ఒక అడవిలో గర్విష్టి సింహం ఉండేది.దానికి బలశాలినని చాలా గర్వం. ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపేది. ఆ అడవిలో వానరం అనే కోతి ఉండేది. అది చాలా మంచి మనసు కలది. ఆపదలో ఉన్న జంతువులను, పక్షులనుఆదుకోవటం, చేతనైన సహాయం చేయడం దానికి తల్లి నుండి అబ్బిన మంచి గుణాలు. వానరం సింహం నుండి జంతువులను చాలా సార్లు కాపాడింది. ఒకసారి పచ్చిక మేస్తున్న లేడిని చంపడానికి అడుగులో అడుగు వేస్తూ,నిశ్శబ్ధంగా ముందుకు కదులుతున్న సింహాన్ని కోతి చెట్టుపై నుండి చూసింది. వెంటనే లేడిపై పడేలా తన చేతిలోని పండును గురిచూసి విసిరింది.పండు తగలగానే లేడి ఉలిక్కిపడి పరుగందుకుంది.సింహం లేడిని అందుకోలేక పోయింది.మరి ఒకసారి గుర్రాన్ని వేటాడటా నికి అలికిడి కాకుండా మెల్లిగా వస్తున్న సింహాన్ని కోతి గమనించింది. వెంటనే ఎగిరి గుర్రం మీద కూర్చుని కిచకిచమని అరుస్తూ హెచ్చరించి గుర్రాన్ని పరుగులెత్తించింది. ఒక కుందేలును చంపడానికి సింహం రావడం కోతి కంట పడింది. వెంటనే కోతి, కుందేలు ను తన కడుపుకు హత్తుకుని చెట్టెక్కింది. సింహం కోతిపై పగపట్టింది. కోతి తన చేతికి చిక్కితే చంపాలని అదునుకోసం ఎదురు చూడసాగింది. ఒకసారి కోతి చెట్టుకింద కూర్చుని పండు తింటూ సింహం కంట పడింది. సింహం ఆవేశంతో కోతి మీద దాడి చేయబోయింది. ఆ అలికిడికి కోతి ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగబ్రాకింది.కొద్దిసేపు చెట్టుకింద అటూ ఇటూ తిరిగి ఏం చేయలేక సింహం వెళ్ళిపోయింది. ఒకరోజు నీటి ప్రవాహంలో కొట్టుకొస్తూ సింహం పిల్ల కోతికి కనబడింది. కోతి వెంటనే కిందపడివున్న చెట్టు కొమ్మలను తీసుకుని పరుగున వెళ్ళి కొమ్మల సాయంతో సింహం పిల్లను కాపాడింది. దాని కడుపులోని నీటిని కక్కించింది.ఆయాసంతో, భయంతో వణికిపోతున్న బుజ్జి సింహానికి ధైర్యం చెప్పి కోలుకున్నాక గుహలవైపు తీసుకెళ్లింది. ఆ బుజ్జి సింహం గర్విష్టి సింహం బిడ్డ. కనపడకుండా పోయి నీటిలో పడి కొట్టుకు పోతున్న తన బిడ్డను కాపాడి తెచ్చిన కోతికి కృతజ్ఞతలు చెప్పింది సింహం. "నేను చాలా సార్లు నిన్ను చంపాలని ప్రయత్నించాను.నిన్ను నేను చంపి ఉంటే ఈరోజు నాబిడ్డను కాపాడేవారు లేక నీటిలో కొట్టుకుపోయేది.మా జాతి కౄరమైనదని తెలిసీ దయా గుణంతో కాపాడావు. మనం ఈ భూమి మీద బతుకుతున్నది ఇతరులకు కీడు చేయడానికి కాదు. చేతనైన సాయం చేయడానికని నీవల్ల గుర్తించాను. ఇకముందు ఏ జంతువునూ వేటాడను. శాకాహారంతో జీవిస్తాను. నీమార్గంలో నడుస్తాను."అని నమస్కరించింది సింహం. పరోపకారబుద్దితో జంతువులన్నింటితో మెప్పు పొందటమే కాక సింహంలోకూడా మార్పు తెచ్చిన వానరాన్ని జంతువులన్నీ అభినందించాయి.