తిమ్మాపురంలో చంద్రయ్య అనే యువకుడు ఉండేవాడు.వాడు అందంగా ఉండేవాడు. వాడు తన అందం చూసుకుని మురిసిపోవటమేకాక అందంలేని వారిని అంగవైకల్యంగలవారిని అదే పనిగా ఆటపట్టించేవాడు. అదే ఊరిలో తిమ్మన్న అనే యువకుడున్నాడు .వాడికి చెవుడు. వాడికేమన్నా చెప్పాలంటే బిగ్గరగా అరవాలి. తిమ్మన్నకు కోపమెక్కువ.వాడి కోపం గురించి తల్లిదండ్రులకు బెంగగా ఉండేది. కొందరు కుర్రాళ్ళు తిమ్మన్నను బిగ్గరగా తిట్టి,వాడు ఆవేశపడితే చూసి ఆనందించేవాళ్ళు. చంద్రయ్య ఆ కుర్రాళ్ళను పిలిచి" మీరు తిమ్మన్నకు కోపం తెప్పించి ఆనందిస్తున్నారు. కోపం తెప్పించి ఆనందించడంలో ప్రమాదముంది. వాడిని ఆటపట్టించి వినోదించటం ఎలాగో చూద్దురు గానీ" అన్నాడు. మరునాడు కుర్రాళ్ళు తిమ్మన్నను మాటలంటుంటే చంద్రయ్య వెళ్ళి వాళ్ళను మందలించి క్షమాపణ చెప్పించాడు. తర్వాత చంద్రయ్య, తిమ్మన్నను చిరునవ్వుతో హేళన చేస్తూ తిట్టాడు. వాడు తనను తిడుతున్నాడని తెలియక తిమ్మన్న నవ్వాడు. చంద్రయ్య నవ్వుతూ మెల్లగా తిడుతూ వుండటం, తిమ్మన్న నవ్వటం కుర్రాళ్ళకు ఆనందానిచ్చింది. వాళ్ళు చంద్రయ్యను మెచ్చుకున్నారు. తిమ్మన్నకూ చంద్రయ్యకూ స్నేహమయింది. తిమ్మన్నను హేళనచేస్తూ ఆటపట్టిస్తూ అమితానందం పొందేవాడు చంద్రయ్య. ఒకరోజు ఇద్దరూ పొరుగూరిలో తిరునాళ్ళు చూడాలని బయల్దేరారు. దగ్గరి దారని అడవి మార్గంలో నడిచివెళ్తున్నారు. దారిలో చంద్రయ్య "ఒరేయ్! ఏనుగు ఘీంకారం కూడా వినిపించని చెవుడును ఏ తిరునాళ్ళలో కొనుక్కున్నావ్?"అన్నాడు. ఆమాటలు వినపడక తిమ్మన్న మౌనంగా ఉండిపోయాడు. చంద్రయ్య ఆనందంగా రెచ్చిపోతూ "నీతో మాట్లాడాలంటే బండెడు కూడు తినాలి. నీచెవుడే నీకు తిరునాళ్ళు" అంటూ నవ్వాడు.వాడి పెదవుల కదలిక చూసి ఏదో చెబుతున్నాడనుకుని తిమ్మన్న వెర్రినవ్వు నవ్వాడు.అది చూసి చంద్రయ్య దారి పొడుగునా వాడిని హేళనచేస్తూ వినోదించసాగాడు.కొంతదూరం వెళ్ళాక దొంగలు వారిని అడ్డగించారు. వెదికి చూస్తే ఇద్దరి దగ్గరా చెరో ఇరవైరూపాయలు దొరికాయి. "చూడ్డానికి గొప్పగా ఉన్నారు. ఓ బంగారు ఉంగరమైనా లేదు. చచ్చుదద్దమ్మలు. పుచ్చిన ముఖాలు" అంటూ దొంగలు తిట్టసాగారు. ఆ మాటలకు చంద్రయ్యకు పిచ్చి కోపం వచ్చి "సిగ్గుపడాల్సింది మేం కాదు. దొంగతనం చేస్తున్నందుకు మీకుండాలి సిగ్గు.చెవిటిమేళం దగ్గర పుట్టెడు చెవుడుంది తీసుకెళ్ళండి" అన్నాడు. తిమ్మన్నకేమీ వినిపించక బుద్దిగా ఊరుకున్నాడు. దొంగలు చంద్రయ్యకు బాగా దేహశుద్ది చేసి "అనువుగానిచోట అధికులమనరాదు. నీ మిత్రుడిని చూసి మౌనంగా ఉండటం నేర్చుకో"అని వెళ్ళిపోయారు. చెవుడు అవకరమైనా కోపం ఇంకా పెద్ద అవకరమనీ, తిమ్మన్నను చెవుడనే అవకరం కాపాడుతోందని,కోపం,హేళనచేయటం అనేవి చాలా ప్రమాదకరమైన అవకరాలని గ్రహించిన చంద్రయ్య ఆ తర్వాత ఇంకెవరి అవకరాన్ని హేళన చేయలేదు. తన అవకరాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డాడు.