అవంతీపురరాజ్యాన్ని సూర్యవర్మ పరిపాలిస్తున్నాడు.ఆయన వద్ద సుమంతుడు మంత్రిగా ఉన్నాడు. సుమంతుడికి నందుడనే కుమారుడున్నాడు.నందుడు.గురుకులంలోఉన్నతవిద్యను పూర్తిచేసుకుని రాజ్యానికి వచ్చాడు.కుమారుని రాజుకు పరిచయం చేయాలనుకున్నాడు సుమంతుడు. ఒకరోజు సూర్యవర్మ మంత్రులతో, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాడు.రాజు అనుమతితో కుమారుని సమావేశానికి తీసుకెళ్ళాడు సుమంతుడు. తనకుమారుని రాజుకు, మంత్రులకు పరిచయం చేశాడు. ఆ సమావేశంలో రాజ్యపరిస్థితులపై చర్చ మొదలయింది. "రాజ్యమంతటా కరువు పరిస్థితులున్నాయి. ఆహారపదార్థాలకొరత తీవ్రంగా ఉంది" అన్నాడు వ్యవసాయశాఖమంత్రి అమరనాధుడు. "పొరుగు రాజ్యాలనుండి ఆహారపదార్థాలు కొనుగోలు చేద్దాం"అన్నాడు రాజు. "అందుకు అవసరమైన ధనం ఖజానాలో లేదు.ఇతర రాజ్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిందే!"అన్నాడు ఆర్థికశాఖామంత్రి. "రాజ్యంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి"అన్నాడు సంక్షేమశాఖామంత్రి. "ఆత్మహత్య మహాపాపమని ప్రచారంచేశాం.మార్పురాలేదు."అన్నాడు ఓ అధికారి. "మన మిత్రరాజ్యాలను ఒప్పిఃచి ఆహారపదార్థాలను సహాయంగా పొందుదాం"అన్నాడు ఓఉన్నతాధికారి ఇదంతా వింటున్న ప్రధానమంత్రి సుమంతుడు "మన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉందనుకుంటున్నాను" అన్నాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఈ సంభాషణ వింటున్న నందుడు "మహారాజా!మీరు అనుమతిస్తే నేను ఐదుప్రశ్నలడుగుతాను.వాటికి ఎవరైనా సమాధానం చెప్పగల్గితే ఈ సమస్యకు పరిష్కారం అర్థమవుతుంది"అన్నాడు. ప్రశ్నలకు సమాధానం చెబితే పరిష్కారం ఎలా లభిస్తుందో రాజు కర్థంకాలేదు. "అడుగుచూద్దాం?"అన్నాడు. ఆశ్చర్యంగా మంత్రులు,అధికారులు నందుడు ఏం ప్రశ్నలడగబోతున్నాడో, సమాధానం ఇవ్వగల్గుతామో లేదోనని ఆసక్తిగా చెవులు రిక్కించారు. "ఈ ప్రపంచంలో దెయ్యం పట్టిన రాజ్యమేది? ఈభూమ్మీద రోజురోజుకీ పెరిగిపోతున్న ఎత్తైన తాటిచెట్టున్న రాజ్యమేది? మొసళ్ళకు చిలుకలను ఆహారంగా వేస్తున్న దేశం ఏది? కాళ్ళు, చేతులు తెగి చస్తున్న తల్లులున్న దేశం ఏది? ఈ ప్రపంచంలో ఆకుపచ్చ ఆయుధాన్ని ఆదరించని రాజ్యమేది?"అన్నాడు. ఈ ప్రశ్నలు విని రాజు, మంత్రులు, అధికారులు ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.విచిత్రంగా ఉన్న ఆప్రశ్నలకు అయోమయపడ్డారు.నందుడు ఏంఅడిగాడో తాము ఏంచెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డారు.చివరికి నందుడినే సమాధానం చెప్పమన్నారు. "అన్ని ప్రశ్నలకూ సమాధానం మన అవంతీరాజ్యమే!"అన్నాడు నందుడు. ఎలాగో వివరించమన్నాడు రాజు. "మహారాజా!నేను గురుకులం నుండి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చాక మన రాజ్యపరిస్థితులను పరిశీలించాను. మన రాజ్యానికి తాగుడు దెయ్యం పట్టింది. యువకులు వృద్దులనే తేడా లేకుండా తాగి ఊగుతున్నారు.మనరాజ్యంలో అవినీతి అనే తాటిచెట్టు రోజురోజుకీ హద్దులు లేకుండా పెరిగిపోతోంది. చిన్నపిల్లలను మొసళ్ళలాంటి ముసలివారికిచ్చి బాల్యవివాహాలు జరిపిస్తున్నారు. తిండిని,గాలిని,నీడను,వర్షానిచ్చే చెట్టు మనకందరికీ తల్లిలాంటిది. అలాంటి చెట్టు మనస్వార్థానికి బలై వేళ్ళు, కొమ్మలు తెగి నేలకూలుతున్నాది.గాలిని,వర్షాన్నిచ్చి,కాలుష్యం నుండి, కరువు, కాటకాలనుండి, ఆకలినుండి,ఈభూగోళాన్ని కాపాడే ఏకైక ఆకుపచ్చ ఆయుధం చెట్టు.అలాంటి చెట్లను మనం ఆదరించడం లేదు. మహారాజా!తాగుడుదెయ్యం పట్టి సమస్యలతో కుటుంబాలు నాశనమవుతున్న రాజ్యంలో ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? బాల్యవివాహాలు ఎందరో చిన్నారుల మరణాలకు కారణమవుతున్నాయి. అవినీతి పెరిగిపోయి ప్రజల ధన, మాన, ప్రాణాలను బలికోరుతోంది.చెట్లను నరికే దేశంలో, మొక్కలను పెంచి, పెద్దచేసి ఆదరించని రాజ్యంలో కరువుకాటకాలు కాక వర్షాలు కురుస్తాయా?ఈ అవలక్షణాలున్న దేశం పతనాన్ని కాక సుభిక్షాన్ని, ప్రగతిని ఎలా సాధిస్తుంది?"అన్నాడు నందుడు. తాగుడు,అవినీతి,బాల్యవివాహాలు,చెట్లనునరకడం,మొక్కలపంపకంపై దృష్టి పెట్టకపోవడం,తమ రాజ్యపతనానికి మూలాలని నేర్పుగా, చాకచక్యంగా వివరించిన నందుడిని అందరూ అభినందించారు.రాజు నందుడిని సత్కరించి,రాజ్యసంక్షేమసలహాదారునిగా ఉన్నత పదవిలో నియమించాడు. తాగుడు,అవినీతి,బాల్యవివాహాలు,చెట్లనునరకడాన్ని నిషేధిస్తూ కఠిన చట్టాలను చేశాడు. ఈ అవలక్షణాలను అరికట్టడానికి, వీటివల్ల కలిగే కీడును వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయటానికి ప్రత్యేకవ్యవస్థను ఏర్పాటు చేశాడు. అతి తక్కువకాలంలోనే అవంతీరాజ్యం కరువుకాటకాలనుండి బయటపడింది. కుటుంబాలు సంక్షేమం దిశగా ప్రయాణించాయి.రాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి.