ఆపదలో ఆదుకున్నవాడే రాజు.. - - బోగా పురుషోత్తం.

Aapadalo aadukunna vade raju
ఓ దట్టమైన అడవి వుంది. అందులో ఓ వృద్ధ సింహం రాజు పదవి వీడి తన పిల్ల సింహంని రారాజుగా పట్టాభిషిక్తుల్ని చేయడానికి సిద్ధమైంది. అడవంతా సందడిగా వుంది. జంతువుల హడావుడితో సింహం ఆనందంతో తన్మయత్వం చెందుతోంది. మంచి శాకాహార, మాంసాహార విందు భోజనం ఏర్పాటు చేసింది. జంతువులు ఎవరికి కావాల్సిన ఆహారం అవి ఆశగా తిన్నాయి. విందు ముగిసింది.
పూలతో అందంగా అలంకరించిన స్టేజీని ఎక్కింది పిల్ల సింహం. వృద్ధ సింహం తన తలపై వున్న కిరీటాన్ని తీసి పిల్ల సింహం తలపై పెట్టింది. జంతువులన్ని చప్పట్లు చరిచాయి.
వృద్ధ సింహం తన పిల్ల సింహంని రారాజుగా పరిచయం చేసి గొప్పలు చెప్పుకుంది.
జంతువులన్ని వృద్ధ సింహానికి కృతజ్ఞతలు చెప్పి అభినందించాయి. వెనుకనే వున్న ఏనుగు మాత్రం కృతజ్ఞతలు చెప్పలేదు. సింహం ఆగ్రహంతో చూసింది. ‘‘ ఏం నేను రారాజును..నా వారసులను రాజుగా అందరూ ఆమోదించి అభినందనలు తెలిపారు. నువ్వు మాత్రం తెలపలేదు ఏం ?’’ అని గర్జించింది సింహం.
ఏనుగు భయపడలేదు.‘‘ నీ పిల్ల బెదిరింపులకి నేను బెదిరిపోను..అసలు రాజు అంటే ఎలా వుండాలి?’’ అని ప్రశ్నించింది ఏనుగు.
సింహం మళ్లీ గర్జించి ‘‘ నేనే రాజుని.. నేను చెప్పనట్లే వినాలి..’’ అని హుంకరించింది.
ఈ సారి ఏనుగు కాస్త గొంతుపెంచింది..‘‘ రాజు అంటే జంతువుల సమస్యలు పరిష్కరించాలి..వాటి ప్రాణాలకు రక్షణ కల్పించాలి..కానీ మీ పాలనలో నా మిత్ర జంతువులకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. సమస్యల్లో ఉన్నా పరిష్కరించలేదు..అలాంటప్పుడు నువ్వు రాజుగా వుండేందుకు అర్హత లేదు..’’ అంది.
‘‘ ఎన్నో ఏళ్లుగా నువ్వు చెప్పినా, చెప్పక పోయినా ఈ అడవికి నేనే రాజును.. అందరూ నా మాటే వినాలి..’’ గర్జించింది సింహం.
ఏనుగుకు నచ్చలేదు. అక్కడి నుంచి వెనుదిరిగింది. దాని వెంటే మిగిలిన జంతువులన్ని నడిచాయి.
ఏనుగు చేసిన తిరుగుబాటుతో సింహం కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే యువరాజైన సింహం పిల్లకు ఏమి చేయాలో తెలియలేదు. దిక్కులు చూస్తుండిపోయింది.
అది గమనించిన ఏనుగు వెనక్కి చూసి ‘‘ నువ్వు రాజుగా కొనసాగాలంటే మా జంతువులకు ఏ కష్టం నష్టం వచ్చినా ఆదపలో ఆదుకోవాలి.. అప్పుడే నిన్ను రాజుగా అంగీకరిస్తాం..!’’ అని చెప్పి విసురుగా వెళ్లిపోయింది ఏనుగు.
ఇప్పుడు అడవిలో జంతువులన్ని తమతమ దారిన స్వేచ్ఛగా తిరగసాగాయి. కొన్నాళ్ల తర్వాత వేసవి కాలం వచ్చింది. ఎండకు అడవిలో నీటి జాడ కరువైంది. జంతువులన్ని ఆకలి తీర్చుకోవడానికి ఆహారం దొరుకుతున్నా నీటి కొరతతో దాహం వేసింది. అడవి అంతా గాలించినా చుక్క నీరు కూడా కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో మంచం పట్టిన సింహం రాజుకు తీవ్ర దాహం వేసింది. నీరు దొరక్కుండా అల్లాడిరది. జంతువులన్ని సింహం దగ్గరకు వెళ్లి ‘‘ నువ్వు మా రాజువి కదా..! తాగునీరు లేక అల్లాడిపోతున్నాం.. మా సమస్యను వెంటనే పరిష్కరించండి రాజా..’’ అని వేడుకున్నాయి.
మంచం పై వున్న సింహం ‘‘ పైకి లేవలేని వయసులో నేను ఏమీ చేయలేను.. దయచేసి నా ప్రాణం కూడా పోయేలా వుంది..దయచేసి గుక్కెడు నీరు తెచ్చి నా గొంతులో పోసి నా ప్రాణం నిలబెట్టండి.. మీకు రుణపడి వుంటా..!’’ అని వేడుకుంది వృద్ధ సింహం.
‘‘ ఇన్నాళ్లు జంతువులపై నీవు రాజుగా పెత్తనం చెలాయించి వెంటాడి వేటాడి ప్రాణాలు తీసి భయపెట్టించావు.. ఇక నీ ఆటలు సాగవు..నీ పాపాలు ఊరికే పోవు..!’’ అంది ఏనుగు.
జంతువులన్ని ఏనుగు వైపు చూసి ‘‘ గజ రాజా.. నీళ్లు లేక అందరి నోళ్లు ఎండిపోతున్నాయి.. ఏం చేద్దాం?’’ ప్రశ్నించాయి.
‘‘ నా వెంట రండి..’’ అని గజరాజు దూరంగా వున్న మడుగు వద్దకు తీసుకెళ్లింది. ఎండిపోయిన గుంతలో పెద్ద గోతిని తవ్వాయి. గజరాజుకు జంతువులన్ని ఐక్యంగా సహకరించాయి. రెండు రోజుల తర్వాత వంద అడుగుల గోతి తవ్వేశాయి. నీటి జాడ కనిపించింది. ఇంకా లోతుగా తవ్వాయి. నీళ్లు పుష్కలంగా లభించాయి. వాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
‘‘ నువ్వే మా రాజు..’’ అంటూ గజరాజును భుజాలపైకెత్తి ఊరేగింపుగా వృద్ధ సింహం వద్దకు తీసుకెళ్లాయి..
కొన ఊపిరితో వున్న వృద్ధ సింహం గొంతులో జంతువులు నీళ్లు పోశాయి. పోతున్న ప్రాణం లేసి వచ్చింది. కళ్లు తెరచి పైకి లేచి కూర్చుంది.
‘‘ మీరు అన్నట్లు ఆపదలో ఆదుకున్న వాడే రాజు..ప్రాణాపాయ స్థితిలో వున్న నన్ను గొంతులో నీళ్లు పోసి కాపాడారు.. మీకు జీవితాంతం రుణపడివుంటాను..రాజుగా నేను చేయాల్సిన పనిని నీవు చేసి రాజు పదవికి అర్హత పొందావు..ఇన్నాళ్లు రాజు అనే గర్వంతో జంతువులన్నింటిని కబళించి ఆకలి దాహం తీర్చుకున్నాను.. నా పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం తీర్చుకుంటాను..నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను..’’ అని కన్నీరు కార్చింది వృద్ధ సింహం.
‘‘ ఇక నుంచి నువ్వే అడవికి రారాజు..’’ అంటూ తలపై వున్న కిరీటాన్ని గజరాజుపై ఉంచి జేజేలు పలికింది పిల్ల సింహం. పక్కనే వున్న జంతువులన్ని ఆనందంతో చప్పట్లు చరిచాయి.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న