పెద్దమనసు - డి.కె.చదువులబాబు

Pedda manasu

"ఈపండు కూడా తిని వెళ్లు"అని ఆఫిల్ పండు, కత్తి చేతికిచ్చింది అమ్మ. పండును కోశాడు రవి. కత్తి పదునుగా ఉన్నవైపు తాను పట్టుకుని పిడి ఉన్నవైపు అమ్మకు అందించి భద్రపరచమన్నాడు. పండు ఒప్పులు కొన్ని అమ్మకిచ్చాడు. కత్తి పదును ఉన్నవైపు ఎదుటివారికిస్తే తీసుకోవడంలో వారికి కోసుకుంటుందని రవి ఆలోచన. 'ఎవరినీ మనం చేతలతో కానీ మాటలతో కానీ నొప్పించరాదు. పంచుకుని తినాలి' అనే సంస్కారం రవికి అమ్మ నేర్పింది. అలాంటి మంచివిషయాలు ఎన్నో అమ్మ రవికి నేర్పింది. "ఇదిగో ఐదురూపాయలు. ఇందులో మూడు రూపాయలు నీకు. ఒకరూపాయి పొదుపు చేయడానికి. ఒకరూపాయి దానమివ్వడానికి"అంటూ బడికి ప్రయాణ మవుతున్న గోపీకి డబ్బు ఇచ్చాడు నాన్న. "బడికి సమయమవుతోంది. నాపేనా కనిపించడంలేదు. ఎక్కడ ఉంచానో...?" కంగారుగా వెదుకుతూ అన్నాడు శివ. మంచంలో పడుకుని ఉన్న తాత లేచి ఎక్కడెక్కడో వెదికి, పేనా తెచ్చిఇచ్చాడు. "తలనొప్పిగా ఉందని పడుకుని ఉన్నావు కదా!అంతశ్రమ తీసుకుని ఎందుకు వెదికావు తాతా?" అడిగాడు శివ. "ఎదుటివారికి మనకు చేతనైనసాయం చేయాలి.ఇందులో శ్రమ ఏముంది?ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచాలి. ఎక్కడెక్కడో పెడితే వెదుక్కోవడం కష్టం"చెప్పాడు తాత. "అలాగే తాతయ్యా !" అన్నాడు శివ. రవి,గోపి,శివ పుస్తకాల సంచులతో బయలుదేరి దారిలో కలుసుకున్నారు. వారు ఉన్న కాలనీ నుండి పాఠశాల కిలోమీటరు దూరంలో ఉంది. మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.దారిలో ఒక కుక్క మొరుగుతూ వెంబడించింది. నడకవేగం పెంచారు.అది మొరుగుతూ దగ్గరగా వచ్చి, వాళ్లు వెనక్కి తిరిగితే ఆగిపోతోంది. కుక్కను అదిలించి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఉన్నట్లుండి కుక్క అరుపులు ఆగిపోయాయి .వెనుదిరిగి చూశారు. కుక్క రహదారిమీద కూర్చొని కాలు నాక్కుంటూ బాధగా మూల్గుతోంది. దగ్గరకెళ్లి చూశారు. కుక్కకాలులో పెద్దముల్లు దిగబడి ఉంది. రవి దాని తల నిమరసాగాడు. గోపీ ముల్లును లాగి దూరంగా విసిరేశాడు. "కుక్కలు గాయాన్ని నాలుకతో నాక్కుంటే గాయం నయమవుతుందని మాతాత చెప్పాడు"అన్నాడు శివ. ముగ్గురూ వేగంగా నడిచి బడికి చేరుకున్నారు.వాళ్లు వెళ్లేసమయానికి బడిలో సందడి సందడిగా ఉంది. పిల్లలంతా ఆటస్థలంలో వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు.వారి మధ్యలో ఆటస్థలం పిల్లలను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. గణతంత్ర్యదినోత్సవం నాలుగురోజులు ఉంది.ఉపాధ్యాయులు ఆటలపోటీలు నిర్వహించే పనిలో ఉన్నారు. పిల్లల ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. కానీ ఒక పిల్లవాడు మాత్రం దిగులుగా కూర్చుని ఉన్నాడు.ఆటస్థలం వైపు ఆశగా చూస్తున్నాడు.ఆపిల్లవాడికి ఒక కాలు మాత్రమే ఉంది. రెండవకాలు చిన్నప్పుడు ప్రమాదంలో పోయింది. ఆపిల్లవాడి పక్కన ఊతకర్ర ఉంది. వాడి కళ్ళలో కన్నీటిపొరలు కదులుతున్నాయి.ఆపిల్లవాడి పేరు చందు. రవి,గోపి,శివ పుస్తకాలసంచులు గదిలో ఉంచారు.నేరుగా చందూ దగ్గరకు వచ్చారు."శుభోదయం మిత్రమా!" అంటూ చేతులు కలిపారు. మిత్రమా!శుభోదయం, శుభమధ్యాహ్నం ,శుభరాత్రి అనే సంబోధనలు తెలుగు మాస్టారు నేర్పారు. రవి,చందు పక్కన కూర్చున్నాడు. కబడ్డీ ఆటకు జట్లను ఏర్పాటుచేస్తున్నారు. చదువులోనే కాక ఆటల్లోనూ మొదటి స్థానంలో ఉండే రవి కనిపించకపోయేసరికి వ్యాయామఉపాధ్యాయుడు చుట్టూ చూశాడు. ఆటను చూడటానికి వృత్తాకారంలో కూర్చున్న వారి మధ్యన రవి కనిపించాడు.ఉపాధ్యాయుడు రవి దగ్గరకెళ్లాడు. "ఏం రవీ... ఆటలపోటీల్లో పాల్గొనవా ?" అని అడిగాడు. "దారిలో ముల్లు విరిగింది మాస్టారూ! నొప్పి ఎక్కువగా ఉంది. కాలు మోపడం కష్టంగా ఉంది."బాధగా చెప్పాడు రవి. కబడ్డీ,కోకో,కుర్చీలాట,రింగ్ బాల్,షటిల్ మొ దలగు ఆటలపోటీలు పిల్లలకేరింతల మధ్య పూర్తయ్యాయి. చివరగా పరుగుపందెం మొదలు పెట్టారు. పరుగు పందెంలో గోపీ ప్రథమస్థానంలో నిలిచాడు.శివ ద్వితీయ స్థానంలో నిలిచాడు. రవి కుంటుతూ ప్రధానోపాధ్యాయుని దగ్గరకొచ్చాడు. "నాకూ,చందూకు ఒంటికాలుపై పరుగు పందెం పెట్టండి మాస్టారూ!" అని అడిగాడు .ఆయన ఒప్పుకున్నాడు. రవి,గోపి,శివ ప్రోత్సాహంతో చందులేచి నిల్చున్నాడు.పీక ఊదగానే రవి, చందు ఒంటికాలుపై పరుగు మొదలు పెట్టారు. వారు చేరవలసిన గీత కొద్దిదూరంలో ఉండగా రవి కిందపడిపోయాడు. చందూ గీతను దాటాడు. ఆప్రాంతం చప్పట్లతో మార్మోగింది. "మాస్టారూ!మేము పరుగు పోటీలో గెలిచాము కదా! చందూతో పోటీపడాలని ఉంది"వ్యాయామఉపాధ్యాయుడితో అన్నారు గోపీ, శివ. చందు,గోపి శివ మధ్య పరుగుపోటీ మొదలయింది.గోపీ శివ ఒంటికాలు పై కొంతదూరం వెళ్లగానే కూలబడిపోయారు. చందూ గీతదాటి గెలిచాడు. ఆప్రాంతం పిల్లలకేరింతలతో,చప్పట్లతో మార్మోగింది .ఆతరగతి పరుగుపందెం మొదటి విజేతగా చందును ప్రకటించారు. గోపీకి రెండవస్థానం, శివకు మూడవస్థానం దక్కాయి.చందు మనసు ఆనందంతో నిండిపోయింది.ప్రథమస్థానంలో వచ్చినందుకు కాదు. ఒంటికాలున్నతానుఆటస్థలంలో ఆటలపోటీలో పాల్గొన్నందుకు, ఆత్మవిశ్వాసంతో కల్గిన ఆనందము. గణతంత్ర్యదినోత్సవంనాడు పిల్లల కరతాళ ధ్వనులమధ్య ప్రధమబహుమతి అందుకున్నాడు చందు. కార్యక్రమం పూర్తయ్యాక ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ "మనం విహారయాత్రకు వెళ్లాలనుకున్నాము కదా! అందరూ సిద్ధంగా ఉండండి. పచ్చనిచెట్లు, మైదానాలు,కొండలు,లోయలు,నదులు,జలపాతాలు,రకరకాలపక్షులు,జంతువులు కనువిందుచేస్తాయి.పురాతనకట్టడాలు, శిల్పాలు, మ్యూజియం చూడబోతున్నారు. ఇక నాలుగురోజులే ఉంది. ఇంకా డబ్బులివ్వనివాళ్లుంటే తెచ్చివ్వండి" అన్నారు. "నేను రావడంలేదు మాస్టారూ!" అన్నాడు చందు. "అందరూ వస్తున్నారు. నీవుకూడా రావాలి" అన్నారు మాస్టారు. "నాన్న డబ్బులేదన్నారు మాస్టారూ! నాకు కాలులేదుగా!ఎక్కువదూరం వేగంగా నడవలేను.ఎత్తైన ప్రాంతాలు ఎక్కలేను కదా !ఎలా రాగలను?" అన్నాడు. చందు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. బాధతో గొంతు బొంగురు పోయింది. రవిలేచి "నువ్వు మాఅందరితో కలిసి విహారయాత్రకు వస్తున్నావు. మేమందరం ఒకొక్కరం పదిరూపాయలు అదనంగా ఇస్తాం!నీఖర్చు వస్తుంది" అన్నాడు. గోపీలేచి "మాకు ఉన్నది రెండుకాళ్ళే. నీకు మాత్రం మాఅందరి కాళ్ళూ ఇస్తాం. మేమంతా నీవెంట ఉండి నడిపిస్తాం" అన్నాడు. శివలేచి "చందూ!నీకోసం మేము ఆమాత్రం చేయలేమా?"అన్నాడు. పిల్లలంతా "ఔను...ఔను" అన్నారు. కార్యక్రమం ముగిసింది. ఆరోజు రానేవచ్చింది. విహారయాత్రకు వెళ్లడానికి పిల్లలందరూ సీతాకోకచిలుకల్లా తయారై పాఠశాలవద్దకు చేరారు. బస్సులు సిద్ధంగా ఉన్నాయి. రవి, గోపీ, శివ ఒక వెదురుకర్రకు మధ్యన గంపను(ప్లాస్టిక్ తొట్టిని) కట్టుకుని తీసుకొచ్చారు. బస్సులో ఉంచారు. "ఏమిటిది?ఎందుకు?" అని అడిగారు ఉపాధ్యాయులు. "ఎక్కువదూరం నడవవలసి వచ్చినా, ఎత్తైన ప్రాంతాలు ఎక్కాలన్నా చందూకు శ్రమ లేకుండా ఇందులో కూర్చోబెడతాం. కర్రను రెండువైపులా భుజంపై పెట్టుకుని మోసుకెడతాము"చెప్పాడు రవి. "ఔను రవీ... ఆటలపోటీల్లో పాల్గొనడానికి కాలిలో ముల్లు విరిగింది. ఆడలేనన్నావు. చందూతో పోటీపడ్డావు. మరునాడు ఉదయమే చక్కగా నడుస్తూ పాఠశాలకు వచ్చావు.ఒక్కరోజులో అంతనొప్పి ఎలా పోయింది?చందూకోసం ఇలాచేశావు కదా!" అడిగారు ఉపాధ్యాయులు. "ఔను మాస్టారూ! దారిలో ఒక కుక్కకు ముల్లు విరిగితే తీసేశాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు ముల్లు విరిగిందని అబద్దమాడాను. అందరిలా పోటీలో పాల్గొనలేకపోతున్నానని మనసులో బాధపడుతున్న చందూను ఆటస్థలంలో పోటీకి దింపడానికే మేము ముగ్గురం అలా నాటకమాడాము. నేను పోటీలకు దూరంగా ఉండి చందూతో పోటీకి దిగాను"చెప్పాడు రవి. పిల్లల మంచిమనసును, ఆలోచనను, ముందుచూపును,చక్కని వ్యక్తిత్వాన్ని ఎలా అభినందించాలో ఉపాధ్యాయులకు అర్థంకాలేదు.సమాజానికి పాఠాలు నేర్పుతున్న వారి నడవడికకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. దూరంగా నిల్చునిఉన్న చందూను పిల్చుకుని వచ్చి మొదట బస్సు ఎక్కించారు.తర్వాత అందరూ ఎక్కి కూర్చున్నారు. అందరిలాగే ఆటస్థలంలో ఆటలపోటీలో పాల్గొనాలనేది చందు కల. అందరితో కలిసి విహారయాత్రకు వెళ్లాలనేది చందు కోరిక. తనకోరికలను నెరవేర్చిన మిత్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో చందుకు అర్థంకావడం లేదు. వారిచేతులను ఆత్మీయంగా తాకి కరచాలనం చేశాడు. చందు కళ్ళలో మెరుపులను చూసి మిత్రులమనసు ఆనందంతో నిండిపోయింది .బస్సులు మెల్లిగా కదిలాయి. పిల్లల స్వచ్చమైన మనసులాగా చల్లగాలి హాయిగా తాకుతోంది. శతకపద్యాలతో అంత్యాక్షరి ప్రారంభమయింది. ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండు చూడచూడ రుచులజాడవేరు పురుష్యులందుపుణ్యపురుష్యులు వేరయా! చివరి అక్షరంలోని అచ్చుతో మరోపద్యం ప్రారంభమయింది. అంత్యాక్షరి సాగుతోంది. బస్సులు సాగిపోతున్నాయి.

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.