(IT కంపెనీల ఉద్యోగస్తులు పై అధికారులని సంబోధించేటప్పుడు పేరు పెట్టి పిలుస్తుంటారు. అంతేకాదు. IT కంపెనీల ఉద్యోగస్తులు ఎక్కువగా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు. ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని ఈ కథ క్రింద విధంగా వ్రాయడమైంది)
“డిడ్ యు కాల్ మి కుమార్?”
“ఎస్, వినీత్. మన కంపెనీ బోర్డు మీటింగ్ అటెండ్ అవడానికి నేను మరో గంటలో ఢిల్లీ బయలుదేరుతున్నాను అని నీకు తెలుసుకదా. ఇంకా ఏమేనా మెటీరియల్ నాకు ఇవ్వడానికి ఉందా ?”
"నో కుమార్. అన్నీ ఇచ్చేసేను. యు లుక్ డల్, ఎనీ ప్రాబ్లెమ్ కుమార్ "
“ ‘XYZ’ కంపెనీ వాళ్ళ బిజినెస్ మన కంపెనీకి తేవడానికి నేను రెండు నెలలుగా ప్రయత్నిస్తుంటే, ఆ కంపెనీలో ఈ డీల్ చూసే యూనిట్ హెడ్ ఆ జాబ్ వదిలి వెళ్లిపోయి, ‘శరత్’ అని న్యూ గై ట్వంటీ డేస్ బ్యాక్ జాయిన్ అయాడు. అతను ఇంకా మన ఫేవర్ లో డెసిషన్ తీసుకొనే లోపల - మన రైవల్ కంపెనీ ‘KUSKUS’ వారు ఆ బిజినెస్ కొట్టేసేటట్టున్నారు.”
“అలా ఎందుకనిపిస్తోంది కుమార్"
“ ‘XYZ’ కంపెనీ వారితో ఆ బిజినెస్ విషయంలో మీటింగ్ కోసం ‘KUSKUS’ కంపెనీ మనిషి ఎల్లుండి సాయంత్రం ఇక్కడినుంచి ముంబైకి ఫ్లైట్ లో బయలుదేరుతున్నాడు అని తెలిసింది. ఢిల్లీలో మన మీటింగ్ లో ఈ ప్రసక్తి వస్తే నేను వెర్రి మొహం వేసుకోవలసి వస్తుంది” - అన్నాడు కుమార్ విచారంగా.
"ఒక్క నిమిషం." అని –
వినీత్ తన మొబైల్ లో ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ కుమార్ కి చూపించి - "ఆ న్యూ గై ఇతనేనా, అతనితో మాట్లాడే నెంబర్ ఇదేనా చూడు" అని చూపించేడు.
అది చూసిన కుమార్ ఆశ్చర్యంగా " ఎస్. దిస్ ఈజ్ ద గై. ఇతని డీటెయిల్స్ నీ మొబైల్ లో ఉన్నాయంటే, నీకు ఇతను తెలుసా"
“ఇతను నా క్లోజ్ ఫ్రెండ్. ఇరవై రోజుల క్రిందట ‘XYZ’ కంపెనీలో మంచి పొజిషన్ లో జాయిన్ అయ్యేడని నాకు రెండు రోజుల క్రిందటే తెలిసింది. నేను ఏమడిగినా అతడు సంతోషంగా చేస్తాడు. నేను ఇప్పుడే అతనితో స్పీకర్ ఓపెన్ చేసి మాట్లాడతాను, విను."
"బి క్విక్. ఐ ఆమ్ రన్నింగ్ షార్ట్ అఫ్ టైం."
వినీత్ మొబైల్ లో అతని ఫ్రెండ్ ‘శరత్’ కోసం లైన్ కనెక్ట్ చేసి, స్పీకర్ ఆన్ చేసేడు – ‘ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్’.
"హలో, హూ ఈజ్ దిస్"
"హలో శరత్, నేను వినీత్ ని"
"హాయ్ వినీత్. వాట్ ఏ సర్ప్రైజె. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు"
"నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ రోజు ఫ్లైట్ లో ముంబైకి వస్తున్నాను. ఇక్కడ ఫ్లైట్ లో చెకిన్ అవగానే నేను అక్కడకి ఎన్ని గంటలకి ల్యాండ్ అయేది నీకు చెప్తాను. ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మై కంపెనీ మేటర్."
"డన్. నాకారు ఎయిర్పోర్ట్ కి పంపిస్తాను. డ్రైవర్ నీ పేరుతో ప్లేకార్డు పట్టుకొని ఉంటాడు. తిన్నగా మాఇంటికి వచ్చేయి. ఈనైట్ ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. రేపటి నీపని కూడా అయిపోయిందనుకొని ఫ్రీగా ఉండు. బై"
"బై. థాంక్ యు."
-2-
“సారీ. నా ముంబై ప్రయాణానికి ఓకే చేస్తావనుకొని అలా మాట్లాడేను. ఇఫ్ యు పర్మిట్, నేనిప్పుడే ఇంటికి వెళ్లి, అక్కడనించి అలాగే ఎయిర్పోర్ట్ కి వెళ్లి, అక్కడే టికెట్ కొనుక్కొని, ఈ రాత్రికి ముంబై చేరుకొని, ‘శరత్’ ని కలిసి మాట్లాడతాను. మన కంపెనీ వివరాలు పెన్ డ్రైవ్ లో తీసుకొని వెళ్తాను.”
“అర్ యు కాన్ఫిడెంట్ వినీత్?”
“అఫ్ కోర్స్, టు హండ్రెడ్ పెర్సెంట్. ఇంత హఠాత్తుగా చేసే ప్రయత్నంలో ఒకప్పుడు వెంటనే వారి బిజినెస్ మనకు రాక పోయినా, మన రైవల్ ‘KUSKUS’ కంపెనీకి మాత్రం బిజినెస్ వెళ్లకుండా కొన్నాళ్ళు పెండింగ్ లో పెట్టేటట్టు తప్పక అరెంజ్ చేస్తాను. ఒకప్పుడు నా ఈ ప్రయాణంతో వెంటనే మన పని అవడానికి అవకాశం లేకుండా, ఆలస్యం అయేటట్టుంటే, శరత్ ని కలవడానికి మరో డేట్ తీసుకొని మన ఇద్దరం వస్తాం అని చెప్తాను. అప్పుడు మన ఇద్దరం వెళ్లి డీల్ ఫైనల్ చేసుకొనే వద్దాం.”
“యు షుడ్ డు ఇట్ వినీత్ ఎనీ హౌ. నౌ, యు మూవ్. విష్ యు అల్ ది బెస్ట్. కీప్ మీ పోస్టేడ్ విత్ డెవలప్మెంట్స్.”
“థాంక్స్. ఐ టూ విష్ ఫర్ యువర్ సక్సెస్ కుమార్.”
సమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలు.
వినీత్ ఎయిర్పోర్ట్ లో స్పైస్ జెట్ టికెట్ కౌంటర్ దగ్గరకి చేరి - “మాడం, ముంబైకి నాకొక టికెట్ ఇవ్వండి ప్లీజ్. అర్జెంటుగా వెళ్ళాలి.”
“సారీ సర్, ఖాళీ లేవు.”
“ఎవరేనా కాన్సల్ చేసుకున్నారేమో చూడండి ప్లీజ్.”
“నో సర్, ఇంతవరకూ ఎవరూ కాన్సల్ చేసుకోలేదు.”
“వెళ్ళవలసిన వారెవరేనా రాలేదేమో చూడండి ప్లీజ్. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి.”
“ఇంకా ఆరుగురు ఇంతవరకూ మాకు రిపోర్ట్ చేయలేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి గంట నలభై నిమిషాలు ఇంకా ఉంది కాబట్టి, మా రూల్ ప్రకారం, మరో గంట పది నిమిషాల వరకూ మేము వారికోసం వేచి చూడాలి సార్.”
“పోనీ అప్పుడేనా నాకొక టికెట్ ఇస్తారా మాడం.”
“ఆ విషయం ఇప్పుడు చెప్పలేము సార్.”
“నేను వెయిట్ చేస్తానులెండి.”
వినీత్ మనసులో – ‘భగవంతుడా, నేను పనిచేసే మా కంపెనీకి ‘XYZ’ కంపెనీ బిజినెస్ సంపాందించి పెట్టి, తద్వారా నేను ప్రమోషన్ కొట్టేయాలంటే, ఇప్పుడు నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి కదా. మిగిలిన ఆ ఆరుగురిలో కనీసం ఒకరేనా ఈ ఫ్లైట్ కి రాకుండా అడ్డు పడు’ – అని ప్రార్ధించసాగాడు.
తనకి మంచి జరగాలన్న స్వార్ధంతో - మరొకరికి చెడు జరగాలని దేముడిని ఆశ్రయిస్తున్నాడు వినీత్.
“ఏం బాబూ, మన టాక్సీ ఎయిర్పోర్ట్ చేరడానికి ఇంకా ఎంత సేపు పడుతుంది” అడిగేడు నవనీత్ ఆతృతగా.
“చెప్పలేం సార్. మనం ఉన్న ఫ్లైఓవర్ మీద ఏదో ఆక్సిడెంట్ అయిందని మన ముందుండే బళ్ళు అన్నీ ఆగిపోయాయి. మన వెనక కూడా చాలా బళ్ళు ఆగిపోవడంతో, వెనక్కి వెళ్ళడానికి కూడా దారి లేదు. ట్రాఫిక్ క్లియర్ అయితే కానీ, మనం ముందుకి కదలలేం సార్.”
-3-
“ఎయిర్పోర్ట్ ఇంకా ఎంత దూరం ఉంది.”
“12 కిలోమీటర్ లు సార్.”
నవనీత్ మనసులో – ‘భగవంతుడా, నీకు అన్నీ తెలుసు. నాకు ప్రమోషన్ రాకపోవడంతో చేసుకున్న అప్పీల్ మీద నన్ను ఇంటర్వ్యూకి పిలిచేరు. నేను ఇప్పుడు ముంబైకి వెళ్లకపోతే, ఎల్లుండి ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళేది? నేను ఎలాగేనా ఎల్లుండి జరిగే ఇంటర్వ్యూకి వెళ్లగలిగేట్టు అనుగ్రహించు. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ - అని వేడుకోసాగాడు.
తన చేతిలో ఏమీ లేదని తెలుసుకున్న నవనీత్, ఆ దేవదేవుడికి తన శరణాగతిని తెలుపుకొని, భారం భగవంతుడి మీద వేసేడు.
ట్రాఫిక్ కొంచెం కదలడం చూసిన నవనీత్ - "బాబూ, నా ఫ్లైట్ కి ఇంకా 50 నిమిషాలే టైముంది. టాక్సీ కాస్తా
తొందరగా పోనిస్తావా ప్లీజ్.”
“ట్రాఫిక్ కదిలి ఐదు నిమిషాలే అయింది కదా సార్. మన ముందు ఉన్న బళ్ళు కదలడాన్ని బట్టి, మన టాక్సీ స్పీడ్ అందుకోవాలి కదా.”
“జల్దీగా వెళ్ళడానికి కొంచెం ప్రయత్నం చేయి” అని --- భగవంతుడిని మరోసారి మనసులో ప్రార్ధించుకున్నాడు.
వినీత్ : “మాడం, మీరన్న గంటా పది నిమిషాలలో, ఇంకా పది నిమిషాలే మిగిలేయి. పొజిషన్ ఎలా ఉంది, నాకు టికెట్ ఇవ్వగలరా ప్లీజ్.”
“ఇంకా ఒకరు రావాలి సార్.”
“పది నిమిషాలయే సరికి ఆ పాసెంజర్ రాకపోతే, నాకు టికెట్ ఇస్తారా.”
“ముందు, ఆ సమయం గడవనీండి.”
“నేను ఇక్కడే వెయిట్ చేస్తాను మాడం.”
“మీ ఇష్టం. మరో పది నిమిషాల వరకూ ఏమీ అడగొద్దు, ప్లీజ్.”
ఆతృతగా వినీత్ : "పది నిమిషాలు టైం కూడా అయిపోయింది మాడం. నాకు టికెట్ ఇవ్వండి ప్లీజ్.”
“ఉండండి సార్. మరో ఐదు నిమిషాలకి కూడా ఆయన రిపోర్ట్ చేయకపోతే, అప్పుడు మీకు టికెట్ ఇస్తాం. మీరు చాలా త్వరగా బోర్డింగ్ కి చేరుకోవలసి ఉంటుంది.”
“నాకు ఈ చిన్న బ్రీఫ్ కేసు తప్పిస్తే, మరేమీ లగేజీ లేదు మాడం. మీరు టికెట్ ఇవ్వగానే పరిగెడతాను.”
టికెట్ కౌంటర్ లో ఉన్న ఆమె, బోర్డింగ్ చూస్తున్న వారితో ఫోన్ లో మాట్లాడి, టికెట్ ఇవ్వగానే వినీత్ పరిగెత్తి, ఫ్లైట్ తలుపు ఐదు నిమిషాలలో మూసేస్తారనగా లోపలికి వెళ్లి, తనకు కేటాయించిన సీట్ లో స్థిరపడి, దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు.
తన తెలివంతా ఉపయోగించి, కాంపిటిషన్ లో ఉన్న KUSKUS కంపెనీకి బిజినెస్ రాకుండా చేసి, తమ కంపెనీకే ఆ బిజినెస్ వచ్చేటట్టు చేసి, ప్రమోషన్ కొట్టేయగలనన్న ధీమాతో, తన సీటుని పుష్ బ్యాక్ చేసి విశ్రాంతిగా వాలేడు వినీత్.
“ఇంకా ఎంతసేపు అవుతుంది బాబూ మనం ఎయిర్పోర్ట్ చేరుకుందికి.”
“మరో పదిహేను నిమిషాలైనా పడుతుంది సార్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది.”
-4-
సమయం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలు.
ఫ్లైట్ టేక్ ఆఫ్ కి పది నిమిషాలుందనగా, ఎయిర్పోర్ట్ డిపార్చర్ గేట్ దగ్గరకి చేరుకున్నాడు నవనీత్.
అక్కడివాళ్లు ఇతన్ని లోపలికి పంపించడమేమిటి, పరిగెత్తి చెక్ ఇన్ కౌంటర్ దగ్గరకి చేరుకున్నాడు.
“సారీ సార్. ఫ్లైట్ డోర్ క్లోజ్ అయిపొయింది. యు అర్ టూ లేట్ టు రిపోర్ట్. మీరు ఇప్పుడు ఈ ఫ్లైట్ లో ప్రయాణం చేయడానికి అవదు.”
“ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చూడండి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి.”
“నో ఛాన్స్ సార్. ఫ్లైట్ ఈ సరికి రన్వే మీదకి చేరిపోయుంటుంది. ఐ యామ్ సారీ. "కావలిస్తే టికెట్ ఫేర్ రిఫండ్ కోసం మీరు క్లెయిమ్ చేసుకోండి. శాంక్షన్ అవుతుందో లేదో చెప్పలేను." అని కావలసిన ఫారం నవనీత్ కి అందించింది ఆమె.
హతాశుడై, దీనంగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు నవనీత్.
'భగవంతుడా నిన్ను ఎంతగానో వేడుకున్నా నాకు ఇలా జరగడంలో ఏమిటి నీ లీల' - అని కనబడని భగవంతుడిని మనసులో ప్రశ్నించేడు, కానీ నిందించలేదు, నవనీత్.
కొంతసేపటి తరువాత, తప్పదు కాబట్టి, మరుసటి ఉదయం ఏడు గంటల సమయానికి ఉన్న ఫ్లైట్ లో ప్రయాణం కోసం టికెట్ తీసుకొని, ఆ రాత్రి ఎయిర్పోర్ట్ లోనే గడపడానికి ‘డార్మిటరీ’ లోకి ప్రవేశించేడు నవనీత్.
విచలిత మనస్కుడైన నవనీత్ తనకు జరిగిన అనుభవం జీవిత భాగస్వామికి ఫోన్ చేసి తెలియచేసేడు.
"విచారించకండి.ఏమి జరిగినా మన మంచికే' అని ఉత్సాహంగా ఉండండి. ఇంటర్వ్యూ కోసం ఈ రాత్రి బాగా చదువుకొని తయారవండి" అని ఆ ఉత్తమ ఇల్లాలు స్వాంతనతో కలసిన ప్రోత్సాహం తెలియచేసింది ఫోన్ లో.
"మన ఫ్లైట్ ముంబై ఎయిర్పోర్ట్ లో కొద్ది నిమిషాలలో ల్యాండ్ అవుతుంది." అన్న ప్రకటన ఫ్లైట్ సౌండ్ సిస్టం లో వినిపించింది.
ప్రయాణికులందరికీ వారి సీట్ స్ట్రెయిట్ గా ఉంచమని చెప్తూ వినీత్ దగ్గరకి వచ్చిన ఎయిర్ హోస్టెస్ - "సర్, మీరు సీట్ ని స్ట్రెయిట్ గా చేసి, బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా కూర్చోండి" అని చెప్పి వెళ్ళింది.
“అలాగే” అని సీట్ ని స్ట్రెయిట్ గా చేసిన వినీత్, ఎయిర్ హోస్టెస్ అలా వెళ్ళగానే, ఆ హెచ్చరికని పట్టించుకోకుండా, తన సీట్ ని మరలా రిలాక్స్ పొజిషన్ లోనే ఉంచి, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు కొంచెం నిర్లక్ష్యంతో.
కొంతసేపటికి -- ఫ్లైట్ చక్రాలు రన్వేపైకి తగులుతూండగా, పెద్ద శబ్దం వచ్చి, ఫ్లైట్ అటూ ఇటూ ఊగుతూ, అతి త్వరగా వెళ్లి ఇంకా పెద్ద శబ్దంతో హఠాత్తుగా ఆగింది. ఒక్కసారిగా - ఫ్లైట్ లో హాహాకారాలు ఏడుపులు నిండిపోయేయి. కొంతమంది ప్రయాణికులు దెబ్బలతో బాధపడుతూ ఏడుస్తూ ఉండగా, కొంతమంది భయానికి కాబోలు స్పృహతప్పి పడిఉన్నారు.
నిర్లక్ష్యంతో సీట్ ని రిలాక్స్ పొజిషన్ లోనే ఉంచి సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంవలన, సీట్ లో నుంచి క్రిందపడిన వినీత్ మెడ మీద తల మీద బరువైన సూట్ కేసు లు పడి - స్పృహతప్పి పడి ఉన్నాడు.
స్పృహతప్పి పడి ఉన్న ప్రయాణికులని ఆంబులెన్సులలో ఆసుపత్రికి తరలిస్తూండగా –
ప్లేకార్డు పట్టుకొని బయటకు వస్తున్న ప్రయాణికులవేపు చూస్తూ నిలబడి ఉన్న కారుడ్రైవర్ ఉన్న చోటుకి కాస్తా వెనకనించి, వినీత్ ఉన్న ఆంబులెన్సు సైరన్ మ్రోగించుకుంటూ త్వరగా ముందుకు కదిలింది.
-5-
రాత్రి పదకొండు గంటలు దాటినా నిద్ర పట్టని నవనీత్ – ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ ఎక్కువ గోలగోలగా ఉందనిపించి, డార్మిటరీ లోంచి ఈవలకు వచ్చి - అక్కడున్న ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే వారు –
"ఇక్కడనించి రాత్రి 8 గంటల 20 నిమిషాలకి ముంబైకి బయలుదేరి వెళ్లిన స్పైస్ జెట్ విమానం ముంబై రన్వే మీద లాండింగ్ అవుతున్నప్పుడు ఆక్సిడెంట్ జరిగింది. ప్రయాణికులలో చాలా మందికి బాగా దెబ్బలు తగిలాయి, ఇంకా పూర్తిగా వివరాలు తెలియవు" – అని చెప్పేరు.
ఒక్కసారిగా శరీరం జలదరించి, 'నన్ను కాపాడేందుకు నాకు విమానం అందకుండా చేసేవా, హే భగవాన్. నీ దయ అపారం. నీ లీల అమోఘం' - అని కనబడని దేముడికి మనసారా భక్తితో నమస్కారం చేసి, కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు, నవనీత్.
*****