చిన్నప్పటి జిహ్వ చాపల్యం అనే తిండి గోల ! - వారణాసి సుధాకర్

Chinnappati jihva chapalyam

"చిన్నప్పటి జిహ్వ చాపల్యం" అనే తిండి గోల !

చిన్నప్పటి తిండి రంధి తల్చుకుంటే, ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, ఆ రోజులు, అప్పటి ఆనందాలే వేరు ! తిండంటే...అంత ఇదేవిటో...!!! "మళ్ళీ మళ్ళీ అది రాని రోజూ..." అని పాడుకుంటూ కాలం వెళ్ళదీయడమే ! ఇష్టం లేకపోయినా, బడికి వెళ్ళాలి కాబట్టి, ఎలాగో కష్టపడి లేచి, ఏడుపుమొహంతోనే 'ప్రభల' పళ్ళప్పొడితో పళ్ళుతోముకుని, తాటాకుతో నాలిగ్గీసుకుని, నూతి దగ్గిర చన్నీళ్ళు స్నానం కానిచ్చి, చద్దెన్నం దగ్గిరికి వచ్చేసరికి మాత్రం మహా ఇష్టంగా ఉండేది ! చద్దెన్నాలకోసం ఒక గూడుండేది. దాంట్లో పెద్ద సత్తు గిన్నినిండా చద్దెన్నం, దాని పక్కనే నాలుగు సత్తు కంచాలూ ఉండేవి. స్టీలు సామాన్లు అప్పటికింకా ఫేషను అవలేదనుకుంటా..పెద్దవాళ్ళకి మాత్రం, మధ్యలో బంగారం పువ్వు వేసిన పెద్ద పెద్ద వెండి కంచాలుండేవి. సదరు చద్దెన్నం సత్తుగిన్నిని మా అక్క బయటికి లాగి, మా సత్తు కంచాల్లో వేసేది. పక్క గూడులో, మాకోసం రిజర్వు చేసిన జాడీల్లో రకరకాల, రంగురంగుల ఊరగాయలుండేవి. మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకంటే, అన్నీ కలిపి, "అంటమంగళం" చేసి తగలేస్తామని...ట! ఆ ఊరగాయల్లో, మాకిష్టమైన అదిరిపోయే ఆవకాయ్, మతిపోగొట్టే మాగాయ్, ఊరించే ఉసిరికాయ పచ్చడి, నోరూరించే నిమ్మకాయ్, చిక్కటి చింతకాయ్ పచ్చడి, దర్పంగా మెరిసే దబ్బకాయల్లోంచి, ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకువేసుకుని, దానికి పేరునెయ్యి జోడించి, 'కలిపికొట్టు, కావేటిరంగా' అన్నట్టు, వాటికి న్యాయంచేసిన పిమ్మట, గబగబా గడ్డ పెరుగుమీద పడి, వీధి అరుగు మీదకి వినబడేట్టు జుర్రి, ఎవరి కంచాలు వాళ్ళు తీసికెళ్ళి, అంట్లుతోమే అప్పలమ్మ దగ్గిర పడేసి, జిడ్డుచేతులు కొబ్బరిపీచుతో తోముకుని, హడావిడిగా మా పలకలు, కణికిలు, బుక్కులు ఏరోజుకారోజు వెతుక్కుని, మా ఖాకీసంచీల్లో కూరేసుకుని, హవాయ్ చెప్పుల్తో పరిగెడుతుంటే, సరిగ్గా అప్పుడే ఒక జోడు ఫట్టు ! దానికి మా పెద్దక్కే పెద్ద మెకానిక్కు. తన మెడలోవున్న గొలుసులోంచి ఒక పెద్ద పిన్నీసు తీసి, దాన్ని సరిజేసేది. అక్కడ మా పెద్దాళ్ళు, "హమ్మయ్య, ఈపూటకి పిల్లకోతులు బళ్ళోకెళ్ళారు" అని వంట పనిలో పడుతుంటే, మా బడిలో "ఔటుబెల్లు" కొట్టేవారు. మేం బాగా కష్టపడి చదివి, పెరిగి, పెద్దవాళ్ళమై, భావిభారత పౌరులం అవ్వాలి కాబట్టి, అందుకు కావలిసిన శక్తిని సంపాదించుకుందుకు, మా శరీరాలకి అవసరమైన 'ఇంధనం' నింపుకుందుకు, చెప్పులు చేతిలో పట్టుకుని, ఇంటికి పరిగెత్తుకొచ్చేవాళ్ళం. మా పెద్దలకి ఆ విషయం ముందే తెలుసు కాబట్టి, "ఆ వసారాలో వున్న అరిటిపళ్ళో, బెల్లమ్ముక్కో తీసుకుని ఏడవండి !" అనేవారు. అక్కడ దూలానికి ఒక పెద్ద కర్పూరచక్రకేళి అరిటిపళ్ళగెల వేలాడుతుంటే, దాంట్లోంచి రెండు - మూడు అత్తాలు ఖాళీచేసి, మళ్ళీ 'బడిబాట' పట్టేవాళ్ళం. మళ్ళీ పదకొండింటికల్లా, మా నలుగురి మందా, మందస్మితాలతో తయారు ! "నాన్న భోజనం అయ్యేదాకా, వంటింటి దరిదాపులకి రాకండి, వీధివైపో, దొడ్డివైపో అఘోరించండి" అనే నిత్య ఆదేశాలు అమలయేవి. సర్లే, పెద్దాళ్ళమాట వినాలి కదా అని, దొడ్డివైపుకే పోయి, ఉసిరిచెట్టో, జామచెట్టో, వేసంకాలం అయితే, బంగినపల్లి మావిడిచెట్టో ఎక్కి, ప్రకృతి ప్రసాదించిన వనరులకు న్యాయం చేసేవాళ్ళం. తరవాత మజ్ఝాన్న భోజన పథకాలు, సాయంకాలపు చిరుతిళ్ళు, రాత్రి నైవేద్యాలు మామూలే ! 💐💐 మా అమ్మమ్మ రాత్రికి ఫలహారంగా చేసుకున్న దోశలు/ పిండి / ఉప్మాలో మాకెలాగూ వాటా పెడుతుందిగా ? ఇప్పుడు తల్చుకుంటే, ఆశ్చర్యం వేస్తుంది, అప్పట్లో పెద్దవాళ్ళు, "ఇల్లే సంగీతమూ..వంటిల్లే సాహిత్యమూ.." అని పాడుకుంటూ, ఇంతమందికి ఎలా వండి, వడ్డించి, రోజంతా వంటిల్లే వైకుంఠంగా ఎలా గడిపేవారో అని ! మాకివన్నీ ఏంతెలుసు, తినడం, ఆడుకోడం, పడుక్కోడం తప్ప ? మా అమ్మమ్మ దొడ్డివైపు, ఇంకో పొయ్యి పెట్టుకుని, "భవానమ్మ వంటిల్లు" లాగ, తన స్పెషల్ ఐటమ్స్ చేసిపడేసేది (డబ్బాల్లో). మా నలుగురిలో ఎవరి పుట్టింరోజు వచ్చినా, పూర్ణంబూర్లు ఉండి తీరాల్సిందే ! అటొచ్ఛీ..ఇటొచ్ఛీ, నోట్లో పోసుకుని, జేబుల్లో కూరుకుని, ఆడుకుందుకు పరిగెత్తిన రోజులు ఎలా మర్చిపోగలం ? రథసప్తమి వస్తే, మా అమ్మ చిక్కుడాకుల్లో పెట్టే పరవాన్నం కోసం, పూజయ్యేదాకా అతికష్టమ్మీద ఓపిక పట్టేవాళ్ళం ! వినాయక చవితి వస్తే, మామూలుగా, వినాయకుడిమీదకంటే, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయల మీదే భక్తి ఎక్కువ వుండేది. సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండగలొస్తే, బూందీ లడ్డు, దాని కజిను, కారంబూంది ఉండితీరాలి. వెన్నకాచిన నెయ్యితో ఇంట్లో మినపసున్నుండలు వాళ్ళు ఓపక్క రెండు చేతుల్తో చుడుతూనే ఉండేవారు, ఇంకోపక్క, రెండుచేతుల్తో మేం తినేస్తూ...సారీ...బొక్కేస్తూ ఉండేవాళ్ళం. కనుమ నాడు మినుము కొరకాలని ఆయుర్వేదంలో ధన్వంతరి చెప్పాడని పెద్దలే చెప్పారు కాబట్టి, ఓ వీసెడు మినప్పప్పు రుబ్బి, అందరికీ సరిపోయేట్టు గారెలు, ఆవడలు, "ఛీజు బడీ హై మష్టు..మష్టు !" (ఇప్పుడు ఫ్రిజ్ నిండా ఎవరెవరో ఇచ్చినవి, కొనుక్కున్నవి, తినకూడనివి కొన్ని, తినలేనివి కొన్ని, తినాలనిపించనివి కొన్ని, సీలు విప్పనివి కొన్ని, డబ్బాల నిండా మూలుగుతున్నాయ్... మనం గదిలో మూలుగుతుంటే...) ఇప్పటి గొడవలోకి వెడితే, చిన్నప్పటి "మూడు" పోతుంది... కాబట్టి, అక్కడికే మళ్ళీ వెళ్ళిపోదాం... ఇంక పండగలొస్తే, ప్రత్యేక పిండివంటలు, ఎవరికి ఏమి కావాలని మమ్మల్ని అడిగేవారు. మేం హోటల్లో సర్వరుకి ఆర్డరిచ్చినట్టు, ఎవరికిష్టమైనవి వాళ్ళం లిస్టు చెప్పేసేవాళ్ళం. వీలైనంతవరకు, ఆర్డరు చేసినవన్నీ వచ్చేవి. అవికూడా, అరిశలు, అప్పాలు, జంతికలు, కజ్జికాయలు, లస్కోరా లాంటివైతే, ఇంతమందికి, వారం - పది రోజులకి సరిపోయేవిధంగా, "వెంకటాద్రి వంటిల్లు" లెవెల్లో ఉండేది. 💐💐 మా అమ్మమ్మ దొడ్లో పెద్ద పొయ్యిమీద, బొగ్గులతో పెద్ద ఇత్తడి మూకుడుతో దిబ్బరొట్టి కాలుస్తుంటే, ఎప్పటికీ అవనట్టుండేది. "ఎదురుచూసి, ఎదురుచూసి, కన్నుదోయి అలసిపోయే" అన్నట్టు, ఎప్పటికి కాలుతుందా, ఎప్పుడు గుటుక్కుమనిపిద్దామా అని ఎదురు చూసేవాళ్ళం. మళ్ళీ దాన్ని సన్నసెగమీద పెట్టి, పైమూత మీద నిప్పుబొగ్గులు వేసేది. "ఉమ్మగిలాలి" అనేది... మాకిక్కడ కళ్ళు "చెమ్మగిలి"పోతుంటే ! మహా చిరాగ్గా ఉండేది. దాన్ని లటక్కున తీసేసి, తినాలనిపించేది. చివరికి ఎప్పటికో దాన్ని అట్లకాడతో చీల్చి చెండాడి, ఎవరి ముక్క వాళ్ళ మొహాన కొడితే, రొట్టి మధ్యలో పెట్టిన గిన్నికోసం దెబ్బలాడుకునేవాళ్ళం. దాని రుచి అలాంటిది ! మా ప్లేట్లలో ఓ పక్క తేనిపానకం వేసుకుని, ఇంకో పక్క తలో ఏబులం బెల్లమ్ముక్క, కొబ్బరిపచ్చడి పెట్టుకుని, ఆవురావురుమని ఎదురుచూసేవాళ్ళం. ఇంక మా అమ్మమ్మ చేసే ఉప్పుడుపిండి గురించి చెప్పకపోతే, సచ్చన్నారాయణ వ్రతంలో కథ పూర్తిగా వినకుండా, ప్రసాదం తినకుండా, మధ్యలో లేచెళ్ళిపోయినంత పాపం వస్తుంది ! ఆవిడ చదివింది మూడో క్లాసే అయినా, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చెయ్యడంలో పీహెచ్డీ చేసుంటుందని నా నమ్మకం. అవే పదార్ధాలతో, ఇప్పుడు మనం "ఉప్పుప్పి" (దాని ముద్దుపేరు) చేసుకున్నా, మా అమ్మమ్మ చేసిన ఉప్పుప్పికి కాళ్ళు, ఆ కాళ్ళకి వేళ్ళు, ఆవేళ్ళకి గోళ్ళు ఉన్నాయో లేవో తెలీదు కానీ, ఆ గోటికి సరిపోలదు ! ఇదే నా జడ్జిమెంటు ! ఆ ఉప్పుడుపిండికి పెద్ద రహస్య ఫార్ములా ఉండేది. పెద్ద ఇత్తడి గిన్ని, బొగ్గుల కుంపటి, మేదరి విసినికర్ర, తానే స్వయంగా తిరగలిమీద విసురుకున్న బియ్యప్పిండి, మిగిలిన సంభారాలు, మెంతులు, కొబ్బరికోరు గట్రా... ఆవిడ చిన్న పీట వేసుక్కూర్చుని, కొబ్బరిపీచుతో కుంపటి వెలిగించడం మొదలెట్టేది ! నాలుగు జీవాలు ఆవిడ వెనకజేరి, "అమ్మమ్మా, ఆ బొగ్గుల కుంపటితో ఎప్పటికి అవుతుంది ? పొయ్యి మీద పెట్టి, కింద పెద్ద మంటపెడితే, తొందరగా అవుతుంది కదా ?" అనేవాళ్ళం. అజ్ఞానాంధకారం ! "మీ మొహాలు సంతకెళ్ళినట్టే వుంది, మీ ఆలోచన ! ఇది కట్టెలతో చేసేది కాదు, దానికి ఆ రుచీ రాదు, ఓపిక పట్టండి" అనేది. ప్రతిసారీ అదే డైలాగు ! అప్పట్లో "ఓపిక పట్టడం" అనే మాట మా నిఘంటువులో ఎక్కడా ఉన్నట్టు లేదు ! చివరాఖరికి ఎప్పటికో మాదాకా వచ్చేది. దానికి ఈడూ - జోడూగా మా ప్లేట్లలో, ఆవకాయ్, ఇంకోపక్కని "వం.ప.పు" (వంకాయ్ పచ్చిపులుసుకి ముద్దుపేరన్నమాట !) వేసుకుని తింటే వుండేదీ.... ఇంక మా అమ్మ చేసే 'టైగర్ ఫుడ్', అదే... పులిహారతో స్వస్తి పలుకుదాం. అందరికీ తెలుసుగా...ప్రతి పండక్కీ, ప్రతి తెలుగింట్లోనూ పులిహార మష్టు ! ఎవరికి వచ్చినట్టు, నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ, ఎన్ని నేతిమిఠాయి కొట్లు వున్నా, ఇప్పటికీ పుల్లారెడ్డిదే పైచెయ్యి అన్నట్టు, మాఅమ్మ చేసినట్టు, మా ఇంట్లో ఇంకెవరూ చెయ్యలేకపోతున్నారు. పండగలకే కాదు, రైల్లో ప్రయాణాలక్కూడా, భేషుగ్గా వుంటుందని పులిహార కనిపెట్టినవాడు, రైలు పుట్టకముందే చెప్పాడని, తాళపత్ర గ్రంధాల్లో ఉందిట ! పులిహారకి తోబుట్టువులాంటి చక్రపొంగలి, పక్కనే వుండి తీరాలి, స్వీటూ - హాటూ అన్నమాట ! ఇంట్లో అందరికీ సరిపోగా, ఇరుగుపొరుగు వాళ్ళకి రుచి చూపించడానికి, పనివాళ్ళందరికీ పంచిపెట్టడానికీ, "పులిహారెప్పుడు మర్నాడే " అన్నట్టు, మర్నాడు పిల్లకాయలు చద్దెన్నంగా తినడానికి సరిపోయేంత చేసేవాళ్ళు. అందరం ఆ పులిహారని "వెటర్నరీ" డోసుల్లో తిని, ఇరుగుపొరుగువాళ్ళు కూడా, "మీరు చేసినట్టు పులిహార చెయ్యడం మాకు రాదండీ " అంటే, మా అమ్మ మొహం పులిహారపళ్ళెం అంత అయి, చేసిన శ్రమనంతా మర్చిపోయి, ప్రభుత్వంవారు 'పద్మశ్రీ' ఇచ్చినట్టు ఫీలయిపోయి, మళ్ళీ ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ 'పులి' అయిపోదామా అని ఎదురు చూసేది... పాపం, మా అమ్మ ! మావూళ్ళో వేంకటేశ్వర స్వామి గుళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు, ఆచార్లు గార్లు ఆకు దొన్నెల్లో పెట్టిన పులిహార ప్రసాదం రుచి అద్భుతంగా ఉండేది. ఆ రుచికోసం, మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి, క్యూలో నుంచుని, రెండు మూడు దొన్నెలు సంపాదించేవాళ్ళం. చిన్నప్పుడు, తినడంకోసం బతికేవాళ్ళం, ప్రస్తుతం బతకడంకోసం తింటున్నాం ! ఓం ఆత్మారాముల శాంతిశ్శాంతిశ్శాంతిః !

మరిన్ని కథలు

Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ
Perugu diddina kapuram
పెరుగు దిద్దిన కాపురం
- జి.ఆర్.భాస్కర బాబు
Margadarshakudu
మార్గదర్శకుడు
- చెన్నూరిసుదర్శన్
Manishi kannaa nayam
మనిషికన్నా నయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Vaddee muddu kaadu
వడ్డీ ముద్దు కాదు
- మద్దూరి నరసింహమూర్తి
Varna yavanika
వర్ణ యవనిక
- జి.ఆర్.భాస్కర బాబు
Parikinee
పరికిణీ
- రాము కోలా దెందుకూరు