దైవం మానుష రూపేణ - Krishna Kumar Bommireddipalli

Daivam Maanusha Rupena

శంకరం వాలు కుర్చీ లో కూర్చుని పేపర్ చదువు కొంటున్నాడు . రోజూ ఉదయాన్నే గంట సేపు వార్తాపత్రిక చదవటం అతని అలవాటు. ఇంతలో మొబైల్ ఫోన్ మోగింది. ఎవరబ్బా ఇంతపొద్దున్నే ఫోన్ చేస్తున్నారు అనుకొంటూ లేచి టేబుల్ మీద ఉన్న ఫోన్ ని తీసుకొన్నాడు. అవతల నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ లో ఉన్నారు. "హలో, శంకరం గారు ఉన్నారాండి" అని వినిపించింది. "ఆ, నేనే శంకరాన్ని. చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు." అన్నాడు శంకరం. "నేనండీ ఉష మాట్లాడుతున్నాను. గుర్తు పట్టారా. మీరు విశాఖపట్నం లో పనిచేసినప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించారు." వెంటనే శంకరం జ్ఞాపకాలు ఇరవై ఏళ్లకిందటికి వెళ్లిపోయాయి. అదేమిటి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది అనుకొన్నాడు శంకరం.

"నాకు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయింది. నిన్ననే చేరాను. మీ మొబైల్ నంబర్ ఆఫీస్ వాళ్ళ దగ్గరనుంచి తీసుకొని ఫోన్ చేస్తున్నాను. నేను ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను. ఇదంతా మీరు చేసిన సహాయంతోనే కదా సార్. మిమ్మల్ని కలుద్దామనుకొంటున్న సార్"

శంకరం అడ్రస్ చెప్పి వచ్చేముందర ఫోన్ చేయమని చెప్పాడు.

శంకరం ఒక పెద్ద బ్యాంకులో 35 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళ క్రితం జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాడు. అతను ఉద్యోగ క్రమంలో దేశంలో చాలా చోట్ల పనిచేసి చివరగా బొంబాయిలో రిటైర్ అయ్యాడు. ఎప్పుడు బిజీగా ఉండేవాడు. బ్యాంకులో చేరినప్పడినుంచి ఎన్నో చోట్లకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విధంగా శంకరం చాలా ప్రదేశాల్లో పని చేశాడు. నిక్కచ్చి మనిషి అని పేరు సంపాదించాడు. తన కింద పనిచేసే సిబ్బంది తో చాల స్ట్రిక్ట్ గా ఉండేవాడు. పనిని ఎప్పుడు అశ్రద్ధ చేసేవాడు కాదు. రూలు ప్రకారం నడుచుకొనేవాడు. తన కింద పనిచేసేవాళ్ళు కూడా తనలాగే ఉండాలనుకొనేవాడు. అదే సమయంలో తననుకున్నవాళ్ళకి సమర్థులైన వాళ్లకి సహాయం చేసేవాడు. అందుకే యూనియన్ వాళ్ళకి నచ్చేవాడు కాదు. ఎందుకంటె వాళ్ళవి గొంతెమ్మ కోరికలని అతని నమ్మకం. వారి ప్రమేయం లేకుండానే సిబ్బంది బాగోగులు చూసేవాడు. తాను నీతి నిజాయతి గా ఉన్నంతకాలం ఎవరికి భయపడాలిసిన అవసరం లేదనుకొనేవాడు. ఇది పై వాళ్లకి నచ్చేది. ఎక్కడికెళ్లినా శంకరానికి క్రమం తప్పకుండా ప్రమోషన్లు వచ్చేవి.

రీజనల్ మేనేజర్ గా విశాఖపట్నం లో పని చేసినప్పుడు 50 బ్రాంచీలు శంకరం అజమాయిషీ కింద ఉండేవి. ముళ్లంగి అనే గ్రామంలో ఆ బ్యాంకు బ్రాంచి ఒకటి ఉంది. అది వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రదేశం. విశాఖపట్నానికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎక్కువగా వరిపంట మరియు చెరకు ఆ ప్రాంతంలో పండిస్తారు. బ్యాంకు కస్టమర్లు 90 శాతం రైతులే. అందుకే డిపాజిట్ల కన్నా బ్యాంకులో లోన్ల శాతం ఎక్కువ. బ్యాంకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించింది. అందుకే గ్రామస్థుల పొదుపు ఖాతాలు కూడా ఆ బ్రాంచ్ లోనే ఎక్కువగా ఉన్నాయి.

ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ ఆ బ్రాంచిలో 2 -3 ఏళ్ళ కన్నా ఎక్కువ కాలం ఉండరు. బ్యాంకు రూల్ ప్రకారం 3 ఏళ్ళ వ్యవధి కాగానే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటిదాకా బ్రాంచ్ మేనేజర్లు అందరు మంచి పేరు సంపాదించారు. గ్రామంలోనే ఉంటూ గ్రామస్థులతో మమేకమై బ్యాంకు అభివృద్ధికి తోడ్పడ్డారు.

ఈ నేపధ్యం లో ఆ బ్రాంచ్ కి గోపి ట్రాన్సఫరై వచ్చాడు. అంతకుముందు అతను అనకాపల్లి బ్రాంచిలో ఆఫీసర్ గా ఉండేవాడు. గ్రామీణ ప్రాంతాల్లో అనుభవం లేదని అతని ట్రాన్స్ఫర్ ముళ్లంగికి అయింది.

గోపికి 35 ఏళ్ళ వయసుంటుంది. భార్య ఒక కొడుకు. కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. గ్రామ ప్రాంతానికి బదిలీ అవటం వలన గోపికి సమస్యలు ఎదురొచ్చాయి. ముళ్లంగి లో ఇంగ్లీష్ మాధ్యమం స్కూలు లేనందున అతను కుటుంబాన్ని తీసుకురాలేడు. బాగా అలోచించి గోపి దంపతులు ఒక నిర్ణయం తీసుకొన్నారు. రాజానగరానికి ముళ్లంగి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజానగరం పెద్దవూరు. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడినుంచి ముళ్లంగికి రోడ్ కూడా బాగుంటుంది. రోజూ ప్రయాణం సులభంగా చేయవచ్చు. గోపి ఏడాది క్రితం మోటార్ సైకిల్ కొనుకొన్నాడు. అందువలన రాజానగరం నుంచి రానూపోనూ సులభంగా ఉంటుంది. రీజనల్ ఆఫీస్ పర్మిషన్ కూడా దొరుకుతుంది.

గోపి ఓ మంచిరోజు చూసుకుని రాజానగరానికి మకాం మార్చేశాడు. ఉదయం 9 గంటలకి బ్యాంకుకు చేరుకునేవాడు. సాయంత్రం పని పూర్తి చేసుకుని రాజానగరం చేరేవాడు. కాలక్రమేణా ఇది అలవాటైపోయింది.

గోపి గ్రామస్థులని కలిశాడు. బ్రాంచి లో ఏయే పనులు జరుగుతున్నాయో గమనించాడు. బ్రాంచి కిచ్చిన లక్ష్యాలేమిటో గుర్తు పెట్టుకున్నాడు. ఇంకా పదినెలల సమయం ఈ సంవత్సరం లో ఉంది. ఈ లోపలే లక్ష్యాల్ని సాధించాలని సంకల్పించుకొన్నాడు. రెండేళ్లు బాగా పనిచేస్తే పదోన్నతి రావచ్చు. కానీ ఇది సాధ్యమా. లక్ష్యాల్ని చేరుకోవాలంటే పని వేగాన్ని పెంచాలి. ఉన్నది తను మరియు క్యాషియర్. అందుకే స్పీడు పెంచాలి. లోన్లు పెంచాలి. కొత్త గ్రామాలకు కూడా వెళ్ళాలి. రోజుకి కనీసం 10 కొత్త లోన్లు యివ్వాలి. ఈ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొన్నాడు గోపి.

రోజులు గడుస్తన్నాయి. కొత్త కొత్త కస్టమర్లు బ్రాంచి కి వస్తున్నారు. గోపి ఆశించినంత వేగంగా కాకపోయినా లోన్ల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆలా ఆరు నెలలు గడిచిపోయాయి.

ఒక రోజు ఉదయాన్నే గోపి బ్యాంకు కి చేరుకున్నప్పుడు. ఒక కొత్త వ్యక్తిని బ్యాంకింగ్ హాలులో చూశాడు. ఆ కొత్త వ్యక్తి తనని తానూగా పరిచయం చేసుకొన్నాడు. "నేను రంగారావుని. హైదరాబాద్ జోనల్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంటు నుంచి వచ్చాను. మీ బ్రాంచిని ఇన్స్పెక్షన్ చేయాలి. ఇదుగోండి ఇన్స్పెక్షన్ లెటర్" అని ఉత్తరాన్ని గోపీకిచ్చాడు. ఆలా బ్రాంచి ఇన్స్పెక్షన్ మొదలైంది. వారం రోజుల్లో ఇన్స్పెక్షన్ ముగిసింది.

ఆ రోజు శంకరం తన కేబిన్ లో కూచొని పని చేసుకొంటున్నాడు. ఇంతలో రాజారావు పరుగు పరుగున లోపలి వచ్చాడు. "సార్, కొంప మునిగింది. ముళ్లంగి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చింది. చాల భయంకరంగా ఉంది సార్. ఈ ఆరు నెలల్లో ఒక కోటి రూపాయల దాకా గోపి లోన్లు ఇచ్చాట్ట సార్. ఉత్త సొంతకాలు తీసుకుని ఇచ్చాట్ట సార్.” రాజారావు రీజనల్ ఆఫీస్ లో బ్రాంచీల ఇన్స్పెక్షన్ కు సంభందిచినవి చుస్తూఉంటాడు. "అదేమిటి, మనకి నెలనెలా బ్రాంచి రిపోర్టులు రావటం లేదా" అని శంకరం అడిగాడు. వస్తున్నాయి సార్, కాని ఈ సంగతులు రిపోర్ట్స్ లో ప్రస్తావన చేయటంలేదు అని రాజారావు జవాబిచ్చాడు. "ఇది చాల సీరియస్ మేటర్. వెంటనీ మనం తగు చర్యలు తీసుకోవాలి. రేపే మనం ముళ్లంగి బ్రాంచి కి వెళ్ళాలి. నువ్వు పర్సనల్ ఆఫీసర్ని, అగ్రికల్చరల్ ఆఫీసర్ ని మనతో రమ్మను చెప్పు. రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు బయలుదేరుదాం. డ్రైవర్ కి కూడా చెప్పు. ఈ రిపోర్ట్ కూడా తీసుకురా. వాళ్ళిద్దర్నీ నా దగ్గరకు పంపించు" అని శంకరం అన్నాడు.

పర్సనల్ ఆఫీసర్ జేమ్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ రామనాథం శంకరం కేబిన్ లోకి ప్రవేశించారు. వాళ్ళిద్దర్నీ ఉద్దేశిస్తూ శంకరం అన్నాడు "ముళ్లంగి బ్రాంచ్ విషయం తెలిసిందికదా" అవునన్నారు వాళ్ళు. "నేనొకటి నిశ్చయించుకున్నాను. రామనాథం ఆ బ్రాంచ్ కి మేనేజర్ గా వెళ్తాడు. గోపి కూడా అదే బ్రాంచ్ లో ఆఫీసర్ గా ఉంటాడు. ఆ విధంగా ఆర్డర్ తయారుచేయండి. గోపి తాను చేసిన తప్పులని సరిదిద్దుకునేదాకా అక్కడే ఉంటాడు." అని శంకరం జేమ్స్ తో అన్నాడు. వెంటనే రామనాథం కలగచేసుకుంటూ "అదేమిటి సార్. నేను రీజినల్ ఆఫీస్ కి వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ట్రాన్స్ఫర్ అంటే యెట్లా సర్. మీరే నా ట్రాన్స్ఫర్ కి హెల్ప్ చేశారు" అన్నాడు. "ఖంగారు పడకు రామనాథం. నిన్ను 6 నెలలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకంటె నీకు గ్రామీణ బ్రాంచీలలో మంచి అనుభవం ఉంది. అక్కడ పరిస్థితి చక్కబడగానే నువ్వు మళ్ళీ రీజినల్ ఆఫీస్ కి వచ్చెస్తావు. ఆ హామీ నేనిస్తున్నాను. నిన్నందరూ నా రైట్ హ్యాండ్ అంటారు కదా. ఆందోళన చెందకు." అని శంకరం, రామనాధానికి ధైర్యం చెప్పాడు. ఆ విధంగా ఆర్డర్స్ తయారు చేసి శంకరం సొంతకాలు తీసుకున్నాడు జేమ్స్.

మర్నాడు వాళ్ళు ముళ్లంగి కి బయలుదేరి వెళ్లారు. వాళ్ళు అక్కడికి బ్యాంకు ప్రారంభించటానికి ముందే చేరుకొన్నారు. ఇంకా బ్యాంకు తెరవలేదు. వీళ్ళు వెళ్లిన 15 నిమిషాలకి గోపి బ్యాంకుకు చేరుకొన్నాడు. వీళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. బ్రాంచిలో కూచున్న తరువాత జేమ్స్ ఆర్డర్ ని గోపికి అందచేశాడు. అప్పుడు శంకరం గోపితో అన్నాడు. "బ్రాంచ్ పరిస్థితి ఏమి బాగోలేదు. ఇవాల్టినుంచి రామనాథం మేనేజరుగా ఉంటాడు. నువ్వు కూడా రెండో ఆఫీసరుగా ఇక్కడే ఉంటావు. ఈ ఆరేడు నెలలలో జరిగిన పొరపాట్లని నువ్వు సరిదిద్దాలి. అర్ధమైందికదా. ప్రతి వారం నువ్వు దీని మీద రిపోర్ట్ తయారు చేసి నాకు పంపించాలి. రామనాధం అనుభవం ఉన్న ఆఫీసర్. అతను కూడా ఉంటాడుకాబట్టి నీకు కావాల్సిన సహాయం దొరుకుతుంది. నువ్వు మటుకు శ్రద్ధగా పనిచేసి చేసిన పొరపాట్లని సరిదిద్దాలి"

ఇలా నాలుగు నెలలు గడిచాయి. ఒక రోజు శంకరం తన కేబిన్ లో కూచొని పని చూసుకొంటున్నాడు. జేమ్స్ ఆదరాబాదరాగా రీజనల్ మేనేజర్ కేబిన్ లోకి ప్రవేశించాడు. "సార్ ఒక దుర్ఘటన జరిగింది. గోపి ఉదయాన రాజానగరం నుంచి వస్తూ ఆక్సిడెంట్ కి గురయ్యాడు. లారీ వచ్చి గోపి మోటార్ సైకిల్ ని గుద్దేసిందిట. తలకి బాగా గాయాలు అయ్యాయట. రాజానగరం హాస్పిటల్ లో చేర్చారు . రేపు విశాఖపట్నం తీసుకొస్తున్నారట”.

మర్నాడు 11 గంటలకి యూనియన్ సెక్రటరీ శంకరానికి ఫోన్ చేశాడు. అతను చెప్పిందేమిటంటే, గోపి ని విశాఖపట్నం హాస్పిటల్ లో చేర్చారట. పరిస్థితి సీరియస్ గా ఉంది. అది విన్న శంకరం జేమ్స్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ పదిమంది దాకా బ్యాంకు సిబ్బంది కనిపించారు. యూనియన్ సెక్రటరీ సదానందం శంకరాన్ని కలిసాడు. "సార్, పరిస్థితి ఆందోళనగా ఉంది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలిట. డాక్టర్ గార్ని కలుసుకుంటే ఆయన వివరంగా చెప్పుతాడు" వారందరు డాక్టర్ ని కలిశారు. డాక్టర్ చెప్పిన ప్రకారం వెంటనీ మెదడుకి ఆపరేషన్ చెయ్యాలి. దానికి కనీసం 2 లక్షలు అవుతుంది.

శంకరం గోపి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. తల్లి తండ్రి గోపీతోనే ఉంటున్నారు. గోపీది ఉద్యోగం మీదే ఆధార పడ్డ కుటుంబం. ఇంత ఖర్చుపెట్టే స్థోమత గోపీకి లేదని శంకరానికి అర్థమైంది. రీజనల్ మేనేజర్ అధికారం కింద బ్యాంకు ఎంత మెడికల్ సహాయం ఇవ్వచ్చు అని శంకరం జేమ్స్ ని అడిగాడు. వెంటనే ముప్ఫయ్ వేలు ఇవ్వటానికి అవకాశం ఉందని జేమ్స్ బదులు చెప్పాడు. రెండు లక్షలు ఇచ్చి పై అధికారుల అనుమతి తరువాత కోరితే యెట్లా ఉంటుంది అని శంకరం జేమ్స్ ని అడిగాడు. అది చాల రిస్క్ సార్. మీకు సమస్యలొస్తాయి అని జేమ్స్ సమాధానం ఇచ్చాడు. శంకరం ఆలోచనలో పడ్డాడు. ఇంతలో గోపి భార్య ఉష శంకరాన్నికలుసుకుంది. సార్, ఎలాగైనా మీరు సహాయం చేయాలి అని చాల బాధగా ప్రాధేయపడింది.

రెండు నిముషాలు అలోచించి శంకరం విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ కి ఫోన్ చేశాడు. "మీ దగ్గిరికి జేమ్స్ ని పంపిస్తున్నాను. గోపి సంగతి తెలుసుకదా. అతని భార్య ఉష కూడా వస్తుంది. రెండు లక్షలు రీజినల్ ఆఫీస్ ఖాతా కి డెబిట్ చేసి వాళ్ళ కివ్వండి. నేను ఆఫీస్ కి వెళ్లగానే మీకు అథారిటీ లెటర్ పంపిస్తాను”

ఈ వార్త వెంటనే అక్కడ ఉన్న బ్యాంకు సిబ్బంది కి తెలిసిపోయింది. వాళ్ళందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సెక్రటరీ ఐతే శంకరాన్ని ఎంతో పొగిడి అతని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు.

ఆఫీస్ కి వెళ్లిన తరువాత శంకరం చేసిన మొదటి పనేమిటంటే బొంబాయి హెడ్డుఆఫీసు కి ఫోన్ చేసి స్టాఫ్ డిపార్టుమెంట్ అధికారైనా నాగరాజన్ తో మాట్లాడటం. ఆయనికి అంతా వివరించి చెప్పాడు. ఇప్పుడు మనం సహాయం చేయకపోతే ఒక స్టాఫ్ కుటుంబం నష్టపోతుంది. పైగా అతనికి ఇన్సురెన్స్ కూడా లేదుట. స్పెషల్ కేసు గా దీన్ని పరిగణించాలి. నాగరాజన్ కి శంకరం అంటే అభిమానం. శంకరం ఎప్పుడు తప్పు చేయడని ఒక ధీమా. అయినా కోప్పడ్డాడు. ఇలాంటి పెద్దనిర్ణయాలు నీ అధికారం లో లేనివి యెట్లా తీసుకొంటావు అని గదమాయించాడు. పరిస్థితి అటువంటిది. నిర్ణయం వెంటనే తీసుకోవాలి. అందుకే అలా చేశాను అని శంకరం సర్దిచెప్పాడు. సరేలే జోనల్ ఆఫీస్ ద్వారా నీ ప్రతిపాదన పంపించు అని నాగరాజన్ ఫోన్ ని పెట్టేశాడు.

రెండు రోజుల తరువాత గోపి చనిపోయిన వార్త శంకరాన్ని చేరింది. ఆపరేషన్ ఫలించలేదు. శంకరం చాల బాధ పడ్డాడు. తాను రిస్క్ తీసుకుని ఇంత చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఎట్లాగైనా గోపి కుటుంబానికి సహాయం చేయాలనీ నిశ్చయించుకొన్నాడు.

రోజులు గడిచాయి. ఒక రోజు ఉదయమే ఆఫీస్ కెళ్ళటానికి తయారవుతన్నాడు శంకరం. ఏవండీ ఎవరో మీ కోసం వచ్చారని భార్య చెప్పడం వినిపించింది. ఇంత ఉదయాన్నే ఎవరొస్తారబ్బా అనుకుంటూ బయటకి వచ్చాడు. ఒక ముసలి దంపతులు, ఉష చిన్న అబ్బాయి తో కనిపించారు. శంకరానికి ధన్యవాదాలు చెప్పటానికి వచ్చారు. అతనికి చాల బాధ అనిపించింది. అదే వాళ్ళతో పంచుకున్నాడు. మాటల సందర్భంలో ఉష గ్రాడ్యుయేట్ అని తెలిసింది. బ్యాంకు లో ఒక సదుపాయం ఉంది. ఉద్యోగులలో ఎవరైనా చనిపోతే వారి భార్యకైనా లేదా పిల్లలలో ఒకరికైనా ఉద్యోగం కల్పిస్తారు. ఉషకి బ్యాంకు లో ఉద్యోగం దొరుకుతుందని అప్లై చేయమని చెప్పాడు. మామూలు పద్ధతిలో అయితే ఆలస్యం అవుతుందని, ఎంతో తొందరగా రావటానికి తన వంతు సహాయం చేస్తానన్నాడు.

ఉష అప్లికేషన్ ని తన రికమండేషన్ తో పాటు హెడ్ ఆఫీస్ కి పంపించాడు. నాగరాజన్ కి ఫోన్ చేసి చెప్పాడు వీలున్నంత తొందర్లో అప్పాయింట్మెంట్ ఆర్డర్ పంపించామని. వారం లోపలే ఉషకి క్లర్కుగా ఉద్యోగం వచ్చింది. ఆమె కోరిక ప్రకారం అనకాపల్లి బ్రాంచిలో ఉద్యోగం వేయించాడు.

ఆరు నెలలు గడిచాయి. శంకరానికి ప్రమోషన్ మీద ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడనించి ముంబై కి ట్రాన్స్ఫర్లు ఐయ్యింది. జనరల్ మేనేజర్ గా ముంబై హెడ్ ఆఫీస్ నించి 5 ఏళ్ళ క్రితం రిటైర్ అయ్యి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు.

ఉష తో మాటలాడినతరువాత గతం అంత సినిమా లాగా కళ్ళ ముందర కనిపించింది శంకరానికి.

వారం తర్వాత శంకరానికి ఉష నుంచి ఫోన్ వచ్చ్చింది. "సార్, ఇవ్వాళ ఆదివారం కదా! మిమ్మల్ని కలవటానికి వీలవుతుందా" అని ఉష అడిగింది. శంకరం వీలవుతుందని చెప్పి సాయంత్రం 4 గంటలకి రమ్మన్నాడు. చెప్పిన ప్రకారం ఉష శంకరం ఇంటికి వచ్చింది. వస్తూనే అశ్రునయనాలతో శంకరం కాళ్ళకి నమస్కరించింది. తెచ్చిన పళ్ళబుట్టని టేబుల్ మీద పెట్టింది. ఇవన్నీ ఎందుకమ్మా అని శంకరం వారించాడు.

“మీరు నాకు చేసిన సహాయం యెట్లా మరచిపోతాను సార్! మీ వలనే జీవితం లో ముందుకు పోగలిగాను. మా అయన కోసం మీరు రిస్క్ తీసుకొని ఆరోజు ధన సహాయం చేశారు. నా దురద్రష్టం కొద్దీ ఫలితం దక్కలేదు. తొందరగా నాకు ఉద్యోగం వచ్చేట్టు చేశారు. అడిగిన చోట ఉద్యోగం ఇచ్చారు. మీ అశీసులు తోనే ఈరోజు పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. మా అబ్బాయి కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి ఈమధ్యే అమెరికా వెళ్ళాడు. అక్కడ పెద్ద కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. మీరు చేసిన సహాయం రోజూ తల్చుకొంటుంటాను. మీరు మాపాలిట దేవుడు సార్” అంది ఉష. "నాదేముందమ్మా, అంతా భగవంతుడి దయ" అన్నాడు శంకరం. ఒక అరగంట సేపు ఉండి ఉష వెళ్ళిపోయింది.

శంకరానికి చాలా సంతోషంగా ఉంది. గోపి లేకపోయినా అతని కుంటుంబం పైకొచ్చిందని. తాను చేసిన పనికి మొదటిసారిగా గర్వ పడ్డాడు శంకరం.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న