చెన్నపట్నంలో గోవిందుడు, చతురుడు అనే మిత్రులు ఉండేవారు. చతురుడు వస్త్రాల వ్యాపారం చేసేవాడు. చతురుడు తెలివైనవాడు.వాడి తెలివితేటలవల్ల వ్యాపారం బాగా జరిగేది. గోవిందుడు కూడా వ్యాపారం చేయాలనుకున్నాడు. ఒకరోజు చతురుడిని కలిసి ఏవ్యాపారం మేలని అడిగాడు. అందుకు చతురుడు కిరాణాసరుకులు నిత్యం జనాలకు అవసరముంటాయి.నష్టాలు ఉండవు. నిత్యవసర సరుకుల వ్యాపారం ప్రారంభించ మన్నాడు.గోవిందుడు కుటుంబాలకే కాకుండా,చిల్లర దుకాణాలకు కూడా సరుకులు ఇవ్వగలిగేలా పెద్దగా వ్యాపారం మొదలుపెట్టాడు.చతురుడు,గోవిందుడితో "ఏది అడిగినా లేదనకుండా అన్నిసరుకులూ నీదుకాణంలో కొరతలేకుండా ఉండాలి. దానివల్ల జనాలు పక్కకు వెళ్లరు. దుకాణం శుభ్రంగా ఉండేలా చూసుకో. ఇది వ్యాపారంలో మొదటి సూత్రం. నిత్యవసర వస్తువులు అధికధరలకు విక్రయిస్తూ, మన దగ్గరకు వచ్చేవారితో ఎక్కువ సంపాదించా లనుకుంటే కొంతకాలానికి నీదగ్గర ధర ఎక్కువని వచ్చేవారు కూడా రావడం మానుకుంటారు. సరసమైన ధరలకు అమ్ముతూ,వచ్చేవారిని పెంచుకోవడం ద్వారా సంపాదన పెరుగుతుంది." అని చెప్పాడు. చతురుడి సలహా ప్రకారం తక్కువ లాభం తీసుకోవడంవల్ల సరుకులకోసం వచ్చేవారు పెరిగారు. ఒకరోజు గోవిందుడు చతురుడితో "తెలిసినవారు,తెలియనివారు కూడా అప్పు అడుగుతున్నారు.ఏంచేయాలి?"అన్నాడు. "నగదు చెల్లించండి. సరసమైన ధరలకు సరుకులు పొందండి. అప్పు రేపు'అని గోడ మీద కనిపించేలా వ్రాస్తే సరిపోతుంది." అని చెప్పాడు చతురుడు. ఆసలహా ఫలితాన్ని ఇచ్చింది.అప్పుగా సరుకులు ఎవరూ అడగడం లేదు. గోవిందుడి వద్ద నలుగురు పనిచేస్తున్నారు. లోపలివైపు ఉన్న పెట్టెలోని ఖర్జూరాలు అమ్మకం లేకున్నా రెండురోజుల్లోనే తగ్గిపోవడం గమనించాడు గోవిందుడు. సరుకులకోసం లోపలికెళ్లి ఖర్జూరాలు తింటున్నారని అనుమానం వచ్చింది. "నలుగురు గుమస్తాల్లో ఎవరు తింటున్నారో కనిపెట్టడం ఎలా?" అని చతురుడిని అడిగాడు.దొంగను పట్టుకోవడానికి ఏం చేయాలో చెప్పాడు చతురుడు. మరుసటిరోజు గోవిందుడు ఉదయమే పనివాళ్లు రాకముందే పెట్టెలో పైనున్న ఖర్జూరాలను తేనెతో తడిపాడు. సోము అనే గుమస్తా సరుకులు తెచ్చి ఇవ్వడానికి లోపలికి వెళ్లినప్పుడు అలవాటు ప్రకారం ఖర్జూరాలు తీసుకుని తిని, సరుకులు తీసుకుని బయటకు వచ్చాడు. డబ్బు పెట్టె వద్ద కూర్చుని ఉన్న గోవిందుడు సరుకులు తూకం వేస్తున్న సోము పెదవులకు, చేతులకు అంటుకుని ఉన్న తేనె మరకలను గమనించాడు. "నీవు ఖర్జూరాలు, బాదంపప్పు వంటి విలువైన పదార్థాలు అవకాశం దొరికినప్పుడల్లా తింటుంటే, నిన్ను చూసి మిగిలినవారూ అలాగే చేస్తే వ్యాపారం దివాళా తీస్తుంది కదా! మీపనికి జీతం ఇస్తున్నా కదా! నెలలో ఒకసారి అడిగి తినండి"అని సోమును దండించాడు. ఆరోజునుండి దొంగతిండి తినడం ఆగిపోయింది. ఒకరోజు గోవిందుడు చతురుడితో "దుకాణంలోకి ఎలుకలు వచ్చి చేరాయి. రెండు పిల్లులను తెచ్చి వదులుదామను కుంటున్నాను"అన్నాడు. చతురుడు నవ్వి "నిత్యవసర సరుకులు విక్రయించే చాలామంది వ్యాపారస్తులు చేసే తప్పు ఇదే! జనాలు సరుకులకోసం వచ్చినప్పుడు పిల్లులు దుకాణంలో తిరుగుతూ కనిపిస్తే శుభ్రతను కోరుకునే సగంమంది రావడం మానుకుంటారు. లోపలివైపు అక్కడక్కడా ఎలుకల బోనులు ఉంచితే సరిపోతుంది. కొన్ని రోజులకు ఎలుకల బాధ తప్పుతుంది"అని ఉపదేశించాడు. చతురుడి సలహాలతో గోవిందుడి వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా అభివృద్ది చెందింది.