భాగవతకథలు-31 సూర్యవంశం - రామావతారం - కందుల నాగేశ్వరరావు

Suryavamsham Ramavataram

భాగవతకథలు-31

సూర్యవంశం - రామావతారం

మరీచిమహర్షి బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు. మరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపుడు అదితి దంపతులకు సూర్యుడు ఉదయించాడు. సూర్యునికి సంజ్ఞ అనే భార్య ద్వారా వైవస్వత మనువు జన్మించాడు. వైవస్వత మనువు భార్య శ్రద్ధ. వారికి ఇక్ష్వాకునితో సహా పది మంది పుత్రులు జన్మించారు. వారి ద్వారా సూర్యవంశం వర్ధిల్లింది.

ఒకరోజు మనువుకు తుమ్ము వచ్చింది. అప్పుడు అతని ముక్కు నుండి పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడు జన్మించాడు. ఇక్ష్వాకుడు సూర్యవంశానికి కిరీటం వంటి మహారాజు. ఈయన పేరు మీదనే శ్రీరాముడికి ‘ఇక్ష్వాకకుల తిలకుడు’ అనే పేరు వచ్చింది. ఈ వంశంలో అంబరీషుడు, పురంజయుడు, మాంధాత, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, అంశుమంతుడు, భగీరథుడు, ఖట్వాంగుడు, రఘువు, దశరథుడు, అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు ముఖ్యులు.

పురంజయుడు:

కృతయుగాంతంలో దేవతలకూ రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిన ఇంద్రుడు శ్రీహరిని శరణు వేడాడు. అప్పుడు విష్ణువు “ఓ దేవేంద్రా! పురంజయుణ్ణి నేను ఆవహించి ఉంటాను. నీవు ఆబోతుగా మారి అతణ్ణి నీ మూపుపై ధరించు” అని చెప్పాడు. అప్పుడు పురంజయుడు తనలో విష్ణుతేజస్సు వ్యాపించగా దివ్యమైన ధనస్సును చేతబట్టి వాడి బాణాలను ధరించి ప్రళయాగ్నిలాగ యుద్ధానికి వెళ్ళాడు. రాక్షసరాజుల శరీరాలను చీల్చి చెండాడి యమపురికి పంపాడు. మిగిలిన వారిని పాతాళలోకానికి సాగనంపాడు. అంతేకాక రాక్షసరాజుల పురాలను కొల్లగొట్టి ‘పురంజయుడు’ అనే పేరును సార్ధకం చేసుకున్నాడు.

మాంధాత:

యవనాశ్వుడు అనే రాజు భార్యకు సంతానం కలగడానికి బ్రాహ్మణులు నీళ్ళను మంత్రించి, ఆ పవిత్ర జలం ఉన్న కలశాన్ని భద్రంగా దాచి నిద్రపోయారు. ఆ రాత్రి రాజు దాహం వేసి యజ్ఞ మందిరంలో ఉన్న ఆ నీళ్ళు త్రాగాడు. పిమ్మట కొంత సేపటికి ఆ రాజు కడుపును చీల్చుకొని చక్రవర్తి చిహ్నాలు కల ఒక కొడుకు పుట్టి తల్లిపాలు లేక ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆకలి తీరడానికి శిశువు నోటిలో తన వ్రేలుని పెట్టాడు. అలా త్రాగినందున ఆ బాలునికి ‘మాంధాత’అని పేరు పెట్టారు. మాంధాత రావణుని వంటి మహాబలశాలిని సైతం ఓడించి ‘త్రసదస్యుడు’ అనే బిరుదు సంపాదించాడు. మాంధాత శ్రీహరిని గూర్చి గొప్ప యజ్ఞాలు చేశాడు.

అంబరీషుడు:

అంబరీషుడు నాభాగుని కుమారుడు. ఏడు దీవులతో కూడిన భూమండలానికి మహారాజైనా, చెడు నడతకు లోనుకాకుండా, రాజ్యపాలన తరువాత మిగిలిన సమయాన్ని విష్ణుపూజలతో వెళ్ళబుచ్చిన రాజర్షి. ఆ రాజు మనస్సు ఎల్లప్పుడూ శ్రీహరి పైనే నిమగ్నమైన ఉండేది. భక్తుల పట్ల ప్రేమ కలిగిన శ్రీహరి సమస్త లోకాల్లోనూ అడ్డులేని సుదర్శనచక్రాన్ని రాజర్షికి అనుగ్రహించి వెళ్లాడు.

హరిసేవా పరాయణుడైన అంబరీషుడు తన పట్టపురాణితో కలిసి ఒక సంవత్సరంపాటు ఏకాదశి వ్రతాన్ని చేశాడు. కార్తీకమాసంలో ఆ వ్రతం చివరికి వచ్చింది. ఆ దంపతులు మూడు రాత్రులు ఉపవాసం ఉన్నారు. ద్వాదశి నాడు యమునానదిలో స్నానమాచరించి మధువనంలో శ్రీహరికి అభిషేకం చేశాడు. బ్రాహ్మణులకు గోవులను దానం ఇచ్చాడు. అందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయానికి దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు.

అంబరీషుడు ఆనందంగా మహర్షిని ఆహ్వానించాడు. మహర్షి స్నానం చేసే వస్తానని కాళిందీ నదికి వెళ్లాడు. ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నా మహర్షి తిరిగి రాలేదు. ద్వాదశిపారణ మానడం మంచిది కాదు. కాని మహర్షి వచ్చే వరకు పారణ చేయరాదు. అందుకని అంబరీషుడు ధర్మవేత్తల సలహా మేరకు మధ్యేమార్గంగా శ్రీహరిని ప్రార్థించి నీటిని పారణ చేశాడు.

ముక్కోపి అయిన దుర్వాసుడు తిరిగి వచ్చి విషయం తెలుసుకొని కోపంతో ఒక కృత్యని పుట్టించి రాజుపై ప్రయోగించాడు. ఆ కృత్య శూలాన్ని ధరించి అంబరీషునిపై దూకింది. అంబరీషునికి రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క క్షణంలో కృత్యను అంతం చేసి దుర్వాసునిపైకి వచ్చింది.

దుర్వాసునకు ఏం చెయ్యాలో తోచక పరుగెత్తడం మొదలు పెట్టాడు. విష్ణు చక్రం వెంట పడింది. బ్రహ్మదేవుడు, శివుడు విష్ణువు సాయం చేయలేమన్నారు. అప్పుడు దుర్వాసనకు వైకుంఠం వెళ్ళి విష్ణువును రక్షించమని ప్రార్థించాడు. విష్ణుమూర్తి “నేను భక్త పరాధీనుణ్ణి. నాభక్తుడైన అంబరీషుణ్ణి శరణు వేడు. అతడు మాత్రమే నిన్ను రక్షించగలడు” అని చెప్పాడు.దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడి పాదాలు పట్టుకొని క్షమించమని విలపించాడు. అంబరీషుని ప్రార్థనతో సుదర్శన చక్రం శాంతించింది. అంబరీషుడు మహర్షి కాళ్ళకు మొక్కి అతడికి తృప్తిగా భోజనం పెట్టి పంపించాడు.

త్రిశంకుడు:

త్రిశంకుని అసలు పేరు సత్యవ్రతుడు. గురుశాపం వలన చండాలుడయ్యాడు. బొందితో స్వర్గానికి పోవాలని ప్రయత్నించి చివరకు విశ్వామిత్రుని అనుగ్రహం వల్ల స్వర్గానికి వెళ్లాడు. దేవతలు ఇతనిని అంగీకరించకుండా క్రిందకి త్రోసివేశారు. విశ్వామిత్రుడు తన తపస్సుతో భూలోకం స్వర్గలోకం మధ్య ‘త్రిశంకు స్వర్గాన్ని’ సృష్టించి సత్యవ్రతుణ్ణి అక్కడ నిలిపాడు. అందువలన సత్యవ్రతుడు త్రిశంకునిగా ప్రసిద్ధి చెందాడు.

హరిశ్చంద్రుడు

త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు యాగదక్షిణ నెపంతో హరిశ్చంద్రుని సంపదను, రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఎన్ని హింసలు పెట్టినా హరిశ్చంద్రుడు తన సత్యనిష్టను వదలి పెట్టలేదు. చివరకు హరిశ్చంద్రుని సత్యనిష్టను మెచ్చిన విశ్వామిత్రుడు అతనికి ప్రశంసించి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు.

సగర చక్రవర్తి:

సగరుడు హరిశ్చంద్రునికి ఎనిమిదవ తరం వాడు. సగరుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లులు ఇతని తల్లికి విషం పెట్టారు. అయినా ఏమాత్రం చెక్కుచెదరకుండా గరళంతో పాటు జన్మించినందువల్ల ‘సగరుడు’ అనే పేరు వచ్చింది. ఇతని కుమారులు సముద్రాన్ని త్రవ్వటం చేత, సముద్రానికి ‘సాగరం’ అనే పేరు వచ్చింది. నూరు అశ్వమేధయాగాలు చేసిన ఘనుడు. నూరవ యాగం చేసినప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి కపిలమహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. గుర్రాన్ని అన్వేషిస్తూ వెళ్ళిన సగర పుత్రులు కపిలమహర్షి ఆ పని చేసి ఉంటాడని తలచి అతడి మీద దుమికారు. కపిల మహర్షి కళ్ళు తెరిచి చూచాడు. ఆ సగరకుమరులు తాము చేసిన తప్పువల్ల తమ శరీరాల్లో పుట్టిన అగ్నిజ్వాలలకు బూడిదయ్యారు. సగరుని మనుమడైన అంశుమంతుడు కపిలమహర్షి అనుగ్రహాన్ని సంపాదించి యాగాశ్వాన్ని తిరిగి తీసుకు వచ్చి తాతగారి యజ్ఞాన్ని పూర్తిచేయించాడు. సగరుని కొడుకు అసమంజసుడు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు.

భగీరథుడు:

అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుడు గొప్ప చక్రవర్తి. గంగను భూమిపైకి తేవడానికి తపస్సు చేశాడు. కాని ఫలితం లభించ లేదు. దిలీపుని కుమారుడైన భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి గంగను దివి నుండి భువికి రప్పించాడు. తన పూర్వీకుల భస్మరాశులపై ప్రవహింపచేశాడు. వారికి పుణ్యలోకాలు ప్రాప్తింపచేశాడు. ఇతని పేరు మీదనే గంగకు ‘భాగీరథి’ అనే పేరు వచ్చింది.

ఖట్వాంగుడు:

భగీరథుని వంశంలో సుదాసుడు అనేవానికి ఒక బ్రాహ్మణ స్త్రీ శాపం వలన సంతానం కలుగ లేదు. అతడి కోరిక ప్రకారం వసిష్టుడు సుదాసుని భార్య మదయంతికి గర్భాధానం చేసాడు. ఆమె ఒక కుమారుని కన్నది. అతని పేరు అస్మకుడు. అతని కుమారుడు మూలకుడు. పరశురాముడు రాజులను చంపినప్పుడు స్త్రీలందరూ కవచంలా మూలకుని చుట్టూ చేరి కాపాడడం వల్ల అతడు నారీకవచుడు అని ప్రసిద్ధి చెందాడు. ఆ మూలకుని మనుమడు ఖట్వాంగుడు. ఖట్వాంగుడు రాక్షసులనుసంహరించి దేవతలకు విజయం చేకూర్చిన పరాక్రమశాలి. దేవతల వల్ల తన ఆయుర్దాయం ఎంతో లేదని తెలుసుకొని, పరమేశ్వరుడి యందే మనస్సు లగ్నంచేసి పరబ్రహ్మంలో లీనమైపోయాడు.

రఘుమహారాజు:

ఖట్వంగుని మనుమడు రఘుమహారాజు. భారతభూమిని ఏకచ్ఛత్రంగా పరిపాలించిన మహారాజు. ఈయన వల్లనే సూర్యవంశానికి ‘రఘవంశం’ అనే పేరు ప్రసిద్ధికి వచ్చింది.

దశరథుడు:

దశరథుడు రఘు మహారాజుకు మనుమడు, అజమహారాజుకు పుత్రుడు. దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన్ని యుద్ధం చేసిన వీరుడు. దశరథునికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజుకు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నలుగురు కుమారులు .

శ్రీరామ చరిత్ర:

దశరథుని భార్య కౌసల్యాదేవికి శ్రీమహావిష్ణువు, అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తిగా జన్మించాడు. బాల్యంలోనే తండ్రి పంపగా యాగాన్ని కాపాడడానికి విశ్వామిత్రమహర్షితో అడవికి వెళ్లాడు. తాటకిని, సుబాహుణ్ణి చంపి, మారీచుని తరిమికొట్టి యాగాన్ని కాపాడాడు. విదేహరాజైన జనకుని ఇంటిలో శివధనుస్సును విరిచి స్వయంవరంలో సీతాదేవిని పరిణయమాడాడు. రణరంగంలో పరవీరభయంకరుడు అయిన పరశురాముణ్ణి భంగపరిచాడు.

తండ్రి దశరథుడు సవతి తల్లి కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి, అయోధ్యను వదలి సీతాలక్ష్మణులతో సహా అరణ్యానికి వెళ్లాడు. చిత్రకూటం మీదుగా దండకారణ్యం చేరాడు. రావణుడి చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కామించి రాగా, లక్ష్మణుడు ఆమె ముక్కు కోసం వదలి పెట్టాడు. ఆ సంగతి తెలిసి వచ్చిన పదునాలుగు వేల మంది రాక్షసులను రాముడు తన బాణాలతో భస్మం చేశాడు. రావణుడు పంపగా బంగారు లేడి వేషంలో వచ్చిన మారీచుణ్ణి వధించాడు. ఆ సమయంలో మారు వేషంలో వచ్చి రావణుడు సీతను అపహరించాడు. అడ్డు పడ్డ జటాయువును కఠోరమైన ఆయుధంతో ఖండించాడు. సీతను వెదుకుతూ వచ్చిన రాముడు జటాయువుకు అంత్యక్రియలు జరిపి ఋష్యమూకానికి వెళ్లాడు.

శ్రీరాముడు సుగ్రీవుడికి అభయమిచ్చి, ఒకే బాణంతో వాలిని వధించాడు. సీతను వెదకడానికి సుగ్రీవుడు మహిమాన్వితుడు, బద్ధిమంతుడూ, బలవంతుడు అయిన హనుమంతుణ్ణి నియోగించాడు. ఆంజనేయుడు అత్యంత లాఘవంగా సముద్రాన్ని దాటి లంకను చేరి సీతాదేవి జాడను తెలుసుకున్నాడు. తిరిగి వచ్చేటపుడు తనతోకకు పెట్టిన నిప్పుతో లంకా పట్టణాన్ని భస్మం చేశాడు. తిరిగి వచ్చి సీతా వృత్తాంతాన్ని రామునికి విన్నవించాడు.

శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి వానరసేనతో లవణ సముద్రాన్ని సమీపించాడు. దారి ఇమ్మని కోరాడు. సముద్రుడు దారి ఇవ్వనందుకు కోపగించి విల్లంబులను అందుకొన్నాడు. వెంటనే సముద్రం బీడు భూమిగా మారిపోయింది. అప్పుడు సముద్రుడు నదీనదాలతో కలిసి వచ్చి శ్రీరాముని శరణుజొచ్చి స్తుతించాడు. ‘ఓ రామా! నాపై సేతువు కట్టు. లంకను చుట్టు ముట్టు. రాక్షసుల తలలు పగలగొట్టు. మంగళకరంగా నీ ఇల్లాలును చేపట్టు’ అన్నాడు. శాంతించిన రాముడు సముద్రుణ్ణి వెనుకటి వలె ఉండమని వరమిచ్చి పంపాడు.

వానర శ్రేష్ఠులు సముద్రంపై వారధి కట్టారు. రాముడు సైన్యంతో సముద్రాన్ని దాటి లంకా నగరం చేరాడు. విభీషణుడు తన్ను శరణు వేడగా అభయం ఇచ్చాడు. వానరసేనతో పట్టణాన్ని ముట్టడించాడు. కుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, దుర్ముఖ మొదలైన రాక్షస వీరులను నాశనం చేశారు. అతికాయ, కుంభకర్ణ, మేఘనాదులను మట్టుపెట్టారు. అప్పుడు పుష్పక విమానం ఎక్కి యుద్ధభూమికి వచ్చిన రావణుణ్ణి, శ్రీరాముడు యుద్ధంలో ఓడించి వధించాడు. విభీషణుణ్ణి లంకా రాజ్యానికి అధిపతిని కావించాడు.

అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలిసి ఓదార్చి లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలగు వారితో పుష్పక విమానం ఎక్కి నంది గ్రామానికి వచ్చాడు. అన్న రాక తెలిసిన భరతుడు పురజనులు వెంటరాగా ఉత్సాహంగా అక్కడకు వచ్చి సాష్టాంగ దండప్రమాణాలు చేసాడు.

సుగ్రీవుడు, విభీషణుడు వింజామరలు వీయగా, హనుమంతుడు తెల్లని గొడుగు పట్టగా, భరతుడు భక్తితో పాదుకలు పట్టగా, శత్రుఘ్నుడు విల్లంబులు తేగా, లక్ష్మణుడు దారిచూపగా, సీత జలపాత్రను తీసుకొని వెంట నడువగా, జాంబవంతుడు బంగారు డాలుని పట్టి సేవింపగా, సమస్త గ్రహాలు కొలుస్తున్న పూర్ణ చంద్రునివలె శ్రీరామచంద్రుడు అయోధ్యా నగరంలో తిరిగి ప్రవేశించాడు.

శ్రీరాముడు తల్లులకు, గురువులకు నమస్కరించాడు. వసిష్ఠుడు వచ్చి, సముద్రజలాలతో అభిషేకించాడు. మంగళ స్నానానంతరం, సీతా రాములు నూతన వస్త్రాలు ధరించి, రత్నఖచిత స్వర్ణ భూషణాలను అలంకరించుకొని పట్టాభిషిక్తులయ్యారు. తల్లి కౌసల్యకు ప్రియం కలిగిస్తూ, లోకం మెచ్చుకొనేటట్లుగా రాజ్యపాలన కావించాడు. శ్రీరామచంద్రుడికికుశుడు, లవుడు అని ఇద్దరు కుమారులు. వారి సంతానం ద్వారా సూర్యవంశం వర్ధిల్లింది.

ఇక్ష్వాకు కులతిలక! రఘువంశ సుధాకర! రామా! శ్రీరామ!

దశరథ నందన! కౌసల్యాసుత! రామా! శ్రీరామ!

లక్ష్మణ సోదర! సీతా మనోహర! రామా! శ్రీరామ!

సుగ్రీవ మిత్ర। హనుమత్ హృదయవాసా! రామా! శ్రీరామ!

రావణ సంహార! విభీషణ శుభకర! రామా! శ్రీరామ!

శ్యామ సుందర! విశాల నేత్ర! రామా! శ్రీరామ!

కరుణా హృదయ! ఆప్తజన రక్షక! రామా! శ్రీరామ!

శ్రీరామచంద్ర! సర్వ మానవోత్తమ! రామా! శ్రీరామ!

రామా! నీ నామం సర్వశుభ కారకం! రామా! శ్రీరామ!

*శుభం*

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.