఒకింత నిరాశకు గురయ్యాడు.

కొద్ది రోజుల తర్వాత ఒక శుభ ముహూర్తంలో ఇద్దరికీ పెళ్ళయ్యింది. గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం ఇత్ద్యాది కార్యక్రమాల తర్వాత నూతన దంపతులిద్దరికీ శోభనం.

అందంగా అలంకరించిన పూల పానుపు పై జీన్స్, బెర్ముడాస్ వేసుకొని యాపిల్ జ్యూస్ తాగుతూ కూర్చున్నాడు వెంకటేశ్వర్లు. తర్వాత జరగబొయే కార్యక్రమం గురించి రక రకాల ఇంగ్లీష్ సినిమాలో సన్నివేశాలలో ఊహించుకుంటూ కూర్చున్నాడు.

అంతలో రతీదేవిలా అలంకరించుకొని సీత పాల గ్లాసుతో వచ్చింది. వచ్చీ రాగానే పాల గ్లాసు పక్కన పెట్టి, పక్క గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని లోనెక్, టైట్ టి షర్టు, చిన్న బెర్ముడాలో వచ్చింది. హాయ్ లూ. టు డే ఈజ్ ఏ వెరీ నైస్ డే. లెట్స్ హావ్ ఫన్ గయ్. నాకూ ఈ సంప్రదాయాలంటే బహు చిరాకు. కాని అమ్మ, నాన్నల పోరు పడలేక ఇలా పల్లెటూరి బైతులా వుండాల్సి వస్తొంది.ఇక ఫ్రం టు డే అయాం ఎ ఫ్రీ గై. లెట్స్ హవ్ అ లివింగ్ ఇన్ రిలేషన్ . ఐ లైక్ అమెరికన్ కల్చర్. ఐ లైక్ రిలేషన్ విత్ మెనీ గైస్ అండ్ హావ్ ఫన్. మై ఎక్స్బాయ్ ఫ్రెండ్ యూజ్డ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీ కల్చర్ ఇన్ అమెరికా అంటూ ఇంగ్లీషులో సీత దంచేస్తుంటే వెంకటేశ్వర్లుకు కళ్ళు బైర్లు కమ్మినట్లయ్యింది. అసలు సీత వేష భాషలు చూడగానే సగం ప్రాణం పోయినట్కయ్యింది.మూర్తీభవించిన సహజ సౌందర్యంతో ,తెలుగు వారి సత్ సంప్రదాయాలకు ప్రతీకలా , నడిచే దేవతలా అనిపించే సీతను ఈ అర్ధ నగ్న దుస్తులలో చూడడం తోనే కడుపులో దేవినట్లయ్యింది. తాను చిన్న చిన్న హాఫ్ నిక్కర్లతో, తొడలన్నీ కనిపించేలా వేసుకొని రోడ్డు మీదకు వెళ్తుంటే అలా వెళ్ళొద్దని, అందరికీ ఎంతో ఇబ్బందిగా వుంటుందని అమ్మానాన్నలు ఎన్నో సార్లు చెప్పినా తాను విన్లేదు. ఇదే ఇంగ్లిషు కల్చర్ అని మీసాలను మెలేసాడు. పాత చింతకాయ పచ్చడిలా లుంగీ, షర్టు వేసుకోవడం తన వంటి ట్రెండీలకు తగదని వాదించాడు. కాని ఇప్పుడు భార్య అదే కల్చర్ ను ఫాలో అవుతుంటే తాను తట్టూకోలేకపోతున్నాడు.

ఆ రాత్రి సీత అసలు తనను ముట్టుకోనివ్వలేదు. ముందుగా మూడు నెలలు డేటింగ్ చేద్దామంది. ఒకరినొకరు అర్ధం చేసుకుందామంది. తర్వాత ఇద్దరికీ టెస్టులు చేయించి హెల్త్ కంపాటిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయించుకుందాం. అటు తర్వాతే శారీరక కలయిక. హెల్థ్ లేదా మెంటల్ కంపాటిబిలిటీ లేకపోతే వెంటనే డైవర్స్ తీసుకుందామంది. ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రెడీగా వున్నాడంది.

కాపురం ప్రారంభమయ్యాక సీత పుర్తిగా ఆధునిక పద్ధతులు పాటించడం ప్రారంభించేది. భోజనంలో సలాడ్స్, పిజ్జా, బర్గర్, టొస్ట్ బ్రెడ్ వంటి ఆంగ్లేయుల పదార్ధాలనే వందేది. గడ్డిలా వుండే అవి తినలేక నెల రోజులకే వెంకటేశ్వర్లు లంఖణం చేసినవాడిలా తయారయ్యాడు. కళ్ళు లోతుగా వెళ్ళిపొయాయి. ముఖం పీక్కుపోయింది. గడ్డం కూడ చేసుకోవడం మానేస్తున్నాడు. ఏం తిన్నా, చివరకు మంచి నీళ్ళు తాగిన కడుపులో దేవేస్తోంది.

పైఎచ్చు ఇంట్లో వుండేటప్పుడు బిగువైన , చిట్టి, పొట్టీ దుస్తులు, బయటకు వెళ్తున్నప్పుడు జీన్స్, టీ షర్ట్ వేసుకోవడం, అందమైన కురులను కనీసం కట్టుకోకుండా అలా వదులుగా వదిలెయ్యదం, ఇక రోడుపై ఆమెతో వెళుతుంటే, అందరూ ఆమె వైపే చూడదం, ఎవరీ బాలీవుడ్ హీరోయిన్ అంటూ కొంటె కుర్రకారు కామెంట్లు చెయ్యడం అతనికి గుండెల్లో గునపాలు గుచ్చుకున్నట్లు వుంది.

ఒక రోజు భార్య స్నేహితురాలింటికి వెళ్ళినప్పుడు మంచంపై పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తుంటే తన జీవితం ఎందుకిలా మారిపోయిందో అని ఆలోచించసాగాడు. బుర్ర పిచ్చెక్కిపోతుంటే టివి ఆన్ చేసాడు. మామూలుగా అయితే డర్టీ చానెల్స్ , కంట్రీ బ్రూట్స్, నాన్సెన్ అండ్ స్టుపిడ్ ప్రాగ్రాంస్ అని తిట్టుకుంటే ఏ ఇంగ్లిషు చానెల్ కో మార్చేవాడు. కాని ఆనాడు నిస్సత్తువ ఆవహించడం వలన అలా చెయ్యలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాడు..

అప్పుడే టి వి లో తెలుగు భాష ఔన్నత్యం పై ఒక పండితుడు చేస్తున్న ప్రసంగం వెంకటేశ్వర్లు చెవులలో పడింది. దేశ భాషలందు తెలుగు లెస్స, అని దేశీయులు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని విదేశీయుల చేత గౌరవింప బడ్డ భాష తెలుగు భాష. తెలుగు భాషలోని తియ్యదనం కమ్మదనం మరే భాషకు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి భాషకూ తనదైన ప్రత్యేకత, మాధుర్యం ఉంటాయి. ప్రపంచంలోని పలు భాషలతో పోలిస్తే.. తెలుగు భాషకు ఎన్నో అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే విదేశీయుల చేత జేజేలు అందుకుంది.దేశంలోని భాషలన్నింటిలో ప్రతి పదం అచ్చుతో అంతమయ్యే ఏకైక భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. ‘రాయుట, చదువుట, వెళ్లుట, పిలుచుట’ లాంటి నామవాచకాలన్నీ అచ్చుతో అంతమవుతాయి. నోరు తెరిచి ఉచ్చరించగలగడం అచ్చుల ప్రత్యేకత. ఈ ప్రత్యేకత తెలుగు భాషకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. సంగీత, సాహిత్య ప్రక్రియల్లో పదాలు సులభంగా ఇమిడిపోయే సహజత్వాన్ని తెలుగు భాష సంతరించుకుంది. తద్వారా ఇతర భాషల్లో లేని అదనపు ప్రక్రియలకు కూడా ఆస్కారం కలిగింది. ఇది తెలుగు భాషకే గర్వకారణమైన విషయం. అచ్చుతో అంతమయ్యే అరుదైన లక్షణం తెలుగు భాషకు అదనపు ఆకర్షణను, ప్రయోజనాన్ని అందించింది. కర్ణాటక సంగీతంలో కంపోజ్ చేసిన అత్యధిక పాటలు తెలుగు భాషకు చెందినవే కావడం గమనార్హం. భావ వ్యక్తీకరణకు అత్యంత సులభతరమైన భాష గా తెలుగుకు గుర్తింపు ఉంది.అటువంటి అరుదైన భాష, మన అమ్మ భాష తెలుగును నిర్లక్ష్యం చేసి పరాయి భాషలను ఆలింగనం చేసుకోవడమే కాకుండా మన భాషను పరాయి వారి ముందు కించబరచదం చాలా పాపం. పరాయి భాషలను నేర్చుకోవదం లో తప్పు లేదు ఆని పరాయి భాషల మోజులో పడి మన అమ్మ భాషను వదిలేయడం, అమ్మను వదిలేసినంత పాపం.

ప్రపంచ మే ఒక భిన్న సంస్కృతుల నిలయం, విభిన్న సాంప్రదాయాల ఆలయం. ఎన్ని సంస్కృతు లున్నా, ఎనెన్ని సాంప్రదాయా లున్నా ఎవరి సంస్కృతి వారికి గొప్ప.

అచ్చమైన, స్వచ్ఛమైన మన తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం కనుమరుగైతున్న వైనం దురదృష్టకరం. తరతరాల తరగని వరాల లాంటి సంస్కృతి , సాంప్రదాయాలు కాపాడుకోండి, కాపాడుకోండి పాడుచేయకండి. పూర్వకాలపు మంచి చెడులను భావితరాలకు తెలిపేటి, భాగ్య వంతులుగ నిలిపేటి

ఆచారాలే సంస్కృతులు, ఆచరించడమే సాంప్రదాయం, ఆచరించడం‌.. ఆదరించడం...

ఇవే మన సంస్కృతి-సాంప్రదాయం అని ప్రతీ ఒక్కరు తెలుసుకోండి.

ఎంతో ఆవేశంగా సాగిన ఆ ఉపన్యాసం వింటుంటే టివిలు లో ఏదో తెలియని చైతన్యం కలిగింది. తన తప్పు తనకు తెల్సివచ్చింది. తన మాతృభాషను, తన మాతృభూమి ఔన్నత్యాన్ని విస్మరించి, అతి ప్రాచీనమైన తమ సంస్కృతి, సంప్రదాయాలకు త్రిలోదకాలిచ్చి ఎంత తప్పు చేసాడో ఆ క్షణంలోనే అతనికి అర్ధమయ్యింది.తన జీవితం తిరిగి గాడిలో పడాలంటే ఏం చెయ్యాలో కూడా స్పురించింది.

వెంతనే బోధి వృక్షం కింద కూర్చోని ఆత్మ సాక్షాత్కారం పొందిన బుద్ధుడిలా మంచం పై నుండి ఉదాటున లేచాడు. తనకు పట్టిన ఇంగ్లీషు పిచ్చిని ఆ క్షణం నుండి వదిలించుకోవాలని ధృఢంగా సంకల్పించుకున్నాడు.

ముందు వేసుకున్న షార్టు, టీ షర్టు విప్పి అవతల పారేసి శుభ్రంగా నాన్నగారు ఏనాడో ఇచ్చిన లుంగీ, వదులుగా వుండే షర్టు వేసుకున్నాడు. ఇంట్లో వున్న తన చిట్టి, పొట్టి బిగుతు దుస్తులు ఒక మూత కట్టి ఒక మూలన పడేసాడు. ఇంట్లో అమ్మ ఎప్పటి నుండో భద్రంగా దాచి వుంచిన పెద్ద బాలశిక్ష పుస్తకం బయటకు తీసి, దుమ్ము దులిపి ప్రతీ రోజు కనీసం ఒక పేజీ అయినా చదవాలని సంకల్పించుకున్నాడు. అంత కంటే ముందు తాను పూర్తి స్థాయి తెలుగు వాడిగా మారాలని, మెల్ల మెల్లగా తెలుగులో మాట్లాడడం ప్రారంభించి, ఒక సంవత్సరం నాటికైనా పూర్తిగా తెలుగులో మాట్లాడే పటిమ సంపాదించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు. శ్రీమతి తిరిగి ఇంటికి వచ్చేసరికి తన నూతన అవతారం చూపించాలని ఆశతో ఎదురుచూడసాగాడు.

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.