కొత్తగా పెళ్లి అయిన శశి , కాపురం మొదటి రోజు ప్రొద్దున 6.30 కి భార్య చేస్తున్న అల్పాహార సువాసనలు ఇంటి నిండా వ్యాపించడంతో అబ్బా! ఎంత బాగుంది సాంబారు వాసన! నోరూరుతోంది ! ఇడ్లీ ,అల్లంపచ్చడి , సాంబార్ కాంబినేషన్ ఎప్పుడో సెలవు మీద ఊరు వెళ్లినప్పుడు అమ్మ చేసేది. మొన్నటి వరకూ వంట వాడు చేసే చపాతీ, కాకరకాయ కూర తో గడిపే నాకు ఈ Corona పుణ్యమా అని అనుకోకుండా పెళ్ళి కుదరటం *తంతే గారెలబుట్టలో పడ్డట్టు* వంట అద్భుతంగా వచ్చిన భార్య చేతిలో పడటం ఎంత అదృష్టం! అనుకుంటూ బ్రష్ చేసి వచ్చి కూర్చున్నాడు. కావ్య ఏమండీ కాఫీ ఇమ్మంటార ? అని అడిగింది శశి కాఫీ వద్దు ముందర ఇడ్లీలను వేడి వేడి సాంబారు ,అల్లం చట్నీ తో ఒక పట్టు పట్టని అన్నాడు. కావ్య టిఫిన్ టేబుల్ మీద పెట్టి శశి తో ఏమండి రండి *నిదానమే* *ప్రధానం* అన్నారు పెద్దలు , ఆహారం విషయంలో మరీ ముఖ్యము, నిదానంగా తినండి అంది. తినే ముందు ఒక్క నిముషం అండి ఒక ఫోటో తీస్తాను ఇలా చూడండి. మన సంసారం మొదటి రోజు టిఫిన్ ఇడ్లీ సాంబార్ చట్నీ తో మొదలయిందని మనకి గుర్తుగా అందరికి తెలిసినట్టు గా ఉంటుంది. ఫేస్బుక్ లో upload చేశాను అనింది కావ్య. సరే లే అని భార్య సంతోషానికి ఫోటో స్టిల్ ఇచ్చాడు వినయ విధేయతలు కలిగిన భార్య దొరికిందని మనసులో సంతోషపడి మొదటి ఇడ్లీ నోట్లో పెట్టుకొని ,సూపర్ కావ్యా! మల్లెపువ్వు లాంటి ఇడ్లీ నోట్లో వేసుకోగానే పీచు మిఠాయి లాగా కరిగిపోతోంది అన్నాడు . ఈ మాట వింటూనే కావ్య ఏమండి ఏమనుకొరుగా మా అమ్మకి ఫోన్ చేశాను, ఇపుడు మీరు నాతో అన్న మాటను తనతో కూడా చెప్పరా అని అడిగింది. ఓహ్ అదేముంది ఫోన్ ఇవ్వు అని శశి అత్తయ్య నమస్కారం ఈరోజు కావ్య చేసిన ఇడ్లీ ,సాంబార్ రుచి అదిరిపోయింది అన్నాడు. సరే బాబు సంతోషం అని అత్త గారు ఫోన్ పెట్టేశారు. ఇక రెండో ఇడ్లీ నోట్లో పెట్టుకోవటం మొదల్లయ్యే లోపల కావ్య , ఏమండీ మా అక్క కి ఫోన్ చేశాను ఇడ్లీ బాగుందని చెప్పరూ ! అనటంతో శశి టిఫిన్ పూర్తి చేసి చెప్తానన్నడు. కావ్య *నిదానమే ప్రధానం* అని ముందరే చెప్పాను కదండీ మొదట తిన్న ఇడ్లీ అరిగి పోనివ్వండి తరువాత రెండో ఇడ్లీ తిందురుకాని అనే మాటతో ఉలిక్కిపడ్డాడు. ఎంత మందికి చెప్పాలో అందరికి చెప్పి ఎలాగో రెండో ఇడ్లీ నోట్లో వేసుకొని ఇంక చాల్లే ఆఫీస్ టైం అయిపోతోందని తయారయ్యాడు. ఆఫీస్ కి వెళ్ళబోతూ వుండగా కావ్య ఏమండీ షూ వేసుకుంటూ కొంచెం తల పైకెత్తి ఇడ్లీ ల గురించి చెప్తే స్టేటస్ లో అప్డేట్ చేసుకుంటా అందరికి తెలియద్దు! కావ్య పై పీకల వరకూ కోపం వచ్చినా తప్పేదేమి లేక వీడియో క్లిప్ కి సహకరించి ఆఫీస్ కి బయలు దేరాడు. ఇలా రెండు మూడు రోజులు గడిచాయి.టిఫిన్ కి భోజనానికి దేనికి కూర్చున్న తినే దానికన్నా వాటి ఫోటోలకు స్టిల్స్ ఇవటం, కామెంట్స్ చెప్పడం, మధ్యాహ్నం,సాయంత్రం,రాత్రి ఆ ఫోటోలకు వచ్చిన whatsapp status అప్డేట్స్ ,ఫేస్ బుక్ లైక్స్ గురించి వినటంతోనే జీవితం గడుపు తున్న శశి ఇంక ఏదైనా ఆలోచించి మార్గం వెతకాలి అనుకున్నాడు. ఎలాగైనా తన బ్యాడ్ days ని గుడ్ days లా మార్చుకోవాలి అని తనకు తనే మంగమ్మ శపథం చేసుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం ఎంత రుచిగా ఉన్నా ఏదో ఒక వంక చెప్పాల్సిందే అనుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరిన శశి ఫ్రెష్ అయ్యి టేబుల్ మీద ఉన్న ముద్దపప్పు,కొత్త అవకాయ,గుత్తి వంకాయ కూర, చారు, గడ్డ పెరుగు, వడియాలు చూశాడు. అవురావుమని తినాలి అని మనసు ఆరాటపడుతున్నా నెమ్మదిగా తినటం మొదలు పెట్టాడు. భోజనం ఎలా ఉంది అని కావ్య అడగ గానే ఈ సారి ముద్దపప్పు కొంచెం ఉడికి ఉంటే బాగుండేది, కూరలో కొంచం ఉప్పు తక్కువై వున్నట్టుగా ఉంది అన్నాడు. వెంటనే కావ్య లోపలికి వెళ్ళిపోయింది.పాపం బాధ పడ్డట్లుగా ఉంది పరవాలేదు it's ok ఎలాగో నెమ్మదిగా నచ్చ చెప్పుకోవచ్చు అని శశి అనుకున్నాడు. ఇంతలో శశి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే లోపల అవతలి వైపు నుంచి ఎంటిరా! కూరలో ఉప్పు తక్కువయిందా , కోడలు చక్కగా వండి పెడుతుంటే వంకలు పెట్టడం మొదలు పెట్టావా! రోజూ మేము whatsapp status లు, కావ్య పంపే ఫొటోలు ,నువ్వు అద్భుతం ,wow so tasty అనటం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. మొన్నటి వరకు ఎండిపోయిన చపాతీ ఉడకని కాకరకాయ కూర తిన్నావు గుర్తుందా! ఏదో ఒక రోజు ఉప్పు తగ్గితే *ఇల్లు పీకి పందిరి వేస్తావా* *ఇంటికి దీపంఇల్లాలు* చక్కగా చుసుకో అంటూ చీవాట్లు పెట్టి ఫోన్ పెట్టేశారు. ఆ ఫోన్ సంభాషణ నుంచి తేరుకొని భోజనము పూర్తి చేసి ఆఫీసు కి బయలు దేరాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకోగానే అమెరికా లో ఉండే అక్క నుంచి ఫోన్, ఎత్తేలోపలే అటునుంచి ఒరేయ్ శశి ఏంటి పప్పు ఉడకలేదా! ఈరోజు కావ్య వంటలో వంకలు వేతికావు అట.నిన్న మంచూరియా బాగుంది,మొన్న ఇడ్లీ అల్లం పచ్చడి బాగుంది,lucky to have wife as kavya అన్నావు. ఈరోజుటికి భార్య చేతి వంట నచ్చట్లేదా! కావ్య అనే పిచ్చుక మీద నీ రుచి అనే బ్రహ్మాస్త్రం ప్రయోగిద్దాం అనుకున్నవా మేము ఉన్నాము ఇక్కడ అంతా చూస్తూ అని ఫోన్ కట్ చేసింది. సమాచారం 5g కన్నా వేగంగా వెళ్తోంది అని అనుకొని ఆ రాత్రి బంధువుల తిట్లని బాగా భుజించి *ఊ అంటే వుత్కృష్టం ఆ అంటే అప్రతిష్ఠ నారాయణా అంటే బూతు మాట* లాగా వుంది తన పరిస్థితి అనుకొని నిద్ర పోయాడు. మరునాడు ఉదయం లేవగానే భార్య ఇచ్చిన ఘుమఘమలాడే కాఫీ కప్పు అందుకొని తాగటం మొదలుపెట్టాడు. ఎలా ఉందండి కాఫీ అనే మాటకు ఏమి చెప్పాలో తెలియక శశి ఏమో కావ్య తెలియట్లేదు అన్నాడు. ఆ మాటకి కావ్య పర్వాలేదండి నేను టిఫిన్ తయారు చెయ్యాలి అని కిచెన్ లోకి వెళ్ళింది. శశి కావ్య normal గా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఫోన్ లు కూడా రాలేదు , ఇంకా ఆఫీస్ కి రెండు గంటలు టైం ఉంది కదా అని న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టాడు. అరగంట తరవాత కాలింగ్ బెల్ రింగ్ అవటంతో తలుపు తీసి చూసాడు.ఎదురుగ్గా స్ట్రెచర్,బయట 108 చూసి అర్థం కాని అయోమయంలో నిల్చున్న భర్తతో వంటింట్లో నుంచి వచ్చిన కావ్య ఇందాక కాఫీ రుచి తెలియట్లేదు అన్నారుగా కరోనా ఏమో అని ఫోన్ చేశాను అండి అనే మాటతో కుదేలై పోయాడు. *పెళ్లంటే నూరేళ్ళ పంట లేదా మంటా !* అని అనుకొని ఇసోలేషన్ హాలిడేస్ కి బయలు దేరాడు.