శరభయ్య కటిక పేదవాడు. కూలీనాలీ చేసి కొంత డబ్బును పోగు చేశాడు. అతనిది పేద గుడిసె. అది వానకు జలజల. గాలికి గలగల. సూర్యచంద్రులు ఆ గుడిసెలో ప్రత్యక్షం. తాను కొత్త ఇల్లు కట్టుకోవాలని శరభయ్య కలలు కన్నాడు . కానీ ఒకనాటి రాత్రి ఒక దొంగ అతని ఇంటిలో ప్రవేశించి అతడు దాచుకున్న డబ్బులు, బంగారు నగలు ఎత్తుకొని పోయాడు. శరభయ్యకు ఏమి చేయాలో తోచలేదు. తాను కష్టపడి సంపాదించిన దాచుకున్న డబ్బు పోయేసరికి అతని దుఃఖానికి అంతు లేదు .చివరికి అతడు తన బాధను అదిమిపెట్టి ఆ రాజ్యాన్ని ఏలే రాజు వద్దకు సాయం కొరకు వెళ్లాడు .కానీ అక్కడ అతనిని రాజ భటులు లోపలికి పోనీయలేదు. వెంటనే అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. శరభయ్య ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగ ఆ నగలు డబ్బును ఒక మూటలో పెట్టుకొని ప్రక్క గ్రామానికి చీకట్లోనే పయనమయ్యాడు .అతడు చాలా అలసిపోవడం వల్ల ఆ చీకట్లోనే ఒక చెట్టు కింద ఆ నగల మూటను పెట్టి నిద్రపోయాడు. ఆ మూటను చూసిన ఒక కోతి దానిని ఆ చెట్టుపైకి తీసుకొని వెళ్ళింది. కానీ అందులో తినేది ఏదీ లేకపోయేసరికి ఆ చెట్టు పైన ఆ మూటను పెట్టి అది వెళ్లి పోయింది. ఆ దొంగ నిద్రలేచి చూసేసరికి అక్కడ తన సంపాదించిన మూటలేదు. వెంటనే అతడు ఉస్సూరుమంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇంతలో ఒక డేగ వచ్చి ఆ చెట్టు పైన కోతి వదలి వెళ్లిన మూటను వెతికి అందులో ఏమీ లేదని గ్రహించి దాన్ని కింద పడవేసింది. అప్పుడే దానయ్య అను వృద్దుడు ప్రక్క గ్రామానికి పని మీద వెళుతున్నాడు. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఆ అడవిని దాటాల్సిందే .అందువల్ల అతడు కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళుతుండగా ఒక మామిడి చెట్టు కింద ధగధగా మెరుస్తూ ఒక మూట అతనికి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి అది ఎవరిదోనని చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఇది తర్వాత రాజుగారికి అప్పగిస్తానని అతడు ఆ మూటను తన వెంట తీసుకుని పోయాడు. ఇంతలో శరభయ్య చిన్న పాప బయట ఆడుకునే సమయంలో ఆ మార్గంలో పల్లకిలో వెళ్తున్న రాణి ఆ పాపను చూసి ఆ పల్లకి దిగివచ్చి ఆ పాపను ప్రేమగా పలకరించింది. అది చూసి శరభయ్య భార్య ఆమెను తన పేద గుడిసెలోనికి రమ్మంది. కానీ ఆ రాణి తర్వాత వస్తానంది. ఆ రాణీకి పిల్లలు లేరు . ఆమె అందరి పిల్లలను తన పిల్లలుగా భావించేది. ఆమె అంతఃపురానికి వెళ్ళిన తర్వాత రాజుగారికి ఆ పాప ముద్దు ముచ్చట గురించి చెప్పింది. రాజు ఆమె మాటలు విని ముగ్ధుడై తాను ఆ పాపను చూడడానికి వచ్చాడు .ఆ పాప ముద్దూ ముచ్చట చూసి రాజుకు చాలా ఆనందమైంది. శరభయ్య రాజు తన గుడిసె లోనికి రావడం చూసి ఎంతో సంతోషించాడు .రాజు శరభయ్యను అతడు ఎందుకు ఇల్లు కట్టుకోలేదని ప్రశ్నించాడు? అప్పుడు శరభయ్య తన నగలు ,డబ్బు పోయిన సంగతి చెప్పాడు. రాజు విచారించి ఆ దొంగ దొరికిన తర్వాత నీ నగలు డబ్బు నీకు అందజేస్తానని ఆ పాపను పలకరించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజు కొన్ని నగలు, కొంత డబ్బు ఒక దొంగ వద్ద దొరికాయని శరభయ్య ఇంటికి భటుల ద్వారా అతనిపై సానుభూతితో పంపాడు .కానీ శరభయ్య అవి తనవి కావని వాటిని తిరిగి ఇచ్చివేశాడు. ఈ సంగతి విన్న రాజు శరభయ్య నిజాయితీని మెచ్చుకొని ఆ నగలను డబ్బును పట్టుకొని పోయిన అసలు దొంగను పట్టుకొన వలసిందిగా రాజభటులను ఆదేశించాడు. ఒకరోజు రాజు కొలువుతీరి ఉండగా అక్కడకు దానయ్య తాత వచ్చి ఈ నగలు తనకు దారిలో దొరికినాయని,తాను అస్వస్థతకు లోనవడం మూలాన కాస్త ఆలస్యమైందని చెప్పి రాజుకు వాటిని అప్పగించాడు. రాజు దానయ్య తాతను ఘనంగా సత్కరించి అతని నిజాయితీని మెచ్చుకొని అతనికి ఆర్థిక సాయం చేశాడు. దానయ్య తాత తన నిజాయితీ వల్లనే రాజు తనకు ఆర్థిక సాయం చేశాడని అనుకున్నాడు. తర్వాత రాజు శరభయ్యను పిలిపించి ఆ నగలను డబ్బులను ఒకసారి సరిచూసుకోమన్నాడు. ఇవి తనవేనని శరభయ్య అంగీకరించి రాజుకు ధన్యవాదాలు చెప్పాడు. రాజు అతనితో" శరభయ్యా! నేను నీ నిజాయితీకి మెచ్చాను. నీకేం కావాలో కోరుకో !"అని అన్నాడు .అప్పుడు శరభయ్య "మహారాజా! నాలాంటి పేదలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ మీరే ఇల్లు కట్టించి ఇవ్వండి. అలాగే నేను కూడా చాలా పేద వాడిని. మీ రాజాస్థానంలో ఏదైనా కొలువు ఉంటే నాకు ఇప్పించండి. ఇక ఎవరైనా ఆపదలో మీ వద్దకు వస్తే వారిని లోపలికి అనుమతించి వారికి సాయం చేయండి"అని అన్నాడు . ఆ మాటలు విని రాజు పరమానంద భరితుడై " శరభయ్యా! నీ నిజాయితీకి మెచ్చాను. నీకు కొలువు ఇస్తున్నాను. నీవు అన్నట్టు ఇకనుంచి పేదవాళ్లకు తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తాను. అంతేకాదు. వారి కష్టసుఖాలు చెప్పుకొనుటకు వారిని లోపలికి అనుమతించి వారికి తగిన సాయం చేస్తాను" అని అన్నాడు. శరభయ్య పరమానంద భరితుడై "మహారాజా !మీరు నూరేళ్లు వర్ధిల్లండి" అని ఆశీర్వదించాడు. తర్వాత త్వరలోనే అతడు రాజు గారి ఆర్థిక సాయంతో తాను ఒక ఇల్లును కట్టుకొని తన కలను నిజం చేసుకున్నాడు . తాను నిజాయితీగా ఉన్నందుకు తన ఇంటి కల నెరవేరిందని శరభయ్య అనుకున్నాడు. అందువల్లనే దొంగ ఎత్తుకుపోయిన తన వస్తువులు దొరికాయని అతడు గట్టిగా నమ్మాడు. తన నిజాయితే తనకు కొలువు కూడా తెచ్చి పెట్టిందని శరభయ్య విశ్వసించి ఎంతో సంతోషించాడు.ఆ రోజు నుండి శరభయ్య ఎన్నడు కూడా తన నిజాయితీని మాత్రం మరవలేదు.