జన్మజన్మ ల భంధం- వైకుంఠ వాహనము - venu gopal maddu

Janma nanmala bandham vaikuntha vahanam

పాఠకులకు నమస్కారం. నా పేరు పద్మిని. పాత తెలుగు సినిమాల్లో భరత నాట్య శిఖామణులు అయిన పద్మిని రాగిని లలిత ... అలాంటి పద్మిని ని కాదు నేను. మా తాత ముత్తాతలు ఇటలీ దేశం నుంచి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే అనుకోండి.

మా తాత గారు అంటూ వుండే వారు

" ఈ రోజుల్లో కోతి బ్రాండు లు కోకొల్లలు ,అప్పటిలో మేము కోటి కి ముగ్గురమే, ప్రిమియర్ పద్మిని, అంబాసడర్ , స్టాండర్డ్ హెరాల్డ్ . మేము ముగ్గురమే అతుకుల గతుకుల భారత రహదారుల్లో నడిచే వాళ్ళం. ". ఆ ప్రిమియర్ వంశం లో నాలుగో తరం లో పుట్టిన చిట్టి పద్మిని ని నేను.

నేను పుట్టింది....అవును నా చరిత్ర మీ కెందుకు. క్షమించాలి, అసలు నేను చెప్పాల్సిన కథ వేరే వుంది. నేను చనిపోయి ఇరవయ్యి ఏళ్ళు దాటింది. కానీ నేను పొయ్యేముందు , నా ఆఖరి యజమాని, కొండల రావు గురించి చెప్పటానికి మీ ముందు కొచ్చా.

ఎప్పుడో చచ్చిన కారు, ఇప్పుడు ఇలా వచ్చి, కథ చెప్పడం ఎమిటి అంటే, దానికి వివరణ ,కథ చదివాక ఆఖరిలో మీకే అర్ధం అవుతుంది. ఇక కథ లోకి...

=====*************==========

కొండల రావు ఒక అసాధారణ మనిషి. నా మునుపటి యజమానుల కన్నా విలక్షణమయిన వాడు. ఏ మాటకామాట నన్ను మాత్రం ఆఖరి రోజుల్లో బాగా చూసుకునే వాడు. ఎప్పటి కప్పుడు తుడవడం, స్నానం చేయించడం, డాక్టరు.. అదేనండి కారు మెకానిక్ దగ్గరకి తీసుకెళ్ళి సమయానుసారం మరమత్తు చేయించటం. ఆఖరి రోజుల్లో అంత కన్నా ఏ కారు కయినా ఇంకేం కేరు కావాలి.

ఆయనకి కి నడక అంటే చాలా ఇష్టం. వ్యాయామము, ఆరోగ్యము మీద మక్కువ ఎక్కువ మన కొండల రావుకి, మోతాదుకి మించే. పక్క వాడి గురించి ఆలోచించే గుణం అతను పుట్టిన పాతకాలం డి. ఎన్. ఎ లో బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. " ఉదయం వ్యాయామం లో నడక మీద, శ్వాస నియంత్రణ మీద మాత్రమే దృష్టి పెట్టాలి అంతే గానీ , చెవిలో పాటలు పెట్టుకోవడం , పిచ్చ పాటి మాట్లాడుకుంటూ అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటూ నడవడం దండగ " అని వ్యాయామోపాఖ్యానం చేసారు మన కొండల రావు ఒకానొకప్పుడు నన్ను తోలుతూ, కారు లో కూర్చుంది ముగ్గురూ ఆడవాళ్ళే అని తెలిసే.

ఒక రోజు నా ఇంజను వేడెక్కి మొరాయించి ఆగిపోయాను, నన్ను రోడ్డు వారగా ఆపేసి వెళ్ళిపోయాడు. ఒక రెండు రోజుల తరువాత ఎవరో ఇద్దరు మనుషులు నడిచుకుంటూ నా వైపు గా రావటం నాకు కనపడింది..

మొదట వ్యక్తి , మన కొండల రావే, ఒక ఇరవయి అడుగుల ముందు హుషారుగా నడుస్తూ వస్తుంటే, వెనకాల ఎవరో సరిగ్గా కనపడట లేదు గానీ , అతను రొప్పుతూ, మూలుగుతూ, " ఇంకా ఎంత దూరం సార్ , ఊరు దాటి పోయి యమలోకాని గాని వచ్చేసామా " అనడం వినపడింది.

"ఇదిగో వచ్చేసాం " అని నా మీద చెయ్యి వేసి తడుతూ చూపించాడు. వడి వడి గా నా బోనెట్ తెరిచి తను తెచ్చిన నీరు రేడియేటరు లో వేసాడు.

" మన అదృష్టం ఏంటంటే, కారు కింద రోడ్డు లో వుంది. ఇదంతా డవున్. గేరు లో పెట్టి, హాండు బ్రేకు వేసి, రాళ్ళు పెట్టి ఆపాను. నువ్వు ఒక్క తోపు తోసావంటే ఇట్టే స్టార్టు అయిపోతుంది " కొండల రావు ఉత్సాహంగా

"సార్, ఉదయాన్నే ఎదో ఆఫీసు పని మీద మీ ఇంటికి వస్తే , నన్ను ఇలా బలి" అతను రొప్పడం ఆపుతూ.

"ఆ సరే లే వయ్యా.. అవన్నీ కారు లో వెళ్తూ మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు కొంచెం వెనక నుంచి తొయ్యి" అని టైర్ కిందనున్న రాళ్ళు తొలగించి, నా డోరు తీసి లోపలకొచ్చి నా సీటు మీద కూర్చున్నాడు కొండల రావు.

"తొయ్యి తొయ్యి గట్టి గా గట్టి గా" కారు లోంచి హుషారు

"తోస్తున్నా సారు" కారు బయట, ఆరు బయట "మీ కారు స్టార్టు అవుతుందేమో , నా గుండె కాయ స్టాప్ అయిపొయ్యేలా వుంది" గొణుకున్నాడు.

నేను కొంత దిగువ దారిలో వేగం పుంజుకోగానే, ఇగ్నిషన్ ఇచ్చి స్టార్టు చేసాడు కొండల రావు. రయి రయ్యి మని స్టార్టు అయ్యాను. కొంచెం దూరం పోనిచ్చి గేరు మార్చి, బ్రేకు వేసి , రోడ్డు పల్లం గా వున్న చోట ఆపాడు కొండల రావు.

బ్రతుకు జీవిడా అనుకుంటూ , కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి కారు లో కూర్చున్నాడు ఆ కారు తోసిన బకరా.

"చాలా థేంక్స్ వీర్రాజు , భలే టైం కి వచ్చావు" అంటూ. నాకోసం తెచ్చిన మంచి నీళ్ళ బోటల్ లో మిగిలినవి అతనికి ఇచ్చాడు. తాగి కొంత సేద తీరాడు అతను.

"కొండ గారు నాకో డవుటు, పలానా వాడు నిద్ర లో చని పోయాడు అని వింటాం కదా. అలా నడక లో కూడ చని పొతారా సార్ ఎవరయినా "

"పోవయ్యా నీ బడాయి, నువ్వు మరీనూ, మహా అయితే రెండు కిలో మీటరులు నడిచాము అంతే. దీనికే ఇలా అయిపొతే ఎలా నువ్వు, అసలు నీకు మంతెన సత్యన్నారాయణ గారు తెలుసునా ? "

"లేదు సార్, కైకాల సత్యన్నారాయణ తెలుసు, అదీ సినిమాల్లో అంతే " వీర్రాజు.

"ఈ జోకులకేమీ తక్కువ లేదు. నువ్వు వ్యాయామం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి మంతెన గారిని ఫాలో అవ్వు వీర్రాజు"

"సార్ మీకు చాలా సార్లు చెప్పాను, నా పేరు వీర్రాజు కాదు సార్. మీరు అలా పిలిచి పిలిచి అఫీసు లో ఎటు నా పేరు వీర్రాజు అయిపోయింది. కిందటి వారం ఆఫీసు నుంచి ఒకావిడ వచ్చి ' వీర్రాజు గారు వున్నారా ' అనటం, నేను ఏమాత్రం సంకోచించకుండా ఆ ' నేనే వీర్రాజు ని ' అని మాట్లాడటం చూసి, మా ఆవిడ నాకు చిన్న ఇల్లు వుందేమో అని అనుమానించింది. మొన్నటికిమొన్న ఎవరినో కలిసినప్పుడు కూడా వీర్రాజు గానే పరిచయం చేసుకున్నాను, నిన్నటికి నిన్న ఒక చెక్కు మీద వీర్రాజు అని సంతకం పెట్టేసా, ఆ చెక్కు వెనక్కి తిరిగి వచ్చి భీబత్సం చేసింది , నా పేరు"

"ఆ సర్లే వయ్యా, సత కోటి లింగాల్లో బోడి లింగం, నువ్వు మా ఊర్లో నా పెద్ద అత్త వాళ్ళ పొలం లో పాలేరు వీర్రాజు లా వుంటావు అంతే, నువ్వు వీర్రాజు వే, ఇంతకీ నువ్వు వచ్చిన పని ఎంటో చెప్పు" కసిరాడు కొండలరావు

"ఏం లేదు సారు నేను ఎమో చాలా చిన్న కంట్రాక్టరు ని, బడా బాబుల లాగ మంది మార్బలం నాకు లేదు. ఎదో మిత వ్యయం తో పని ముగించాలి అనుకుంటున్నా, అలా అని నేనేం పనిలో గానీ సరుకు లో గానీ కక్కుర్తి పడటం లేదు, అది మీకు తెలుసు, నాణ్యత లో ఏ లోటూ రానివ్వను. కాని మా పని కి వాడుకునే కాంట్రాక్టరు జీపు ని మీ ఆఫీసులో అందరూ, వాళ్ళ వ్యక్తిగత విషయాలకి , వాళ్ళ బోజనాలకి, కాఫీ లకు వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు సార్. మీ ఆఫీసు జీపు లు రెండు ఖాళీ గా పడి వున్నా అవి వాడరు సార్, దాని వల్ల మా కుర్రాళ్ళ కి జీపు దొరకక పనులు ఆగిపొతున్నాయి సార్. మీరు కొంచెం..."

"ఆ అర్ధం అయింది . అదా నీ బాధ, ఆ సర్లే నేను నా ఆఫీసు వాళ్ళకి కొంచెం చెప్తానులే" అంటూ నన్ను నాలొగో గేరు లోకి పట్టాడు.

"అది కాదు సార్ , మీ ఆఫీసు జీపులు ఎందుకని వాడరు" వీర్రాజు ఆరా తీస్తూ

" అదా, మా పెద్ద బాసు దగ్గర ఒక జీపు వుంటుంది దాని పేరు ' అలంకారం ' " వీర్రాజు మొహం అదోలా పెట్టాడు....పేర్లు పెట్టడంలో జీపులని కూడ వొదలరా మీరు అన్నట్టు

"పూర్తిగా వినవయ్యా " అంటూ నన్ను ఎడమ వైపు రోడ్డు కి తిప్పాడు కొండల రావు " అది అలంకారం, ఎందుకంటే, అది ఎప్పుడూ నిత్యం పెళ్ళికూతురు లాగా ముస్తాబయి అలంకారం చేసుకొని వుంటుంది. మా బాసు వాడడు ఎవరినీ వాడనివ్వడు. వాడికి దమ్ము లేదు. ఎమన్నా అడిగితే ' అది కేవలం తను , ఇంకా పెద్ద బాసులని కలవడానికి ,ఆఫీసు పని మీద వెళ్ళడానికే వాడాలి అంటాడు. దాన్ని రోజూ డ్రైవర్ శుభ్రం చేసి అలంకరించి, అలా మూల పెడతాడు... ఇక పోతే మా ఆఫీసు వాళ్ళంతా వాడుకోడానికి ఇంకో జీప్ వుంది"

"నేను అన్నది అదే సార్, నేవీ నేలం రంగు ది, అది మీ వాళ్ళు వాడుకోవచ్చు కదా సార్" వీర్రాజు పాపం దీనం గా

"అదే , అక్కడికే వస్తున్నా. దాని పేరు ' అవమానం ' . దాని వాడాలంటే మేము నానా సంకలు నాకాలి, చాలా అవమానాలు పడాలి."

"అదేంటి సార్ వింత, మీ ఆఫీసు జీపే కదా"

"ఆ దానికో మెలిక వుంది. అది వాడుకోవాలంటే, మా బాసుకి నోట్లో పెట్టాలి"

"ఆ ఎమిటి సార్ పెట్టాలి" ఆశ్చర్యం గా గుటక వేసి " మీ బాసుకి స్వీట్ పెట్టాలా సార్ నోటి లో"

"ఆ తెలుగు నొటు కాదయ్య.. ఇంగ్లీష్ నోటు.. ఆ జీపు ని ఎందుకు వాడుతామో ఒక నోటు , అదే అప్ప్లికేషన్ లా అనుకో. దానిలో రాసి, ఎన్ని గంటలు వెళ్తాము, ఎన్ని కిలో మెటర్లు వెళ్తాం , అన్నీ రాస్తే, అప్పుడు అతను దాన్ని ఆమోదించి, దానికి తగ్గ పెట్రోల్ ఖర్చు మాకు ఇస్తాడు. ఇవాన్నీ అయ్యాక, దేవుడు కరుణించాడు సరే అనుకుంటే, సమయానికి డ్రైవర్ పూజారి కనపడడు. వాడిని పట్టుకొని బతిమాలి బామాలి వాడుకోవాలి. అందుకే ఆ జీపు ' అవమానం ' "

"నేను ఒకసారి గట్టి గా వాదించా, అన్ని అవసరాలు చెప్పి రావండి, గబుక్కున ఎదన్నా ఇంకో అఫీసుకి వెళ్ళే పని పడొచ్చు, మీరు ఇంత పంచాయితి పెడితే, పనులు ఆగిపోతాయి అని, ఎవడన్నా నా మాట వింటేనా. ప్రభుత్వ పని లో ఆ మాత్రం జాప్యం వున్నా పరవాలేదు, కానీ అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి అంటాడు. పంచాంగం ప్రకారం చేస్తే ఎవడికో గాడిద పుట్టిందట, అలా వుంటుంది వీళ్ళ పని"

నన్ను ఇంటి ముందు ఆపాడు కొండలరావు. ఆపగానే బయటకి వచ్చి , ఒకసారి నా బోనెట్ తీసి చూసాడు. ఎమయినా వేడెక్కిందా అని. నేనంటే ఎంత ప్రేమో.

" ఇంతకీ ఎమంటారు... " వీర్రాజు దిగాలుగా నన్ను దిగి " అవును...మహాప్రభో మీరు మనుషులకే అనుకున్నా , కారులకి జీపులకీ కూడ పేర్లు పెడతారా " అని రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టారు

"ఎదో సరదాగా .. నవ్వుతూ బతకాలిరా"

"సార్ మరి ఆ రెండు జీపులు సరే, మరి మా కాంట్రాక్టరు జీపు కి ఏ నామ కరణం చేసారు సార్ ?" కుతూహలం గా అడిగాడు.

"ఎందుకు వదులుతా... దానికీ వుంది. నీ జీపు ' అహంకారం ' . అంటే ఎవడు పడితే వాడు, అడ్డ గోలుగా, అహంకారం గా , వాడెబ్బ సొమ్ము లా , నిన్ను కూడ అడగకుండా వాడేసుకుంటారు కదా. అందుకే మీ జీపు ' అహంకారం ' " వివరించాడు కొండల రావు.

"ఆ హా అద్బుతం సార్ అలంకారం అవమానం అహంకారం" మళ్ళీ రెండు చేతులూ జోడించాడు

ఇద్దరూ నానుంచి దూరం గా , కొండల రావు ఇంటి వైపు నడుస్తున్నారు

"నువ్వు దిగులు పడకు మా ఆఫిసు వాళ్ళ కి నేను చెబుతాలే" అన్నాడు కొండల రావు.

ఆ తర్వత వాళ్ళు లోపలకి వెళ్ళి పోయారు, నాకేం వినపడలేదు, కనపడలేదు. నేను విశ్రమించాను.

***********************************

ఒకానొక రోజు కొండల రావు కుటుంబ సమేతంగా నన్ను నడుపుతున్నాడు. కొండల రావుకి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద వాడు చిన్న వాడి కంటే కొంచెం పెద్ద. ఆ నలుగురినీ ఎక్కడికయినా తీసుకెళ్తే, నాకు అదో తృప్తి. పెద్దవాడు ముందు సీటు లో వెనకాల భార్య , చిన్నాడు కూర్చున్నారు.

"నెమ్మది నెమ్మది, పక్కకి పక్కకి " నా వెనక సీటు లో కూర్చున్న కొండల రావు భార్య మందలింపు గా

"నాన్నా వెనక సీటు లో కూడా స్టీరింగు , బ్రేకులు వుండే కారు తీసుకోండి, అప్పుడు అమ్మ కూడ వెనకాల నుంచి నడపచ్చు" పెద్దవాడు

"అమ్మా నువ్వు నేర్చేసుకో డ్రైవింగు" చిన్నాడు

"నాకా, నాకెందుకు..." ఆశ్చర్యం గా మొహం పెట్టి . ఇంతలోనే "ఆ జాగర్త, నెమ్మది నెమ్మది, పక్కకి పక్కకి" అంది రోడ్డు మీద్ ఎదో స్కూటర్ అడ్డం గా రావటం చూసి

"ఒరేయ్ పిల్లలూ జల్లలూ, ఈ రోజు ఆదివారం, సెలవే .. మధ్యాన్న బోజనాలు ఎటూ మా స్నేహితుడి ఇంట్లో అయిపొయాయి , కాబట్టి మీకు ఇద్దరికీ డ్రైవింగ్ నేర్పించనా"

"నాకేం వొద్దు, అస్సలు నాకు నేర్చుకోవాలని లేదు" పెద్దాడు

"నాకు నేర్పించడి నాన్నా. అన్నయ్య , మరి మనం పెద్ద అయ్యాక కారు కొనుక్కుంటే, అప్పుడు ఎలా ? " చిన్నాడు ఆత్రం గా

"ఆ కారా ? సరెలే , అప్పుడు చుద్దాం, నేను కొన్నాక నేర్చుకుంటాలే"

"నేను ఇప్పుడే నేర్చుకుంటా" ఆదుర్దా గా చిన్నాడు

సరే అని, భార్య ని పెద్ద వాడిని ఇంట్లో దించేసి, చిన్న అబ్బాయి కి నన్ను తోలడం నేర్పించడానికి తీసుకెళ్ళాడు. తోలడం ఎంటి ఎదో ఎద్దులని ఆవులని తోలినట్టు చెండాలంగా.. నడపడం అందాం. డ్రైవింగ్ నేర్పుతున్నాడన్నమాట.

స్టీరింగు వీలు ఎలా స్వాదీనం లో ఉంచుకోవాలి, బ్రేకు, ఏక్సెలరేటరు, క్లట్చ్ తో ఎలా గేరు మార్చడం, అన్నీ నేర్పించాడు కొండల రావు. చిన్న వాడి ఉత్సాహం చూసి నాకూ ముచ్చటేసింది. అసలే ఆది వారం , ఊరు అవతల కావటం వల్ల రోడ్డు అంతా ఖాళీ గా వుంది. బండి తిన్నగా ఒకే సరళ రేఖ లో పోతుంది మెల్లగా అతి తక్కువ వేగంతో.

"నాన్నా మీరు అన్నిటికీ పేర్లు పెడటారు కదా, మీ ఆఫీసు జీపు లని కూడ వదలకుండా, మరి దీనికేమి పేరు పెట్టాలేదా "

"హ ..లేదు రా దీనికి ఎమీ లేదు" నవ్వాడు కొండల రావు.

"అయితే నేను పెడతా.. ఉండు"..అని కొంచెం సేపు ఆలోచించి " ఆ.. తట్టింది.. ఇది ' అవసరం ' .. ఎందుకంటే, ఇది కనీస అవసరాలకి తప్పితే ఎందుకు పనికి రాదు. మన కోలనీ లో తిరగడానికి మాత్రమే, దీనిలో సిటి కి గాని, పక్క ఊరికి గానీ, వెళ్ళామంటే తిరిగి వస్తామనే నమ్మకం వుండదు" గట్టి గా నవ్వుతూ

కొండల రావు చిన్న గా నవ్వాడు. నాకు అస్సలు నచ్చలేదు. నన్ను అవమానించడం. వీడెంత వీడి వయసెంత, ఒక్క సారి గా అమాంతం పిల్ల కుంకని ఎత్తి అవతల పడేద్దాం అనిపించింది, కానీ నాకు అలాంటి శక్తులు ఎమీ లెవ్వు. వీడి జన్మ లో అసలు డ్రైవింగ్ సరిగ్గా రాకూడదు అని శపించాను.

ఇంతలో "ఆ ...' అవసరం ' అనే పేరు బానే వుంది.. ఇంకో పేరు కూడా అనుకోవచ్చు.. నువ్వు అదే గేరు లో వుండకు..గేరులు మార్చడం అలవాటు చేసుకో "

చిన్నవాడు గేరులు మార్చడం ప్రయత్నిస్తున్నాడు. వాడి మీద నాకు వున్న కొపం తో , గేరు లు మృదువుగా మారకుండా నా వంతు నేను పగ తీర్చుకుంటున్నా.

"క్లచ్చ్ వదలకుండా నెమ్మది గా, గత్తర్ బిత్తర్ ఖాన్ లా కాదు" కొండల రావు వారించాడు. నాన్న చెప్పినట్టు గేరులన్నీ మార్చి, మళ్ళీ నాలుగు లోకి వచ్చాడు చిన్నాడు

"ఆ దీన్ని ' అవకాసం ' అని కూడా అనొచ్చు . ఎందుకంటే. ఒక అవకాసం వినియోగించు కోవటం కోసము కొన్నాను. మా ఆఫీసు వాళ్ళు, అందరికీ కారు భరణము లా ఒక లక్ష రుపాయిలు ఇచ్చారు. కచ్చితం గా దానితో కారే కొనాలి, వాళ్ళ కి బిల్లులు కూడా చూపించాలి. కొంత మంది ఒళ్ళోసిపోయిన యవ్వారం గాళ్ళు, అఫీసు వాళ్ళు ఇచ్చిన లక్ష కి ఇంకో రెండు మూడు తగిలించి కొత్త కొత్త కారులు కొన్నారు. అది ఒళ్ళు పొగరు. నేను చాలా జాగ్రత్త గా నాలుగూళ్ళు తిరిగి ఈ సెకండు హాండు కారు కొన్నా, అదీ సరిగ్గా లక్ష దాటకుండా . కొండలయినా తరిగి పోవు కూర్చొని తింటే.." అని ఇద్దరూ నవ్వుకుంటుంటే సడన్ గా

"కొండ కాదు బండ బండ, రోడ్డు మధ్యలో " గట్టి గా అరిచాడు కొండల రావు.

అనుభవం లేక కారు ని తప్పించలేక పోయాడు చిన్నబ్బాయి. ధడ్ మని పెద్ద శభ్దం. కుర్ర కుంక ఎంత పని చేసాడు. ' కుయ్యొ మొర్రొ ' గట్టి గా అరిచా.. నా కారు వేదన వీళ్ళకి అసలు వినపడదు గా.

"అంత పెద్ద రాయి అనుకోలేదు నాన్నా, కారు కింద నుంచి అది వెళ్ళిపోతుంది అనుకున్నా, సోరీ నాన్నా" దిగాలుగా మొహం పెట్టి.

"ఆ సరె సర్లే, కారు ఇంకా నడుస్తుంది, ఇక ఆపకుండా డైరెక్టు గా రిపేరు షాపు కి పోనీ చెప్తా, కింద ఎదో గట్టిగానే తగిలింది. ఇప్పుడు ఆపితే మళ్ళి స్టార్టు అవ్వక పోవచ్చు" కొండల రావు సలహా మేరకు నన్ను తిన్నగా కారు మెకానిక్ షాపు కే తెచ్చాడు.

అక్కడ నాకు మత్తు ఇచ్చి, ఒక వారం మరమ్మత్తు చేసాక మళ్ళీ తేరుకున్నాను. మళ్ళా ఝాం ఝాం ని పరుగులెట్టా

*******అంతిమ పయనం ******** **********

మీ మనుషులకి చని పోయే ముందు ఒక అంచనా , ఒక రకమయిన పూర్వ సంకేతం వుంటుంది అని కొంత మంది నమ్ముతారు. అలాగే మా కారులకి కూడా.. ఆ సర్లే కారుకూతలు అని కొట్టి పడేస్తారు ఇంకొంత మంది. అలాగే నాకు కూడా, నా ఆఖరి రోజుల్లో అలానే వుండేది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు, అస్సలు స్టార్టు కాకుండానే షెడ్ కి వెళ్ళి పోదాము అనుకున్నా, సరే లే ఈ కుటుంబానికి అత్యవసరం ఎదో వచ్చింది. అదీ కొండల రావు భార్య తాలూకు బంధువులు అంతా వచ్చివున్నారు. ఆవిడ గారి చెల్లెలు , అన్న వదిన అంతా. వాళ్ళ ముందు మనం ఇలా రోగిష్టి ముండ మోపిలా ఎందుకులే అనుకొని, లేని ఓపికా తెచ్చుకొని, ఈ ఒక్క సారికీ పనికొద్దాం అనుకున్నా. అందరూ కలిసి ఊరు అవతల ఎవరినో కలవటానికి బయలు దేరారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సాఫీ గానే సాగుతుంది, కానీ నాకు ఓపిక లేక పోవటం వాళ్ళు మాట్లాడేది సరిగ్గా వినపడలేదు, నా బుర్ర కి ఎక్క లేదు.

ఇంతలో నా ఇంజెను గుండెల్లో మంట మొదలయ్యింది. అప్పటికే ఫ్యూయల్ పంపు లో ఆయిల్ లీకు అవుతుంది, నా కార్బురేటర్ బెల్టు కొట్టేసింది. పొగలు.. దగ్గి దగ్గి దగ్గలేక ఆర్తనాధాలు చేసాను. కొంత సేపటికి అది గమనించిన కొండలరావు నన్ను ఆపి, బయటకి వచ్చి నా బోనెట్ తీసి చూసాడు. పాపం అతనికి కూడా కారు రిపేరు మీద పెద్ద గా అవగాహన లేదు. తనకి తెలిసిన ఇంటి చిట్కా వైద్యం, రేడియేటర్ లో నీళ్ళు పోయడమే. ఎదో కాస్త దగ్గు తగ్గింది కాని, ఆ వేడి తగ్గలేదు. పొగలు ఇంకా హెచ్చు అయ్యాయి. ఇంతలో ఆ మధ్యాన్నపు ఎండ వేడి కి ఎక్కడనుంచో నిప్పు రవ్వ రాజుకుంది. అసలే ఆయిలు లీకు. మంట అంటుకుంది. అదృష్టం కొద్ది ఇది గమనించిన కారు లో వున్న వాళ్ళు అంతా , తమ వస్తువులు తో సహా బయటకి వచ్చేసారు. ఇక నా బోనెట్ అంతా ఒకటే మంటలు. నా ప్రాణం ఆ మంటల్లోనే ఆహుతి అయిపోతింది. కారు దగ్ధం.

కొండల రావు చేతి మీద తాగిన నీళ్ళే నా ఆఖరి దప్పిక. అదే తులసి తీర్ధం.

**********************************************

అలా ఆ కారు-చిచ్చులో నేను తగలడి పోయాక, పై లోకానికి వచ్చేసి, వైకుంఠ వాహనం గా చేస్తున్నాను. కార్లు కూడా ఇక్కడకి వస్తాయా ? మరి కారులకి కూడ స్వర్గము, నరకమూ వేరు వేరు గా వుంటాయా ? అవన్నీ నాకు తెలియదు. ఒకానొక రోజు, దాదాపు ఇరవయి సంవత్సరాల తర్వాత , ఎవరో నాకు బాగా తెలిసిన వ్యక్తి నా వైపే వస్తున్నాడు, ఒక భటుడి తో.

" ఆ కొండల రావూ , ఇదిగో నయ్యా , నువ్వు మా బుర్ర తిని, ఒక వాహనం అడి గావు కదా, నీ గతించిన కాలానుసారం నీకు ఈ కారు నిర్ణయించారు మా దక్షులవారు. ఇది నిన్ను ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తుంది, దీనికన్నీ తెలుసు. నువ్వు మాట్లాడేది కూడా అర్ధం అవుతుంది. ఒక మూడు రోజుల్లో నీ బస ఎక్కడ అనే నిర్ణయం చేసుకోని, అక్కడకి దగ్గరలో వున్న సంచాలకునికి తెలియచెయ్యి" అని చెప్పి వెళ్ళి పోయాడు ఆ భటుడు.

చూస్తే మన కొండల రావు. అరే ఆశ్చర్యం, ఉబ్బి దబ్బిబ్బు అయ్యాను. ఆనందం. కానీ ఒక్క క్షణం నిజం గుండెలకి గుచ్చుకుంది... అంటే కొండల రావు చనిపోయాడు. అయ్యో అనుకున్నా.. కానీ ఇప్పుడా విషయాలు ఎందుకు అని "సార్ గుర్తున్నానా" పలకరించాను

కొండల రావు ఉలిక్కి పడ్డాడు " ఎవరు" అటు ఇటు దిక్కులు చూసాడు గాలి లోకి

"నేనే సార్, మీ పద్మిని ని. భూలోకం లో మనుషులనే మీరు మాట్లాడనిచ్చే వారు కాదు, ఇక నా మాట మీకు ఒక లెక్కా, మీరు ఎప్పుడయినా వింటేగా నా గొంతు గుర్తుపట్టదానికి " నవ్వాను గట్టిగా... ' హిస్స్ హిస్స్ హిస్స్ " నేను నవ్వితే కారు టైర్ ట్యూబు లో గాలి పోయినట్టు వుంటుంది.

" ఆ నిజమా, గుర్తులేకేమి, నువ్వు నాకు బాగా గుర్తు"

"అవును సార్, మనకి జన్మ జన్మ ల రుణమో బంధమో ఎదో మిగిలిపోయింది...ఇంక చింత పడకండి నేనే మిమ్మల్ని ఇక్కడ పైలోకమంతా తిప్పుతాను"

"ఆ.. అదే ఇక్కడికి వచ్చాక ఎదో వసతి ఏర్పాటు చేసాము అక్కడే వుండాలి అన్నారు, అదెలా కుదురుతుంది. అసలు నేను ఒకసారి ఊరు అంతా చూడాలి కదా. ' నా వ్యాయామానికి, ఉదయం నడక కి , యొగా లకి పార్కులు సదుపాయాలు ఎక్కడ వున్నాయో, అవన్నీ చుసుకోవాలి గా' అని వాళ్ళ బుర్ర తిన్నాను. ఊరుకోనుగా "

" నాకు తెలుసు సార్, రండి కూర్చోండి" తలుపు తీసాను.

కూర్చుంటూ " హూ మేడ్ ద రూల్స్ ? షో మి ద రూల్స్ అని గదమాయించా. షొ మి ద మేన్ , ఐ విల్ టెల్ ద రూల్..మనకి తెలియనివా ఇవన్నీ. ఒక సారి నియమం అర్ధం చేసుకుంటే, అప్పుడు దాన్ని ఎలా బ్రేకు చెయ్యాలో , దొంగ దారి ఎలా వెతకాలో కనిపెట్టొచ్చు"

కొండల రావు లోపలకి వచ్చి కూర్చున్నాక, 20 ఏళ్ళనాటి తీపి జ్ఞాపకాలు అన్నీ ఒక్క క్షణం కళ్ళముందు తిరుగాడాయి. కానీ ఈ సారి కొండల రావు డ్రైవింగ్ సీటు లో లేడు. పక్క సీటు లో కూర్చోమన్నాను. నా హెడ్ లైట్స్ కి కొంచెం పొగ మంచు పట్టింది. కారు స్టార్టు చేసాను

"ఇక్కడ కారు కి ఇందనం అక్కర లేదు , టైరులకి గాలి అక్కరలేదు, ఇంజెన్ కి మరమత్తులూ అవ్వసరం లేదు , అంతా స్వయంచలితం అంతా శాస్వతం. నాకు ప్రతి మూలా తెలుసును, మీకు అన్నీ చూపిస్తా. అన్నట్టు మరచా, మిమ్మల్ని దింపిన బటుడు కి ఏం పేరు పెట్టారు సార్"

"ఒహో నీకు అది కూడా తెలుసా.. భలే భలే.. వాడు బాగా తెగ బలిసి ఎద్దు లా వున్నాడా.. అందుకే... ' దున్నపొతా బేబి నివ్వు ' . అది ఒక పాత తెలుగు సినిమా లో పాట, ఎద్దు మొద్దవతారం లా వుండే వాళ్ళని చూస్తే నాకు అది గుర్తుకొస్తుంది"

ఇద్దరం నవ్వుకున్నాం

"సార్ ఇంకో మాట. నాకు ఇక్కడ అన్ని మార్గాలు తెలుసును. దొంగ దారులు , రాజ దారులు, సొరంగాలు, ఒకటేమిటి అన్నీ , సర్వం తెలుసు..మీరు మొదట ఊరు చూడండి, మీకు నచ్చిన చొట బస చేయండి.. ఎప్పుడయినా మీ కుటుంబాన్ని చూడాలనిపిస్తే, నాకు చెప్పండి, ఒక రహస్య సొరంగం ద్వారా తీసుకెళ్తా. అదొక రహస్య పోర్టల్ గేట్ వే . మనం ఇలా వెళ్ళి , అలా చూసి వచ్చేద్దాం.. మూడో హెడ్ లైట్ కి తెలియకుండా..సరేనా"

ఊ అన్నట్టు తల ఊపాడు కొండల రావు. ఈ సారి చెమ్మగిల్లడం అతని కళ్ళవంతు

+=================== మా నాన్న గారు మా పాత పద్మిని కారు లో వెళ్తున్నట్టు నాకు నిద్ర లో కల లా మెదిలింది.. దాని ఆధారం గా =======dedicated to my dad RIP. 22 apr 1946 -- 24 sep 2022

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న