అంధకాసురుడు
పురాణ గాథలు-6
-1-
పూర్వం ఒకప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు జగన్మాత పార్వతీదేవితో కలిసి కైలాసాన్ని విడిచి పవిత్రమైన కాశీనగరానికి వచ్చాడు. శివపార్వతులు మందరపర్వత ప్రాంతంలో వనవిహారం చేసి సరససల్లాపాలలో ములిగిన సమయంలో పార్వతి సరదాగా తన చేతి వేళ్ళతో శంకరుని కన్నులను మూసింది. ఒక్కసారిగా విశ్వమంతటా చీకటి ఆవరించింది. శివుని స్పర్శతో ప్రేమభావం పుట్టి గిరిజాదేవి అరచేతి యందు మదజలం ఉద్భవించింది. ఆ జలం శంకరుని పాలభాగానికి తగిలి ఒక పెద్ద బిందువు రూపంలో జారి క్రింద పడింది. దాని నుండి అతి భయంకరుడు, వికృతరూపం కలవాడు, నల్లనివాడు, గ్రుడ్డివాడు అయిన ఒక బాలుడు పుట్టాడు. పుట్టిన వెంటనే గట్టిగా ఏడవడం మొదలెట్టాడు.
ఆ ఏడుపును విన్న పార్వతి ‘ఎవడీ బాలుడు’ అని తన నాథుణ్ణి అడిగింది. “సతీ! నీ స్పర్శ నుండి ఉద్భవించిన ఈ బాలుడు నీ కుమారుడే. వీడిని రక్షించు” అని చెప్పాడు శంకరుడు. పార్వతి ఆ బాలుడికి ‘అంధకుడు’ అని నామకరణం చేసి చెలికత్తెల సాయంతో జాగ్రత్తగా పెంచ సాగింది.
-2-
కశ్యపుని కుమారుడైన హిరాణ్యాక్షుడికి పిల్లలు లేరు. భార్య సలహాతో సంతానం కావాలని శివుని గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. “స్వామీ! నాకు ఉత్తమమైన పుత్రుణ్ణి ప్రసాదించు” అని కోరాడు. అందుకు శివుడు “నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు. కాని నీ తపస్సుకు మెచ్చి మా దంపతులకు పుట్టిన అంధకుడు అనే కుమారుణ్ణి నీకు దత్తత ఇస్తున్నాను. నీ కుమారునిగా పెంచుకో” అని చెప్పాడు. హిరణ్యాక్షుడు ఆనందంగా శివపుత్రుణ్ణి తీసుకొని వెళ్ళి ‘అంధకాసురుడు’ అనే పేరుతో ప్రేమగా పెంచుకో సాగాడు. హిరణ్యాక్షుడు పుత్రప్రాప్తి కలిగిన గర్వంతో దేవతలను జయించి చివరకు రసాతలంలో వరహావతారంలో ఉన్న శ్రీహరి చేతిలో మరణించాడు.
హిరణ్యాక్షుడు చనిపోయిన తరువాత అతని సోదరుడు హిరణ్యకశిపుణ్ణి, శ్రీహరి నరసింహస్వామిగా అవతరించి చంపాడు. రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుణ్ణి రాజుగా చేశాడు. ప్రహ్లాదుని సోదరులు అంధకాసురుని గుడ్డివాడు అని పరిహసించి అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకొన్నారు. బాధతో అంధకుడు అడవికి వెళ్ళి ఒంటి కాలిపై నిలబడి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కరించ లేదు.
అప్పుడు మరింత పట్టుదలతో తన శరీరం నుండి మాంసాన్ని కోసి సమర్పించి యజ్ఞం చేశాడు. చివరకు నరాలు, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ కఠోర తపస్సుకు అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించడం మొదలెట్టాయి. దేవతలు అంధకుని తపస్సును ఆపి తమను రక్షించమని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. విథాత అంధకుని ముందు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు.
“స్వామీ! ముందుగా నాకు దృష్టిని ప్రసాదించు. నా రాజ్యం నాకు తిరిగి దక్కాలి. నన్ను నిందించిన నా సోదరులు నా సేవలు చేయ్యాలి. వీటిని సాధించే బలప్రతాపాలు నాకియ్యి. నాకు ఎప్పటికీ చావు లేకుండా వరం ఇయ్యి” అని అంధకాసురుడు బ్రహ్మదేవుడిని కోరాడు.
“వత్సా! ఈ చరాచర జగత్తులో చావు అనేది సహజం. చావు లేకుండా నేను వరం ఈయలేను. మరణానికి ఏదో ఒక కారణం స్వీకరించు. నీ మిగిలిన కోర్కెలన్నీ నెరవేరుతాయి” అని చెప్పి బ్రహ్మదేవుడు అంధకాసురుని దేహాన్ని చేతితో నిమిరాడు. వెంటనే అంధకాసురుడు సుందర రూపం, ఆరోగ్యమైన శరీరం పొందాడు. కన్నులకు చూపు వచ్చింది.
అప్పుడు అంధకాసురుడు “పితామహా!అయితే విను. తల్లి వలె పూజింప తగినది, మూడు లోకాల్లోను అతి శ్రేష్టమైనది, గొప్ప సౌందర్యం కలది అయిన స్త్రీని నేను కోరినప్పుడు నాకు రాజ్యం పోయి మరణం కలుగేటట్లుగా వరమియ్యి” అని అడిగాడు. ఆ విచిత్రమైన కోరికకు ఆశ్చర్యపోయిన బ్రహ్మ ఈశ్వరుని మనస్సులో ఒక్కసారి తలచి ఆయన అనుమతితో అంధకుడు కోరినట్లుగా వరం ప్రసాదించాడు.
-3-
అంధకుడు నగరానికి తిరిగి వచ్చి తన సోదరులను వశం చేసుకున్నాడు. శత్రువులను జయించి రాజ్యాన్ని తిరిగి పొందాడు. అందమైన యువతులను తన అంతఃపురంలో చేర్చి వారితో క్రీడించసాగాడు. ఒకనాడు తన పరివారంతో సుందరమైన మందర పర్వత ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లి విడిది చేశాడు. అంధకుని మంత్రి ఒకడు ఆ పర్వత ప్రాంతంలో తిరుగుతూ ఒకచోట పార్వతీ పరమేశ్వరులను చూశాడు. తిరిగి వచ్చి అంధకునికి పార్వతి సౌందర్యాన్ని వర్ణించి చెప్పాడు. చివరగా “ప్రభూ! అంతటి అందమైన స్త్రీకి నీవే సరియైన నాయకుడవు” అని చెప్పి అంధకునిలో చెడు ఆలోచన కలిగించాడు.
అంధకుడు మదగర్వంతో పార్వతిని తనకు అప్పగించమని లేదా తనతో యుద్ధం చేయమని శివుడికి వర్తమానం పంపాడు. దానికి ఆగ్రహించిన రుద్రుడు మండిపడి పోరుకు సిద్ధమని దూతను పంపివేశాడు. రాక్షసులు సైన్యాన్ని సమీకరించుకొని శివుని పై యుద్ధానికి కదిలారు. రుద్రుడు కూడా తన రుద్రగణాలతో, సకల దేవతా సమూహంతో యుద్ధానికి సన్నిద్ధుడయ్యాడు. రాక్షస సైన్యం మందరగిరి ముఖద్వారాన్ని బ్రద్దలు కొట్టి పార్వతి కొరకు కొండ గుహల్లో వెదకసాగారు. దేవతలు అలా వచ్చిన రాక్షసులను సంహరించ సాగారు. ప్రథమ విజయం శివసేనకే లభించింది.
-4-
భృగువంశంలో జన్మించిన భార్గవుడు పూర్వం కాశీ నగరానికి వెళ్ళి గంగాతీరంలో ఒక శివలింగం స్థాపించి భక్తితో అర్చిస్తూ తపస్సు చేసాడు. ఈ విధంగా అయిదు వేల సంవత్సరాలు ఆరాధించినా శంకరుడు ప్రత్యక్షం కాలేదు. అపుడు కాలిన ఊక నుండి వచ్చే పొగను పిలుస్తూ వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడైన ప్రత్యక్షమయ్యాడు. అపుడు పరమానందంతో శివుని స్తుతించాడు.
శివుడు సంతృప్తి చెంది ఇలా అన్నాడు. “ఓ భార్గవా! నువ్వు పవిత్రుడవు. కాశీ నివాసం చేత నిన్ను నా ఇద్దరు పుత్రులతో సమానంగా చూస్తాను. భవిష్యత్తులో నీవు నా ఉదరంలో ప్రవేశించి పుత్రరూపంలో జన్మించగలవు. భూలోకంలో నువ్వు ఉదయించిన కాలంలో మానవుడు ఏ శుభ కార్యాలు చేసినా అవి సఫలమవుతాయి. కాశీలో నువ్వు స్థాపించిన శివలింగం శుక్రేశ్వరుడు అనే నామంతో ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు నీకు చనిపోయినవారిని తిరిగి బ్రతికించగల మృతసంజీవని విద్యను ఉపదేశిస్తున్నాను” అని వరాలిచ్చాడు. శుక్రుడు సంతోషంతో తన నివాసాన్ని చేరుకున్నాడు.
-5-
అంధకుడు రాక్షస గురువైన భార్గవుని చెంతకు వెళ్ళి మృతసంజీవని విద్యతో చనిపోయిన రాక్షస వీరులను బ్రతికించమని ప్రార్థించాడు. భార్గవుడు శంకరుని మదిలో తలంచి, శరణాగత ధర్మంతో చనిపోయిన రాక్షస వీరులను బ్రతికించాడు. వారు నిద్రలో నుండి లేచినట్లుగా లేచి రుద్రగణాలతో మరల యుద్ధం చేయసాగారు. ప్రమథగణాలు ఏమి చెయ్యాలో తెలియక నందీశ్వరుని ద్వారా శివునికి ఈ విషయాన్ని తెలిపారు. శివుడు నందీశ్వరునికి తగిన బలాన్ని అనుగ్రహించి భార్గవుని ఎత్తుకొని రమ్మని పురమాయించాడు. నందీశ్వరుడు భార్గవుని తన కొమ్ముల మధ్య ఇరుకించుకొని క్షేమంగా రుద్రుని వద్దకు తెచ్చాడు. శివుడు భార్గవుని రెండు వ్రేళ్ళతో ద్రాక్షపండు వలె పట్టుకొని నోటిలో వేసుకొని మ్రింగి వేశాడు.
శంకరుడు భార్గవుని మ్రింగివేయగా దానవుల ప్రతాపం సన్నగిల్లింది. అంధకుడు తన సైన్యాన్ని ఎంత ప్రోత్సాహించినా దానవ వీరులు ప్రమధగణాల తాకిడికి తట్టుకోలేక పోయారు. శివుని గర్భంలో ఉన్న భార్గవుడు సుడులు తిరుగుతూ ఎంత వెదికినా బయటకు వచ్చే మార్గం కనపడలేదు. కాని బయట జరుగుతున్న యుద్ధం అతనికి శివుని ఉదరంలో కనిపిస్తోంది. అలా వంద సంవత్సరాలు గడిచినా బయటకు వచ్చే దారి తెలియలేదు. చివరకు భార్గవుడు శివమంత్రాన్ని జపించి శుక్ర రూపాన్ని ధరించి శివుని ఉదరం నుండి లింగ మార్గం ద్వారా బయట పడ్డాడు. బయటకు వచ్చాక మరల శివుని స్తుతించాడు.
ఇలా స్తుతించిన భార్గవుని చూసి శివుడు సంతోషించి “పుత్రా! నీవు నా లింగం నుండి శుక్రరూపంలో బయట పడ్డావు. కావున నీవు ఇప్పటి నుండి ‘శుక్రుడు’ అనే పేరుతో పిలువబడతావు. నిన్ను నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను. నీకు ఇకపై చావు పుట్టుకలు లేవు” అని వరమిచ్చాడు. పార్వతి కూడా ఆయనను కుమారుడిగా స్వీకరించింది.
-6-
అక్కడ యుద్ధరంగంలో అసురులందరూ పారిపోయినా, అంధకుడు మాత్రం ఒంటరిగా పరాక్రమంతో పోరాడసాగాడు. తన శరీరం నుండి స్రవించి రాలిపడ్డ ప్రతీ రక్తపు బొట్టు నుండి మరొక అంధకుడు పుట్టేలా మాయాప్రయోగం చేశాడు. విష్ణుమూర్తి దీనిని గ్రహించి వికృతముఖం గల శక్తిరూపం ధరించి శివుని చెవి నుండి ఉద్భవించాడు. అంధకుని శరీరం నుండి రాలే ప్రతీ రక్తపు బొట్టును క్రింద పడకుండా పానం చేశాడు. దానితో అంధకుడు ఒక్కడే శుష్కించిన శరీరంతో అస్తిపంజరంలా మిగిలాడు.
ఇంక ఆలస్యం చేయకుండా రుద్రుడు త్రిశూలాన్ని వాని గుండెల్లో గుచ్చి ఆకాశంలోకి నిలబెట్టాడు. వాని శరీరం సూర్యకిరణాలతో వేడెక్కినా అంధకుడు శివుని స్మరిస్తూనే ఉన్నాడు. శివుని నూట ఎనిమిది నామాలను మూడు వేల సంవత్సరాలు నిర్విఘ్నంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. దానికి ప్రీతి చెందిన శంకరుడు అంధకుణ్ణి శూలం పైననుండి దించి “ఓ దానవరాజా! నీ ధైర్య సాహసాలకు మెచ్చాను. శూలం మీద ఉన్నా నా నామాన్ని ధ్యానిస్తూనే ఉన్నావు. దీనితో నీ పాపాలన్నా నశించాయి. ఏ వరం కావాలో కోరుకో” అన్నాడు.
ముక్కంటి మాటలకు ఎంతో ఆనందించిన అంధకుడు మోకాళ్ళపై నిలబడి చేతులు జోడించి ఇలా అన్నాడు. “స్వామీ! నేను పూర్వం పలికిన మాటలను మనస్సులో పెట్టుకో వద్దు. నేను మూఢుడైన లోకమాతయైన పార్వతీదేవి విషయంలో చెడుగా ఆలోచించాను. నీ భక్తుడను. నా తప్పులను మన్నించి రక్షించు.”
పార్వతీ దేవితో “మాతా! జగజ్జననీ! ఆ నాడు ఈ అర్భకుని చేరదీసి పెంచింది నీవే. మరల దానవునికి అప్పగించి నన్ను దూరంగా పంపినదీ నీవే. ఈ నాడు నాకు పునర్జన్మ పఇవ్వండి” అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అంధకుని ప్రసన్నంగా చూశాడు. పార్వతి వానిని దగ్గరగా తీసుకొని శిరస్సు నిమిరింది. శివుడు అంధకుణ్ణి గణాధ్యక్షుడుగా నియమించాడు.
శివుని ఉదరంలో ఉండి శుక్రుడు జపించిన శివమంత్రాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో చదువుతారో, వింటారో వారికి మృత్యుభయం తొలగుతుంది.
*శుభం*