కలవారమాయే మదిలో - బాలాజీ మామిడిశెట్టి, కలం పేరు: బామాశ్రీ

Kalavaramaye madilo

శ్రావణమాసం ఏకాదశి, తెల్లవారితే ఆదివారం, రాత్రి ఒంటిగంట దాటుతుంది. అసలే కొత్త ప్రదేశం ప్రతిచోట, ప్రతిరోజులాగానే ఇక్కడ కూడా పవర్ కట్. ఉరుములు, మెరుపులతో పాటు చిరుజల్లులు ప్రారంభమయ్యి, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుంది. జనం కిటకిటలాడుతున్నారు. భార్య తాయారు, పిల్లలు లత, వినయ్ తనతో పాటు వున్నారు. గాని రామ్ గులాం గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. వర్షం వల్ల అందరికి చలి పుడుతుంటే, తనకు మాత్రం వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నోరు ఆరిపోతుంది. కాళ్ళనుంచి వణుకు పుడుతుంది. ఒంటరిగా లేకపోయిన ఇంతమందిలో నాకే కనిపిస్తుందా! ఆ భయంకర రూపం! లేక అందరికీ కనిపిస్తుందా! అనే సందేహం తన మనస్సును దహించేస్తుంది.

మెరుపు, మెరుపుకు పరిశీలనగా చూస్తున్నాడు. ఆకారం చూస్తే మరీ పెద్దది కాకపోయిన, కంటపడుతుంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. విరబూసిన నల్లని జుట్టు, ఎర్రని చింతనిప్పులాంటి కళ్ళు, బాగా తెరిచిన నోరు, నోటిలో నుండి బయటకు కనిపిస్తున్న రక్తసిక్తమైన నాలుక ప్రక్కనే రెండు కోర పళ్ళు.

కొద్ది రోజుల క్రితం టివిలో చూసిన హర్రర్ చిత్రంలో వికృతరూపం మీద పడి అందర్ని దాడిచేయడం గుర్తుకు రావడంతో రామ్ గులాంకు చెమటలు పట్టాయి. భార్యను మంచి నీళ్ళిమ్మని అడిగాడు. వాళ్ళ సీసాలో నీళ్ళు అయిపోయాయి. నోరు తడి ఆరిపోయి, తల తిరుగుతున్నట్లయ్యింది. ఎవరినైనా అడుగుదామంటే యాత్రికులందరూ కొత్తవారే. ఇంతలో ఓ వాలంటీర్ అటువైపు రావడంతో తాయారు మంచినీళ్ళు కావాలని అడిగింది. వెంటనే అతను తెచ్చి ఇచ్చాడు. నీళ్ళు త్రాగుతున్న సమయాన్న మెరుపు వెలుతురులో వికృత రూపం స్పష్టంగా విఠలాచార్య సినిమాలోని మోహినిలా కనిపిస్తుంది. పుణ్యక్షేత్రమైనందున ఏమీ జరగదనే ధైర్యంతో కూడిన భయంతో వున్నాడు.

మనస్సులోని భయాన్ని దాచుకుంటూ పక్కనే వున్న తాయారుని నెమ్మదిగా “అక్కడ ఏమైనా దెయ్యం కనిపిస్తుందా?” అని చూపిస్తూ అడిగాడు రామ్ గులాం. అతను చెప్పిన వైపు చూసి, “ఏమీ లేదండీ, అంతా మీ భ్రమ” అని నిద్రమత్తులోకి జారుకుంది. ఎవరికీ కనబడని కదిలే రూపం తనకు మాత్రమే కనిపిస్తుందా! వచ్చే దారిలో ఏమైనా దిష్టి తీసిన వాటిని గాని తొక్కేనేమోనని తనలో తాను మధనపడుతునే మళ్ళీ చూసి, చూడంగానే కలవరపడ్డాడు. శ్మశానంలోగాని, ఎక్కడా ఎవరూలేని నిర్మానుష్య ప్రదేశాలలో దెయ్యాలు సంచరిస్తాయని బామ్మ చెప్పేది. ఈ దెయ్యం బాగా బరితెగించినట్లుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ మీద దీని ప్రతాపం అని మదిలో తలచుకుంటూ, దేవుని స్మరించుకున్నాడు. ఇక్కడ వేలాది మంది జనం తిరుగుతుందంటే ఇక్కడకు జేరిదంటే బహుశా ఇది దేవుని పూజించే రకమా! బ్రతికుండగా తాను చేయాలనుకున్న పూజలు పూర్తిగాకపోవడంతో, పూజలు చేయడానికి వచ్చిందా! ఎవరి మీదైన వాలి గుడిలో దర్శనం చేసుకుంటుందేమో! లేకపోతే నాతోనే కలిసి వచ్చి దైవదర్శనం చేసుకుని ముక్తి పొందుతుందేమోనన్న ఆలోచన రాగానే ఓ ఆత్మకు కైవల్యం పొందేటందుకు నా వంతు కృషి చేసానన్న తృప్తి మిగులుతుందని తనను తాను సంతృప్తి పరుచుకోసాగాడు. కళ్ళు మూసుకున్నా, ఆ వికారరూపం మనస్సును దహించేయడంతో వెన్నులో వణుకు మరీ తీవ్రమైంది.

క్యూలైన్లో వున్న దిమ్మమీద కూర్చుని సేద తీర్చుకుంటూ, అసలేమీ జరిగింది ఈ రోజని ఆలోచనల్లోకి వెళ్ళాడు రామ్ గులాం. భార్యబిడ్డలను తీసుకుని తిరుమలకు ముందురోజు మధ్యాహ్నం బయలుదేరి, రాత్రంతా ప్రయాణం చేయడంతో కునుకు వేయలేదు. ఈ రోజు ఉదయం ట్రైన్ దిగి, కాలినడకన మధ్యాహ్నానానికి కొండ మీదకు చేరుకుని, సత్రంలో గది తీసుకుని, దగ్గరలో నున్న కేశఖండనశాలకు వెళ్ళి, తలనీలాలు సమర్పించుకుని, ఉచిత దర్శనానికి సాయంత్రం ఆరు గంటలకి లైన్లోకి వచ్చారు. కాలినడకన వచ్చిన వారికి, రెండు గంటల్లో దర్శనం జరుగుతుందని అందరూ చెప్పారు. రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడం, దానికి తోడు ఏకాదశి కూడా అవడం వల్ల, జనం ఎక్కువగా రావడంతో. రద్దీ ఎక్కువయ్యి, దైవ దర్శనం ఆలస్యం అవుతుందని తెలుసుకున్నాడు.

భక్తులందరూ లైన్లో నిలబడి, నడుచుకుంటూ మధ్యలో వాలంటీర్లు ఇస్తున్న ఫలహారాలు, పాలు తీసుకుంటూ నెమ్మదిగా కదులుతున్నారు. ఇంతలో రాత్రి పన్నెండు అయ్యింది. అర్దరాత్రి దర్శనాలు ఆపేసి, తెల్లవారుఝామున మొదలిడతారని సమాచారం తెలుసుకున్నాడు రామ్ గులాం. దేవుడ్ని చూడడానికి వైకుంఠయాత్రకు బయలుదేరితే, నిజంగా వైకుంఠానికి దగ్గరలోనే వున్నట్టు తోస్తుంది. ప్రయాణబడలిక తీరలేదు. ఓ వైపు శారీరకంగా నీరసం వస్తుంటే, మరోవైపు ఉరుములు మెరుపుల మధ్యలో భయంకరమైన వికృత రూపంతో మానసికంగా కృంగిపోతున్నాడు. పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఏమీ జరగదనే భక్తితో కూడిన నమ్మకం. చెట్టుకొమ్మ విరిగి పడిన శబ్దం రావడముతో ఒక్కసారిగా వులిక్కి పడి చుట్టూ చూశాడు. భార్యపిల్లలు మగతగా వున్నారు. ఈలోపు అతనికి తెలుగు దెయ్యాల జాతీయ గీతమైన “నిను వీడని నీడను నేను” జ్ఞాపకం వచ్చి, కళ్ళు తిరిగినట్లయి మనస్సంతా అదోలా అయ్యింది.

పార్వతీపురం మన్యంలోని మక్కువ అనే కుగ్రామంలో, పేద కుటుంబంలో సాంప్రదాయానికి మారుపేరుగా చెప్పుకునే పేద కుటుంబంలో జన్మించాడు రామ్ గులాం. ఆ వూరు చుట్టు కొండలు, కోనలు, వాటి మధ్యలో సెలయేరులు. జనుము, వేరుశనగ వంటి కొన్ని పంటలు మాత్రమే పండుతాయి. మక్కువ మీద మక్కువతో ఇ.ఎన్.టి. ఆసుపత్రిని సొంతవూర్లోనే పెట్టి కాలం వెళ్ళదీస్తున్నాడు.

“తీర్థయాత్రలకు తోడుతో వెళ్ళాలి, కాటికెళ్ళేటపుడు కోటి మనస్సులను మన వెంట తీసుకువెళ్ళాలి” అని పెద్ద మావయ్య అంటూ వుండేవాడు. “అయినావాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా వెళితే ఇలానే వుంటుంది. ఏంచేద్దాం? అంతా నా ప్రారబ్ధమ” ని మనస్సులో మదనపడసాగాడు. చదివిన చదువు ఇ.ఎన్.టి. అవడంతో వచ్చిన పేషంట్లకు చెవి చూసి, గులుం తీసి, శుభ్రం చేయడంతో చాలామంది తనను డాక్టర్ రామ్ గులాం అనడం మానేసి ముద్దుగా “గులుం డాక్టర్” అనేవారు. అసలే పల్లెటూరు, దానికి తోడు వారికి కొంత ఎక్కసక్కెములు కూడా ఎక్కువే. అందరూ గులుం డాక్టరంటుంటే మొదట్లో కోపం వచ్చేది కాని రాను అలవాటు పడిపోయి, తాను కూడా ఒకోసారి ఫోన్లో మాట్లాడేటపుడు నేను డాక్టర్ రామ్ గులాం, ఇ.ఎన్.టి అనబోయి గులుం డాక్టర్ ఇ.ఎన్.టి అనడం తనకు కూడా అలవాటైపోయింది.

రామ్ గులాంకు చూపు మళ్ళీ ఆ రూపం వైపు పడింది. ఎవరో కొంతమంది పక్కకు తప్పుకున్నట్లున్నారు. లైను కొంచెం ముందుకు జరిగింది. అంతలో ఎవరో సెల్ ఫోన్ లైటు వేసారు. ఆ కాంతికి వికారరూపం మరింత భయంకరంగా కనిపించింది. భార్యను అడిగితే “మీ భ్రమ నాకేమీ కనిపించడంలేదు” అని కాస్తంత విసుగ్గా అంది. జగమంత జనంవున్న ఏకాకిలా భయపడుతూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని, పిల్లలకు ఏమీ జరగకూడదని, వాళ్ళను గట్టిగా పట్టుకుని బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగములా గడుపుతున్నాడు. గాలి, వాన తగ్గి కరెంటు రావడంతో ఒక్కసారిగా తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయ్యింది. .

“పరిశీలన జ్ఞానానికి తొలిమెట్టు” అయినప్పటికి పరిశీలనతో పాటు వివేచన కూడా కలిగివుండాలి. అతిగా ఆలోచించిన, అనవసరంగా పరిశీలించిన ఇటువంటి సమస్యలే వుత్పన్నం అవుతాయనడానికి రాంగులామే మంచి వుదాహారణ. అసలు విషయం ఏమిటంటే ధర్శనానికి వచ్చిన భక్తులలో భారీ సైజులోనున్న ఒకామె జుట్టు విరబూసుని, మెరుపు రాళ్ళతోనున్న ఒక క్లిప్ పెట్టుకుని, దానిపైన రెండు ఫ్లక్కర్లు పెట్టుకుంది. ఫ్లక్కర్లు రెండూ, రెండు కళ్ళలా కనిపిస్తుంటే, దాని కిందవున్న క్లిప్ నోరులా మెరుస్తుంది, క్లిప్పుకున్న ఎర్రని రేడియం క్లాత్, కొద్దిపాటి కాంతికి మెరయడంతో రక్తసిక్తమైన నాలుకలా కనిపించింది. క్లిప్పుకు చెరోవైపున్న, తెల్లని పొడవైన రెండు రాళ్ళు భయంకరమైన కోరల్లా అనిపించాయి. అతిగా ఆలోచించే రామ్ గులాం భయంతో ఖంగుతిన్నాడు.

నిజాన్ని తెలుసుకున్న రామ్ గులాం, భార్య పిల్లలకు చూపించి నవ్వుకున్నారు. అందుకే దేని కోసం అతిగా ఆలోచించ వద్దని, శాస్త్రీయంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి రావాలని ఇంటర్ చదివేటప్పుడు గంగాధర్ మాస్టార్ చెప్పిన మాటలు రాంగులాం చెవిలో మార్మోగాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి గాని, అతిగా ఆలోచించడం అనర్థం.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న