అప్పుడే తెల తెల వారబోతోంది. సూరీడు రోమాలను నిక్కపొడుచుకొని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకొచ్చి చూస్తున్నాడు. మా మొబైల్ క్లినిక్ తారు రోడ్డు పై సర్రు మని దూసుకొని పోతున్నది.... కడప దగ్గర ఒక పల్లె మీదుగా. డెంగు ఫీవర్ తో పల్లెలన్ని గడగాడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజి కి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మేడికోస్ అయిన మమ్మల్ని ఇలా పల్లెలకి పంపారు. కుర్రకారంతా ఆనందముతో కొత్త సినిమా పాటలకు లయబద్దంగా హం చేస్తూ ఊగుతున్నాము. మా డ్రైవర్ కూడా కుర్రాడు కావడం మూలాన ఒడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు.
గత వారం నుండి మేము, మా లేడీ డాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ ని తిప్పుతున్నాము. ఉన్నట్లుండి మా డ్రైవర్ గావుకేక పెడుతూ మా వెహికల్ ని ఒక్క కుదుపుతో ఆపాడు. అలా చూద్దుము కదా, ఒక ముసల్ది రోడ్డుమీద ప్రాణం లేనట్లు పడి ఉంది. మాకందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. మా డ్రైవర్ గావు కేకలు పెడుతూ... ఒక్కసారిగా కిందకు దూకి, ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండి దొరికిందా అని తిడుతున్నాడు.
అతను మా వైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండిని నడుపుతున్నప్పటికీ ఈ ముసల్ది ఒక్కసారిగా రోడ్డుమీదకురికిందని చెప్పాడు. ఆమెకు గాయాలు లేనప్పటికీ సృహ తప్పి పడి ఉంది. వెంటనే ఆమెను మా మొబైల్ క్లినిక్ లోనికి మార్చమని నా స్నేహితులతో చెప్పాను. నేను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె తలను నా ఒడిలోనికి తీసుకుని ఆమె పల్స్ చూస్తూ కొంచెం వాటర్ తీసుకుని ఆమెపై చల్లాను. నెమ్మదిగా ఆమె కళ్ళు తెరిచి చూసి మమ్మల్ని చూసి భయపడుతూ లేవబోయింది. ఆమె పల్స్ చాలా తక్కువగా ఉండటం మూలాన ఆమె కొద్ది రోజులుగా ఆహారం తీసుకోలేదని గ్రహించి ఆమెను లేవవద్దని చెప్పి సలైన్ ఎక్కించాము. మరో మూడు గంటల తర్వాత ఆమె లేచి కూర్చున్నది. ఆమెకు మా దగ్గర ఉన్న పళ్ళ జూస్ ని కొంచెం కొంచెం తాపాము. ఆహారంతో ఆమె కొంచెం శక్తీ పుంజుకున్నది.
మా వాళ్ళందరూ మేము చేరవలసిన ఊరు రాగానే తమ తమ కిట్లతో అక్కడ ఎదురుచూస్తున్న పేషంట్లను చూడటం మొదలుపెట్టారు.సీరియస్ కేసులన్నీ ముగించుకొని, మిగిలినవారిని మరుసటి దినం పక్క పల్లెకి వస్తామని అక్కడికి రమ్మని చెప్పి పంపాము. చీకటి పడటం మొదలు పెట్టింది. ఇక ఆ రోజుకి పేషంట్లను చూడడం ఆపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మా వాన్ ఎక్కగానే ఆ ముసలమ్మ ఇంకా అక్కడే కూర్చుని ఉంది.
అమ్మా "నీవెక్కడకి వెళ్ళాలి" అని అడిగితే ఆమె తానొక అనాథను తనకు ఎవ్వరూ లేరని, తనకు గమ్యం లేదని చెప్పింది. "నాయనా నన్ను అదిగో అక్కడ కనిపిస్తున్న కొండ పక్కన గుడి దగ్గర దిగబెట్టండి" అన్నది. తానూ అక్కడ దొరికే బిచ్చంతో బతుకుతున్నానని చెప్పింది. చూడడానికి ఆమె చాలా పొడవుగా ఈ వయసులో కూడా నిటారుగా తెల్లటి చాయతో ఉంది.
ఆమెను తీసుకుని వెళుతూ మా తిరుగు ప్రయాణంలో నాకున్న జిజ్ఞాసతో ఆమె గురించి తెలుసుకోవాలన్న తలపుతో "అమ్మా నిన్ను చూస్తుంటే నాకెందుకో ఊరిలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తున్నాది"అని అన్నాను. ఆమె నవ్వుతూ "నాయనా నేను ఒక దురద్రృష్టవంతురాలిని. నా కన్నబిడ్డకు లేని ప్రేమ నీకు నామీద కలిగిందంటే అది నా మీద ఆ దేవుని దయ" అంది.అమ్మా నీకెంత మంది పిల్లలని అడిగితే "నాకు ఏడు మంది పిల్లలు నాయనా"అంది.మా మాటలు ఆసక్తి పుట్టించడముతో నా తోటి స్నేహితులు కూడా వినసాగారు.
మరి అంతమంది పిల్లలుండి నీవెందుకు అనాథవయ్యావు అని అడిగితే "పూర్వజన్మ ప్రారబ్దం, ఈ జన్మ ప్రాపకం"................ అని అన్నది.నాయనా...."కొడుకు కొడుకంటూ నేను ఆరుగురు ఆడపిల్లలను కన్నాను, ఆ తరువాతే నా కలల పంట పుట్టాడు"."లేక లేక పుట్టాడని వాడిని కాలు కింద పెట్టనీయకుండా పెంచాను". "మారాజు మా ఆయన అప్పటికి అంటూనే ఉండేవాడు... వాడిని అతి గారాబం చేసి చెడగొట్ట మాకే" అని.నేను వింటేనా............!!!
మా ఆయన మండలానికే పెద్ద డాక్టర్ కావడం మూలాన మాకు డబ్బుకు లోటు లేకుండే. మా చుట్టుపక్కల పల్లెలలో ఉంటున్న మా ఆడబిడ్డల పిల్లలు కూడా మా కాడ ఉండి స్కూల్కి పోతా ఉండిరి. మా ఆయనది పెద్ద సర్కారు ఉజ్జోగం కావడం వలన అందరూ నా మాటకు ఎదురుచెప్పేటోళ్ళు కాదు. నేను వస్తా ఉంటేనే ఊరు ఊరంతా ఆ మారాజు భార్య వత్తన్నారని నన్ను గౌరవించేటోళ్ళు. నా ఒడ్డూ పొడుగూ చూసి, మంచి మామిడి పండు రంగు తేలి ఉన్న నా ఒళ్ళు చూసి... చదువు లేకపోయినా మా అత్తగారు ఏరికోరి నన్ను కోడలిగా చేసుకున్నారు.అమ్మ మాటకు ఎదురు చెప్పని మా ఆయన్ని నా మాట వినేటట్టు చేసుకున్నాను నేను కొద్ది రోజుల్లోనే.వరుసగా బిడ్డలను కంటా ఉంటే కూడా నా వయస్సు కరగకుండే. అది నాకింకా గర్వాన్ని పెంచింది.చేతినిండా డబ్బులు ఆడతా ఉండె. ఇంటిని సంసారాన్ని నువ్వే చూసుకోవే అంటూ నా చేతికి డబ్బులు ఇచ్చేటోడు నా మారాజు.మా అత్తని చిల్లిగావ్వలా తీసిపారేసినా. నా బిడ్డలకి ఆమెను ఆయాను చేసినా....తన కొడుకు పెండ్లాము చెప్పినట్లు ఆడుతున్న యవ్వారం ఆమె కనిపెట్టినా పాశాన్ని వదులుకోలేక నే చెప్పినట్టు వినేది.
నలుగురు ఆడుబిడ్డలకు, ఆళ్ళ పెండ్లిళ్ళ పెట్టుపోతలకు, పండగలకి కొత్త బట్టలు తీయమని మారాజు డబ్బులు ఇస్తే, నేను నాసిరకం బట్టలు కొని వాళ్ళ మొకాన వేసేదాన్ని. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు మా ఇల్లు పది రోజుల ముందే పండగ కళ తో కళకళ లాడిపోయెది.మారాజు పండగకి ముందే నలుగురు అడుబిడ్డలు ఆళ్ల మొగుళ్ళు ఇంకా బిడ్డలకు కొత్త బట్టలు పెట్టి చేతికి పైసలు కూడా ఇచ్చే వాడు పై ఖర్చులకు అంటూ.నా కూతుర్లు పట్టు పావడ తో ఒంటినిండా నగల తో ఆడుతూ పాడుతూ ఇంటి లో తిరిగేవారు...అత్రాసాలు,పప్పుబిళ్ళలు,లడ్డూలు,మురుకులు,సున్నుండలు, రవ్వ లడ్డు అబ్బో ఎన్నెన్నో వంటలు...కారం దోశ,ఎర్ర కారం,పితుకు పప్పు,రాగి సంగటి,చికెన్ బిర్యాని,నాటుకోడి పులుసు, మసాలా మటన్,కొరమీను ఫ్రై....ఇంకా ఎన్నో మారాజు దగ్గరుండి చేయించి ఇంటి లోని వారికే కాకుండా హాస్పిటల్ స్టాఫ్ కి కూడా ఇంకా తినండి అంటూ కొసరి కొసరి వడ్డించేవాడు....పండుగ రోజులలో. "నీ చేత్తో చేసిన పులగం గోంగూర పచ్చడి అమృతం బంగారమ్మ" అని నన్ను మెచ్చుకునే వాడు మారాజు. ఇక "సేమియా సెనగపప్పు సగ్గుబియ్యం కమ్మగా నేతిలో వేయించిన జీడపప్పు ఏలకులు" వేసి నేను చేసిన బెల్లం పాయసం అద్బుతం అంటూ పిల్లలు ఇంక కొంచం పెట్టమని గారాలు పోయేవాళ్లు.ఇంటి అల్లుళ్ళు నాతో "అక్కా నీ చేతి రుచి ఎవ్వరికి రాదు" అనేవాళ్ళు నేను చేసిన పచ్చి పులుసు కలుపుకొని అన్నంలోనికి ఎర్రగడ్డ నంజుకొని తింటూ....దీపావళి రోజు అందరూ కలిసి ఇంటి నిండా దీపాలు వెలిగించే వారు...ఇల్లు పండుగ రోజులలో నిండుగా ఉండేది. మా రాజు తన బిడ్డలను చూసుకుని మురిసేటోడు "నా బిడ్డలు నా ఇంటి దీపాలు... నా కంటి వెలుగులు" అంటూ.
ఆ రోజులే వేరు....నగలేసుకొంటే నాణ్యత పెరగదని అది మాకు మల్లె పుట్టుకతో రావాలని మా ఇంటి ఆడబిడ్డలని ఎగతాలి చేసేదాన్ని. వాళ్ళు విని మిన్నకుండేవారు ఏమి చేయలేక.నా దగ్గర మిగిలిన డబ్బులు దాచి నా కన్నడు అడిగినప్పుడల్లా వానికి కావాల్సినంత ఇచ్చేదాన్ని.మా అన్నయ్య వచ్చి వాళ్ళ కష్టాలు ఏకరువు పెట్టగానే అక్కడ వాళ్ళు వ్యవసాయం అచ్చి రాక అష్టకష్టాలు పడుతుంటారని దయ తలచి, కొంచెం మా పుట్టింటికి కూడా పంపేదాన్ని.మా చెల్లెలది వెన్నలాంటి మనసంటూ పొగుడుతూ......... అటు తిరిగి ఇంతేనా ఇచ్చేది అంటూ దెప్పుతూ యెళ్ళేవాడు. నా కొడుకు ఎంత అల్లరి చేసినా నేను ఓర్చుకునే దాన్ని, కానీ మా మా రాజు మాత్రం చెండాలు వలి చేసేవాడు. అబ్బో ఆయనంటే సింహస్వప్నం వానికి....
అందుకే చాటుమాటుగా ఆయనకు కనిపించకుండా తిరుగుతుండేవాడు. వాడికి బోజనంలో పూటకొక కూర లేనిదే ముద్ద దిగేది కాదు.వయస్సు పెరిగే కొద్దీ వానికి చెడు సావాసాలు మొదలయ్యాయి. బీడి తో మొదలెట్టి ఆడు తాగుడు, జూదం కి కూడా అలవాటు పడ్డాడు. బడి ఎగ్గొట్టి తిరగడం మొదలుపెట్టాడు.వడ్డీ వ్యాపారం చేస్తూ మా రాజు కి తెలియకుండా నేను దాచిన లెక్కని, నేను కుదవబెట్టుకొన్న సొత్తుల్ని పట్టుకుపోయ్యేటోడు.నాలుగు రోజులపాటు ఏడనో తిరిగి ఇంటికోచ్చేటోడు. రోజుకొక గొడవ ఇంటిమీదకు తెచ్చేటోడు. అవి వాళ్ళ నాన్నకు తెలియకుండా దాచడానికి నేను అష్టకష్టాలు పడేదాన్ని.వాడు ఓ రోజు నా ఆడబిడ్డ కూతురిని బలవంతంగా చెరచబోయాడని ఆ పిల్ల నాన్న వచ్చి నాతో అంటే "ఆడు మొగాడు, మీ పిల్ల ఎంత బరితెగించి ఉంటే, దాని మీద చెయ్యివేసి ఉంటాడు ఆడు" అని అన్నా. ఆ రోజు ఆయన నన్ను చూసిన చూపు ఈనాటికి నాకు ఎరికే...."ఆ మారాజు మొహం చూసి మిమ్ములను వదిలిపెడ్తాండానంటూ" కన్నీళ్ళతో వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో మిగిలిన ఆడుబిడ్డల పిల్లలను కూడా చదువు మాన్పించి వాళ్ళని ఇంటికి తీసుకుపోయిరి. ఆ రోజుతో నాకు ఆడుబిడ్డలకు ఉన్న బంధాలు తెగిపోయాయి. అప్పటికే నా కూతుళ్ళ పెండ్లిళ్ళు అయ్యాయి.
నా కొడుక్కి చదువు వంటబట్టలేదు, కానీ నా కూతుళ్ళు బాగా చదివిరి. ఆళ్ళ నాయన చెప్పినట్లు వాళ్ళు వింటా ఉండిరి.నన్ను చూస్తేనే నా కూతుళ్ళకు వణుకొచ్చేది. వాళ్ళు పొద్దున్నే నా ఎదురుగా వచ్చినా సహించే దాన్ని కాదు. ముదనష్టపు మొహాలంటూ కన్నబిడ్డలను ఈసడించేదాన్ని. ఏదైనా వాళ్ళ నాయనమ్మ తో పంచుకోనేవాళ్ళు. ఆమె పోయాక మా రాజు వాళ్ళని మిక్కిలిగా సాకాడు. ఏడుస్తూ............ "ఇదిగో ఆ పాపాన్ని ఇలా అనాధలా మోస్తున్న" అన్నది.
నాయనలారా, ఒక కూతురికి మీలాగే డాక్టరీ చదవడానికి మద్రాస్ లో సీటు వచ్చినప్పుడు అబ్బో మారాజు చాలా ఆనందముతో ఊరంతా స్వీట్లు పంచిపెట్టాడు. పెద్ద కూతుర్ని మా దూరపు చుట్టాల అబ్బాయి ఆమెరికా లో చదవతా ఉండేవాడు, ఆడికిచ్చి పెళ్లి చేసాడు. రెండోదాన్ని నేను వద్దు వద్దంటున్న, మా ఊరిలోనే టీచర్ గా పనిచేసే మా ఆడబిడ్డ కొడుకుకే, వాళ్ళు ఇద్దరూ ఇష్టపడ్డారని పెళ్ళి చేసాడు.మూడోది తనతోనే డాక్టరీ చదువుకునే కుర్రాడినే పెళ్ళాడింది. నాలుగో దానికి కాలేజి లెక్చరర్ తో పెళ్ళయ్యాక దానికి కూడా లెక్చరర్ ఉజ్జోగం వచ్చింది.ఐదో దాన్ని, ఆరోదన్ని, ఇంజనీర్లుగా పనిచేస్తున్న అన్నదమ్ములకిచ్చి పెళ్లి చేసాడు. ముసల్ది చచ్చేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకొందట మరి. తన కూతుళ్ళ మట్టి పిసుక్కునే రాతల్లాగా కాకుండా, తన మనవరాళ్ళ బతుకుల్ని మంచిగా ఉజ్జోగం చేసే వానికిచ్చి పెళ్లి చేయమని.....ఆ ఒక్క విషయంలో ఆయన నా మాట వినలేదు.....లేకుంటే ఎవడో ఒక అనామకుడకిచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి కొడుక్కి ఇంకా కొంచెం ఆస్తి మిగలబెట్టి ఉండేదాన్ని.
ఓ రోజు మారాజు తన తోటివాళ్ళతో మాట్లాడుతున్నపుడే ఆయనకి గుండె ఆగిపోవడంతో చచ్చిపోయాడు. అప్పటికప్పుడె పెద్దసుపత్రికి తీసుకపోయినా లాభం లేకపాయె. ఊరంతా కన్నీళ్ళతో ఆయనను సాగనంపిరి. నా పంచప్రాణాలయిన నా కొడుకు, నేను మిగిలాం అంత లంకంత ఇంటిలో. ఆయన పోవడంతోనే వాడి ఆగడాలు శృతిమించాయి రోజు రోజుకి. ఆ రోజుతో నా పతనము కూడా మొదలయ్యా.... ఆయన పోవడంతోనే ఆ ఇంటి కళాకాంతులు పోయాయి. పల్లెల నుండి వచ్చి ఎంతోమంది మా ఇంట తిని బడికి పోయే వాళ్ళు. వాళ్ళని ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు.పల్లెల్లో కూడా కాన్వెంట్లు తెరవడంతో ఇప్పుడు ఎవ్వరూ మా ఇంటికి పై చదువుల కోసం రావడం లేదు. అది నిజమే కావచ్చు లేక నా కొడుకు ఆగడాలు భరించలేక కావచ్చు.
ఒకరిద్దరు ఆడపిల్ల తల్లితండ్రులు కూడా వాడి గురించి మా మారాజు బతికున్న రోజులలోనే చెబితే, ఆయన వరకు పోనీ కుండా నేను పరువు పేరుతో, డబ్బుతో వాళ్ళ నోళ్ళు నొక్కేసాను.ఇప్పుడు వాడికి పిల్లనిచ్చే వాళ్ళు కూడా లేకపోయిరి.
నేను మా బందువులందరిని బ్రతిమాలి మా కుటుంబ గొప్పతనాన్ని చెప్పి ఒక పిల్లని పట్టా.దాన్ని నా కొడుకిచ్చి పెళ్ళి చేస్తే అది నా క్రింద కుక్కిన పేనులా పడి ఉంటుందని తలచా.పెళ్ళి అయినాది. చాలా ఆడంబరంగా వాని పెళ్లి చేశా.మారాజు పోయిందే నా కూతుళ్ళు నా ఇంట అడుగుపెట్టలే. నన్ను, వాడిని చూస్తే భయం వాళ్లకి నిలువెళ్ళా. పెళ్ళికి మాత్రం పిలువనంపా. అల్లుళ్ళను, బిడ్డలను తీసుకురాక ఆళ్ళు మాత్రం వచ్చి ముహూర్తం అయిన వెంటనే పని ఉందని చక్కాపోయిరి.కానీ నా కొడుకు తో అది పది రోజులు కాపురం చేసిందో లేదో, నాకు విడాకులు కావాలంటూ, దాన్ని నా కొడుకు, నేను కలిసి చంపచూస్తాన్నామంటూ ఠానా లో కేసు పెట్టింది. దాని కడుపులో మా వంశాంకురం ఉందని అంటూ ఆస్తి కోసం కోర్టుకెక్కింది. ఆడు, ఆ పిల్ల ఏమి రాజీ పడ్డారో నాకయితే తెలవదు, కాని నాలుగు రోజులకే అది కాపురానికి తిరిగి వచ్చింది.
ఆ రోజు రాత్రి వాళ్ళు నా గొంతు నులిమి చంపాలని చూసారు!!! ఇది చస్తే కానీ మిగిలిన ఆస్తి దక్కదంటూ....అంతా కూతుళ్ళకు దోచి పెట్టిందంటూ వాళ్ళు అనుకోవడం నాకు వినబడింది. నేను చచ్చినాననుకొని నన్ను బండిలో వేసి నా కొడుకు ఊరవతల పారేసాడు. ఎవరో సాధువు నన్ను చూసి గుక్కెడు నీళ్ళు తాపి ప్రాణం నిలబెట్టి తన తోవన తాను పోయాడు. "చెడి కూతుళ్ళ ఇళ్ళకి పోలేక, ఆళ్ళకి నా మొఖం సూపలేక ఇదిగో ఈ గుడి మెట్లమీద అడుక్కుతిని బతుకుతున్నా". "ఆ మారాజు బతికుంటే నాకు ఈ దుర్గతి పట్టేది కాదు. నే చేసిన పాపమే శాపమైనాది"."కొడుకు కొడుకంటూ ఆడిని గుండెలపై పెంచా"....."ఆడిని తప్పు దారిలో నడిపించా"....."నే తప్పు చేసినా"....."అందుకే బతికుండగానే కొడుకు కొరివి పెట్టాడంటూ" కన్నీరు కారుస్తున్న ఆమెను ఊరడించి మా మెడికల్ కాలేజ్ కి అనుబంధంగా ఉన్న ఓల్డేజ్ హోం లో చేర్చాము.ఆ క్షణం నేను తెలుసుకున్నాను ....... ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పోసి ఒక వీర శివాజీని తయారు చేసిన జిజాబాయి ఎంతటి మహోన్నతురాలోనని....తల్లి శిల్పి అయితే తల్లి చేతిలో మలచబడ్డ బిడ్డ శిల్పం అవుతాడు....వాడు ఆమె ఆలోచనలకు ప్రతిబింబిం అవుతాడు అని అనుకున్నా......