స్మృతుల అలల్లో - సుస్మితా రమణమూర్తి

Smruthula alallo

“ సిస్టర్!...డాక్టర్ గారు ఎప్పుడొస్తారు? “ “ వారు ఆపరేషన్ ధియేటర్లో ఉన్నారు. రావడానికి గంట పట్టొచ్చు “ ‘ ఇంకా గంటసేపా!?... ‘ కళ్ళ పరీక్షకు వచ్చిన రామ్మూర్తి గుబురు గెడ్డాన్ని నిమురుకుంటూ, మెలితిరిగిన మీసాలు తడుముకుంటూ నిట్టూర్చాడు. ఎదురుగా కూర్చున్న వ్యక్తి తనవేపే తదేకంగా చూస్తుండటం గమనించి పరిశీలనగా అతడిని చూసాడు. ‘వారు అప్పటి మా సీనియర్ సూపర వైజర్ శ్రీధర్ గారే కదా?...సందేహం లేదు వారే!... పదిహేనేళ్ళ క్రిందట బదిలీపై హైదరాబాదు వెళ్ళిపోయారు . మనిషిలో పెద్దగా మార్పేమీ లేదు. అప్పటిలానే ఉన్నారు. ఆ బుర్ర నిగనిగలు అలానే ఉన్నాయి! వారం వారం ఒక్కో వెంట్రుకను ఇంకా నల్ల చెరువులో బాగా ముంచి ఆరేస్తున్నారన్నమాట!... ఎనభైకి దగ్గరవుతున్నా వారి ఓర్పుకి హేట్సాఫ్! బట్ట తలలో కూడా హుందాగా, ఆకర్షణీయంగానే ఉన్నారు!…’ రామ్మూర్తి అంతరంగంలో నాటి స్మృతుల అలలు లేస్తున్నాయి. వారిని ఎన్నో ఏళ్ళ తర్వాత చూస్తున్నందుకు మదిలో ఆనందం పొంగులు వారుతోంది. ‘ వారు తనను గుర్తు పట్టలేదా!?...గుర్తించి కూడా ముభావంగా ఉన్నారా!?... అప్పుడు ఎంతోమందిమి వారి అదుపాజ్ఞలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించాం . ఆఫ్టరాల్ జూనియర్ని పలకరించడమా?...తనెందుకు పలకరించలేదని అనుకుంటున్నారా?..ఉహుఁ!... వారి స్వభావం అది కాదు. మొక్కుబడి వలన పెరిగిన జుత్తు, మాసిన గెడ్డం, పెద్ద పెద్ద మీసాలలో ఉన్న తనను పోల్చుకోవడం కష్టమే మరి!--- ‘ వారి పదవీ విరమణ తర్వాత తను పదేళ్లు ఉద్యోగం చేసి ఆఫీసర్ హోదాలో రిటైర్ అయ్యాడు. పెన్షన్ వారికంటే ఎక్కువే వస్తోంది. పలకరించక పోవడానికి కారణమిదా?... ఉహుఁ!.. వారికి అలంటి అసూయా భావం లేనేలేదు. అప్పుడప్పుడు చరవాణిలో పలకరిస్తున్నారు కదా?.. మరెందుకు గురువు గారు నోరు విప్పటం లేదు!?- ‘ఆరోజుల్లో అందరికీ మంచి రిపోర్టులే ఇచ్చారు. వారితో పనిచేసిన అందరం మంచి హోదాల్లోనే రిటైర్ అయ్యాం. బహుశా వారికి అప్పటి తన రూపమే గుర్తుండి ఉంటుంది. అందుకే గుర్తించలేదేమో?... అంతే అయ్యుంటుంది….’ రామ్మూర్తి ఆలోచనల అలలతో తలమునకలు అవుతున్నాడు శ్రీధర్ అనె వ్యక్తి చూపులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెదవులపై చిరు దరహాసం, కళ్ళలో ఆనందం తొంగిచూడ్డం రామ్మూర్తి గమనించాడు. ‘ తొందరపడి వారి గురించి తప్పుగా అనుకున్నాను. మరికాసేపు ఎదురు చూద్దాం. ఏ క్షణమైనా పలకరించవచ్చు. అప్పటి ముచ్చట్లు చెప్పుకుని , ఆ మధుర జ్ఞాపకాలలో తేలిపోవచ్చు…’ ‘ రామ్మూర్తిలో చాలా మార్పు వచ్చిందే!.. అప్పుడు జాన్, రాజు, కృష్ణ…ఇంకా చాలామంది ఉండేవారు. అందరిలో రామ్మూర్తేగా చలాకీగా, ఆకర్షణీయంగా ఉండేవాడు!... బుల్ లా పని చేసేవాడు. తనతో ఉన్న వారందరూ తెలివైన వారే! సూపర్ వైజరుగా తనది కర్ర పెత్తనమే!.. అంతా వారే చూసుకునేవారు. అలాంటి సహోద్యోగులు ఉండటం తన అదృష్టమే!...అందరూ తనంటే ప్రాణం పెట్టేవారు. వారంటే తనకూ అంతే అభిమానం! …. ‘ ఆఫీసు పరంగానే కాక , కుటుంబ విషయాల గురించీ ఒకరికొకరం పట్టించుకునే వాళ్ళం. ఆ సంఘటన ఇంకా గుర్తే!...మా పెద్దపిల్ల ఓణీ ఫంక్షన్కి ఉంగరాలు, గొలుసు అమ్మేయాలనుకున్నప్పుడు రామ్మూర్తే అడగకుండానే చేబదులు ఇచ్చాడు. అంతటి అనుబంధం మామధ్య ఉండేది…’ శ్రీధర్ కి నాటి సంఘటనలు గుర్తు కొస్తున్నాయి. ‘హైదరాబాదుకి వెళ్ళింతర్వాత అందరికీ దూరమైపోయాడు తను. ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నా మాట పలుకు లేక ఇలా ఒకరివేపొకరం చూస్తుండి పోవడం ఆశ్చర్యమే!... అర్థం కాని పరిస్థితి!.... అనుకోకుండా ఎదురు పడ్డాం. తను పలకరించేదాకా ఆగడం దేనికి?...తనే పలకరీస్తే సరి!...’ శ్రీధర్ నిర్ణయం బలపడింది. “ శ్రీధర్ గారూ! మీరు లోపలికి వెళ్ళండి “ సిస్టర్ చెప్పేసరికి జనరల్ డాక్టరుని కలియడానికి లేచాడు తను. “ ఏఁవండీ! డాక్టర్ గారు ఆపరేషన్ థియేటరులో బిజీ బిజీగా ఉన్నారట! ఈరోజు వారిక్కడికి రారని సిస్టర్ అంటున్నారు. రేపు మీ కళ్ళు చూపించుకోండి. నేను గైనకాలజీ డాక్టరమ్మని కలియాలి పదండి! “ ఎన్నో ఏళ్ళ తర్వాత కనిపించిన గురువు గారిని కలిసి మనసారా మాట్లాడుకునే అవకాశం లేకపోవడంతో వారికి చేతులు జోడిస్తూ భార్యామణివి అనుసరించాడు రామ్మూర్తి.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న