రెక్కలొచ్చిన పక్షులు - భీమా శ్రీనివాస రావు

Rekkalochina pakshulu

సాయింత్రం ఐదు గంటలు కావస్తుంది. అప్పటిదాకా భగ,భగ నిప్పులు చిమ్మిన సూర్యుడు కాస్త శాంతి పడినట్లు అనిపిస్తూ అస్తమించటానికి సంసిద్ధుడవుతున్నాడు. నిజమేమిటి అంటే , సూర్యుడు తేజస్సు తగ్గినట్లు మనలో భ్రమ కలిగించాడు. ఆ బ్రమనే నిజమనుకొని బ్రతికేస్తున్నాం. ఎంతవిచిత్రం. నిజంగా జీవితమంతా కష్టపడి,ఈరోజు ఓపిక తగ్గి, నా అనే వాళ్ళకే భారంగా అనిపించే మేము కదా.... అస్తమించటానికి సంసిద్దమవుతుంది అనుకొంటూ కంటి కొన వెంబటి కారుతున్న దుఃఖ సాగర బిందువు ని తువ్వాలుతో తుడిచికొంటూ మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు నారాయణ. వసారాలో వేసుకొన్న పడకకుర్చీ అలానే ఓపికలేనట్లు నెమ్మదిగా కదులుతున్నది. చూరు అంచులోనుండి సరిగ్గా ముఖం మీద పడుతున్నసూర్యుని కిరణాలూ నారాయణ కళ్ళను తెరిచే ప్రయత్నం కూడా చెయ్యనివ్వటం లేదు. జరుగుతున్న పరిణామాలు ఒక్కటి అతనికి పూర్తిగా అర్ధమవ్వటం మొదలయ్యాయి. కానీ వాటికి బిన్నంగా ఏమీ ఆలోచన సాగించలేకపోతున్నాడు. కళ్ళ నీళ్లు ఆపే ప్రయత్నం పూర్తిగా అతని అధీనంలో లేకుండా పోయింది.

ఇంతలో , ఓ " అయ్యా " అనే పిలుపు అతని చెవిన పడింది. అది లక్ష్మీదేవి పిలుపే అని గ్రహించిన నారాయణ చేతులో ఉన్న తువ్వాలును మొఖం మీద వేసుకొని ... నిద్రలో ఉన్నట్లు నటిచాలనుకొన్నాడు. ఇంతలో మరింత దగ్గరగా వచ్చిన లక్ష్మీదేవి - ఏందయ్యా ఈ నిద్ర, పొద్దున్నే అంత దూర ప్రయాణం పెట్టుకొని అని తట్టి లేపే ప్రయత్నం చేసింది. ఆ పిలుపుకు, స్పర్శకు ఏ మాత్రం చలించని నారాయన ముఖం మీద ఉన్న తువ్వాలు తీసి , ఏందయ్యా ఏం మాట్లాడవు ఇంత అరుస్తున్నా అనేలోపే , ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లలో , ఎరుపు రంగుని కప్పి ఉంచటానికా అన్నట్లు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అది చూచిన లక్ష్మీదేవి ఇలా అంటుంది.

అయ్యా... నేను కొన్ని రోజులు చూద్దామయ్య అన్నా వినకుండా వెళ్లాలని పట్టుబట్టావు. సరే అన్నాను. ఇప్పుడేమో ఏంటి ఇది, చిన్నపిల్లాడిలా. అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతుందిగా. ఇంకా ఎందుకు ఈ కన్నీళ్లూ, లేని పోనీ ఆలోచనలు. అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కొంచెం తేలిక పడిన నారాయణ, అదేలేవే వెళ్లుతున్నదుకు నాకు వేరే ఆలోచన ఏమి లేదు. కానీ తర్వాత ఏమి జరుగుతుందో ,అనే చిన్నపాటి భయం బాధ పెడుతుందే అన్నాడు జీర బోయిన స్వరంతో. మళ్ళి లక్ష్మిదేవి కలుగజేసుకొని, నాకు ఏమీ జరగదులే అని చెప్పి ఇప్పుడేందయ్యా మళ్ళి నీ భయం అంది. ఇంక చాలు గాని, ప్రొద్దుటే ప్రయాణం కదా !!! అందరికీ అర్ధం అయ్యేలా చెప్పావా ? ఇంకా ఏమైనా పనులు మిగిలిఉన్నాయా ? అని అడిగింది.

చెప్పానే, చెప్పాను.... పనులు కూడా అన్నీఅయి పోయాయి. కానీ మళ్ళీ ఒకసారి చూస్తావుండు అంటూనే ....

మీ తరుపు వారికి కూడా సరిగ్గా చెప్పావా లేదా .... అని అడిగాడు నారాయణ. ఆ "చెప్పా" నయ్యా అంది లక్ష్మీదేవి.

ఆ టేబుల్ మీద ఉన్న కళ్లజోడు, డైరీ ఇటివ్వు, ఒకసారి రాసుకొన్న లిస్ట్ మళ్ళీ చూస్తాను అన్నాడు నారాయణ. కళ్ళజోడు,డైరీ ఇస్తూనే .... సరిగ్గా చూడయ్యా . ఏదయినా మర్చిపోతే ఇప్పుడే కానివ్వు అంది లక్ష్మీదేవి.

కళ్ళజోడు పెట్టుకొని, డైరీ తెరచిన నారాయణ మొదటి పేజీ నుండి ఒక్కోలైను చూడసాగాడు. అవన్నీ చూస్తుంటే...మళ్ళీ అతని ఆలోచనలు వేరే వైపు సాగాయి. అయినా ఒక్కోలైను చదివి లక్ష్మీదేవి కి వినిపిస్తూ .... ఎర్రఇంక్ పెన్నుతో టిక్కులు పెట్టసాగాడు. మొదటిగా

1. ఇద్దరి పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంట్లు - రద్దు చేసి వచ్చిన డబ్బు బీరువాలో లోపలి డ్రా లో పెట్టాను. అది ఇక్కడ రాసాను.

2. అమ్మగా మిగిలి ఉన్న అరెకరం మెట్టపొలం, ఎకరం పాతిక సెంట్లు మాగాణి... తన తదనంతరం వాడికి చెందేటట్లు వీలునామా రాసాను.

3. నీకు ,ఇన్నేళ్ల మన జీవితంలో చేయించిన ఒకే ఒక నగ , చిన్న రాళ్ల హారం, రెండు గాజులు మూటకట్టి కోడలి కి ... ఇది నేకెనమ్మా అని రాసిపెట్టాను.

4. నా పాత సైకిల్.... వీధి చివర సుబ్బిగాడికిచ్చి... మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు ఇది నీదేరా అని చెప్పి వచ్చాను.

5. కిరాణా కొట్టు ముత్తేశ్వరరావు కి ఇవ్వవలసిన రెండువందల యాబై బదులు ...మూడు వందలిచ్చి ...మిగిలిన డబ్బులు తర్వాత తీసికొంటాలే అని చెప్పి వస్తూ పాలకేంద్రం వెంకటేశ్వరావు కి ఈరోజు వరకు బాకీ కట్టి ...రేపటి నుండి ఉండము , ఊరేళ్లుతున్నాం....తిరిగి వచ్చినాక మళ్ళీ వచ్చి చెప్పుతాలే అని చెప్పి వచ్చాను.

6. డొంక చివర బోసుకి, బెజవాడ మాస్టారుకి, మిఠాయి కొట్టు సాంబయ్యకు, కంసాలి డాక్టర్కి, హోమియోమందుల యలమయ్యకి, అప్పయ్య మంగలికి, చాకలి కిష్టయ్యకి, హోటల్ చిన్నబ్బాయి కి వెళ్ళొస్తానని చెప్పి చివరిగా రమణారావు కరణంగారి దగ్గరకు వెళ్ళాను. అయన నారాయణ... నీవు ఇప్పుడు అంత దూరం వెళ్ళటం అవసరమా అని అడిగాడు. తప్పదయ్యా... ఇప్పుడుకాకపోతే ఎప్పుడైనా వెళ్ళకు తప్పదు గా అన్నానే , కానీ ఆయన మనం అక్కడికి వెళుతున్నాం అంటే అసలు నమ్మటంలేదే అన్నాడు...లక్ష్మీదేవి వంక చూస్తూ. కొంపతీసి చెప్పేశారా ?? అంది ఆత్రంగా. లేదే... మనం అక్కడికి వెళ్ళి కొన్నాలుండి తిరిగివస్తాము అని చెప్పానే అన్నాడు నారాయణ.

7. తర్వాత పూలకొట్టు సాంబయ్యకు... వెయ్యు రూపాయ లిచ్చి.... రేపు రెండు పెద్ద దండలు, ఒక పెద్ద గంప విడిపూలు ఉంచమని చెప్పి వచ్చాను. ఎదో ఒక టైం లో నేను కానీ, మా వాళ్లు కానీ వచ్చి తీసికొంటాం అని చెప్పాను. సాంబయ్య ఏంటి సంగతి అంటే , మా వాడు వస్తున్నాడు మమ్ముల్ని తీసికెళ్ళటానికి అని చెప్పాను.

8. బట్టలషాపు బుజ్జి కి - రేపు ఊరెళుతున్నాం.... నాకు ఒక కొత్త పంచె, నీకు ఒక కొత్త చీర ఇమ్మని తెచ్చాను.

9. పుల్లయ్య కి, మట్టయ్య కి, సుబ్బారావు కి, వెంకటేశ్వర్లు కి, సోమయ్యకి, రత్తయ్య కి, వీరయ్యకి , నర్సయ్యకి, రామచంద్రయ్యకు, ఎల్లమందకి, యానాదికి, రాంబాబుకి.... అందరికీ రేపు మా అబ్బాయి వసున్నాడు మమ్ముల్ని తీసికెళ్ళటానికి, మళ్ళీ తిరిగి వచ్చినాక కలుస్తానని చెప్పానే. కానీ అందరూ...నేనేదో నిజం చెప్పనట్లు నా వంక చూస్తూనే... సరే జాగ్రత్త గా వెళ్ళి రండి అంటున్నారు అని గద్గద స్వరంతో చెప్పి ఒక్కసారిగా ఆపేసాడు.

అప్పుడు లక్మిదేవి , నేనుకూడా అలాగే చెప్పానయ్యా అంది. బాయికాడి వెంకమ్మ అప్ప కూడా అసలు నమ్మలేదంది.

ఇద్దరూ అన్నీ విషయాలు మాట్లాడుకొంటుండగానే సమయం రాత్రి ఏడున్నర అయింది. రాయ్య కలసి భోజనం చేద్దాం , తర్వాత నాకు గిన్నెలు అన్నీ కడిగి తుడిచి మూటకట్టే పనికూడా ఉంది అంటూ లోపలి వెళ్ళింది లక్ష్మీదేవి.

ఇద్దరూ భోజనాలు చేసి అన్నీ పనులు ముగించుకొనే సరికి సరిగ్గా సమయం రాత్రి తొమ్మిదిన్నర. నారాయణ మంచం మీద నడుం వాలుద్దామనుకొంటుండ గానే ఫోన్ మ్రోగింది. వెళ్ళి ఫోన్ ఎత్తిన నారాయణకు అవతలి నుండి .... హలో , హలో నాన్న అంటూ పిలుపు. ఆ కన్నా ఎక్కడఉన్నారు అని నారాయణ అడగగానే, నాన్న ఇప్పుడే దుబాయ్ లో ల్యాండ్ అయ్యాం... మళ్ళి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ ఫ్లైట్ నాన్న అని సమాధానం. నాన్న, హైదరాబాద్ లో దిగి డైరక్ట్ గా కార్ తీసికొని వచ్చేస్తాం. ఇంటికి వచ్చే సరికి ఉదయం 10 అవుతుంది అన్నాడు కన్నా. అప్పుడు నారాయణ, సరే కన్నా, జాగ్రత్తగా రండి అంటూ , అమ్మతో మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి, కన్నా జాగ్రత్తగా రండిరా, అమ్మాయి పిల్లలు జాగ్రత్త అంటూ ఆపుకోలేని దుఃఖాన్ని దిగ మ్రింగుతూ ఫోన్ నారాయణకి ఇచ్చింది. హలో కన్నా..... అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగానే కాల్ కట్ అయింది. కాల్ కట్ అయింది లక్ష్మి అంటూ ఫోన్ ప్రక్కన పెట్టి , మంచం మీద మౌనంగా వాలాడు నారాయణ. అంతలో కళ్ళ నీళ్ళు ఇంకా నులుముకుంటూ వచ్చిన లక్ష్మిదేవిని , ఏంటి లక్ష్మీ చిన్న పిల్ల లా, ఇప్పటి దాక నాకు చెప్పి నువ్వు చేస్తున్నదేమిటి అన్నాడు నారాయణ. మౌనంగా ఉండిపోయింది లక్ష్మీదేవి.

మెయిన్ డోర్ దగ్గరగా వేసి , ఇద్దరూ మంచం మీద నడుం వాల్చారు. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం తప్ప మాటలు లేవు. కొద్దీ సేపటితర్వాత, నారాయణ, లక్ష్మీదేవి అరచెయ్యి తన అరచెయ్యి లో వేసి ఇలా అంటున్నాడు.....

లక్ష్మీ, నువ్వు నా జీవితంలోకి వచ్చి అరవై ఏళ్ళు అయింది. ఎప్పుడూ నాకు ఇది కావాలని అడిగింది లేదు. నేను చెప్పిన మాటకు ఒక్కసారైనా " కాదు " అని చెప్పింది లేదు, నా ఇష్టాలన్నీ నీ ఇష్టాలనుకొన్నావు కానీ, నీకంటూ ఏమి ఇష్టాలు, కోరికలు లేవా లక్ష్మీ ?. ఇప్పుడు చెప్పు లక్ష్మీ నీకేం కావాలో..... చెప్పు లక్ష్మీ అని అడుగుతున్నాడు.

ఏం మాట్లాడవు లక్ష్మీ అని మళ్ళి అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి.....

ఏందయ్యా ఇది కొత్తగా, ఏం కావాలని ఇప్పుడు అడుగుతున్నావు ..... ఇప్పుడేం ఇస్తావు ? అంది.

నువ్వు అడిగి చూడు లక్ష్మీ ఇస్తానో లేదో తెలుస్తుందిగా అన్నాడు నారాయణ...

చాల్లే అయ్యా.... బంగారం లా జీవితమంతా నన్ను చూసుకొన్నావ్, నాకు ఇంతకన్నా ఏం కావాలి అయ్యా ... అంది లక్ష్మీదేవి.

అది సరే లక్ష్మీ ... ఏం కావాలో అడగకుండా ఇవన్నీ ఏమిటి అన్నాడు నారాయణ.

సరే అడుగుతాను.. అడిగినాక కాదు, కూడదు , తెలియదు అనొద్దు అంది లక్ష్మిదేవి. సరే అన్నాడు నారాయణ....

అప్పుడు లక్ష్మీదేవి.... మళ్ళి జన్మ అంటూ ఉంటే , మళ్ళి నువ్వే నా భర్తగా వస్తావ అయ్యా ? అని మౌనంగా ఉండిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక , చేతిలో ఉన్న తన చెయ్యిని మరింత గట్టిగా పట్టుకొన్నాడు నారాయణ. మళ్ళీ కొంతసేవు ఇద్దరి మధ్య మౌనం....

సరే లక్ష్మీ రేపటినుండి అంతా మంచే జరుగుతుందిలే, ఏం బాధపడొద్దు అంటూ సర్ది చెప్పి, బాగ పొద్దుపోయింది పడుకో లక్ష్మీ నువ్వసలే నిద్ర కాయలేవు అంటూనే , నాకు నమ్మకం ఉంది లక్ష్మీ , మనం మళ్ళీ తిరిగి కలుస్తాం. ఈసారి మాత్రం నువ్వెలా చెపితే అలా అని చెయ్యి మరింత గట్టిగా పట్టుకొన్నాడు నారాయణ . సరే... సరే .... అంటూనే నిద్రమత్తులోకి జారుకొంది లక్ష్మీ దేవి.

కళ్ళు అయితే మూసుకున్నాడు కానీ.... నారాయణ కు ఏ మాత్రం ఊరటగా లేదు. ఒకటే ఆలోచనలు... ఏమైనా తప్పుగా ఆలోచించామా అని మరో వైపు.... ఆ ఆలోచనలు అన్నీ కలసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అలా ఆలోచిస్తూనే... జీవితం ఎక్కడ మొదలైయింది, ఎక్కడ ముగుస్తుంది అనే వైపు సాగాయి నారాయణ ఆలోచనలు.......

అది 1970 వ సంవత్సరం.... శ్రావణ శుక్రవారం, రాత్రి ఏడూ ఎనిమిది కావస్తుంది. బయట జోరున వర్షం కూడా. లక్ష్మీదేవి కి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమయానికి అత్తయ్య ఇంట్లోనే ఉంది కాబట్టి, గొడుగు పట్టుకొని మంత్రసాని పుల్లమ్మ ఇంటికి పరుగు పరుగు న వెళ్ళి, పుల్లమ్మ ను వెంటబెట్టుకొని వచ్చాను. అప్పటికే లక్ష్మీ నొప్పులకు తాళలేక విలవిల లాడుతుంది. మంత్రసాని పుల్లమ్మ, నువ్వు బయట ఉండయ్యా, ఏం కాదులే అని చెప్పి లోపలికి వెళ్ళింది. అరగంట సమయం గడిచింది. గుండంతా బరువెక్కి పోతుంది లోపల లక్ష్మి ఎలావుందో అని. సరిగ్గా అప్పుడే పుల్లమ్మ బయటకొచ్చి, నారాయణ..... అదృష్టవంతుడవయ్యా ... పండంటి మగబిడ్డ అని చెప్పింది. పుల్లమ్మ ఏం చెప్పిందో వినబడక ముందే , లక్ష్మి ఎలా ఉందని అనేదానికి .... బిడ్డ బొద్దుగా పుట్టినందుకు కాస్త కానుపు కష్టం అయ్యింది నారాయణ. కానీ ఏమి గాబరా పడాల్సింది లేదులే. ఒక గంట తర్వాత సృహలోకి వస్తుంది.... వెళ్లి చూడు అంటూ పుల్లమ్మ వెళ్ళిపోయింది. అత్తయ్య ప్రక్కనే కూర్చుని సపర్యలు చేస్తుంది. నన్ను కూడా కాళ్ళను చేతులతో రుద్దమంది. గంట అన్నది... మూడు నాలుగు గంటలకు కానీ మనస్ప్రుహ కి రాలేదు. సృహ లోకి రాగానే , ఎలా ఉంది లక్ష్మీ అని అడిగాను. నాకు బాగానే ఉందయ్యా , వాడు ఎలా ఉన్నాడు అంది. అప్పుడు చూసాను కన్నా గాడిని. నాయాలు భలే బొద్దుగా ఉన్నాడు. అంతా లక్ష్మీ పోలికే. ఆ కానుపు తర్వాత, లక్ష్మీ కి పెద్ద జబ్బుచేసి పెద్దాస్పత్రికి తీసుకెళ్లితే గర్భసంచి తెసేయాలన్నారు. చేసేదేమి లేక ఒక్కడితోనే అంతా అనుకొన్నాం. కన్నా గాడిని మట్టిని కాలకంటకుండా పెంచాం. మంచి స్కూల్లో, కాలేజీ లో చదివించాం. బీటెక్ అవ్వగానే మంచి ఫారిన్ కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. నాన్న, రెండంటే రెండే ఏళ్ళు అమెరికా వెళ్లి కొంచెం డబ్బులు కూడబెట్టి తిరిగివస్తా అనిచెప్పి వెళ్లిన కొడుకు...... రెండేళ్ల తర్వాత, నాన్నా కొంచెం మంచి జీతం వచ్చే ఉద్యోగం పెద్ద కంపెనీ లో వచ్చింది ఇంకా రెండేళ్లు ఉంటాను అన్నాడు . చేసేదేమిలేక సరే అన్నాను. రెక్కలొచ్చిన పక్షులను ఎగరొద్దు అంటే ఎలా అని అనిపించింది.

అప్పటికే మా ఆరోగ్యాలు అంతంత మాత్రం గానే ఉన్నాయి. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి అమ్మా, నాన్న..... వచ్చే జనవరిలో వచ్చి మిమ్ముల్ని కూడా అమెరికా తీసికెళ్ళతాను అన్నాడు. వద్దులే కన్నా... మాకు ఇక్కడ బాగానే ఉంది అని చెప్పాము. ఆ తర్వాత రెండేళ్లకనుకుంట....ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి.... నాన్న...ఇక్కడ మా పాత ఆఫీస్ లో నాతో పాటు పనిచేసిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసికుందాం అనుకుంటున్నాను. చాలా మంచి అమ్మాయి నాన్న , పైగా మన తెలుగు వాళ్లే , కానీ ఇక్కడ అమెరికా లో స్థిరపడ్డారు. మీరే మంటారు అన్నాడు. అమ్మతో మాట్లాడు అని ఇచ్చాను. ఏంటి కన్నా... ఉన్నట్లుండి ఈ పెళ్ళిఏంటి.... అసలు వాళ్ళు ఎవరు ఏంటి నీకు ఏం తెలుసురా అంది. అన్నీ చూసాను అమ్మ, మంచి ఫ్యామిలీ... పైగా ఒక్కటే అమ్మాయి. ఒప్పుకోండి అమ్మ అని బ్రతిమిలాడసాగాడు. సరే అన్నీ నువ్వే చూచుకొన్నాక .... ఇంకా మేము ఒప్పుకొనేది ఏముందిరా అని వాపోయింది లక్ష్మి. ఇంకా ఎదో చెప్తూనే ఉంది వాళ్ళ అమ్మ... ఇంతలో వచ్చే నెలలోనే పెళ్ళి అంటున్నారు అమ్మ అన్నాడు. మీకు ఫ్లైట్ టిక్కెట్స్ పంపిస్తాను మీరూ వస్తే బాగుంటుంది అమ్మా అన్నాడు. లక్ష్మీకి ఏమి అర్ధంకాక, ఫోన్ నాకిచ్చింది. ఏంటిరా... కన్నా వచ్చే నెలలో పెళ్ళా ?? ఫ్లైట్ టికెట్స్ పంపిస్తే మేము రావాలా.?? ఇంకా ఏవేవో ప్రశ్నలు అడగాలనుకొన్నా .... ఇక అక్కడితో ఆపేసి.... కన్నా, ఇప్పుడు మేము రాలేము లే నాయన, పెళ్ళి అయిన తర్వాత వీలు చూసుకొని ఒకసారి మీరే వచ్చి వెళ్లండని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఫోన్ అయితే పెట్టేసాడు కానీ, లోపల అంతా బాధగానే ఉంది. లక్ష్మితో..... నువ్వేం బాధపడకు లక్ష్మి, వాడు బాగుంటే అంతే చాలు. అంతకన్నా మనకేం కావాలే అని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు కళ్ళ నీళ్లు దిగమింగుకొంటూ.

ఆ తరువాత కన్నా నుండి సరిగ్గా నెలన్నరకు ఫోన్ వచ్చింది. నాన్న... పెళ్ళి బాగా జరిగింది... నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇదిగో అమ్మను కూడా పిలువు... మీకోడలితో నువ్వు మాట్లాడి, అమ్మకివ్వు అన్నాడు. ఫోన్ రిసీవర్ చెవి దగ్గరే ఉంది... అవతలి నుండి హెల్లౌ, మామగారు నమస్తే. " ఐ యామ్ రూప జాన్సన్. హౌ అర్ యు, హౌ ఈజ్ ఆంటీ. కన్నా ఈజ్ ఏ నైస్ గై. ఐ లైక్ హిం వెరీ మచ్. సారీ ఫర్ అవర్ షార్ట్ నోటిసుడ్ మ్యారేజ్ .... .... .... ఇలా చెప్పుకొంటూ పోతుంది. నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఆ పిల్లది ఏం తప్పుంది. చిన్నప్పటి నుండి అమెరికా లో పుట్టి పెరిగింది. పక్కనున్న వీడన్నా చెప్పాలిగా... నాకు ఏమి వచ్చో, ఏమి రాదో..... . కొంచెం సేపటి తర్వాత .... వాడు ఫోన్ తీసుకొని నాన్న మీ కోడలు ఎలా మాట్లాడింది, అమ్మ కూడా మాట్లాడిందా అని అడుగుతున్నాడు. కోడలు బంగారం లా ఉందిరా .... అమ్మ ఇంట్లో లేదు తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతుందిలే అని చెప్పి ఫోన్ పెట్టేసా.

ఆ తరువాత అప్పుడప్పుడు కన్నా ఫోన్ మాట్లాడు తున్నా .... ఏదో అర్ధం కానీ జీవితం లా అనిపించేది. ఆ మధ్యలో కన్నా ఒక్కడే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాలేదు ఒక సారి వచ్చి చూచెల్లారా అంటే వచ్చాడు. పది రోజులుండి అమ్మ కొంచెం కోలుకుందిగా నాన్న వెళతాను, ఇద్దరు పిల్లలతో తనకి కష్టం గా ఉందంటుంది అన్నాడు. సరే కన్నా.... మాకు ఆరోగ్యాలు ఏ మాత్రం బాగుంట లేదు. ఏదో ముసలిది ఉన్నన్నాళ్ళు ఉంటాం. మాకు ఎప్పుడైనా ఏమైనా అయితే... కాస్త వచ్చి నీ ధర్మం నీవు నెరవేర్చి పోరా అని వాపోయా. సరే నాన్న మీకేం కాదులే ఇప్పుడు . ఒకపని చెయ్యండి... నెల నెలా ఒక యాభై వేలు డబ్బులు పంపిస్తాను, ఎవరినైనా ఇంట్లో పెట్టుకోండి అన్నీ చూచుకొనేలా అని ఉచిత సలహాకూడా ఇచ్చాడు. మీరు అమెరికా రమ్మంటే ఎలాగూ రారు. మేమేమో ఇద్దరం ఉద్యోగాలు, పిల్లలు చదువులు... అన్నీ ఇబ్బందులే నాన్న... అంటూ ఏవేవో నీతి కథలు చెప్పాడు.

పెళ్ళయి దాదాపు పదేళ్ళు పైనే అయింది. కోడలితో , మనవడు,మనవరాలి తో ఏదో ఫోన్ లోనే వచ్చి రాని బాష తో తంటాలు పడ్డాం..... కానీ ఒక్కోసారి వాడే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. బాగా చదివించినందుకు మంచి ఉద్యోగం వచ్చింది. వాడి బ్రతుకు వాడు చాలా బాగా బ్రతుకుతున్నాడు. వాడూ , వాడి సంసారాన్ని చూసుకోవాలిగా. పైగా ఉద్యోగం చేసే పెళ్ళాం, చదువుకొనే ఇద్దరు పిల్లలు. వాడే కరెక్ట్, వాడే కరెక్ట్ ....

ఇలా మరో సంవత్సరం గడిచింది.... లక్ష్మికి ఆరోగ్యం మరింత క్షిణించింది. ఏదో లేచి ఒక ముద్ద వండుతుంది కానీ... పరిస్థితి ఏం బాలేదు అని తెలుస్తుంది. ఒక రోజు ఇద్దరం అన్నీ విషయాలు మాట్లాడుకొన్నాం. జీవితం లో అన్నీ చూసాం... ఇంకా తీరని కోరికలంటూ ఏమి లేవు. ఒకవేళ కొన్ని ఉన్నా అవి తీరవు అని తెలిసింది. మరుక్షణమ్... కన్నా కు ఫోన్ చేశాను. మీ అందరికి సెలవలు ఎప్పుడుంటాయని అడిగాను. దగ్గరలో క్రిస్టమస్ , న్యూ ఇయర్ వస్తుంది నాన్న, దాదాపు ఒక పదిహేను రోజులు సెలవలు ఉండొచ్చు అన్నాడు. అయితే కన్నా... ఒక్కసారి నిన్ను , కోడలిని , పిల్లల ను చూడాలని ఉందిరా. మళ్ళీ ఇంకా లేటయితే చూస్తామో లేదో అనిపిస్తుంది. అమ్మ కు అసలు బాగాలేదు. అన్నాను. అయితే అందరం మాట్లాడుకొని రేపుచెప్తా అని ఫోన్ పెట్టేసాడు.

లక్ష్మీ ఈ సారి అందరూ వస్తారనే అనిపిస్తుందే.... నువ్వు ఏమంటావ్ అన్నాను. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అయ్యా అంది లక్ష్మి.

తరువాతరోజు కన్నా నుండి ఫోన్ వచ్చింది. కోడలు కూడా ఇక్కడ లైఫ్ రొటీన్ అయి బోర్ కొడుతోంది వెళదాం అంటుంది నాన్న, పిల్లలు కూడా ఇప్పటివరకు మిమ్ముల్ని చూడలేదు, మిమ్ముల్ని ఒకసారి చూడాలంటున్నారు అన్నాడు. ఎప్పుడొస్తున్నారు అంటే డిసెంబర్ 5 న అన్నాడు.

రేపే డిసెంబరు 5.

చుస్తూ చూస్తూ ఉండగా యాబై ఏళ్ళు గడిచిపోయాయి. కన్నా గాడు ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడో పెద్దయ్యాడో మాయగా ఉంది. కానిలే గూడులోని పిల్లలకు రెక్కలొచ్చేవరకే తల్లి ,తండ్రి అవసరం. తర్వాత... స్వేచ్ఛగా అవి ఎగిరి పోతుంటే... సంతోషపడాలే కానీ...భాద ఎందుకు అని సర్ది చెప్పుకొంటున్నా. నిజంగా ఆలోచిస్తే తల్లి, తండ్రి అవసరం అంతవరకేనా ??

కొన్నిసార్లు సమాధానమే లేని ప్రశ్నప్రపంచంలో ఇదొక్కటేనేమో అనిపిస్తుంది.!!! ఆలోచిస్తూ , ఆలోచిస్తూ ..... ఈ వేదన , ఆలోచనలతోనే రాత్రంతా గడచిపోయింది...

మళ్ళీ తెల్లారలేదేమో ..... ?

తెల్లారి ఎనిమిదవుతుంది.... బరువెక్కిన హృదయం ఒక్కసారిగా దూది పింజలా అనిపిస్తుంది నారాయణ కి . లక్ష్మి లక్ష్మి అని పిలుస్తుంటే పక్కనే ఉన్న లక్ష్మి మౌనంగా నారాయణ వంకచూస్తుంది. ఈ లోపు ఎవరో, రాత్రి గడి పెట్టకుండా దగ్గరకు వేసిన తలుపు కొడుతున్నారు. వెళ్లి తీద్దాం అనుకొంటూ నారాయణ ప్రయత్నం చేస్తున్నాడు కానీ తలుపు తెరుచుకోవటం లేదు. లక్ష్మి , తలుపు తెరుచుకోవటం లేదు ఏంటో చూడు అన్నాడు. లక్ష్మి వచ్చి చూసి తలుపు రావట్లేదయ్యా అంటుంది. ఈ లోపు తలుపు ఎంతకీ తీయకపోతే.... తలుపు నెట్టి చూసి గడవేయలేదని గ్రహించిన పూర్ణచందర్రావు ... తలుపు నెట్టుకొని లోపలికి వస్తూనే నారాయణ బాబాయ్, లక్ష్మి పిన్ని అని పెద్దగా పిలుస్తున్నాడు.

లోపలికి వచ్చిన పూర్ణచందర్రావు.... కళ్లెదుటి దృశ్యాన్ని చూసి ఏమి అర్ధంకాక .... అలానిలబడి పోయాడు. కొంచెం చేపటి తర్వాత తేరుకొని బయటకు వచ్చి, చుట్టుపక్కల అందరికి విషయం చెప్పాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అందరూ జమకూడారు. ఒకరి తర్వాత ఒకరు దగ్గర చుట్టాలందరూ చేరుకొన్నారు. అందరూ నోటివెంట ఒకటే మాట. పొద్దునే అబ్బాయి, కోడలు, పిల్లలు అందరూ వస్తున్నారు.... మీ అందరూ మా ఇంటికి రండి అని నిన్న సాయంత్రమే చెప్పారు అని. ఎవరికీ ఏమీ అర్ధం కావటంలేదు అక్కడ ఏమి జరిగిందో....

అప్పటికే ఉదయం పది గంటలు కావస్తుంది.

ఈ లోపే ఒక తెల్లకారు వచ్చి నారాయణ ఇంటిముందు ఆగింది. అందులోనుండి దిగిన కన్నా కు , అతని భార్య , పిల్లలకు అక్కడ ఏం జరిగిందో, ఆ జనమేంటో అర్ధం కాలేదు. ఈ లోపు పూర్ణచంద్ర రావు పరుగు పరుగు న వచ్చి, కన్నా..... అంతా అయిపోయిందిరా అంటూ గట్టిగా పట్టుకొని భోరున విలపిస్తున్నాడు. కొంచెం... అర్ధం అయి అవనట్లున్న కన్నా.... ఏం జరిగింది అన్నయ్య అని అడుగుతున్నాడు. పద కన్నా నువ్వే చూద్దు కానీ...... ఎంత ఘోరం జరిగిపోయిందిరా ... కన్నా అని భోరుమంటున్నాడు. లోపలి వెళ్ళి చూసిన కన్నా కి ... విషయం ఏమీ అర్ధం కాక నీరచించి కూలబడ్డాడు..... పక్కనే అతని భార్య... డార్లింగ్ వాట్ హేపెన్డ్... ఓహ్ మై గాడ్ అంటూ తెల్లబోయింది. పిల్లలకైతే అసలు విషయం ఏమీ అర్ధంకాలేదు. అలా చూస్తూ నిలబడి పోయారు......

ఇంతలో విషయం ఊరంతా తెలిసింది. అందరూ వచ్చారు. సమయం మధ్యాన్నం పన్నెండు గంటలు కావస్తుంది.

ఇంతలో విషయం తెలిసి పూలకొట్టు సాంబయ్య - రెండు పెద్దదండలు, గంపెడు పూలు తెచ్చి నిన్న నారాయణ కలిసిన సంగతి అందరికి చెప్పాడు. మరో నిమిషం లో బట్టల కొట్టు బుజ్జి కొత్త బట్టలు కూడా తీసికొన్నారని చెప్పారు. స్మశానం లో వెట్టి ఎంకన్న వచ్చి నిన్న నారాయణ రెండువేలు ఇచ్చాడని, రేపు మావాళ్లకు అవసరం ఉంటుందని, కావలసిన ఏర్పాట్లు చెయ్యమని చెప్పారని చెప్పుకొచ్చి భోరుమన్నాడు.

కంసాలి డాక్టర్ వచ్చి అంతా పరిశీలించి ఇది సహజ మరణంగా ధ్రువీకరించాడు.

తీరా చూస్తే ఎవరూ ఏపనికి వెళ్ళవలసిన అవసరం లేకుండా అంతిమ యాత్రకి అన్నీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి . ఇదంతా చూస్తున్న వారికీ హృదయ విదారకంగా ఉంది. కొడుకు, కోడలు సమయానికి రావటం ఏమిటి. ఇప్పుడే ఇలాజరగటం ఏంటని ?

నిస్తేజంగా నిలబడిన కన్నా కు ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి

- తల్లి తండ్రి అంటే యాభైవేలు ఖరీదా అని. వారు బ్రతికుండగా ఒక్క రోజు కూడా వారికీ ఒక్క సేవ చేసింది లేదని, చివరకు తనవారసులను కూడా నాన్నకు చూపించకుండా తప్పుచేసానని. కానీ ఏం లాభం గడిచిన సమయం తిరిగి రాదనే సత్యం ఇప్పుడు తెలిసి. తనకోసమే వారి జీవితమంతా బ్రతికారని , కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచారని , కానీ తానూ మాత్రం వారికి ఏమీ చేయలేకపోయానని అలోచించి ఏం లాభం?

చిన్నప్పుడు, నాన్న నేను పెద్దైనాక నిన్ను విమానం ఎక్కిస్తా అని చెప్పా - చేసానా ?

అమ్మా నీకు బంగారు నెక్లెస్ కొనిస్తా అని చెప్పా - కొన్నానా ?

చివరకు నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని - చివరి ప్రయాణపు ఏర్పాట్లు కూడా మీరే చేసుకొన్నారు - ఛీ ఛీ అని భోరుమంటూ విలపిస్తున్నాడు కన్నా. బంధువు లందరూ ఓదార్చుతున్నారు.

ఒకపక్క పెద్దలందరూ కలసి అంతిమ యాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు.

అప్పుడే ఆ మంచం దిండు క్రింద నారాయణ ఆఖరి గా రాసిన ఉత్తరం దొరికింది. అది చదివి కళ్ళు చెమర్చని వారు లేరు.

ఉత్తరాన్ని .... తలుపు తీయలేక , తాము ఉన్న స్థితి ఏంటో గ్రహించిన నారాయణ మాటల్లో .........

ప్రియమైన కన్నా.... ముందుగా నీకు మా అశీసులు. నీవు ఎక్కడ ఉన్నా హాయిగా, సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. కోడలికి, పిల్లలకు మా ఆశీర్వాదాలు.....

నీవు ఇంటికి వచ్చేసరికి ... మాకు ఆ దేవుడి దయ ఉంటే ,మేము ఆ దేవుడని చేరి ఉంటాము. ఇందుకు మమ్ముల్ని క్షమించు. తప్పటం లేదు కన్నా... మేము ఎవరికీ భారం కాదలుచుకోలేదు. మేమే కాదు ప్రపంచంలో ఉన్న ఏ తల్లితండ్రులు అలా కావాలని అనుకోరు.

ఎందుకంటే, జీవితమంతా కష్టపడి మిమ్ముల్ని కని ,పెంచి ,పెద్దచేసిన , మేము ఏమీ ఆశించి ఇదంతా చెయ్యము రా !! . మా దర్మం మేము నిర్వర్తించాము. అటువంటప్పుడు మీ ( పిల్లలు ) ధర్మాలను కూడా మీరు నెరవేర్చాలి కదారా ? ఏ తల్లి అయినా, తండ్రి అయినా .... తాములేని క్షణం లో తమబిడ్డలు ఏం కష్టాలు పడతారో అని ఎక్కువ ఆలోచన చేస్తారు. రేపు నీకు కూడా మా వయసు వచ్చేసరికి... అన్నీ అర్ధమవుతాయి. కానీ ఏంలాభం. అప్పటివరకు మేము ఉండముగా ?. మేము బాగా అలోచించి ఆ దేవుడు మీద భారం వేసి, ఆయననే వేడుకొన్నాం. తండ్రీ... మా అబ్బాయి , కోడలు , పిల్లలూ అందరూ ఒకేసారి వస్తున్నారు. వారు ఎక్కోడో దూరంగా అమెరికా లో ఉంటారు. వారు, వారి పనులతో రోజూ సతమతమవుతూ ఉంటారు. మేము వచ్చిన పని పూర్తయిందని నీవు విస్వశిస్తే, మళ్ళి మళ్ళి వారికి సెలవులు కూడా దొరకవు కాబట్టి మమ్ముల్ని నీలో ఐక్యం చేసికో తండ్రి అని. నీవు ఈ ఉత్తరం చదివే సరికి మేము ఆయనని చేరివుంటాము.

కన్నా... రేపు నీకు ఏ ఇబ్బంది రాకుండా, డైరీ లో అన్ని వివరాలు రాసిపెట్టాను. జాగ్రత్త గా నీవు తిరిగి వెళ్ళే లోపు అన్నీ చూచుకో. మాకు నీ మీద ఏకోపం లేదు కన్నా. ఎందుకంటే మా కంటే నిన్ను ఎవరూ ఎక్కువప్రేమించలేరు కాబట్టి.

ఇక ఉంటాం కన్నా.... ప్రేమతో మీ అమ్మ - నాన్న.

చివరిగా మా జీవిత కథ చదివిన కొడుకులందిరికి ఓ చిన్నమాట....

అమ్మ - నాన్న అంటే ఈ జీవితానికి దైవ సమానులు. ఎక్కడో..... ఉన్నాడో...లేడో అనే అనుమానంతో కొలిచే దేవుడికన్నాకళ్లెదుట కనిపించే దేవుళ్ళని పూజించండి. మీరు భయపడకండి , వారు మీ నుండి ఏమీ ఆశించరు.!!!. వారికి మీరు ఉన్నారు అనే దైర్యం ఇచ్చి, వారు ఎలా ఉన్నారో కనుక్కొండి. ఉద్యోగాలు, చదువులు అనేవి .... మా అప్పుడూ ఉన్నాయి, మీ ఇప్పుడూ ఉన్నాయి. అవే జీవితం కాదు. వాటితో పాటు నిజమైన జీవితాన్ని, జీవితసారాన్ని కూడా చవిచూడండి. బహుశా, మీ చిన్నతనం మీకు తెలియదు , గుర్తు ఉండదు కదా - అమ్మ ఏం సపర్యలు చేసిందో, నాన్న ఏం చేసాడో.... మరి వారి చిన్నతనాన్ని ( ముసలితనం ) చూడాల్సిన భాద్యత మీకు లేదా ? అని హృదయంతో ఆలోచించండి. రేపు మీరూ చిన్నవారవుతారు అనే సత్యాన్ని గ్రహించండి. పెద్దలకు ప్రేమను పంచండి. వారి మాటలు ఏమైనా కఠువుగా ఉంటే, నిదానంగా అర్ధంచేసికోవటానికి ప్రయత్నించండి. అర్ధంకాకపోతే వదిలేయండి. వారి ప్రేమను వెలకట్టకండి. అది వెలకట్టలేని నిస్వార్థమైన ప్రేమ. వారు లేనప్పుడు, ఉంటె మీరు చేసే వాళ్లమని అనుకొనే వాటిలో సగం వంతు , వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యండి. సంతోషిస్తారు.

రెక్కలొచ్చిన పక్షులతో నిజ జీవితాన్ని పోల్చుకోకండి. మనం మనుషులం కనుక రెక్కలుండే అవకాశం లేనే లేదు. దిక్చుచి లేకుండా నౌక నడపటం ఎంత కష్టమో - పెద్దలు తోడు లేని "జీవితం" అనే నౌక ను నడపటం కూడా అంతే కష్టం.

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.