భాగవత కథలు – 32 మత్స్యావతారం - కందుల నాగేశ్వరరావు

Matsyaavataaram

భాగవత కథలు – 32

మత్స్యావతారం

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగింటిని కలిపి ఒక మహాయుగం అంటారు. అటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ప్రతీ మన్వంతరాన్ని ఒక మనువు పాలిస్తాడు. అటువంటి 14 మనువులు పాలించేకాలం బ్రహ్మకు ఒక పగలు. ఇప్పటివరకు ఆరు ఉదయకల్పాలు బ్రహ్మకు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ఏడవ మన్వంతరాన్ని ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగం ఇప్పుడు నడుస్తోంది.

ఆరవ కల్పం (చాక్షువ మన్వంతరం) చివరి రోజుల్లో ద్రవిడదేశానికి సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు గొప్ప హరిభక్తుడు. ఎల్లప్పుడూ హరిసేవలో మునిగి తేలేవాడు. ఎన్నో సార్లు కేవలం నీరు మాత్రం ఆహారంగా తీసుకుంటూ విష్ణువును గురించి తపస్సు చేసేవాడు. సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనే నది ఒడ్డున విష్ణువుకు నీళ్ళతో తర్పణం వదులుతున్నాడు. అప్పుడు అతని దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది. వెంటనే ఆ చేప పిల్లను నది నీళ్ళలో వదలిపెట్టాడు.

ఆశ్చర్యంగా ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది. “రాజా! ఈ నదిలో నాలాంటి చిన్న చేపలను తినే పెద్దపెద్ద చేపలు ఎన్నో ఉన్నాయి. జాలర్లు కూడా వలలు వేసి నన్ను బంధిస్తారు. నన్ను రక్షించి నీతో తీసుకొని వెళ్ళు”. సత్యవ్రతుడు జాలితో ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకు వెళ్లాడు. ఒక్క రాత్రిలోనే ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోయింది.

మరునాడు ఉదయం చేపపిల్ల రాజుతో “రాజా! నేను ఉండడానికి ఈ కమండలం చాలదు. నన్ను ఏదైనా పెద్జ పాత్రలో ఉంచు” అంది. సత్యవ్రతుడు ఆ చేపపిల్లను పెద్ద కడవలో ఉంచాడు. కాస్సేపటికి అది పెరిగి కడవంతా నిండి పోయింది. దయామయుడైన ఆ రాజు దానిని చిన్న నీటి మడుగులో విడిచాడు. అది ఆ మడుగు కంటె పెద్దదై ‘నేను తిరగడానికి ఈ మడుగు చాలదు’ అంది. రాజు దానిని తీసుకువెళ్ళి పెద్ద తటాకంలో వదిలిపెట్టాడు. చూస్తుండగానే ఆ చేప చెరువంతా ఆక్రమించి ‘ఇది కూడా చాలదు’ అంది. అప్పుడు రాజు దానిని తీసుకువెళ్ళి సముద్రంలో విడిచాడు.

అప్పుడా చేప “రాజా! ఈ సముద్రంలో నన్ను మొసళ్ళు, తిమింగలాలు పట్టి చంపుతాయి. నన్ను రక్షించు” అంది. అప్పుడు రాజు చేపతో “ఒక్క రోజులో నువ్వు ఆమడల దూరం వ్యాపించావు. ఇంత పెద్ద చేపను మేమెవరమూ చూడలేదు. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు తప్పక భక్తులను కాపాడడానికి చేపరూపంలో వచ్చిన విష్ణుదేవుడువి అని నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించి కాపాడు” అని ప్రార్థించాడు.

ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో సంచరించడానికి చేప రూపం ధరించిన శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! ఈ రాత్రి గడిచిన తరువాత ఏడవ దినంలో భూలోకంతో సహా మూడులోకాలూ ప్రళయ సముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీదగ్గరకు వస్తుంది. నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులు ఆ నౌకపై ఉంచుకొని ప్రళయ సముద్రంలో విహరించు. సప్తఋషులు నీతోపాటే ఆ నౌకలో ప్రయాణం చేస్తారు. వారి శరీరాల నుండి వచ్చే దివ్యకాంతి నీకు దారి చూపుతుంది. ఓడ సముద్రపుటలలకు దెబ్బ తినకుండా మత్స్యరూపం ధరించిన నేను ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తాను. సుడిగాలులకు నావ తిరగబడకుండా నేను పంపిన పెద్ద పాముతో నావను నా తోకకు బంధించు. నావకు ప్రమాదం జరగకుండా ప్రళయరాత్రి ముగిసేవరకూ నేను రక్షిస్తూ ఉంటాను. నిన్ను రక్షించడం కొరకే ఈ మీన రూపం ధరించాను”. ఈ విధంగా పలికి శ్రీహరి అదృశ్యమయ్యాడు.

ఆ రాత్రి విష్ణువు పలికిన మాటలు తలుచుకుంటూ సత్యవ్రతుడు దర్భల శయ్యపై తూర్పున శిరస్సు ఉంచి పడుకున్నాడు. మరునాడు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం కురవడం మొదలెట్టింది. సముద్రాలు పొంగి పొర్లి దేశాలను ముంచి వేసాయి. కల్పాంత కాలంలో ఏర్పడిన ఆ ప్రళయంలో ప్రజల ప్రాణాలు కోల్పోయారు.

బ్రహ్మదేవుడు బాగా అలిసిపోయి నిద్రపోయాడు. అతని ముఖం నుండి వెలువడిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించాడు. వేదాలను దొంగిలించిన హయగ్రీవుడు వాటిని చదవడం మొదలెట్టాడు. బయట ప్రపంచంలో ఉండడానికి బయపడి సముద్రంలో ప్రవేశించాడు. వేదాలను దొంగిలించి సముద్రంలో దాగిన రాక్షసుణ్ణి సంహరించడం, ఓషధులూ విత్తనాలూ రక్షించడం ఆ భగవంతుడైన విష్ణుదేవుని ప్రస్తుత కర్తవ్యాలు.

మహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్యరూపం ధరించాడు. ఆ పెనుచేప చిన్న చిన్న రెక్కలు, పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారు రంగు శరీరము, దానిపై అందమైన మచ్చలు, చక్కని మొగము, ఒక కొమ్ము కలిగి మిరుమిట్లు గొలిపే చూపులతో విరాజిల్లుతూ సముద్రంలో ప్రవేశించింది. మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, వంటి రంగును మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ ప్రళయజలాలలో వేదాల కోసం వెదకసాగింది.

సత్యవ్రతుడు భగవంతుణ్ణి ధ్యానిస్తున్న సమయంలో విష్ణుమాయతో ఒక నావ అక్కడకు వచ్చింది. అది చూసిన సత్యవ్రతుడు ఉత్సాహంతో దానిపై పెక్కు ఓషదులను విత్తనాలను అమర్చాడు. విష్ణువుని స్తోత్రం చేస్తూ మునులతో పాటు నావలో కూర్చొన్నాడు. శ్రీహరి చెప్పినట్లుగా సముద్రంలో కనపడ్డ పెద్ద పాముతో ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసాడు. ‘భక్తులను ఆదరించే మమ్ము కాపాడు’ అంటూ మనస్సులో భగవంతుని ప్రార్థనలో మునిగి పోయాడు.

మత్స్యరూపంలో ఉన్న విష్ణుదేవుడు అతని ప్రార్థనకు సంతోషించి సాంఖ్యయోగంతో కూడిన వేదభాగాన్ని అతనికి భోధించాడు. మునులతోబాటు సత్యవ్రతుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే వరకూ ఆ విధంగా విష్ణువు పెనుచేప రూపంలో తిరుగుతానే ఉన్నాడు. తెల్లవారుజామున విష్ణుమూర్తి వేదాలు బాధతో పెట్టుకున్న మొర విన్నాడు. ఉత్సాహంతో తోక ఊగించాడు. శరీరం మెరిపించాడు. సముద్ర గర్భంలో ప్రవేశించి అక్కడ దాగిఉన్న దుష్టుడూ మహాబలిష్టుడూ అయిన హయగ్రీవుణ్ణి హతమార్చాడు.

అంతలో ప్రళయకాలం ముగిసింది. బ్రహ్మసరస్వతులు నిద్ర లేచారు. తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చొన్నారు. విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చాడు. సత్యవ్రతుడు కాపాడిన ఔషదులు విత్తనాలు బ్రహ్మదేవుడికి చేరాయి. బ్రహ్మ తిరిగి చరాచర జీవసృష్టి మొదలుపెట్టాడు. సత్యవ్రతుడు ఈ ఏడవ కల్పంలో ‘వివస్వంతుడు’ అని పిలువబడే సూర్యునికి ‘శ్రాద్ధ దేవుడు’ అనే పేరుతో పుట్టాడు. విష్ణుదేవుని దయ వలన ‘వైవస్వత మనువు’ అనే పేరుతో ఏడవ మనువయ్యాడు.

ప్రళయ సముద్రంలో మైమరచి నిద్రించిన బ్రహ్మ దేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్ట రాక్షసులని సంహరించడం కొరకు, రాజర్షి విష్ణుభక్తుడు అయిన సత్యవ్రతుని రక్షించడం కొరకు మత్స్యావతారం ధరించిన విష్ణుదేవుని మహిమను తెలియజేసే ఈ పుణ్య కథను శ్రద్ధతో చదివేవారి కోరికలు నెరవేరుతాయి, మోక్షాన్ని పొందుతారు.

***

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న