కుడి ఎడమైతే - VEMPARALA DURGA PRASAD

Kudi edamaite

కిషోర్ వుద్యోగం చేసేది హైదరాబాద్ లో. గత ఏడాది తను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండగా తండ్రి (father) రఘుపతి చనిపోయాడు. తండ్రి మరణంతో పై చదువులు మానుకుని క్యాంపస్ లో వచ్చిన ఉద్యోగం లో జాయిన్ అయిపోయి, హైదరాబాదులో ఉంటున్నాడు.

కిషోర్ అక్క శ్యామలకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. శ్యామల, ఆమె భర్త కిరణ్ లు విజయవాడలోనే కాపురం పెట్టడంతో సీతమ్మకు కొంత గుండె ధైర్యం... కూతురు అల్లుడు దగ్గరగా ఉన్నారని. కిషోర్ కి కూడా హైదరాబాద్ కంటే దూరం వెళ్లడం ఇష్టం లేదు ఎందుకంటే, అతనికి తల్లి సీతమ్మ అంటే ప్రాణం.

వారానికోసారి తల్లిని చూడడానికి గుడివాడ వచ్చేస్తాడు. ఆదివారం రాత్రి(night) బయలుదేరి బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడం అతనికి అలవాటే. ఒక్కొక్కసారి కొడుకుతోపాటు బయలుదేరి విజయవాడ వచ్చి కూతురు, అల్లుడిని చూసి ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది సీతమ్మ.

ఉన్నది సొంత ఇల్లు కాకపోయినా ఆమెకు తన భర్త జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అక్కడ ఉండడమే ఇష్టం. కిషోర్ తనతో హైదరాబాద్ రమ్మన్నా ఆమె ఒప్పుకోలేదు . ఎప్పటిలాగే ఈరోజు కూడా సీతమ్మ, కిషోర్ ఉదయమే గుడివాడ నుండి బయలుదేరి శ్యామల ఇంటికి వచ్చారు. రాత్రి పది గంటలకి బెంజ్ సెంటర్లో కిషోర్ బస్సు ఎక్కాలి.

రాత్రి 10:00 అవుతుండగా కిరణ్ తన బావమరిది కిషోర్ ను మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి బస్సు ఎక్కించాడు. అది సెమి స్లీపర్ బస్సు. స్పేర్ డ్రైవర్ (driver)ఉంటాడు. అతనే టికెట్స్ పరిశీలించి, రైట్ చెప్పేక డ్రైవర్ బస్సు పోనిస్తాడు కిరణ్ కి బాయ్ చెప్పి, ఆ రెండో డ్రైవర్ కి తన టికెట్ చూపించి, కిషోర్ 9 నెంబర్ సీట్ లో కూర్చున్నాడు . అది కిటికీ పక్క సీటు, DRIVER నుండి ౩వ వరస... బస్సు బయలుదేరింది.

తన పక్క సీటు ఖాళీగా ఉంది. ఆర్టీసీ బస్టాండ్ దాటాక భవానీ పురం దగ్గర ఒక వ్యక్తి వచ్చి పక్క సీట్లో కూలబడ్డాడు. మనిషి బలిష్టంగా ఉన్నాడు, కానీ తన వయసే ఉంటుంది అనుకున్నాడు కిషోర్.

ఆ వ్యక్తి పెరిగిన గడ్డం, మీసాలు తో రఫ్ గా కనిపిస్తూ ఖద్దరు షర్ట్ వేసుకుని వున్నాడు. బహుశా చోటా రాజకీయనాయకుడు ఏమో అనుకున్నాడు కిషోర్. కూర్చున్న దగ్గర నుంచి హ్యాండ్ రెస్ట్ ని పూర్తిగా ఆక్రమించేసి కొద్దిగా మీద పడుతున్నట్టే ఉన్నాడు.

ఇంతలో స్పేర్ డ్రైవర్ వచ్చి. “పి కిషోర్ మీరేనా” అని అడిగాడు

“అవునని” తల ఎగరేసాడు అతను. అప్పుడు తెలిసింది కిషోర్ కి అతనిది తన పేరే అని. కోదాడ దాకా అతని న్యూసెన్స్ భరించాడు కిషోర్ . పైగా అతని వాలకం చూస్తే తాగినట్టు కనిపిస్తున్నాడు.

“ఇలా ఇబ్బంది పడుతూ హైదరాబాద్ దాకా ప్రయాణించాలా” అని ఆందోళనగా ఉంది. పైగా ఇంకో అనుమానం వచ్చింది, బస్సు కుదుపులకు అతను వాంతి చేసుకుంటే?” తాను ఇబ్బంది పడతాడు అనిపించింది.

అందుకని, ఒకసారి “ ఎక్స్క్యూజ్మీ “ అని పిలిచాడు.

నిద్రమత్తులోనే ఏమిటి అన్నట్టు చూసాడు అతను.

“దయచేసి మీరు కిటికీ వైపు కూర్చుంటారా ? నేను మీ సీట్లో కూర్చుంటాను “ అన్నాడు.

సరేనని ఆ వ్యక్తి సీటు మారాడు. విండో సీట్ ఇష్టమేమో, ఆ వ్యక్తి కిటికీ వైపు వాలి పడుకోవడంతో ఇప్పుడు కిషోర్ కి డిస్టబెన్స్ లేదు. కిషోర్ కూడా ఒక కాలు మధ్య దారి వైపు పెట్టుకుని ఎడమ పక్కకు తిరిగి పడుకున్నాడు.

ఇంకో అరగంటలో ఆ బస్సు సూర్యా పేట చేరుతుంది అనగా ఆ సంఘటన జరిగింది. ఐరన్ లోడ్ తో వస్తున్న ఒక పెద్ద లారీ ఎదురుగా వచ్చి బస్సు కుడివైపు బలంగా గుద్దుకుంది. బస్సు రెండు మూడు పల్టీలు కొట్టి కల్వర్టు పక్కన పొలాల్లో పడిపోయింది .

ఆ ఏరియా అంతా బస్సు ప్రయాణికుల ఆర్తనాధాలతో నిండిపోయింది. యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందంటే బస్సు కుడి చేతి వైపు డ్రైవర్ నుండి మొదలుపెట్టి మూడు సీట్లు వరకు కూర్చున్న వాళ్ళు శరీరాలు తెగి పడిపోయాయి, డ్రైవర్ కాక స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. డ్రైవర్ సీటు తో సహా ..సీట్లు బోల్టులు ఊడి ఎగిరి పడటంతో అందరూ చెల్లాచెదురుగా విసిరేసినట్లు పడిపోయారు.

బస్సు అద్దాలు పగిలిపోవడంతో స్పృహలో ఉన్నవాళ్లు మాత్రం పాక్కుంటూ పొలాల్లోకి గాయాలతో బయటపడ్డారు. సెల్ల్ ఫోన్లు మరియు లగేజీలు అయితే ఎవరి లగేజీ ఎవరిదో తెలియనంత దూరానికి తుళ్ళి పడిపోయాయి.

ఆ మిడ్ నైట్ ఆ యాక్సిడెంట్ చేసిన శబ్దానికి దగ్గర్లోని గ్రామస్తులు (villagers) హుటాహుటిని కదిలి వచ్చారు. వారు చేసిన సాయం వల్ల చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు.

కిషోర్ కి ప్రాణాపాయం తప్పింది కానీ స్పృహలో లేడు. నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం అయ్యేలోపు వాళ్లు పొలాల్లో పడి ఉన్నారు. అంబులెన్స్లు రావడంతో తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ తరలించారు. స్వల్పంగా గాయాలైన వారిని సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు. లక్కీగా కిషోర్ కి చర్మం పైన గీసుకున్న దెబ్బలే తగిలాయి గాని, యెగిరి పడడం వలన కాలర్ బోన్ విరగడంతో స్పృహ కోల్పోయాడు. అందువల్ల సూర్యాపేట హాస్పిటల్లో చేర్చారు.

డ్రైవర్ని, మరణించిన మరో ముగ్గురు ప్రయాణికుల్ని మార్చురీకి తరలించారు 2 వ DRIVER కి తీవ్ర గాయాలు ఇవ్వడంతో హైదరాబాద్ ఉస్మానియాలో చేర్చారు.

మర్నాడు ఉదయం 9 గంటలకి కిషోర్ కి తెలివి వచ్చింది. ఒక ఎస్సై, కానిస్టేబులు తానున్న మంచానికి దగ్గరలో కుర్చీలో కూర్చుని ఉన్నారు.

డ్యూటీ డాక్టర్ వచ్చి పరీక్ష చేశారు. కిషోర్ కి ఒళ్లంతా సలపరంగా వుంది., తల పగిలిపోతున్నంత ఫీలింగ్. కుడి చేయి కదప బోయాడు, కానీ సాధ్యం కాలేదు, ఏదో పట్టేస్తున్న భావన.

“ కదలకండి ...మీకు కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయింది, కట్టు వేసాము. మీరు కుడి వైపు తిరగలేరు. ఆరు వారాలు కట్టు ఉంటుంది. అదృష్టవశాత్తు అంత పెద్ద ప్రమాదంలో, మీరు బ్రతికి బయటపడ్డారు” అన్నాడు డాక్టర్. కిషోర్ ఆయనకేసి దీనంగా చూశాడు...

“ ఏం కావాలి చెప్పండి అన్నాడు డాక్టర్ .

“మా వాళ్ళకి ఫోన్ చేయండి నా ఫోన్ ఎక్కడ పడిపోయిందో తెలియదు” అన్నాడు కిషోర్.

“ అవి అన్నీ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు” అన్నాడు డాక్టర్.

యాక్సిడెంట్స్ లో పోలీస్ ఫార్మాలిటీస్ అలా ఉంటాయేమో అనుకున్నాడు కిషోర్. ఇది జీవితంలో మొదటి భయంకర అనుభవం అతడికి. ఇంతలో తల్లి గుర్తుకు వచ్చింది, ఎంత తల్లడిల్లి పోతుందో...అనిపించింది.

“ప్లీజ్ త్వరగా మా బావగారికి ఫోన్ చేయించండి విజయవాడ లో వుంటారు” అన్నాడు బాధతో మూలుగుతూ. స్వరం తేలిపోయింది. ఇంతలో NURSE వచ్చి, గ్లాసుడు వాటర్ తాగించింది. తాగాక ఎడమ పక్క, కనపడిన మేరకు కు దృష్టి సారించాడు కిషోర్. తన తోటి ప్రయాణికులు చాలామంది అక్కడ తలొక బెడ్ మీద పడుకుని ఉన్నారు. అందులో చాలామంది షాక్ లో ఉన్నారు. కొంతమందికి దగ్గర వాళ్ళు వచ్చేసారు... వాళ్ళ ఏడుపులు, పెడబొబ్బలతో హాస్పిటల్ వాతావరణం భీతావహం గా ఉంది.

పరిస్థితి గమనించిన ఎస్ఐ డాక్టర్ వైపు చూశాడు, డాక్టర్ తలాడించాడు... పర్వాలేదు అడగొచ్చు అన్నట్లు .

ఎస్సై కిషోర్ కి దగ్గరగా వచ్చి కిషోర్ పక్కన నిలబడి అడిగాడు... “మీరు బస్ కి వచ్చేటప్పుడు మీ బావ గారి ఇంటి నుంచేనా వచ్చారు ?” అన్నాడు.

“అవును “ అన్నాడు కిషోర్ . “ మీరు మీ బావ గారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు స్వప్న అనే అమ్మాయిని మీ కారులోకి ఎక్కించుకున్నారా “ అని అడిగాడు..

“నేను మా బావ మోటార్ సైకిల్ మీద బస్సు స్టాండ్ కి వచ్చాం” అన్నాడు కిషోర్.

“ మీరు అబద్ధాలు ఆడినా చెల్లవు కిషోర్, మా వద్ద అన్ని ఆధారాలు వున్నాయి ...మీ బావగారి మీద, మీ మీద ఎమ్మెల్యే గారు 4 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించారు. నిన్న సాయంత్రం 7:00 సమయంలో సప్నా అనే అమ్మాయిని మీ బావగారు సహకారంతో బలవంతంగా కారులోకెక్కించుకుని మీరు కిడ్నాప్ చేయబోయిన విషయం తెలిసింది”

క్షణం ఆగి... కిషోర్ ని పరిశీలనగా చూస్తూ ఇలా అన్నాడు ఎస్సై

“ ఆమె తప్పించుకుని పారిపోయి 4TH Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి ఇచ్చింది. ఆమె విజయవాడ లో ఎమ్మెల్యే గారి చెల్లి కూతురు. మీ ఎమ్మెల్యే గారికి, మా తెలంగాణ డీజీపీ గారు CLOSE. అందుకే మా డీజీపీ గారి నుండి మాకు ఆర్డర్స్... మీరు హైదరాబాద్ బస్సు స్టాండ్ లో దిగ గానే కస్టడీ లోకి తీసుకోమన్నారు. కానీ అనుకోకుండా మీ బస్ కి యాక్సిడెంట్ అయింది.” అన్నాడు స్థిరంగా ఎస్ఐ... మీరు తప్పించుకోలేరు అన్నట్లు.

అసలే ఆక్సిడెంట్ షాక్ లో వున్న కిషోర్ కి పిచ్చెక్కినట్లు అయింది.

“ మీరు ఎవరో అనుకుని నా దగ్గరికి వచ్చి ఉంటారు... నాకు నేర చరిత్ర లేదు, పైగా ఆ స్వప్న ఎవరో నాకు తెలీదు. మా బావగారి వద్ద కారు కూడా లేదు ” అన్నాడు అమాయకంగా కిషోర్.

‘అప్పుడు ఎస్ఐ రిజర్వేషన్ చార్ట్ చూపిస్తూ మీ సీట్ నెంబర్ 10 కదా అన్నాడు.

అప్పుడు కిషోర్ కి గుర్తుకొచ్చింది ... తన పక్కనున్న వ్యక్తితో తాను సీట్ మార్చుకున్న విషయాన్ని ఎస్ఐకి చెప్పాడు.

“ నా పేరు కె. కిషోర్, అతని పేరు పి. కిషోర్, బహుశా మీరు అతని గురించి అనుకున్నారేమో” అన్నాడు.

ఎస్సై కి ఇప్పుడు విషయం అర్థమైంది ...తనకి డీజీపీ గారి నుంచి వచ్చిన సందేశంలో పేరు, సీట్ నెంబర్ ఉన్నాయి . ఫోటో ఇచ్చి ఉంటే తను పోల్చుకోగలిగేవాడు, ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ లేదు అందువల్లే ఈ సమస్య అనుకున్నాడు.

అప్పుడు ఎస్సై కి ఒక ఆలోచన వచ్చింది ఫోన్ తీసుకుని కిషోర్ ని వాళ్ళ బావ నెంబర్ చెప్పమన్నాడు. చెప్పాక డైల్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడమని ఇచ్చాడు.

జరిగిన యాక్సిడెంట్ వివరాలు కిరణ్ కి చెప్పాడు కిషోర్. కంగారు పడిపోయాడు కిరణ్.

ఎస్ఐకి, కిషోర్ సంభాషణ, అవతలి వాళ్ళ మాటల్లో నిజాయితీ అర్థమైంది.

కిషోర్ కి సారీ చెప్పి వెళతాను అని కదులుతూ... డాక్టర్ వైపు చూశాడు.

డాక్టర్ ఎస్సై తో ఇలా అన్నాడు.... “. ఈ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వాళ్ళందరిలో కిషోర్ అనే వ్యక్తి ఇతరొక్కడే అని చిన్న దెబ్బలతో తప్పించుకున్న ప్రయాణీకుడి సహాయం తో గుర్తించగలిగేము. అందుకే మీరు అతనికి స్పృహ వచ్చేదాకా వెయిట్ చేశారు. బస్సు లో దొరికిన చార్ట్ ఒక్కటే మనదగ్గర ఆధారం. అందరి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాలి. బస్సు లో వున్న 2వ డ్రైవర్ ఇక్కడ లేడు. గుర్తించడం కొద్దిగా కష్టమే, అయితే మెయిన్ డ్రైవర్ కాకుండా, మరో ముగ్గురు మరణించారు, వాళ్ళ వివరాలు తెలియాల్సి వుంది, వాళ్ళ డెడ్ బాడీస్ మార్చురీ లో వున్నాయి”. చూస్తానంటే చూపిస్తాను”.

ఎస్సై తలాడించి వెళ్లి పోయాడు. అప్పుడు కిషోర్ కి అర్థమైంది . తన సీట్ లో కూర్చున్న వ్యక్తి ఈ యాక్సిడెంట్ కి బలైపోయాడు అని... తాను సీటు మారి బతికి పోయాడన్నమాట.

మధ్యాహ్నం కి కిరణ్, శ్యామల, సీతమ్మ టాక్సీ లో సూర్యా పేట చేరుకున్నారు.

కిషోర్ని ఆ స్థితిలో చూసి ముగ్గురూ చలించి పోయారు.

భగవంతుడి దయవల్ల గాయాలతో అయినా బ్రతికి బట్టకట్టాడని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వాళ్ళు.

ఈ సంఘటన కిషోర్ జీవితంలో మర్చిపోలేడు. ఒక్కో సారి "కుడి ఎడమయితే మృత్యువుకి దూరంగా జరుగుతామన్న మాట “అనుకున్నాడు.

-END-

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న