ఒక వూళ్ళో చందు అనే వ్యాపారి ఉండేవాడు. అందరికీ సులువుగా మాటిస్తాడు కానీ నిలబెట్టుకోడు.
ఒకసారతడు పొరుగూరు నుండి తిరిగొస్తుండగా ఒక పొగరుబోతు ఎద్దు పొడవబోయింది. ఆ దార్లో వెళుతున్న వీర్రాజు అనే రైతు చందుని ప్రక్కకి లాగి రక్షించాడు. తనని కాపాడిన వీర్రాజు మీద కృతజ్ఞతా భావం కలిగింది చందుకి.
అతడి గురించి వివరాలు అడిగాడు చందు. అతడికి పెళ్లీడుకొచ్చిన కూతురుందని , సంబంధము వెతుకుతూ వచ్చానని చెప్పాడతడు.
“అలాగా. మా ఊళ్ళో పెళ్లీడు కొచ్చిన కుర్రాళ్ళున్నారు. మీరెళ్లిన చోట కుదరకపోతే మా ఇంటికి రండి. సాయం చేస్తాను” అని ఆహ్వానించాడు చందు.
సరేనంటూ వెళ్ళిపోయాడు వీర్రాజు.
ఊరెళ్ళాక మిత్రుడైన రఘుతో ‘తనని రక్షించిన వీర్రాజు గురించి, అతడి కూతురు సంబంధం గురించి’ చెప్పి సాయమడిగాడు చందు.
సరేనన్నాడు రఘు. అన్నట్టుగానే మూడు రోజుల్లో పెళ్లీడు కొచ్చిన యువకుల వివరాలను చందుతో చెప్పాడు.
చందు ‘వాళ్ళమ్మాయికి పెళ్లి కుదిరి ఉంటుంది. లేదంటే నా దగ్గరికి వచ్చేవాడు. ఆ విషయం మరచిపో“ అన్నాడు తేలిగ్గా. మిత్రుడి వైఖరికి ఆశ్చర్యపోయాడు రఘు.
పది రోజుల తరువాత చందు, రఘు కలసి ఉన్నప్పుడే వీర్రాజు వచ్చాడు. ఏవైనా పెళ్లి సంబంధాలున్నాయా అని అడిగాడు. వీర్రాజుని కూర్చుండబెట్టి మర్యాదలు జరిపిన తరువాత ’ ‘ఎంతో ప్రయత్నించాను. ఈ వూళ్ళో యువకులు లేరని’ సులువుగా అబద్ధం చెప్పాడు చందు. అది విని ఆశ్చర్యపోవడం రఘు వంతయింది.
ఒకసారి అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది చందుకి . ప్రక్క ఊరులోని పెద్ద వ్యాపారి దగ్గర అప్పు తెచ్చాడు చందు. నెల రోజుల్లో తీరుస్తానని మాట ఇచ్చాడు.
నెలరోజులు గడిచినా ఆ వ్యాపారి అప్పు తీర్చలేదు చందు. సరికదా అతడికి కనబడకుండా తప్పించుకుంటున్నాడు. ఆ వ్యాపారి వచ్చినప్పుడు ఇంట్లో లేడని పిల్లలతో చెప్పిస్తున్నాడు. అతడొస్తాడనుకున్న సమయానికి పని పెట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు.
ఆ వ్యాపారికేం చేయాలో తెలియక, అప్పు వసూలు కాలేదన్న బాధలో ఊళ్ళోని వారికీ విషయం చెప్పాడు. వాళ్లలో ఒకరు , రఘు గురించి చెప్పి అతడిని కలిస్తే చందుకి చెబుతాడన్నారు.
ఆ వ్యాపారి రఘుని కలిసాడు. “చందు మంచివాడే. ఏదో ఇబ్బందిలో ఉన్నాడు. అతనితో మాట్లాడుతాను” అని సర్దిచెప్పి పంపించేశాడు.
చందుని ఆ సాయంత్రమే కలిసి పొరుగూరి వ్యాపారి తాలూకా అప్పు గురించి అడిగాడు రఘు. “అదా.. తీరుస్తానులే. డబ్బు అందగానే ఇచ్చేస్తా” అన్నాడు చందు తేలిగ్గా.
‘నీకు డబ్బు ఎప్పుడు అందుతుందని’ రఘు అడిగితే ‘ఖచ్చితంగా చెప్పలేను. కానీ తప్పక తీరుస్తా’నన్నాడు చందు. “ఖచ్చితంగా చెప్పలేనప్పుడు నెలరోజులని మాట ఎందుకిచ్చావు? మాట ఇచ్చినప్పుడు నిలుపుకోవద్దా’ అని నిలదీసాడు రఘు.
“అప్పు పుట్టడం కోసం అలా చెప్పానులే. నేనేమైనా తీర్చనని చెప్పానా?” తిరిగి ప్రశ్నించాడు చందు.
“గతంలో చాలాసార్లు నువ్వు మాట తప్పావు. వీర్రాజుకి నా ముందే అబద్ధం చెప్పావు. ఇప్పుడీ వ్యాపారిని ముప్పు తిప్పలు పెడుతున్నావు. ఇది ధర్మమా?” అని కోపంగా అడిగాడు రఘు.
“నువ్వు మరీ గొప్పగా వూహించుకోకు. జనమంతా అప్పు కోసం నాలాగే మాట్లాడతారు. అదేమీ తప్పు కాదు” అని సమర్ధించుకున్నాడు చందు.
“ముమ్మాటికీ తప్పే . నిలబెట్టుకోగలమనే నమ్మకం ఉన్నప్పుడే మాట ఇవ్వాలి. లేదంటే ఇవ్వకూడదు. నీకు కుదిరే విషయాలలోనే వాగ్దానం చెయ్యాలి తప్ప నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి తప్పించుకోకూడదు” అని బుద్ధి చెప్పాడు రఘు.
“వీర్రాజు విషయంలో సాయం చేయాలనుకున్నాను కానీ సొంత పనుల వలన కుదరలేదు. నా పని కంటే అవతలివాడి పనే ముఖ్యమా ? “ తిరిగి ప్రశ్నించాడు చందు.
“వీర్రాజు నిన్ను రక్షించాడనుకో.. ధన్యవాదాలు చెబితే సరిపోయేదానికి నిన్నెవరు వాగ్దానం చెయ్యమన్నారు? వాగ్దానం చెయ్యడమంటే ఆశ పుట్టించడమే. తన కూతురికి నీ వల్ల సంబంధం కుదురుతుందని ఆశగా వచ్చిన వీర్రాజు బాధగా వెళ్ళడం చూసాను. అది నీ తప్పు కాదా?” అనడిగాడు రఘు. తలదించుకున్నాడు చందు.
“సరే. ఆ విషయం వదిలెయ్యి. వ్యాపారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోయావే అనుకో. ముఖం చాటెయ్యడం దేనికి? నువ్విస్తానన్న సమయానికి ఇవ్వలేక పోయినప్పుడు ముందుగానే వెళ్లి అతడిని కలిస్తే సరిపోయేది కదా. మరికొంత సమయం కావాలని అడిగుంటే నీ మీద గౌరవం పెరిగేది. ఖచ్చితంగా గడువు పెంచేవాడు. ఇప్పుడు నీ మీద నమ్మకం పోయింది. భవిష్యత్తులో అప్పు కావాలన్నా, సాయం కావాలన్నా నీకు దొరుకుతుందా? ఆలోచించు” అన్నాడు రఘు.
“నన్నేం చేయమంటావు. రావాల్సిన డబ్బు అందలేదు“ బాధగా చెప్పాడు చందు.
“అయితే విను. కొంత డబ్బు సర్దుతాను. దాంతో వ్యాపారికి తీర్చేసి క్షమాపణ అడుగు. మిగతా డబ్బు కోసం గడువు అడుగు. అది చేతికి రాగానే వ్యాపారికి తీర్చవచ్చు. అంతే కానీ వాగ్దాన భంగం చెయ్యకు. ఇంట్లో ఉండి కూడా లేనట్టు పిల్లలచేత అబద్ధాలు చెప్పించకు. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. అది మంచిది కాదు. వాగ్దాన పాలన చేసేవాడికి భయమే ఉండదు. వాగ్దాన భంగం చేయడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నీ పిల్లలకు కూడా ఏదైనా చేస్తానని మాటిస్తే తప్పకుండా నెరవేర్చు. వాళ్ళు కూడా వాగ్దాన పాలన నేర్చుకుంటారు. ఇక ముందైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బుద్ధిగా కట్టుబడి ఉండు” అని గట్టిగా చెప్పాడు రఘు.
సరేనన్నాడు చందు.