పండగ మాకో ఆటవిడుపు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pandaga maako aatavidupu

"సంక్రాంతి పండగ ఇంక నాల్రోజులే వుంది. మనం ఊరెళ్ళాలి. నువ్వు లీవ్ పెట్టి తొందరగా బస్ టికెట్లు తీసుకో... లేకపోతే చాలా ఇబ్బందవుతుంది. "పొద్దున్నే ఆఫీసుకి హడావుడిగా బయల్దేరబోతున్న నా దగ్గరకొచ్చి అమ్మచెప్పింది.

హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ టీమ్లీడ్ గా పనిచేస్తున్నాను. ఆఫీసులో పండగ సమయానికి ఏవన్నా అర్జంట్ టాస్క్ లు వస్తాయేమోనని నేనే ఇప్పటిదాకా టికెట్లు తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అంత బిజీ ఏం లేదు. అందుకే అమ్మకి ‘సరే’ అని నవ్వుతూ చెప్పి ఆఫీసుకి బయల్దేరాను.

నేను చదువుపూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి సంవత్సరమవుతోంది. నాన్న రిటైరయ్యి నెలవుతోంది. నేనూ అన్నయ్యా ఇద్దరమే పిల్లలం. అన్నయ్య లక్నో లో ఉద్యోగం చేస్తున్నాడు. వాడు చాలా బిజీ మనిషి. వాడెంత బిజీ అంటే కనీసం ఫోన్లోనన్నా తన క్షేమ సమాచారాలు అందివ్వడు. నేనే సెల్ కి చేసి కనుక్కుని అమ్మా నాన్నకి చెబుతుంటాను. ప్రతి పండక్కి కాకపోయినా పెద్దపండగలకి మా సొంతూరికెళ్ళడం మాకు ఆనవాయితీ అయిపోయింది. మాకేంటీ అసలు సిటీలో డెభ్భై శాతం పల్లెటూళ్ళకి పరుగులెడతారు. ఎందుకు?

అక్కడ మన సంస్కృతి సంప్రదాయం పచ్చగా వుంటాయి. ఈ సిటీల్లో బిజీ బిజీగా గజి బిజిగా గడిపిన మనకి పల్లెటూళ్ళకి వెళ్ళి సేదదీరడం ఓ ఆటవిడుపు. నిజంగా మానసికంగా చాలా రెజొవెనెట్ అవుతాం.

ఆన్ లైన్లో బస్ కి టికెట్లు దొరకక పోవడంతో... సాయంత్రం ఆఫీసులో తొందరగా పనిముగించుకుని టికెట్లకోసం ప్రైవేటు బస్ ఆపరేటర్ల దగ్గరకి వెళ్ళాను. మాడదిరే రేటు చెప్పారు. ఏం చేస్తాం? ఆర్టీసీకూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది... ఇంక ప్రైవేటు బస్ ల వాళ్ళు ఊరుకుంటారా! దొరికినంతా దోచుకోవడానికి సిద్ధం! మూడు టిక్కెట్లు తీసుకుని ఇంటికొచ్చాను.

"ఏరా... టికెట్లు దొరికాయా?" అమ్మ ప్రశ్నలో ఆత్రం.

టికెట్లు అమ్మ చేతిలో పెట్టాను.

అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. ఆవును మరి మాకోసం అహర్నీశలూ శ్రమిస్తూనే వుంటుంది. ఇలా ఊరికెళ్ళినప్పుడే కదా అమ్మకి కాస్త విశ్రాంతి. తన వాళ్లని చూసుకుని... తనవాళ్ళ మధ్య గడిపితే ఎంతో సంతోషం తనకి.

***

మేము ఊళ్ళోకి అడుగుపెట్టాం.

దిగింది మొదలు ఇంటికి చేరేవరకు అందరూ ఆప్యాయంగా పలకరించడమే! సీటీలో మన పక్కవాళ్ళు కూడా మనతో మాట్లాడకపోవడం ఖచ్చితంగా గుర్తొచ్చి తీరుతుంది.

అమ్మమ్మా, తాతయ్యా, మామయ్యా... అత్తయ్యలు... వాళ్ళపిల్లలు అందరూ అభిమానంగా దగ్గరకు తీసుకుని కుశల ప్రశ్నలు వేశారు. ఇంత అనుబంధం ఇక్కడతప్ప ఇంకెక్కడ సాధ్యమవుతుంది? పండగలని అనుభూతించాలంటే పల్లెటూళ్ళకి వెళ్ళాల్సిందే!

పండగ మొదటిరోజు భోగి.

తెల్లవారు ఝామునే లేచి ఇంట్లో వున్న పాత తట్టా బుట్టా చెక్కలు వేసి భోగి మంట వేశారు. అప్పటిదాకా శరీరాన్ని వణకించిన చలి వేడి దెబ్బకి దూరంగా పారిపోయి మంట ఎప్పుడు ఆరిపోతుందా ఎప్పుడు మళ్ళీ దాడి చేద్దామా అన్నట్టు ఎదురుచూస్తోంది. ఎనిమిదింటిదాకా సరదాగా చలికాచుకుని వేపపుల్లతో పల్లు తోముకుని తాటాకుతో నాలిక గీసుకుని గోదావరిలో స్నానం చేసి ఇంటికొచ్చాం. పసుపుపెట్టిన కొత్త బట్టలు రెడీ. అవి వేసుకుని పెద్ద వాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాం. ఇంటికొచ్చేసరికి రక రకాల పిండి వంటలు నాసికాపుటాల ద్వారా జిహ్వ కవాటాలు తెరుస్తూ సిద్ధంగా వున్నాయి. ఇక ఆగలేకపోయాము. సిటీలో అయితే కడుపుని కొలుచుకుంటూ... వ్యాధులకి భయపడుతూ ‘ఏదో బ్రతకడానికి ఇంత తిన్నామనిపించే’ మేము భుక్తాయాసంతో లేచాము. సాయంత్రం సరదాగా జరిగిన కోడి పందాలు చూడ్దం నిజంగా ఒక వేడుక.

రెండో రోజు పెద్ద పండగ సంక్రాంతి.

పరికిణీ ఓణీలేసుకున్న పడుచుపిల్లలు ఇంటిముందు పేడ కళ్ళాపీజల్లి అందమైన ముత్యాల ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని రక రకాల పూలతో అలంకరించడం చూడ చక్కనైన దృశ్యం. గంగిరెద్దుల ఆట... వాటి దీవెన, హరిదాసుల ’హరిలో రంగ హరి’ కీర్తనలు ఓహో అద్భుతం.

కొత్త బట్టలు... పిండి వంటలు షరా మామూలే!

మా కుటుంబ శ్రేయస్సుని కాంక్షించే అయ్యగారు పెద్దలచేత పూజలు పూర్తి చేయించి మమ్మల్ని పదికాలాలపాటు చల్లగా ఉండమని దీవించడం, మధురాతిమధురమైన అనుభూతి.

కొత్త పంటలు చేతికొచ్చిన ఆనందంతో మా తాతగారు చేతికి ఎముకలేకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. ఇక్కడ మనం గీసీ గీసి ‘బార్ గైన్’ చేస్తే అక్కడ ఉదారంగా అలా ధారపోయడం ఆశ్చర్యపరచింది. అదే విషయం తాతయ్యని అడిగితే..‘కలిమి కలిగిన రోజున పదిమందికిస్తే, లేని రోజున నలుగురూ సాయానికొస్తారు. మనకున్నదాన్ని మనం తినడం ఎప్పుడూ గొప్ప కాదు. పదిమందికీ పెట్టడమే గొప్ప’ అన్నాడు.

ఎంత గొప్ప సమానత్వపు సమాధానం. పట్నంలో రాను రాను మనిషి పరిధి చిన్నదైపోతోంది. ‘తను... తన లోకం’ అంతే!

కనుమ రోజు.

మాకు సిరి సంపదల నిచ్చిన పశుజాతికి కృతజ్ఞతలు చెప్పి... కమ్మని మినప గారెలూ అల్లంపచ్చడీ తిన్నాం. ఈరోజు ప్రయాణం చేయకూడదు కాబట్టి మరుసటిరోజు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇల్లూ, అందరి మనసులు బోసిపోయాయి.

"అందరూ ఉంటే ఇలా ఇల్లు కళ కళ్ళాడుతుంది. మీరందరూ తలోదిక్కుకీ వెళ్ళిపోతారు... రేపటినుండి... ఈ ఇంట్లో సందడీ... సంబరం ఉండదు" అన్నాడు తాతయ్య బాధగా.

ఇన్ని రోజులూ మాకోసం అంత శ్రమించిన అమ్మమ్మకి కూడా మేము వెళ్ళడం బాధ కలిగిస్తోంది.

"అంత శ్రమ పడ్డావు. హాయిగా విశ్రాంతి తీసుకోక మా కోసం ఎందుకే అమ్మమ్మా అంత తాపత్రయ పడతావు?" అని అడిగాను.

"అది శ్రమేంట్రా... మీరు కడుపునిండా తింటూ నా వంటని అప్యాయంగా మెచ్చుకుంటుంటే ఇంక నాకేం కావాల్రా! రేపటి నుండి ఎవరి బాధ్యతల్లో వాళ్ళు కూరుకుపోయి అర్ధాకలితోనే వుంటారని నా బెంగ" అంది.

నా కళ్ళు చెమర్చాయి.

"తాతయ్యా నేనో మాట చెప్పనా..."అన్నాను.

తాతయ్య చెప్పమన్నాడు. అందరూ నేనేం చెబుతానా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

"మేము పెద్ద పండగలకి మా స్వార్థంతో ఇక్కడకొచ్చి సంతోషాన్ని మనసుల్లో మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాం గాని. మీ గురించి మీరెప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎన్నో సంవత్సరాల్నుండి ఈ ఊరు ఈ ఇల్లూ ఇలాగే వుంది. మా నగరాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. ఈ ఊళ్ళు మాత్రం ఎలాంటి ప్రగతి లేకుండా ఇలాగే వుంటాయి. ఇక్కడి మట్టిరోడ్లు... గుడుల గోపురాలు... బడులు... చెఱువులు... మాకు గొప్ప గొప్ప అనుభూతులుగా కథలు కవితలు రాసుకుంటాం. అక్కడ మాకు మాల్స్ కావాలి... మల్టీప్లెక్స్ లు... ఫ్లై ఓవర్లు కావాలి... మీరు మాత్రం మాకు ఇలాగే వెనకబడిన తనంతో కావాలి. మేము సేదదీరడానికి ఒక పార్కులాను... ఫామ్ హౌస్ లాను ఊరుండాలి. నగరాలనుండి పండగలకి డెబ్బైశాతం జనం పల్లెటూళ్ళకి వస్తున్నారంటే ఇక్కడి కమ్మదనం మమ్మల్ని ఎంతగా ఆకర్షిస్తోందో తెలుస్తోంది కదా! అలాంటప్పుడు నగరాలని మన సంస్కృతి సంప్రదాయాల వేదికగా చేసుకోవచ్చుకదా! ఊహుఁ... మా సుఖాలు మాక్కావాలి... అప్పుడప్పుడూ ఇలాంటి అనుభుతులూ వుండాలి! స్వార్థం తాతా... ప్రతి మనిషికి నిలువెల్లా స్వార్థం! మీ ప్రేమాభిమానాలని మేము మా స్వలాభానికి వాడుకుంటున్నామంతే! ఇక్కడ నిత్యకృత్యంగా కనిపించేవి, నగరంలో మేము ఊరికి దూరంగా శిల్పారామం అని ఏర్పాటు చేసుకుని చూసి వస్తుంటాం తెలుసా తాతా! అమ్మమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే పదార్ధాలు అక్కడ స్వగృహ ఫుడ్స్. డబ్బు పడేస్తే ఏదైనా చూడొచ్చు... తినొచ్చు... కానీ అనుభూతించలేం. మమ్మల్ని మా స్వార్ధాన్ని క్షమించు తాతయ్యా!" అన్నాను మనస్పూర్తిగా కళ్ళనీళ్ళతో!
తాతయ్య నా తల నిమురుతుండిపోయాడు.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు