"సుమన్ ....సుమన్ ....సుమన్"
"పిలిచేవా సుమా"
"లేదు, అరిచేను. నేను మూడు సార్లు పిలిస్తే, మెల్లిగా 'పిలిచేవా సుమా' అంటూ అడుగుతున్నావు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? "
"మా ఇంట్లో నాకే ఎటువంటి విలువ గుర్తింపు ప్రాధాన్యత లేవు. అలాంటి చోటుకి నిన్నెలా నా భార్యగా తీసుకొని వెళ్ళేది, అని”
"అంటే, నన్ను పెళ్లి చేసుకోవడమా వద్దా అనే కదా" కాస్త కంగారుగా అడిగింది సుమ.
"చ, అది కాదు."
"మరి మీ ఇంట్లో నీకు గుర్తింపు వగైరా లేకపోవడేమిటి, నాకు అర్ధం కావడం లేదు. వివరంగా చెప్తావా, ప్లీజ్"
"రామాయణంలో అంతర్గతంగా ఉన్న శునస్సేపుడు కథ చెప్తాను విను. నీకే తెలుస్తుంది.
జనకమహారాజు గారి పురోహితుడు శతానందులవారు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి వృత్తాంతం చెప్తూ అంతర్గతంగా చెప్పిన కథ -- ఒకప్పుడు అయోధ్యని ఏలుతున్న అంబరీషుడు యజ్ఞం చేయడానికి సిద్ధమైన సమయంలో యజ్ఞపశువుని ఇంద్రుడు తస్కరిస్తాడు. యజ్ఞపరిసమాప్తికై, ఆ రోజుల్లో ఉన్న నియమానుసారం, యజ్ఞపశువుగా బలి ఈయడానికి ఒక బ్రాహ్మణ బాలుడు దొరుకుతాడేమో అని వెదుకుతూ ఉంటే, అంబరీషుడుకి ముగ్గురు పుత్రులు కల ఋచీకుడనే బ్రాహ్మణుడు తారసిల్లుతాడు. అంబరీషుడు ఆయనతో ‘ఒక పుత్రుడిని తనకి యజ్ఞపశువుగా ఇస్తే లక్ష గోవులు ఇస్తానంటాడు.’ జవాబుగా, ఋచీకుడు ‘పెద్దకొడుకు తనకి అత్యంత ప్రియతముడు కావున అతనిని ఇవ్వనంటాడు.’ ఋచీకుని భార్య ‘చిన్నకొడుకు తనకి అత్యంత ప్రియతముడు కావున అతనిని ఇవ్వనంటుంది.’ అప్పుడు ఋచీకుని పుత్రులలో మధ్యముడైన శునస్సేపుడు అంబరీషుడుతో 'రాజా నా తల్లితండ్రులలో నేను ఎవరికీ అక్కరలేదు అని తెలిసింది కదా, లక్ష గోవుల్ని మా తల్లితండ్రులకు ఇచ్చి నన్ను యజ్ఞపశువుగా స్వీకరించమని’ ముందుకు వస్తాడు. --- అది శునస్సేపుడు కథ.”
"శునస్సేపుడుని బలి ఇచ్చేసాడా అంబరీషుడు? ఆ వివరాలేవీ చెప్పకుండా కథ ముగిస్తావేమిటి"
“శునస్సేపుడు కథ అంతవరకే నాకు సంబంధించినది. కాబట్టి ఆ కథలో మిగతా వివరాలు అప్రస్తుతం."
"శునస్సేపుడు కథకి నీకు ఏమిటి సంబంధం?"
"మా అమ్మా నాన్నకి ముగ్గురు కొడుకులు. నేను మధ్యముడిని."
"అయితే"
"నీకింకా వివరంగా చెప్పాలి, విను"
సుమన్ పుట్టిన రెండేళ్ళకి తమ్ముడు పుట్టినప్పటినుంచి, ఇంటా బయట అతని పేరు 'నడిపోడు' అని స్థిరపడింది.
పుట్టిన రోజు నాడు తప్పితే, మరెప్పుడూ అతనికి కొత్త బట్టలు కొనే ప్రసక్తే ఉండేదికాదు. ఇంకెప్పుడేనా లాగు చొక్కా కావలిస్తే, "ఒరే నడిపోడా, పెద్దాడి బట్టలు ఉన్నాయ్ కదా వేసుకో నీకవి సరిపోతాయిలే" అన్నది వాళ్ళ అమ్మ నోటినుంచి వచ్చే మాట.
బడిలో చేరిన తరువాత, ఏ తరగతికైనా "ఒరే నడిపోడా, పెద్దాడి పుస్తకాలు ఉన్నాయ్ కదా, అవి తీసుకొని వెళ్ళు" అన్నది వాళ్ళ నాన్న నోటినుంచి వచ్చే మాట.
-2-
కాలేజీలో సుమన్ మాథ్స్ లో చేరతాననుకుంటే - "ఎందుకురా, నీకోసం పుస్తకాలకి వేరే ఖర్చు, కామర్సు లో చేరు, పెద్దోడి పుస్తకాలు నీకు కూడా పనికొస్తాయి" అని బలవంతాన సుమన్ కామర్సు లో చేరేటట్టు ఒప్పించేరు సుమన్ నాన్న.
తమ్ముడికి ఏమేనా కావలిస్తే వాడు చిన్నోడు కదా అని అమ్మ పట్టుపట్టి కొత్తవి కొనిపించేది. మొత్తాన పెద్దోడికి చిన్నోడికి అన్నీ కొత్తవి. నడిపోడికి ఎప్పుడూ అన్ని పెద్దోడు వాడిన పాతవి మాత్రమే.
తల్లితండ్రులు తనతో ఎందుకు అలా వ్యవహరించేవారో సుమన్ కి తెలియదు, తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు కూడా.
ఆ విధంగా పెరిగిన సుమన్ మనసు చాలా గాయపడింది.
అందుకే కాబోలు బలిజేపల్లివారు ఎప్పుడో చెప్పేరు – ‘ఆయుధాలతో అయేవి మాత్రమే గాయాలు కావు, కొన్ని మాటలు కూడా ఎప్పటికీ కోలుకోలేని గాయాలు చేస్తాయి’ అని.
"ఇప్పుడు చెప్పు సుమా, తల్లితండ్రుల ప్రేమకి నోచుకోని అభాగ్యుడైన నేను ఆ నా తల్లితండ్రులకి కోడలిగా తీసుకొనివెళ్ళి నీకు ఏమని న్యాయం చేయగలను? నువ్వు ఆ ఇంట్లో ఎలా మనగలవు? నా సమస్యతో నామీద నాకే ఒకరకమైన ఏహ్యభావం ఏర్పడి అసలు మనం ప్రేమించుకోకుంటే బాగుండేది అనిపిస్తోంది"
"ఇదీ మరీ బాగుంది. సమస్యలు చూసుకొని ప్రేమ పుడుతుందా ఏమిటి. సమస్యకి పరిష్కారం వెతకాలి కానీ"
"నువ్వే చెప్పు, నీ ఆలోచనలో ఏమేనా పరిష్కారం ఉందా ఈ సమస్యకు"
"నేను మీ ఇంటికి రావడం బదులు నువ్వే మా ఇంటికి వచ్చేయి"
తుళ్ళిపడిన సుమన్ -"నన్ను ఇల్లరికం రమ్మంటున్నావా, నీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల దగ్గర నాకెంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు ఆలోచించేవా"
"ఆలోచించక్కరలేదు, ఎందుకంటే నాకు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఎవరూ లేరు"
"మా ఇంట్లోనే విలువ లేని నేను, ఇల్లరికం అల్లుడిగా మీ ఇంట్లో ఏమి విలువ ఆశిస్తాను"
"ప్లీజ్, అలా అనుకోకు. మా నాన్నగారు నిన్ను నెత్తిమీద పెట్టుకుంటారు, నాది గ్యారంటీ"
"ఆ నెత్తి మీదనుంచి కిందకు తోసేయడానికి మూడురోజులు చాలు. ఇల్లరికపు అల్లుడి కష్టాలు ఎన్ని వినలేదు. ఎన్ని చూడలేదు”
"నువ్వు అనవసరంగా ఏమిటేమిటో ఊహించుకుంటున్నావు. నీకు పురాణాల మీద విశ్వాసం ఉందికదా"
"అవును. ఆ విషయంకి మన పెళ్ళికి లింక్ ఏమిటి"
"విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు"
"పాలకడలిలో శేషశయ్య మీద"
"పాలకడలికి విష్ణుమూర్తి బంధుత్వంలో ఏమి అవుతాడు"
"అల్లుడు"
"అంటే, విష్ణుమూర్తి ఇల్లరికం ఉంటున్నట్టే కదా"
"అవుననుకో"
"శివుడు ఎక్కడ ఉంటాడు"
"హిమవత్పర్వతం మీద"
-3-
"హిమవత్పర్వతంకి శివుడు బంధుత్వంలో ఏమి అవుతాడు"
"అల్లుడు"
"అంటే, శివుడు కూడా ఇల్లరికం ఉంటున్నట్టే కదా"
"అవుననుకో"
"ఇల్లరికం ఉండడంలో లోపం ఎంచడానికి, నువ్వు నమ్మి ఆరాధించే దేవతలకంటే కూడా మానవమాత్రులమైన మనమేమీ ఎక్కువ కాదు కదా.”
"వాళ్ళు దేవతలు దేముళ్ళు - పైగా వారి వారి మామగార్ల కంటే ఎంతో ఉన్నతమైనవారు. నేనో సామాన్యమైన మానవుడిని. వాళ్ళతో నాకు పోలికేమిటి"
"పోనీ ఓ సారి మా నాన్నతో మాట్లాడు. అతని మాటలు చేతలు హావభావాలు చూసి అప్పుడు నీ అభిప్రాయం చెప్పు"
"ముందు ఎవరైనా బాగానే ఉంటారు. కానీ, కాలం గడిచే కొద్దీ ఇల్లరికం రావడంలో కష్టాలు ఒక్కొక్కటి అనుభవంలోకి వస్తాయి. అది లోక సహజం. ఎన్ని వినలేదూ, ఎన్ని సినిమాల్లో చూడలేదూ"
కొన్ని క్షణాలు ఆలోచించిన సుమ --
"పోనీ, మరో ఆలోచన చెప్తాను. నువ్వు గుండమ్మకథ సినిమా చూసేవా"
"ఎన్నిసార్లో"
"అందులో ఆఖరి సీన్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఏమిటి"
"సినిమా ఎన్నిసార్లో చూసేను కానీ, పర్టికులర్ గా ఆ డైలాగ్ ఏమిటో గుర్తు రావడం లేదు"
"అత్తగారైన సూర్యకాంతంని నాన్నగారైన రంగారావుకు చూపిస్తూ ‘నాన్నగారూ ఇకనుంచీ ఈవిడ మనతోనే ఉంటారు అంటే అల్లుడరికం అన్నమాట, ఇల్లరికంకి వ్యతిరేకం’ - అని అంటాడు ఎన్టీఆర్."
"అవును, ఇప్పుడు గుర్తుకొచ్చింది"
"మరింకేం, మనం పెళ్లి చేసుకొని మనకంటూ ఉన్న ఇంటికి మా అమ్మానాన్నలని తీసికొనివచ్చి మన దగ్గర ఉంచుకుంటాం. దాంతో నీకేమీ అవమానం జరగదు. పైగా, ఒంటరిగా ఉండవలసి వచ్చిన అత్తామామలని దగ్గర పెట్టుకొని స్వంత కొడుకులా చూసుకుంటున్నావని పేరు వస్తుంది.”
"నీ ఆలోచన బాగుంది. అలాగే చేద్దాం. మన పెళ్లి కాకుండానే నువ్వు 'కరణేషు మంత్రీ' అనిపించుకున్నావు.”
“నా అంచనా ప్రకారం - నా ఆలోచనకి మా అమ్మానాన్న కాదనరు. ఎందుకంటే, మా నాన్నకి పెన్షన్ వస్తుంది కాబట్టి మన మీద ఆర్ధికంగా ఆధారపడాలేమో అన్న చింత కానీ చిన్నతనం కానీ వారికి ఉండదు కదా."
"నిజమే. పద మీ నాన్నగారిని కలిసి మాట్లాడదాం. ఇద్దరం కలిసి వారిని 'అల్లుడరికం' కి ఒప్పిద్దాం" –
అంటూ సుమన్ అందించిన చేతిని పాణిగ్రహణం చేసిన సుమతో ఇద్దరూ సప్తపది కూడా కానిచ్చేరు.
*****