హాస్పిటల్ - Vemparala Durga Prasad

Hospital

అది 10 పడకలున్న ఓ చిన్న హాస్పిటల్ . కానీ మంచి సెంటర్ లో ఉండడం తో చాలా రద్దీ గా ఉంటుంది. డాక్టర్ హస్త వాసి మంచిదని పేరొచ్చింది. చిన్న చిన్న ఆపరేషన్లకు, ఆక్సిడెంట్ కేసులకు అక్కడకి ఎక్కువ జనాలు వస్తూంటారు. అందుకే ఎప్పుడూ పేషెంట్ల తో కిట కిట లాడి పోతూ ఉంటుంది.

రమేష్ కి కూడా ఆ హాస్పిటల్ ఇంటి దగ్గర. పైగా, డాక్టర్ యువకుడయినా, అతని గురించి అందరూ చాలా బాగా చెప్తారని, ఆ హాస్పిటల్ కి ఎక్కువగా PREFER చేస్తాడు. ఆ హాస్పిటల్ లో సత్యవతమ్మ అనే అనాధ మహిళ ఎప్పుడూ సేవలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఆయాల కంటే ఎక్కువ, నర్సుల కంటే తక్కువ. ఆమెకు ఓ నలభయ్ ఏభై ఏళ్ళ మధ్య వయసు ఉంటుంది. ఆమె ఆ హాస్పిటల్ పరిసరాల్లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ, హాస్పిటల్ అంతా ఆమెదే. నర్స్ లకి, పేషెంట్లకు సాయ పడుతూ ఉంటుంది. చిన్న పిల్లలని ఎత్తుకుని, తల్లులకు రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. నర్సులకు కావాల్సినవి అందించేది ఆమే. బాలింతలని బాత్రూంకి చెయ్యి పట్టి తీసుకెళ్తూ ఉంటుంది. ఎవరేది పెట్టినా తింటుంది. ఒక్క మాట లో చెప్పాలంటే ఆ హాస్పిటల్ లో జీతం భత్యం లేని పనిమనిషి. నర్సులూ, వార్డ్ బాయ్స్, ఆయాలు అందరూ పెద్దమ్మ అని ప్రేమగా పిలుచుకుంటూ వుంటారు. రాత్రి వేళల్లో హెడ్ నర్స్ సుజాత రూమ్ లోనే భోజనం, బట్టలు మార్చుకోవడం. రోజంతా గిలకలా తిరుగు తూనే ఉంటుంది.

రాత్రి వేళల్లో హాస్పిటల్ లోనే పడుకుంటుంది, ఎందుకంటె ఆమె అనాధ, తనకెవరూ లేరంటుంది.

డాక్టర్ గారు కూడా ఆమెని సత్యవతమ్మా అని గౌరవంగా పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ ఆమెని ప్రేమగా చూసుకుంటూ వుంటారు.

రమేష్ బావమరిది పవన్ కి ఆక్సిడెంట్ అవడం తో ఆ హాస్పిటల్ లో జాయిన్ చేసేడు. పవన్ 9వ క్లాస్ చదువుతున్నాడు. స్కూల్ నుండి వస్తూండగా ఆక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కి తల్లి తండ్రులు మూడు సంవత్సరాల వయసులో చనిపోయారు. అక్క, బావ లయిన లక్ష్మి, రమేష్ ల దగ్గరే ఉంటాడు.

“ బ్లడ్ పోయింది, అర్జెంటు గ 2 బాటిల్స్ బ్లడ్ రెడీ చేసుకోమన్నాడు” డాక్టర్.

వాడి BLOOD GROUP ఓ నెగటివ్. ఓ నెగటివ్ BLOOD GROUP వాళ్లతో చాలా PROBLEM . వాళ్ళ బ్లడ్ ఆక్సిడెంట్ కేసెస్ లో మరియు ఎమెర్జెన్సీస్ లో... GROUP తెలియని సందర్భాల్లో, TRAUMA కేసెస్ లో ఇతరులకి ఎక్కించు తారు కానీ, వాళ్లకి మాత్రం ఓ నెగటివ్ బ్లడ్ మాత్రమే ఎక్కించాలి.

డాక్టర్ వచ్చాడు, రమేష్ ని అడిగేడు.

"బ్లడ్ తెచ్చేరా? "

"లయన్స్ CLUB లో, ఇతర బ్లడ్ బ్యాంక్స్ లో ఓ నెగటివ్ బ్లడ్ ఎక్కడా స్టాక్ లేదు. డోనార్స్ లిస్ట్ సంపాదించ గలిగెను. కానీ ఒకే వ్యకి వూళ్ళో వున్నారు, ఆయన ఇప్పుడు వస్తున్నారు. మా ఇంట్లో చూస్తే ఎవరిదీ ఓ నెగటివ్ BLOOD GROUP కాదు డాక్టర్." అన్నాడు.

"యెంత సేపట్లో వస్తారతను?... ఆలస్యం చేస్తే పేషెంట్ కి ప్రమాదం" అన్నాడు డాక్టర్ .

రమేష్ సమాధానం చెపుదామని చూస్తూండ గానే, రమేష్ బ్రదర్ రాజు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అతనే వీళ్ళు మాట్లాడిన డోనార్ .

డాక్టర్ అతని బ్లడ్ పరీక్ష చేసి, వెంటనే అతని దగ్గర బ్లడ్ తీసుకునే ఏర్పాట్లు చేసాడు.

“ PATIENT పరిస్థితి మెరుగు పడుతోంది. ఇంకో బాటిల్ సాయంత్రానికల్లా ఎక్కించాలి, చూసుకోండి, లేదా మేము తెప్పించమంటే తెప్పిస్తాం కానీ RS. 8000 అవుతుంది RARE బ్లడ్ GROUP కదా, వేరే ఛానల్ లో ప్రయత్నిస్తాము..” అన్నాడు డాక్టర్.

రమేష్ కి కంగారు గా వుంది. డాక్టర్ మీద ఆధార పడడమే బెటర్ అనిపించింది. ఈ కంగారు లో అటూ ఇటూ తిరగలేము అనుకున్నాడు.

"సరే డాక్టర్ నేను పే చేస్తాను", ARRANGE చెయ్యండి " అన్నాడు.

సాయంత్రానికి 2వ బాటిల్ కూడా ఎక్కించేరు.

పవన్ ని మర్నాడు I.C.U. నుండి రూమ్ కి SHIFT చేసేసేరు. ఇప్పుడు బాగానే వున్నాడు. ఒక్క రోజు ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేడు డాక్టర్.

మధ్యాహ్నం పవన్ రూంలోంచి బయటకి వస్తూ ఉంటే, పక్కనే ఉన్న హెడ్ నర్స్ సుజాత రూమ్ లో నుండి మూలుగు వినపడింది. సత్యవతమ్మ మంచం మీద పడుకుని మూలుగుతూ వుంది.

సుజాత కేకలేస్తోంది. " డాక్టర్ గారు మందులిచ్చారుగా.. వేసుకుని పడుక్కో, మూలగకు, నాకు డిస్టర్బన్స్. "ఈ ఆపిల్ జ్యూస్ తాగు" అని జ్యూస్ ప్యాకెట్ ఇచ్చింది.

రూమ్ లోకే తొంగి చూసి, “ అదేమిటి, చలాకీ గా తిరిగే సత్యవతమ్మ ఇవాళ బయట కనపడక పొతే, ఊరెళ్లిందేమో అను కున్నా,...సిక్ అయ్యిందా?” అన్నాడు.

"ఆ అవును సార్, తనకి వంట్లో బాగులేదు " అంటూ రూమ్ లోంచి బయటకి వచ్చేసింది సుజాత.

వచ్చి, తలుపు దగ్గరగా వేసేసింది.

రమేష్ తిరిగి బావమరిది రూమ్ లోకి వెళ్లి పోయాడు.

రాత్రి రూమ్ లో బావమరిది కి సాయంగా రమేష్ పడుకున్నాడు. ఓ రాత్రి వేళ నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్న రమేష్ కి కారిడార్ లో సన్నగా మాటలు వినపడి తలుపు సందులోంచి చూసాడు.

సుజాత, డాక్టర్... ఆమె రూమ్ బయట మాట్లాడుకుంటున్నారు.

" సార్... సత్యవతమ్మ చాలా నీరసంగా వుంది. జ్వరం కూడా వచ్చింది. మూలుగుతోంది " అంది.

ఆ REPRESENTATIVES ఇచ్చిన సాంపిల్స్ వున్నాయి గా, ఆ మందులు వెయ్యి. పర్వాలేదు, రేపటికి తగ్గి పోతుందిలే " అన్నాడు.

" అది కాదు సర్, గత నెల లోనే బ్లడ్ తీసేము కదా, మరో 2నెలలు ఆగాల్సింది ..." అని నసిగింది సుజాత.

ఏం చేస్తాం, ఆమెది RARE బ్లడ్ GROUP, బయట ఓ నెగటివ్ BLOOD త్వరగా దొరకటం లేదు. 201పేషెంట్ కి తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది.” అన్నాడు డాక్టర్.

"అవుననుకోండి...” గొణుగుతోంది సుజాత

ఏమీ పర్వాలేదు లేమ్మా, ముసల్ది గట్టి పిండమే, 2 రోజుల్లో లేచి కూర్చుంటుంది. ఆ సాంపిల్స్ వెయ్యి. మరో డోస్ అవసరమయితే పెంచు. ఆపిల్ జ్యూస్ ఇస్తూ వుండు. " అన్నాడు డాక్టర్ ...తేలికగా తీసిపారేస్తూ.

" రూమ్ 201అంటే తన బావమరిది కోసమా " అనుకున్నాడు రమేష్.

"సత్యవతమ్మ ప్రాణం అంటే అంత తీసిపారేస్తున్నాడు డాక్టర్... ఆమె ప్రాణం మీదకి తెచ్చి బ్లడ్ దోచేసేరన్న మాట"

అంటే గొడ్డు చాకిరీ చేస్తూ, వాళ్ళూ వీళ్లూ పెట్టింది తింటూ ఓమూల పడుకునే సత్యవతమ్మ డాక్టర్ కి ఇలా ఉపయోగపడుతోందా ?" ఆమె జీవితం తో ఆడుకుంటూ ఇలా డబ్బు సంపాదించడం యెంత ఘోరం...

"పాలిచ్చే ఆవుని మేత ఖర్చు లేకుండా, హాస్పిటల్ లో కట్టేసుకున్నాడు ఈ డాక్టర్ “ అనుకున్నాడు రమేష్.

ఇప్పుడతనికి డాక్టర్ మీద వున్న మంచి భావం తొలగి పోయింది. తన బావమరిదిని కాపాడిన సత్యవతమ్మ కి ఏదయినా చేసి ఋణం తీర్చుకోవాలి అనిపించింది.

మరునాడు పవన్ ని డిశ్చార్జ్ చేసేరు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చూసాడు సత్యవతమ్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భార్య లక్ష్మి తో సంప్రతించి ఒక నిర్ణయానికి వచ్చేడు రమేష్.

తమతో బాటే ఉంటుంది అని సత్యవతమ్మని ఒప్పించి ఇంటికి తీసుకు వచ్చేడు.

ఇప్పుడు రమేష్ లక్ష్మి ల కు, పవన్ కు ఒక పెద్ద దిక్కు వచ్చింది.

-END -

మరిన్ని కథలు

Swargalokam vardhillali
స్వర్గలోకం వర్ధిల్లాలి
- సదాశివుని లక్ష్మణరావు విశాఖపట్నం
Dongalu baboy
దొంగలు బాబోయ్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Lokam teeru
లోకం తీరు
- టి. వి. యెల్. గాయత్రి.
Navyapatham
నవ్య పధం
- కొడవంటి ఉషా కుమారి
Gamyam teliyani gamanam
గమ్యం తెలియని గమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vuttaralayya
ఉత్తరాలయ్య
- కామేశ్వర రావు
Naati tallula banah tatwam
నాటి తల్లుల భనఃతత్త్వం
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Garvabhangam
గర్వభంగం
- సరికొండ శ్రీనివాసరాజు