ఒక ఏనుగు కడుపునిండా చెరుకు గడలు తిని,తన పిల్లలకోసం తీసుకెడుతోంది. చిట్టీ అనే చిలుక ఎగురుతూ వచ్చి ఏనుగుపై కూర్చుంది.దారిలో ఒక నక్క ఎదురు వచ్చింది. "ఏనుగన్నా!పిల్లలకోసం చెరుకు గడలు తీసుకెడుతున్నట్లున్నావు.ఏరోజయినా మన మృగరాజుకు చెరుకు గడలు తీసుకెళ్లి ఇచ్చావా? సింహం ఏరోజూ చెరుకు రసం రుచిచూసి ఉండదు. ఒకసారి ఇచ్చి చూడు. సింహం దగ్గర నీకు మంచి గుర్తింపు లభిస్తుంది." అని నక్క సలహా ఇచ్చింది. "అలాగే ఇప్పుడే వెళ్లి మృగరాజుకిస్తాను. చెరుకు రుచి చూపిస్తాను." అని ఏనుగు సింహం గుహవైపు బయలుదేరింది. చిలుక ఏనుగుతో "అన్నా!నీ పిల్లలఆకలి ముఖ్యం.మృగరాజు సంగతి మనకెందుకు? చెరుకులు నీపిల్లలకివ్వు. సంతోషంగా తింటాయి"అని చెప్పి ఎగిరిపోయింది. ఏనుగు చిలుక మాటలు వినకుండా చెరుకు గడలతో సింహం వద్దకెళ్లింది. సింహం కోపంగా చూసి "మాంసం తినే నేను చెరుకు తినే దద్దమ్మలా కనిపిస్తున్నానా? అంటూ తిట్టిపంపింది.ఏనుగు అవమానంతో వెళ్లిపోయింది. ఒకరోజు సింహానికి జబ్బు చేసింది. తలనొప్సితో బాధపడుతోంది. వైద్యంచేసే కోతిని రమ్మని పావురంతో కబురంపింది సింహం. పావురం కోతికి విషయం చెప్పి వెళ్లిపోయింది. కోతి కొమ్మకు తగిలించిఉన్న వైద్యం సంచిని తీసుకుని చెట్టుదిగి పది అడుగులు వెళ్లగానే కోతికి నక్క ఎదురయింది. "కోతిమామా!ఎక్కడికివెళ్తున్నావూ?" అని అడిగింది.విషయం చెప్పింది కోతి. "సింహం నుండి కబురు రాగానే పరుగెత్తి వెళ్లి వైద్యం చేస్తే నీవిలువ, అవసరం తెలియకుండా పోతుంది. ఆలస్యంగా వెడితే నీఅవసరం తెలిసొచ్చి విలువ పెరుగుతుంది "అని సలహా ఇచ్చిందినక్క. కోతి వెనుదిరిగివచ్చి సంచిని చెట్టు కొమ్మకు తగిలించి కూర్చుంది. చెట్టుపై ఉన్న చిట్టీ చిలుక ఇది గమనించి "కోతి మామా! సింహం దగ్గరకు వెళ్లకుండా తిరిగి వచ్చావేం? అని అడిగింది. కోతి నక్క చెప్పిన మాటలు చెప్పి, "రెండవసారి కబురువస్తే వెళ్తాను. సింహానికి నాగొప్పతనం,అవసరం అర్థమవుతుంది" అంది కోతి. "ఆరోగ్యం బాగలేక బాధపడుతుంటే ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇప్పుడు నీగొప్పతనానికి వచ్చిన లోటు ఏమీలేదు. అవసరానికి వెంటనే పలికినప్పుడే విలువ పెరుగుతుంది"అంది చిలుక. కోతి ఆమాటలు వినకుండా కాలుమీద కాలేసుకుని ఠీవిగా కూర్చుంది. కోతి ఎంతసేపటికీ రాకపోయేసరికి ఎలుగుబంటును పంపింది సింహం. ఎలుగుబంటు వచ్చి పావురం వచ్చి విషయం చెబితే రాకుండా ఠీవిగా, ఖాళీగా కూర్చుని ఉన్న కోతిని కోపంగా చూసి నాలుగుదెబ్బలు తన్ని వెంట తీసుకెళ్లింది. ఒకసారి చెట్టుకింద దిగులుగా కూర్చుని ఉన్న కాకిని నక్క చూసి కారణమడిగింది. "నక్కబావా!చిలుకకు అందం, కోకిలకు పాట,నెమలికి నాట్యం,గిజిగాడికి అందమైన గూడుకట్టే నైపుణ్యం ఇలా ఏదోఒక గుర్తింపు ఉంది.నాకు ఏగుర్తింపూ లేదు. చాలా దిగులుగా ఉంది" అంది. నక్క నవ్వి" నువ్వూ పాడగలవు. నాట్యం చేయగలవు.నీకేం తక్కువ. పులిమంత్రికి ఆటపాటలంటే ఇష్టం. వెళ్లి నీప్రతిభను ప్రదర్శించు.మంచి బహుమతి పొందు. గుర్తింపు వస్తుంది"అని సలహా ఇచ్చి వెళ్లింది. చెట్టుపైనున్న చిట్టి ఈమాటలు వింది. నక్కమాటలకు పొంగిపోయి పులివద్దకు బయలుదేరుతున్న కాకితో చిలుక "నీవు పరిసరాలను శుభ్రం చేస్తావు. పిండప్రదానం చేయడానికి నిన్ను మాత్రమే ఆహ్వానిస్తారు. కలిసిమెలిసి ఐక్యతగా ఉంటారనే పేరుమీకు ఉంది. ఈగుర్తింపు చాలు. సాధన చేయకుండా, లేనిప్రతిభను ప్రదర్శించాలని ప్రాకులాడకు"అంది. చిట్టీ మాటలు వినకుండా పులివద్ద తన పాటఆట ప్రదర్శించి చీవాట్లుతిని వచ్చింది కాకి. 'ఈలోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చేవాళ్లకు లోటులేదు. కానీ ఆ సలహాలను విని, మంచిచెడ్డలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా అడ్డమైన తప్పుడు సలహాలను ఆచరిస్తే, అభాసుపాలై నష్టపోయేది మనమే' అనుకున్నాయి ఏనుగు,కోతి,కాకి.