పొదుపు - సి.హెచ్.ప్రతాప్

Podupu

రామాపురంలో కృష్ణయ్య అనే రైతు వుండేవాడు. అతనికి ఒక ఎకరం పొలంతో పాటు రెండు ఆవులు, మూడు గేదెలు వున్నాయి. కృష్ణయ్య పొలంలో వ్యవసాయం చేస్తుంటే అతని భార్య పాడిపనులు చేస్తూ, వచ్చే పాలతో ఆ గ్రామంలో వ్యాపారం చేసి భర్తలు చేదోడు వాదోడుగా వుండేది. ఖాళీ సమయంలో ఇంటి వెనుక వున్న జాగాలో కూరగాయలు పండిస్తూ వాటిని తన రోజు వంటకు ఉపయోగించేది. వారిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ వచ్చే ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ గుట్టుగా సంసారం నడిపేవారు. ఇద్దరికీ దుబారా ఖర్చు నచ్చేది కాదు. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని, కరువు కాటకాలు వంటి ఆపదలు వచ్చినప్పుడు తమను ఒడ్డున పడేసేది తాము దైనందిన జీవితంలో చేసే పొదుపు మాత్రమేనని ఇద్దరూ ఖచ్చితంగా నమ్మేవారు. వారి దినచర్య కూడా పొదుపు విధానాలనే ప్రతిఫలించేది.

అయితే ఆ ఊరిలో వున్న రైతులు, మోతుబరులు, పెద్ద మనుష్యులకు వీరి విధానాలు నచ్చేవి కావు. పిల్లికి బిచ్చం పెట్టని దంపతులని వారిపై ముద్ర వేసి దూరంగా వుంచేవారు. ఏ శుభకార్యాలకు వీళ్ళను పిలిచేవారే కాదు. వీరిని దగ్గరకు రానిస్తే ఆ పిసినిగొట్టు వాసనలు తమకెక్కడ అబ్బుతాయోనన్న భయాన్ని వీళ్ళు వ్యక్తపరుస్తుండేవారు. వారిపై అనధికార సామాజిక బహిష్కరణ అమలు చేసి , వారితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరాదని ఊరివారిని శాసించారు. అయితే నిండు కుండ తొణకదన్నట్లు వీరి వెక్కిరింపులు, అవహేళనలు, సామాజిక బహిష్కరణ కృష్ణయ్య దంపతులపై ఏ మాత్రం పడలేదు. ఎవ్వరినీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతూ సంతృప్తికరమైన జీవితం గడిపేవారు.

ఇదిలా వుంటే ఒక సంవత్సరం వర్షాలు అసలు కురవక దుర్భిక్ష్య పరిస్థితులు నెలకొన్నాయి. పంటపొలాలన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఇళ్ళల్లో దాచుకున్న డబ్బు, దస్కం, గ్రాసం అన్నీ అయిపోయి గ్రామస్థులు బాధల్లో పడ్డారు. పక్క ఊరువారిని అప్పు అడుగుదామంటే వారి పరిస్థితి కూడా అంతే. పన్నులు వసూలు కాక, జమిందారు కూడా చేతులెత్తేసాడు.

డబ్బున్న పెద్దమనుష్యులకు పేదవారికి సహాయం చేసేందుకు మనస్సొప్పలేదు. పైగా వీరికి డబ్బు లేదా ఎటువంటి సహాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అని అనుకున్నారు.దానితో ఊళ్ళో ఎక్కడ చూసినా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేసే ప్రజలే కనిపించారు.

వీరి బాధలు చూడలేక కృష్ణయ్య దంపతులు మానవత్వంతో స్పందించారు. తమ ఇంటి వెనుక వున్న బావి నుండి నీళ్ళు వాడుకోనిచ్చారు. పొదుపు చేసి దాచుకున్న ధాన్యం, పప్పులు అందరికీ ఉచితంగా పంచేసారు. దానితో ఊరిలో పేదవారి ఆకలి తీరింది. అందరూ వచ్చి కృష్ణయ్య దంపతులు మా పాలిట దేవుళ్ళని పొగిడారు. కృష్ణయ్య దంపతులు చేసిన ఆ నిస్వార్ధ సేవకు ఊరి పెద్దమనుష్యులకు కూడా కనువిప్పు కలిగింది. మన కొసం మనం చేసే పని మనతొనే అంతరించిపొతుంది కాని పరులకొసం చేసే పని శాశ్వతంగా నిలిచి పొతుంది అన్న విషయం వారికి ఆలస్యంగా అర్ధమయ్యింది. . పిసినారి అంటూ ముద్రవేసి ఆ దంపతులను సామాజికంగా బహిష్కరించడం ఎంత తప్పో తెలిసింది. వచ్చి ఆ దంపతులకు క్షమార్పణ చెప్పుకున్నారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న