వాగర్ధావివ సంపృక్తౌ - యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్

Vagardhaviva sampruktow

సదరన్ పేపర్ మిల్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ ప్రారంభమవడానికి ఇంక 10 నిమిషాలు మాత్రమే ఉంది. బోర్డు చైర్మన్ చౌదరి గారు మాటి మాటికీ వాచీ చూసుకుంటూ గుమ్మం కేసి చూస్తున్నారు. 10 గంటలు అవుతుండగా ఒక వ్యక్తి గబ గబా లోపలికి ప్రవేశించడాన్ని చూసి, ఒక్కసారి అమ్మయ్య అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్.ఆర్.కె.దాస్ - 'దాసు’ గా సుప్రసిద్ధుడు. ఎప్పుడూ ముదురు రంగు ప్యాంటు, లేత రంగు పొడుగు చేతుల చొక్కా, మేచింగ్ స్లిమ్ టై, షర్ట్ జేబులో గోల్డ్ కేప్ పెన్, సీకో వాచ్, నిగ నిగ లాడే నల్లని పాయింటెడ్ షూ, అప్పుడప్పుడే ఎదురవుతున్న మార్బుల్ బట్ట తల, చేతిలో లెదర్ బిజినెస్ వాలెట్. ఇదీ, పదహారణాల టాప్ క్లాస్ ఎగ్జక్యూటివ్ లా ఉంటుంది అతను కనిపించే స్టైల్.

అతని కళ్ళల్లోని ధైర్యం తన సామర్ధ్యం మీద తనకున్న అపారమైన నమ్మకానికి ఒక సూచికలా ఉంటే, పెదవులపై మందహాహం ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది.

"సారీ సార్! లిఫ్ట్ ప్రోబ్లెం అనుకుంటా, మెట్లెక్కాల్సొచ్చింది", అని సంజాయిషీ ఇచ్చుకుంటూ చౌదరి గారి ప్రక్క కుర్చీలో కూర్చొని, మూత పెట్టిన గ్లాసులో ఉన్న మంచినీళ్ళు క్రొద్దిగా త్రాగి. " ఇంక మొదలు పెట్టండి", అన్నట్లుగా ఆయన వైపు చూశాడు దాసు. చౌదరి గారు కుర్చీని టేబుల్ కి దగ్గరగా జరుపుకొని, కొంచెం పెద్ద కంఠంతో మొదలు పెట్టారు.

"లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడున్నవారందరికీ తెలుగు అర్ధమవుతుంది గాబట్టి, నేను తెలుగులోనే మాట్లాడతాను.

ఇప్పటికి మన ఫ్యాక్టరీ కనస్ట్రక్షన్ మొదలుపెట్టి రెండు సంవత్సరాలవుతోంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఒక ఆరునెలల్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మన ఫ్యాక్టరీ నుండి వచ్చే ఉత్పత్తి అంతా నిబంధనల ప్రకారం నూటికి నూరు శాతం విదేశాలకు ఎక్స్ పోర్టు చేయాలి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. ఈలోగా మీకు నా ప్రక్కన కూర్చున్న వ్యక్తిని పరిచయం చేస్తాను."

"ఈయన మిస్టర్ దాస్ , ఎన్.ఆర్.కె.దాస్. క్రొత్తగా చీఫ్ కన్సల్టెంట్ గా మన ఫ్యాక్టరీలో గత వారం చేరారు. పేపర్ మిల్ వ్యవహారాలలో అపారమైన అనుభవం కలిగిన నిష్ణాతుడు. మహారాష్ట్రలోని అతి పెద్ద పేపర్ మిల్ విజయం వెనుక వీరి పాత్ర ఎంతో ప్రాధాన్యమైనది. మన అభ్యర్ధనపై, మనతో కలసి పనిచేయడానికి అంగీకరించి బాధ్యతలను తీసుకున్నందుకు అభినందనలు తెలియచేస్తూ, మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు దాసు గారిని మాట్లాడవలసినదిగా కోరుతున్నాను" అని చౌదరి గారు ముగించారు.

"అందరికీ నమస్కారం! ముందుగా చౌదరి గారికి ధన్యవాదములు. నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు. ఇక అసలు విషయానికొస్తే, ప్రపంచంలో రెండు దేశాలు చైనా, అమెరికాలు పేపరు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. మిగిలిన దేశాలు వాటి దరిదాపుల్లో కూడా లేవు. అమెరికాలో పేపరు ఉత్పత్తి 50 మిలియన్ల టన్నులుంటే వినియోగం సుమారు 200 మిలియన్ల టన్నులు. రీసైకిలింగు ద్వారా వెనక్కొస్తున్నది కేవలం 45 వేల టన్నులు ఉంటే, మిగిలిన వినియోగాన్ని దిగుమతుల ద్వారానే సేకరిస్తొంది. దీనికోసం ఇతర దేశాలపై పూర్తిగా అధారపడింది. ఆ బిజినెస్ కోసం ముఖ్యంగా చైనా మరియు జపాన్ విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ మధ్యనే మన దేశం కూడా ఫారిన్ ఎక్స్ పోర్ట్ విధానంలో మార్పులు తీసుకొని రావడంతో, ఇక్కడనుంచి కూడా ఎగుమతులు మొదలవడమే కాకుండా, మన దేశీయ కంపెనీల మధ్య పోటీ కూడా ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా ముందుస్థానంలో ఉండేది క్వాలిటీ", ఏ ఏ దేశం ఎంతంత ఉత్పత్తి చేస్తోందో అంటూ నెంబర్లతో సహా ఏ పుస్తకమూ చూడకుండా చెప్పుకుంటూ..... పోతున్నాడు దాసు. అందరూ స్కూలు పిల్లల్లా చెవులప్పగించి విస్మయంగా వింటున్నారు. అతని మేధా సంపత్తికి లోపల్లోపల మురిసిపోతున్నారు.

ఒక్కసారి చెప్పడం ఆపి "ఏమైనా ప్రశ్నలున్నాయా?" అని దాసు అడుగుతూంటే, అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు "ఇంత క్లారిటీ గా చెబుతుంటే ఇంకేం ప్రశ్నలుంటాయన్నట్లు".

చౌదరి గారు మాత్రం మనసులో అద్భుతమైన టాలెంటుని పరిచయం చేసినందుకు స్వాజీలాండ్ ఆర్ కె గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. క్రితం సంవత్సరం చౌదరి గారు సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్ళినపుడు జొహన్స్ బర్గ్ సిటీలో ఒక గెట్ టుగెదర్ లో కలిసారు స్వాజిలాండ్ కి చెందిన ఆర్ కె. గత కొన్నేళ్ళగా అక్కడ పేపర్ మిల్ లో ఆర్ కె పనిచేస్తున్నారు. ఒక మంచి కన్సల్టెంట్ కోసం చూస్తున్నామని చౌదరి గారు చెప్పగానే దాసు గారిని సిఫార్సు చేశారు ఆర్ కె.

అనుకున్న ఎజండాతో మీటింగు ముగియడంతో, అందరూ లంచ్ కి లేచారు.

******************************

"నాన్న ఎన్నింటికొస్తారమ్మా? అర్జెంటుగా నేను కొన్ని ఫిజిక్స్ థీరంస్ చెప్పించుకోవాలి, రేపు ఎగ్జాం ఉంది", అంటూ తల్లి వసుంధరని అడుగుతోంది స్వప్న. అంతలోనే బయట ఆఫీసు కారులోంచి దిగుతూ కనిపించాడు దాసు.

"ఇప్పుడే కదా వస్తున్నారు, కాస్త ఫ్రెష్ అవ్వనీ, ఆ తరువాత అడుగుదుగాని" అంటూ మంచినీళ్ళ గ్లాసుని భర్తకి అందించింది వసుంధర.

"వసూ! ముందు కాస్త కాఫీ ఇయ్యి, భోజనం లేటుగా చేస్తాను. రేపు ఎగ్జాం ఉందా? ఫిజిక్సా?" అంటూ సోఫాలో కూర్చుంటూ స్వప్న చేతిలో పుస్తకాలు చూస్తూ అడిగాడు దాసు.

"అవును నాన్నా" అంటూ ఎదురుగుండా కూర్చుంది స్వప్న.

ఆర్కెమెడిస్ ప్రిన్సిపల్, ఓం లా, పాస్కల్ లా - అలవోకగా ఉదాహరణలతో సహా ఎంతో అనుభవమున్న ప్రొఫెసర్ లా వివరిస్తున్నాడు.

ముచ్చటగా అతని వైపే చూస్తోంది వసుంధర. ఎంత జ్ఞాపకశక్తి! ఎప్పుడో ఇరవై ఏళ్ళకింద నేర్చుకున్న చదువు, ఇప్పుడు కూడా ఏ సహాయము లేకుండా నోట్లోంచి వస్తోందంటే నిజంగా అతని మేధాశక్తికి జోహార్ అనుకుంది. అంతే కాదు ఫోన్ నెంబర్లు అయినా ఇంటి అడ్రసులైనా నెంబరు తో సహా అన్నీ అతని నాలికపై ఉంటాయి.

ఆఫీసునుంచి సాయంత్రం ఏడింటికల్లా ఇంటికొస్తాడన్న మాటే గాని, పదింటి వరకూ ఏవో ఫోనులు వస్తూనే ఉంటాయి. అవన్నీ తీసుకుంటూనే, పిల్లల చదువుల్లో సహాయం చేస్తూంటాడు. అంతేకాదు మంచి సంగీతప్రియుడు కూడా.

శాస్త్రీయ మరియు ఆధునిక సంగీత పరిజ్ఞానంలో కొట్టినపిండి. ఒకసారి దాసు రెండవ కూతురు మృదుల త్యాగరాజ పంచరత్న కీర్తన "ఎందరో మహానుభావులు" ప్రాక్టీసు చేస్తుంటే దాసు చెవిన పడింది.

"తల్లీ! ఆ కీర్తన పాడుతుంటే, నీ హృదయభావం కనబడకూడదు. త్యాగరాజుల వారిది కనపడాలి. అప్పుడే అది శ్రోతల హృదయాన్ని కాక వారి ఆత్మలను తాకి వారి వ్యక్తిత్వాలలో పరివర్తన తెస్తుంది" అంటూ శ్రీ రాగంలో ఆ కీర్తన తను పాడి వినిపించగానే, నిజంగా త్యాగరాజే పాడుతున్నడా అనిపించింది.

****

ఉదయాన్నే ఏడింటికల్లా ఆఫీసుకెళ్ళిన దాసు, ఏడున్నరకి ఇంటికి ఫోన్ చేశాడు. డ్రాయర్ తాళాలు మరచిపోయాను, డ్రైవర్ని పంపుతున్నాను ఇవ్వమని. అదేమిటి, అలా ఎప్పుడూ మరచిపోరే! అనుకుంటూ, తాళాలు తీసి ప్రక్కన పెట్టుకుంది వసుంధర, డ్రైవర్ వచ్చాకా ఇవ్వడానికి. ఆరోజు సాయింత్రం ఆరవుతుండగానే ఇంటికివచ్చేసాడు దాసు.

"ఏమిటి విశేషం? ఈరొజు అంత తొందరగా వచ్చారు?", అన్న వసుంధర మాటకి సరిగ్గా సమాధానం చెప్పకుండానే, వాష్ రూములోకి వెళ్ళిపోయడు దాసు. రోజూ ఉండే మందహాసం, ప్రశాంతత దాసు ముఖంలో కనబడలేదు ఆమెకి.

"ఏదో ఆఫీసు చికాకు అయి ఉంటుందిలే" అనుకొని కాఫీ కలపడానికి వంటింట్లోకి నడిచింది.

యధావిధిగా, ఫోన్లతో బిజీగా గడిపాడు దాసు. మధ్యలో స్వప్న ఎదో మాట్లాడాలని ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోలేదు.

రోజులు గడిచిపోతున్నాయి. దాసు ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. చెప్పిందే పదిసార్లు చెప్పడం, ప్రక్కనే కాఫీగ్లాసు పెట్టినా పట్టించుకోకపోవడం, పరధ్యానంగా భోజనం చేయడం. పిల్లలతో అసలు మాట్లాడటం తగ్గించేసాడు. పైగా చికాకు, కోపం ఎక్కువైపోయాయి. అతని ప్రవర్తన మూలంగా, జీవితంలో ఎప్పుడూ లేని విధంగా భార్యాభర్తల మధ్య కోపాలు, అరచుకోవడాలు మొదలయ్యాయి. ఉల్లాసానికి ఉత్సాహానికి కేరాఫ్ అడ్రసులా ఉండే ఆ కుటుంబ పరిస్థితి, ‘ఎంతో ప్రశాంతంగా పయనిస్తున్న పడవ ఒక్కసారి తుఫానుకి చిక్కుకున్నట్లు’ అల్లకల్లోలంగా మారింది.

ఒకరోజు మధ్యాహ్నం కాలింగ్ బెల్ మ్రోగటంతో తలుపు తీసిన వసుంధర ఒకింత ఆశ్చర్యానికి లోనయింది. ఎదురుగుండా నాయిడు గారు. సదరన్ పేపర్ మిల్ లో అక్కౌంట్స్ డివిజన్ లో పనిచేస్తారు. దాసుతో బాగా చనువుగా ఉంటారు.

"నమస్తే మేడం, బాగున్నారా" అంటున్న నాయుడు గారితో, "నమస్తే లోపలకి రండి" అంటూ సోఫా దగ్గరకి దారితీసింది.

"మంచినీళ్ళు కావాలా" అన్న వసుంధర మాటకి వద్దని చెయ్యూపుతూ.

"మేడం! మీకు సార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి, దయచేసి వింటారా" అంటూ కొంత గంభీరమైన స్వరంతో అడిగారు నాయుడు గారు.

ఆ మాటకి ఒక్కసారి ఉలిక్కిపడింది వసుంధర. చెప్పండి అన్నట్లుగా ఆయనకేసి చూసింది.

"ఈ మధ్య ఆఫీసులో దాసు గారి ప్రవర్తనలో చాలా మార్పు గమనించామమ్మా. అనవసరంగా అందరిపైనా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. చెప్పిన పనులే మళ్ళా చెబుతున్నారు. చైర్మన్ గారితో కూడా అలాగే ఉంటున్నారు".

" చైర్మెన్ గారే పంపారమ్మ, ఒక్కసారి మీతో మాట్లాడమని" అని చెప్తూ వసుంధర వైపు చూసారు నాయుడు గారు.

వసుంధర ముఖంలో నెత్తురుచుక్క లేదు. ఇప్పటిదాకా ఏదో ఆఫీసు వత్తిడిలో అలా ఉన్నారనుకుంది. కానీ పరిస్థితి అలా లేదు, ఇదేదో ఆరోగ్య సమస్యే అయి ఉంటుంది అనుకుంటూ,

"అవునండి! నేను కూడా గ్రహించాను. ఏవో ఆఫీసు సమస్యలనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అవేమీ కావని", అంటూ చాలా నీరసంగా సమాధానం చెప్పింది.

"మీరు సరేనంటే, సిటీలో మంచి న్యూరాలజిస్ట్ వద్ద అప్పాయింటుమెంటు తీసుకుంటాను, సార్ ని మీరు ఒప్పించి తీసుకురావాలి", అని ఆమె సమాధానం కోసం చూశారు నాయుడు గారు.

"అలాగే! ఆయనికి చెప్పిచూస్తాను ఏమంటారో ", అని నాయుడుగారిని సాగనంపి ఆలోచనలలో పడిపోయింది వసుంధర.

*******************************

ఆ వచ్చే ఆదివారం సాయింత్రం వసుంధర అన్న కొడుకు మురళిధర్ పెళ్ళి. సిటీలోనే జరుగుతోంది. రెండురోజులు ముందే రమ్మని ఆహ్వానం అందినా, దాసుని దృష్టిలో పెట్టుకుని ఆదివారమే వెళ్ళాలని, అక్కడినుంచి వచ్చిన తరువాత మాత్రమే డాక్టరు అప్పాయింటుమెంటు గురించి కదుపుదామని నిశ్చయించుకుంది వసుంధర.

"రేపు ఉదయమే మనం బయలుదేరి పెళ్ళికి వెళ్ళాలి గుర్తుందా?" అంటూ పడుకోబోయే ముందు అడిగింది వసుంధర.

"అవునా! ఎవరి పెళ్ళి? నాకు ఇప్పటిదాకా చెప్పలేదే మరి!", అని చికాగా ముఖం పెట్టాడు దాసు.

"అదేటండి? లాస్ట్ సండే మా అన్నయ్య వదినా వచ్చి పిలిచారు కదా! మీరు కూడా నన్ను ముందే వెళ్ళమన్నారు కూడా, గుర్తుకొస్తోందా?" అంటూ రెట్టించి అడిగింది వసుంధర.

“అవునన్నట్లు”, ముభావంగా తలూపాడు దాసు.

" మరి డ్రైవర్ని రమ్మని చెప్పారా? రేపు అతనికి శెలవు కదా!" అడిగింది వసుంధర.

"డ్రైవర్ ఎందుకు? సెలవు రోజు కాబట్టి అంత రష్ ఉండదు. బాగా తెలిసున్న రూటే, అంతగా కావాలంటే ఉదయమే చెప్పచ్చులే, అతను రాకపోతే ఎవరినైన పంపుతాడు" అని దాసు అనేసరికి, "హమ్మయ్య", అనుకుంది వసుంధర.

ఉదయాన్నే కుటుంబం మొత్తం కారులో బయలు దేరారు. కళ్యాణమండపం సిటీ బయట సుమారు 45 నిమిషాల దూరంలో ఉంది. ఇంతకుముందు రెండు మూడు సార్లు అక్కడ జరిగిన ఫంక్షన్లకు వెళ్ళిన అనుభవం ఉంది దాసుకి. కొంతదూరం వెళ్ళేసరికి స్వప్నకి అనుమానం వచ్చింది, కారు సరైన రూట్ లో వెళ్ళడం లేదని.

"నాన్నా! మనం రూటు మారిపోయినట్టున్నాం, గమనించావా?" అని అడిగేసరికి, "అవును రూటు మరచిపోయాను" అని కారుని ప్రక్కగా తీసుకెళ్ళి ఆపాడు దాసు.

ఈలోగా స్వప్న అటు స్కూటరుపై వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి, డైరక్షన్లు అడిగి వ్రాసుకొని, దాసు ప్రక్క సీట్లో కూర్చొని చెబుతుంటే, మెల్లిగా కళ్యాణమండపానికి చేరుకున్నారు.

మధ్యాహ్నం భోజనాలు జరుగుతున్నాయి. "వసూ! బావగారు ఎక్కడున్నారు" అంటూ వచ్చాడు అన్నగారు.

"అవును! ఎక్కడున్నారు?" అంటూ కలియదిరిగి చూసేసరికి హాలులో, ఒక మూలనున్న కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు దాసు.

"బావగారు భోజనం చేద్దాం లేవండి" అన్న ప్రశ్నకి సమాధానం రాకపోవడంతో, దాసు భుజమ్మీద చెయ్యివేసి లేపడానికి ప్రయత్నించింది వసుంధర. ఒక్కసారి ఆ చేయిని విసురుగా తోసేయడంతో, బిత్తరపోయింది, అలాగే ఆవిడ అన్నగారూను.

“ఏమిటిది! ఎప్పుడూ లేనిది ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు? అందులోనూ అందరిముందూ!” తలకొట్టేసినట్లయింది వసుంధరకి. సిగ్గుతో కుచించుకుపోయింది. అన్నగారిని ప్రక్కకి తీసుకెళ్ళి, గత కొన్ని నెలలుగా దాసు ప్రవర్తిస్తున్న తీరుని పూసగుచ్చినట్లు చెప్పింది. "అన్నీ సర్దుకుంటాయిలే" అన్నట్లు ఆయన చెల్లి భుజంపై తట్టి లోపలకి తీసుకు వెళ్ళారు.

రోజు రోజుకీ దాసు పరిస్థితి బాగా దిగజారి పోతోంది. ఒక్కచోట స్థిరంగా కూర్చోటల్లేదు. ఆటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. డాక్టరు పేరెత్తినప్పుడల్లా వసుంధరపై విరుచుకు పడిపోతున్నాడు. ఆఫీసులో కూడా పరిస్థితి ఇలాగే ఉందని, అసలు పని చేయడం మానేసి వింతగా ప్రవర్తిన్నాడని నాయుడు గారి ద్వారా తెలుస్తూనే ఉంది.

అలా అయితే వాళ్ళు ఉద్యోగంలో ఎంతకాలం ఉంచుతారు అనుకుంటూంటే ఒక్కసారి ఏడుపు ముంచుకొచ్చింది వసుంధరకి.

ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలవుతుంటే, బయట కారాగిన శబ్దం వినబడి, కిటికీలోంచి చూసిన వసుంధరకి, దాసుతో బాటు చౌదరి గారు, నాయుడు గారు కూడా రావడం కనబడింది. గబగబా డోర్ తీయగానే, వారందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు.

చౌదరి గారు చెబుతున్నారు,"దాసు గారు మీరు మళ్ళా మాములుగా అవ్వాలి. నాకేమీ అవలేదని అనకండి. ఇదివరకటిలా చురుకుగా లేరు. ఒక్కసారి డాక్టర్ వద్దకు వెళదాం. చిన్న ట్రీట్ మెంట్ చేస్తారు. మీరు మళ్ళీ నాలుగు రోజులలో మాములుగా అయిపోతారు. ప్లీజ్, నా మాట వినండి". ఆ మాటలు దాసుకి అర్ధమయ్యాయో లేదో గాని, ఆయన ముఖం వైపు చూసి చిన్నగా నవ్వాడు.

"అమ్మా! రేపు ఉదయం 10 గంటలకు డాక్టర్ వైద్యనాథన్ అప్పాయింటుమెంటు తీసుకున్నాను. చాలా పేరున్న న్యూరాలజిస్ట్. మీతో పాటు నేను, నాయుడు గారు కూడా వస్తాం" అని చౌదరిగారు వెళ్ళడానికి లేచారు.

***********************

ఒక వారం తరువాత, సాయంత్రం 5 గంటలవుతోంది. డాక్టర్ వైద్యనాథన్ ఆఫీసు రెసెప్షన్ రూములో వసుంధర, చౌదరి గారు, నాయుడు గారు కూర్చొని ఉన్నారు. పదినిమిషాల తరవాత లోపలకి రమ్మని పిలుపొచ్చింది.

డాక్టర్ టేబుల్ మీద ఫైల్లో దాసు హెల్త్ రెపోర్ట్ ఉంది. వసుంధర మనసంతా చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్ వైద్యనాథన్ రెపోర్ట్ తీసి చూస్తూ, పెన్నుతో కొన్ని పాయింట్లు నోట్ ప్యాడ్ పై వ్రాసుకొని చెప్పడం ప్రారంభించాడు. అందరూ ఎంతో ఆతృతతో ఆయన వైపు చూస్తూ వింటున్నారు.

"మనం చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఫిజికల్ హెల్త్ చాలా బాగుంది.కానీ బ్రెయిన్ కండిషన్ బాగా వీక్ అయింది. దాని గురించే మీకు వివరిస్తాను, రెలాక్సుడుగా వినండి. దాసు గారి జ్ఞాపకశక్తి ఎప్పటినుంచో తగ్గుకుంటూ వస్తూ ఇప్పుడు బాగా తగ్గిపొయింది. దీనినే మెడికల్ టెర్మినాలజీలో "ఆల్జైమెర్స్ డిసీజ్" అంటారు. 1906 వ సంవత్సరంలో అలోఇస్ ఆల్జైమెర్ అనే జర్మన్ డాక్టర్ ఈ వ్యాధి గురించి మొట్టమొదటిసారిగా వివరించడంతో దానికి ఆయన పేరు పెట్టారు. ఈ వ్యాధి మొదట చిన్నగా ప్రారంభమయి క్రమేపీ పెద్దదవుతుంది. అంటే వ్యాధి లక్షణాలు మన కళ్ళ ఎదురుగా స్పష్టంగా కనబడతాయి”.

“ఈ వ్యాధి ఉన్నవాళ్ళు, ఉదయం లేచిన వెంటనే బాగా ఫ్రస్టేషన్, కోపంగా ఉంటారు. క్రమేపీ మాట్లాడం తగ్గుతూ, కొంత కాలానికి బాగా తెలిసిన పదాలను పలకడానికి కూడా తడుముకుంటారు. తప్పులు కూడా పలుకుతారు. చదవడం, టీవీ చూడడం కూడా పూర్తిగా మానేస్తారు. స్వంతంగా స్నానం చేయడం, తినడం కూడా కష్టమే. వ్యాధి ముదిరే కొద్దీ, సొంతవాళ్ళని కూడా గుర్తు పట్టలేరు. దీనికి ముఖ్య కారణం బ్రెయిన్ సైజు తగ్గిపోవడమే. మైక్రోస్కోప్ లో చూస్తే, ఈ వ్యాధి ఉన్న వారి బ్రెయిన్ , ప్రతీ స్టేజ్ కీ తగ్గిపోతున్నట్లు గమనించవచ్చు. ఫిజికల్ గా కూడా బాగా కృంగిపోతారు. ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోకండి. ఇది నా బాధ్యత", అని ఆపగానే. వసుంధరకి ఒక్కసారి తన కాళ్ళక్రింద నేల చీలిపోయినట్లనిపించింది. వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.

డాక్టర్ ఆమె భుజం మీద చేయి వేసి, " రిలాక్స్ మేడం! ఈ సమయంలో మీకు ఉండాలసినది ధైర్యం, ఆత్మవిశ్వాసం. ముఖ్యంగా, మీరు మీ పిల్లలు ఆయన్ని చూసుకోవలసి ఉంటుంది. అందుకు మీకు కౌన్సిలింగు చాలా అవసరం. మీ ఎదురుగా ఉన్న వ్యక్తిది ఒక పసిపిల్లాడి మనస్తత్వం అని అర్ధం చేసుకొండి. దీనికింకా నివారణ రాలేదు. మందులద్వారా కొంత మేరకు హైపెర్ ని తగ్గించవచ్చు. అంతకంటే ఏమీ చేయలేము. మీరు ఎంత రిఫ్రెష్ గా, ప్లెజంట్ గా ఉంటే ఆయన్ని అంత బాగా చూసుకోవచ్చు. క్రొత్త క్రొత్త ప్రదేశాలకి తీసుకెళుతూ ఉండండి. ఎప్పుడూ నవ్వుతూ ప్రవర్తిస్తూ, ఆయన్ని నవ్వేలా చేయండి" అంటూ పలు రకాల సలహాలు, సూచనలు ఇస్తూ కొన్ని మందులు వ్రాసి వారిని సాగనంపారు.

కారులో ఇంటికొస్తున్న వసుంధరకి ఒక్కసారి దాసు తనని ఆట పట్టిస్తూ అనే మాటలు, పిల్లలకి బిగ్గరగా చెప్పే పాఠాలు, గొంతెత్తి పాడే పాటలు, సినిమా రీళ్ళలా కళ్ళముందు తిరిగాయి. మనసునిండా ఆలోచనల యుద్ధాలు.

“ఇక తను నన్ను అలా ఆట పట్టించలేరు, పిల్లలతో సరదాగా గడపలేరు, కనీసం మాటలు కూడా ఉండవా”

“ఒక మనిషి మన జీవితంలోంచి మాయమైతే, ఆ గాయాన్ని కాలం మాయం చేస్తుంది. కానీ మన మనిషి మన కళ్ళముందు జీవత్సవంలా మసలుతుంటే అది మాయని గాయం, గుండె బరువు.”

దేవుడా! మా ప్రేమానురాగాలు చూసి నీకు కన్ను కుట్టిందా? అందుకనే ఇలా ఆడిస్తున్నావా?

వసుంధర మనసు నిర్వేదం అయింది. అది ఎటువంటిదంటే “కళింగ యుద్ధం తరువాత చిద్రమైన దేహాల మధ్య నడిచిన అశోకునికి కలిగిన నిర్వేదం లాంటిది”.

కానీ వెంటనే " మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక పసిపాప అని మరచిపోకండి" అన్న డాక్టర్ మాటలు, తన చెవిలో మారుమ్రోగుతున్నాయి. ఇప్పటివరకు కుటుంబంకోసం తను సర్వం ధార పోసాడు. నాకు గానీ పిల్లలకి గానీ కష్టం అనేది ఏమిటో తెలియకుండా చేసాడు. మేము తప్ప తనకి ఎవరున్నారు?

“విషయం తెలియక ఎంతలా గొడవ పడ్డాను! ఎన్నెన్ని మాటలన్నాను!” తలచుకుంటుంటే గుండె పిండేసిన బాధ కలిగింది వసుంధరకి.

“కుటుంబ బాధ్యతను భుజంపై వేసుకొని, పిల్లలకి ముఖ్యంగా ఆయనకి ఏలోటూ రాకుండా చూసుకోవాలి”. “ఇప్పుడు ఋణం తీర్చుకోనే అవకాశం వచ్చిందేమో!”

"ఇక ఈ బాధని ఇక్కడితో దిగమింగి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి", అన్న ఢృఢ నిశ్చయంతో బయటికిచూస్తూ కళ్ళు గట్టిగా తుడుచుకుంది.

గిర్రున సంవత్సరం తిరిగింది. దాదాపు వారానికి ఒకసారైనా నాయుడు గారు, దాసు ఇంటికి వచ్చి చూసి వెళుతున్నారు. దాసుతో వసుంధర పడుతున్న అవస్థలను గమనిస్తూ ఉన్నారు. ఒకరోజు దాసుని చూడటానికి వచ్చిన నాయుడు గారికి "బాల్కనీలో వీలుచైరులో కూర్చున్న దాసుకి, వసుంధర నవ్వుతూ ఎదో చూపిస్తూ అన్నం తినిపిస్తుంటే, అతను రెండు చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యం” కంట తడి తెప్పించింది.

“ఈ స్థితి రావడం ఆయనకు భోగమా! శాపమా! “

"ఎంత ఎత్తులకు ఎదిగాడయ్యా! ఎంత లోతులను చూశాడయ్యా!" అంటూ వయసులో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకొన్న మనిషినే వయోధికుడయ్యేసరికి ‘నా’ అనుకున్నవాళ్ళే పనికిరానివాడిగా చూస్తారు.

అటువంటిది తను చెప్పేది తెలియక, తనకు తెలిపేది తెలియక ఒక పసిమనస్సున్న వ్యక్తిని, “పార్వతి శివుడిలో సగం” అనే భావనకు తాత్పర్యంగా, "వాక్కు - అర్ధము" అనబడే ఎడతెగని బంధంలా,

“అర్ధాంగి అంటే దేహంలోనే కాక ఆత్మలోనూ సగం కావడమే దాంపత్య రససిద్ధి” అనే నానుడికి అర్ధంలా,

"అంతరాత్మవు నీవు అఖిలంబులును నీవు, నీవు నేనటన్న భావమీవు..

“నువ్వే నేను.. నీవు నడిచిన దారి, నీవు చేరదలచిన గమ్యమూ ఇక నావి.." అని ఆత్మసాక్షిగా భర్తకి అంకితమై లోకానికి చాటి చెబుతున్న నీ అపురూపమైన ఆడజన్మ – ఎంత గొప్పదమ్మా! “

"నాతిచరామి" అన్న అతని అడుగులో అడుగు కలిపి, “అమ్మగా, ఇల్లాలుగా, భర్త రెండో బాల్యాన్ని పసిపాపలా లాలిస్తూ, అందులోనే ఆనందాన్ని చూసుకుంటున్న ఓ ధర్మచారిణీ! మీకు శతకోటి వందనాలు”, అని మనసులో వసుంధరని ప్రశంసిస్తూ లోనికి నడిచారు నాయుడు గారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ సమాప్తం^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న