విజయపురంలో నందనుడనేవాడు ఉండేవాడు.అతను కొంతవరకూ చదువుకున్నాడు.వ్యవసాయం పనులు చూస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉండేవాడు.నందనుడికి చిన్నతనం నుంచీ చిత్రలేఖనం అంటే మక్కువ. చదువుకునే వయస్సులో చిత్రకళను కూడా అభ్యసించా డు. చదువు మానుకున్న తర్వాత కూడా సమయం దొరికినప్పుడు మనసుకు నచ్చిన చిత్రాలు గీసేవాడు.నందనుడికి పరిశీలనా శక్తి ఎక్కువ,ఉషోదయం వేళ ఉదయించే సూర్యున్ని,సంధ్యా సమయంలో అస్తమించే సూర్యబింబం అందాలను, నక్షత్రాల మధ్యన వెన్నెలను చిందించే చంద్రబింబాన్ని, కొండలను, కోనలను, జలపాతాలను, రకరకాల పక్షులను, పువ్వులను ప్రకృతిలోని అనేక అందాలను చిత్రించేవాడు. ఒకసారి రాజు హోలీ పండుగ సందర్బంగా చిత్రలేఖనం పోటీలను ఏర్పాటు చేశాడు. నందనుడు తల్లిదండ్రులు, మిత్రుల ప్రోత్సాహంతో పోటీలో పాల్గొన్నాడు. చిత్రకళలో చెయ్యి తిరిగిన చిత్రకారులు పోటీలో పాల్గొన్నారు. నందనుడు వారి ముందు నిలువలేకపోయాడు. ఏ బహుమ తీ రాలేదు. నిరాశతో ఊరు చేరుకున్నాడు. తన కళను మెరుగు పర్చుకుంటూ ప్రతి సంవత్సరం పోటీలో పాల్గొంటున్నాడు. ఏ బహుమతీ రావడంలేదు. నాలుగవ సంవత్సరం హోలీ సందర్బంగా రాజు నిర్వహించబోతున్న పోటీలకు నందనుడు పేరు నమోదు చేసుకోలేదు. తల్లిదండ్రులు,మిత్రులు కారణం అడిగారు. "పోటీకి వెళ్లడం ఎందుకు?ఓటమితో బాధపడటం ఎందుకు? పాల్గొనకుంటే ఏబాధా ఉండదుకదా!" అన్నాడు. "పోటీలో పాల్గొని ప్రయత్నిస్తే గెలవడానికి అవకాశముంది.పాల్గొనకుంటే ఓటమే కదా! ప్రయత్నించి విఫలమవడం ఓటమి కాదు. మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి. మళ్లీ మళ్లీ కృషితో ప్రయత్నించే వారినే గెలుపు వరిస్తుంది"అన్నారు తల్లిదండ్రులు. "ఓటమి నుంచి నేర్చుకోవలసింది నిరాశ కాదు,పట్టుదల.విజయానికి ఓర్పే అత్యున్నత సాధనం. ఓటమి ఎదురయ్యే కొద్ది పట్టుదల, కృషి పెంచుకోవడం విజేత లక్షణం.మొదట్లోనే ఏవ్యక్తి తన రంగంలో ప్రముఖుడు కాలేడు. ప్రయత్నించి, ప్రయత్నించి సాధించాలి. మళ్లీ ప్రయత్నిం చు. నీకొచ్చే నష్టం ఏముంది?" అన్నారు మిత్రులు.వారి మాటలతో ప్రేరణ పొందాడు. పేరు నమోదు చేసుకుని పోటీలో పాల్గొన్నా డు.ఆపోటీకి న్యాయనిర్ణేతగా చిత్రకళలో సుప్రసిద్దుడయిన గురువు ఋగ్వేదుడు వ్యవహరించాడు.ఆయన వరుసగా చిత్రాలను పరిశీలిస్తూ వివరాలు వ్రాసుకుంటూ వస్తున్నాడు. చివరలో పేరు నమోదు చేసుకోవడం వల్ల నందనుడి చిత్రం చివరలో ఉంది. ఋగ్వేదుడు నందనుడి చిత్రం దగ్గరకు వచ్చాడు. ఒక పెద్ద కాన్వాసుపై దశలవారీగా గిజిగాడి గూడు నిర్మాణం చిత్రించబడి ఉంది.మొదట కొమ్మపై గిజిగాడు పిట్ట ఉంది. తర్వాత చిత్రాల్లో గూడుకు అవసరమైనవి సమకూర్చుకుంటూ గూడును అల్లుతోంది. గూడు నిర్మాణం దశలవారీగా ప్రతిభావంతంగా సహజత్వం ఉట్టిపడేలా చిత్రించబడి ఉంది. గిజిగాడు అందమైన గూటిలో కూర్చుని ఊయలలాగా ఊగుతూ ఆనందంగా ఉంది. చివరి చిత్రంలో గూడును చెల్లాచెదురు చేస్తున్న అల్లరి పిల్లలున్నారు. ఋగ్వేదుడు నందనుడి చిత్రానికి ప్రథమ బహుమతి ప్రకటించి అభినందించాడు. "ఈచిత్రానికి ప్రథమ బహుమతి ప్రకటించడానికి కారణం సభికులకు చెప్పండి" అన్నాడు రాజు. "మహారాజా! గిజిగాడు చిన్నపిట్ట. తెలివైన వారిగా కొనియాడబడుతున్న మనుష్యు లము కూడా ఆగూడును అల్లలేము. అలాంటి కష్టమైన గూటి నిర్మాణాన్ని దశలవారీగా సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించడమంటే మాటలు కాదు.ఎంతో ఓర్పుతో, ఏకాగ్రతతో, ఎంతో కాలం కష్టపడి పరిశీలిస్తే తప్ప గీయడం చాలా కష్టం. అలాంటి పని నందుడు చేశాడు. అంతేకాకుండా ఈ చిత్రం కింద 'ఎవరికీ మేలు చేయకున్నా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకు' అనే వాక్యం వ్రాసాడు. పక్షులు ఎంతో శ్రమపడి తలదాచుకోవడాని కి గూటిని కట్టుకుంటాయి. మనలో ఆ గూళ్లను పట్టుకెళ్లే వాళ్ళు, పడగొట్టే వాళ్లు న్నారు. సమాజంలోఎదుటివాడి అభివృద్దిని చూసి ఓర్వలేక వాడిని పతనం చేయడానికి పథకాలు పన్ని కీడుచేసే వాళ్లున్నారు. అలాంటి అవలక్షణం మంచిది కాదనే సందేశం ఈచిత్రం ద్వారా నందుడు సమాజానికి ఇచ్చాడు.అందుకే ఈచిత్రానికి ప్రథమ బహుమతిప్రకటించాను "అని వివరించాడు ఋగ్వేదుడు. నందుడిని తల్లిదండ్రులు, మిత్రులు అభినందిస్తుంటే "'ప్రయత్నించి విఫలమవ డం ఓటమి కాదు. ప్రయత్నించక పోవడమే ఓటమి' అని నాకు మీరు ఇచ్చిన ప్రేరణే ఈనాటి విజయం" అన్నాడు నందనుడు.