విలువైన సంపద - డి.కె.చదువులబాబు

Viluvaina sampada

సదానందుడు అనే ముని దగ్గర అనంతుడు, చక్రపాణి అనే శిష్యులు ఉండేవారు.ఇద్దరూ మంచి మిత్రులు. వారి విద్యాభ్యాసం పూర్తయ్యాక సదానందుడు వారితో "నాయనా!నాదగ్గర మహిమాన్విత మైన రెండు పండ్లు ఉన్నాయి. సంపద ఫలం తిన్నవారికి సంపద కలిసి వస్తుంది. ధనవంతులుగా జీవిస్తారు. రెండవది ఆరోగ్యఫలం.ఇది తిన్నవారు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు.ఎవరికి ఏపండు కావాలో కోరుకోండి" అన్నాడు. వెంటనే అనంతుడు ధనం కలిసివచ్చే పండును కోరుకున్నాడు. చక్రపాణి ఆరోగ్యాన్నిచ్చే పండును కోరుకున్నాడు. పండ్లను తిన్న తర్వాత గురువువద్ద సెలవు తీసుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఆర్థికశాస్త్రం అభ్యసించిన అనంతుడు వ్యాపారం ప్రారంభించాడు. వైద్యశాస్త్రం అభ్యసించిన చక్రపాణి వైద్యుడిగా స్థిరపడ్డాడు.అనతికాలంలోనే అనంతుడు మంచి లాభాలతో సంపద సమకూరి ధనవంతుడయ్యాడు.చక్రపాణి గొప్ప వైద్యుడిగా పేరుపొందాడు. అనంతుడు సంపాదించడంలో తలమునకలవుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. కనిపించిన ప్రతిదీ అతిగా తినడం, శారీరకశ్రమ లేకపోవడం,నిరంతరం వ్యాపారాలకు సంబంధించిన ఒత్తిడి కారణంగా రోగాలు చుట్టుముట్టాయి.వైద్యులను కలిశాడు. ఒక వైద్యుడు తీపి తినకూడదన్నాడు. ఒక వైద్యుడు ఉప్పు బాగా తగ్గించమన్నాడు. మరియొక వైద్యుడు నూనె పదార్థాలు, మసాలాలు మానుకోమన్నాడు. రకరకాల మందులిచ్చారు.ఒళ్లంతా సచ్చుగా, నొప్పులతో ఉంటోంది. ఆయాసంగా ఉంది. హుషారు లేదు. ఏపని చేయాలన్నా ఉత్సాహం లేదు. ఒకరోజు ప్రయాణమై గుర్రంబగ్గీలో అనంతుడు, చక్రపాణి ఊరికి బయలుదేరాడు. అనంతుడు వెళ్లే సమయానికి చక్రపాణి వైద్యశాలలో రోగులను చూస్తూ తీరిక లేకుండా ఉత్సాహంగా కనిపించాడు. జబ్బు నయమైనవారు అనంతుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోతున్నారు. కొత్తవారు వస్తున్నారు. చక్రపాణి అనంతుడిని ఆత్మీయంగా ఆహ్వానించాడు. ప్రేమగా పలకరించి క్షేమసమాచారాలు అడిగాడు. "మిత్రమా!ఎంతఉన్నా తినడానికిలేదు. ఉత్సాహం లేదు,నీరసంగా కాలం గడుపుతున్నాను.మన గురువుగారు అడిగినప్పుడు ఆరోగ్యాన్నిచ్చే పండును కోరుకోక పొరపాటు చేశాను" అని అనంతుడు తన పరిస్థితిని వివరించాడు. "మిత్రమా!ఆరోగ్యంగా ఉండడానికి గురువు గారిచ్చిన ఆరోగ్యఫలమే అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారందరూ అలాంటి ఫలాన్ని తినలేదు కదా!ఒక పద్దతి లేకుండా అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, సంపాదనలోపడి ఒత్తిడితో గడపడం, తృప్తిలేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, వ్యసనాలు ఇవన్నీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనారోగ్య ఫలాలు. తక్కువ వయసులోనే ఆరోగ్యం చెడిపోవడానికి నీ నిర్లక్ష్యమే కారణం.ఒకసారి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడితే పూర్తిగా నయం కావడం కష్టం. సమయానికి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన మితాహారం, మందులు తీసుకుంటూ, వ్యాయామం, యోగా చేస్తూ వ్యసనాలు లేకుండా, మనస్సుపై ఒత్తిడి లేకుండా ఉంటూ, సరైనసమయానికి నిద్రపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఈలోకంలో లేదు.నేను అందిస్తున్న వైద్యసేవలు నాకు ఎంతో తృప్తిని, మనశ్శాంతిని ఇస్తున్నాయి. నీసంపదలో కొంతభాగం పేదలకోసం ఉపయోగించు. మనశ్శాంతి,సంతోషం లభిస్తాయి" అన్నాడు చక్రపాణి. జీవితంలో ఆరోగ్యంపట్ల శ్రద్ద లేకపోవడం తాను చేసిన పెద్దతప్పు అని తనలాగా శ్రద్దలేనివాడి ఆరోగ్యాన్ని ఎవరూ కాపాడలేరని గుర్తించాడు అనంతుడు.

మరిన్ని కథలు

Kurchee
కుర్చీ
- జి.ఆర్.భాస్కర బాబు
Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi