
హేమ ఒక పల్లెటూరి అమ్మాయి. మెడిసిన్ చదువుతోంది. స్నేహితురాళ్ళు సెలవులకి ఊర్లకి వెళ్లటంతో రూమ్ లో ఒక్కటే ఉన్నది. అర్థరాత్రి ఫోన్ మోగింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు..? అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది.
" హలో! హేమ.. నేను భార్గవిని.." ,
" ఓ! భార్గవి !! ఈ టైమ్ లో ఫోన్ చేశావు ఏమిటి.."
" నీకు నా బాయ్ ఫ్రెండ్ హర్షిత్ తెలుసు.. ఇంటర్వ్యూ కోసం నువ్వు ఉంటున్న సిటీ కి వచ్చాడు. అనుకోకుండా ఆక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నాడు. అక్కడ నువ్వు తప్ప తెలిసిన వాళ్ళెవరూ లేరు. నువ్వు అతనికి సహాయం వెళ్ళాలి.." అభ్యర్ధన అటువైపునుంచి.
భార్గవి తనకి చిన్ననాటి స్నేహితురాలు. ఆమె సహాయం అడిగితే తాను కాదనటం సభ్యత కాదు. పైగా అనుకోకుండా జరిగిన సంఘటన.. హర్షిత్ ఏ హాస్పిటల్ లో ఉన్నాడో లొకేషన్ షేర్ చేయమని, తాను ఉన్న గది నుంచి బయలుదేరింది.
ఒంటరిగా బెడ్ మీద పడుకుని ఉన్న హర్షిత్ కి తనని చూడటానికి వచ్చారనటంతోనే ప్రాణం లేచి వచ్చింది. తన స్వంత మనుషులని చూసినట్టుగా అనిపించింది. భార్గవి, తాను స్నేహితురాళ్లమని గుర్తు చేసి అతనితో ప్రేమగా మాటలాడింది హేమ.
" ఇప్పుడు మీ కండిషన్ ఎలా ఉన్నది .." అన్నది.
హర్షిత్ ఆక్సిడెంట్ జరిగిన తీరు చెప్పి ఇప్పుడు ఫర్వాలేదు.." అన్నాడు.
ఇంతలో రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ , తెల్లవారాక మీరు డిశ్చార్జ్ అవ్వవచ్చు.. కానీ ఒక్క కండిషన్! సెవెన్ డేస్ వరకు బెడ్ రెస్ట్.. అన్నాడు. హర్షిత్ మొహంలో విషాదం..! సెవెన్ డేస్ ఎక్కడ ఉండాలనేది అతనికి పెద్ద ప్రశ్న?
హేమకి అతని పరిస్థితి మీద జాలివేసింది. తన రూమ్మేట్స్ హాలిడేస్ కి ఊర్లకి వెళ్లారు. టెన్ డేస్ వరకు రారు. కష్టంలో ఉన్న అతనికి సహాయం చేయటంలో తప్పు లేదు అనుకుంది.
" మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ లో ఉండవచ్చు.. అన్నది.
" దేవుడు మీకు మంచి హృదయం ఇచ్చాడు.." అన్నాడు హర్షిత్..
హేమ హర్షిత్ ని తన రూమ్ కి తీసుకొచ్చింది. అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది.
రోజులు గడుస్తున్నాయి. ఇంకో రెండు రోజుల్లో తాను ఈ రూమ్ నుంచి, హేమ నుంచి వెళ్లిపోవచ్చు.. అనుకున్న
హర్షిత్ కి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. బెడ్ మీద పడుకుని ఉన్న హేమని చూశాడు.
అంతే.. అతనిలో కోరిక పడగలు విప్పింది. తన గర్ల్ ఫ్రెండ్ భార్గవి కంటే హేమనే మరింత అందంగా కనిపించింది.
దేవుడు మనిషికి ఒకే ఒక జీవితం ఇచ్చాడు. అందులో యవ్వనం విలువైనది. తప్పు, ఒప్పులు ఆలోచించే వాడు జీవితంలో అలాగే ఉండిపోతాడు. వాటిని వదిలేసిన వాడే జీవితాన్ని ఎంజాయ్ చేయగలడు.. అనుకున్నాడు.
రూమ్ లో బోర్ గా ఉంటున్నది. కొద్ది సేపు బయటికి వెళ్లొద్దామా అన్నాడు.. ఆ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన హేమతో. హేమ సరే అన్నది.
పార్క్ లో నడుస్తుండగా.. హేమ శరీర భాగాలని తాకుతూ ఆమెని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశాడు హర్షిత్..
రాత్రి పుట హేమ నిద్రలో ఉన్నది. తన కోరిక తీర్చుకోటానికి ఇదే అదను అనుకున్నాడు. తలుపులు నెమ్మదిగా తెరుచుకుని ఆమె గదిలోకి వచ్చాడు. ఒంటి మీద చేయి పడటంతో హేమ సడన్ గా నిద్ర లేచింది.
" మన ఇద్దరం కలసి ఉండేది ఈ ఒక్క రాత్రే.. కనుక నాకు కోపరేట్ చేయి.." అన్నాడు.
" నేను నీ గర్ల్ ఫ్రెండ్ కి స్నేహితురాలిని.. " అన్నది హేమ.
" అయితే ఏమిటి.. నువ్వు ఆమె కంటే అందంగా ఉన్నావు. నువ్వు ఊ.. అంటే ఆమెని వదిలేసి నీతోనే ఉంటాను.." అన్నాడు.
"ద్రోహి..! కష్టం లో ఉన్నావని చేరదీస్తే హాని తలపెడతావా .. " అన్నది.
" నువ్వు ఎన్నయినా అను.. నాకు ఇది కలిసి వచ్చిన అవకాశం.. ఈ రాత్రికి నిన్ను సొంతం చేసుకోనిదే వదలను.. " అన్నాడు.
హేమ అతని కళ్ళలోకి క్రోధంగా చూసింది. అదేం అతనికి పట్టలేదు. పూల బోనులో చిక్కుకున్న మేకపిల్లలా అయింది ఆమె పరిస్థితి.
+++++ +++++
సూర్యుడి వెచ్చని కిరణాలు ఒంటిని తాకటంతో మెలకువ వచ్చింది హర్షిత్ కి.
ప్రశాంతంగా నిద్ర లేచిన అతనికి ఆ రాత్రి జరిగినది గుర్తుకొచ్చింది. తాను చేసిన పనికి హేమ రియాక్షన్ ఎలా ఉంటుందో..? ఆమె ముఖం చూడాలి అనుకుని ఆమె గదిలోకి వెళ్ళాడు.
అక్కడ హేమ లేదు.. రూమ్ ఖాళీ గా ఉంది. బెడ్ మీద ఒక లెటర్ కనిపించింది.
" నిన్న పార్క్ లో నీ బిహేవియర్ గమనించాను. నువ్వు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మనిషివి అని అర్థం అయ్యింది. కనుక నా జాగ్రత్త లో భాగంగా నువ్వు ప్రయోగించిన స్లీపింగ్ టాబ్లెట్స్ తెలివిగా నీ మీదనే ప్రయోగించి నేను నా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళాను. నీ వల్ల నాకు కొంత సమయం వేస్ట్ అయింది అనుకుంటాను.. వెంటనే నా రూమ్ ఖాళీ చేసి వెళ్ళు. లేకపోతే పోలీస్ లని పిలవాల్సి ఉంటుంది. " .
హర్షిత్ కి అర్థం అయింది రాత్రి తాను కన్నది అంతా కల అని.
ఇంకా అక్కడే ఉంటే ఆమె అన్నట్టుగానే పోలీస్ లకి పట్టిస్తుంది అన్న భయం వేసింది. ఆపైన క్షణం ఆలోచించకుండా పెట్టె సర్దుకున్నాడు.