అతిధి దేవోభవ - సి.హెచ్.ప్రతాప్

Atidhi devo bhava

విద్యాపురంలో దేవయ్య అనే పేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. తన తండ్రి ఇచ్చిన అరెకరం పొలంలో కూరగాయలు పండించుకుంటూ వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంపై ఎంర్తో సంతృప్తిగా జీవిస్తుండేవాడు. సమయం వున్నప్పుడు, ఈ ఊరిలోని వారు దైవ కార్యాలకు పిలిస్తే వెళ్ళి పూజలు చేయించి వారిచ్చిన దానితోనే తృప్తి పడేవాడు. అతని భార్య లక్ష్మమ్మ కు కాస్త కోరికలు హెచ్చు. అయితే భర్త ఆదాయం తక్కువగా వుండడంతో తన కోరికలను బలవంతంగా అదుపులో పెట్టుకోవలిసి వస్తుండేది. అయితే ఇంటి నిర్వహణలో భార్యకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ , వున్నంతలో పిల్లల్ని బాగా పెంచుతూ కుటుంబాన్ని గుట్టూచప్పుడుగా నెట్టుకొస్తోంది.

దేవయ్యకు దైవ భక్తితో పాటు దయాగుణం కూడా మెండుగా వుండేది.తెల్లవారుఝామునే లేచి, స్నాన సంధ్యాదులు , దైవార్చన పూర్తి చేసాకే నీళ్ళు కూడా ముట్టేవాడు. ఇంటి గుమ్మం ముందు ఎవరు నిలబడినా, తనకు ఉన్నంతలో ఏదో ఒక సహాయం చేస్తే గాని పంపేవాడు కాదు.

ఒకరోజు ఆ గ్రామంలో ఒక సాధువు తన ముగ్గురు శిష్యులతో కలిసి భిక్షాటనకు వచ్చాడు. వీధి వీధి తిరుగుతూ గ్రామస్థులు ఇచ్చినది పుచ్చుకొని ముందుకు వెళ్తున్నాడు. ఆ రోజుకు ఆకలి చంపుకునెందుకు సరిపడినది లభించాక తిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోవడం ఆయన దినచర్య.

అందులో భాగంగానే ఊరి చివర వున్న దేవయ్య ఇంటి ముందు నిలబడి భిక్ష అర్ధించాడు ఆ సాధువు.

ఆ సమయంలో దేవయ్య భోజనం చేస్తున్నాడు. అంతకు ముందే పిల్లలు భోజనం చేసేసారు. అతను తిన్న తర్వాత భార్య భోజనం చేయాలి. నెలాఖరు రోజులు కనుక ఇంట్లో వెచ్చాలు అంతంత మాత్రంగా వున్నాయి. సాధువు వచ్చిన సంగతి తెలుసుకొన్న లక్ష్మమ్మ అప్పుడు ఏం జరగబోతోందో వెంటనే ఊహించింది.

భర్త చేస్తున్న భోజనం ఆపేసి, మిగిలినదంతా సాధువుకు దానం చేసేస్తాడు. అప్పుడు అతను అర్ధాకలితో వుండడమే కాక తనకు అన్నం మిగలదు. మిగిలిన కాస్త వెచ్చాలతో తిరిగి వంటా చేయాలి. ఎందుకొచ్చిన తద్దినం అనుకుంటూ సాధువు భర్తకు కనిపించకుండా వీధి గుమ్మానికి అడ్డంగా నిలుచుంది. తర్వాత నెమ్మదిగా లో గొంతుకతో" ఇంట్లో అన్నీ నిండుకున్నాయి , కాస్త ముందుకు వెళ్ళండి" అని సాధువుతో చెప్పింది లక్ష్మమ్మ.

సరేనని, మీ కుటుంబం చల్లగా వుండాలని దీవించి సాధువు, అతని శిష్యులు ముందుకు సాగిపోయారు. అయితే భార్య యొక్క ప్రవర్తన అనుమానస్పదంగా అనిపించడం వలన దేవయ్య సంగతేమిటని భార్యను అడిగాడు. ఏమీ లేదు, మీరు ముందుగా భోజనం పూర్తి చెయ్యండి. మీ తర్వాత నేను తినాలి, ఒళ్ళంతా అలసటగా వుంది, త్వరగా పడుకోవాలి అని భర్తను తొందర పెట్టసాగింది లక్షమ్మ.

ఆమె మాటలు నమ్మక, దేవయ్య లేచి గుమ్మం బయటకు చూసాడు. అతనికి ముందుకు సాగిపోతున్న సాధువు, అతని శిష్యగణం కనిపించారు. భార్య చెసిన పని అర్ధమై " ఎంత పని చేసావే నువ్వు. గుమ్మం ముందుకు వచ్చిన అతిధిని ఆకలితో వెళ్ళగొడతావా నువ్వు. అందువలన ఎంతటి పాపం సంక్రమిస్తుందో అర్ధం చేసుకోవడం లేదు నువ్వు"" అని గబ గబ పరిగెత్తి సాధువు బృందానికి అడ్డం నిలిచి " తెలిసో తెలియకో నా భార్య చెసిన తెలివి తక్కువ పాపపు పనికి నన్ను క్షమించండి. దయ చేసి ఇంటికి తిరిగి రండి. నేను తినగా మిగిలిన భోజనపు పదార్ధాలను దయచేసి భిక్షగా స్వీకరించండి. ఎంగిలి అని భావించి తిరస్కరించవద్దు" అని కాళ్ళపై పడి కన్నీళ్ళతో ప్రార్ధించాడు.

అందుకు సాధువు ఎంతో సంతోషించి" నాయనా,మేము భిక్షాతనతో జీవించే వారం.మాకు ఎంగిలి, మిగిలినది అన్న వ్యత్యాసాలు వుండవు. చివరకు నీవు తినే పళ్ళంలో ఆఖరు మెతుకైనా మాకు అమృతంతో సమానం.నువ్వు ఎంతో ప్రేమతో, వచ్చి మమ్మల్ని నీ ఆతిధ్యం స్వీకరించమని అర్ధించావు.అదే మాకు పదివేలునువ్వు బాధపడవద్దు. మేము తప్పక వచ్చి ఈ ఆతిధ్యం స్వీకరిస్తాం" అని తన శిష్యులతో వచ్చి దేవయ్య ఆతిధ్యం స్వీకరించారు.

ఇక చేసేదేమీ లేక లక్ష్మమ్మ మిగిలిన కాస్త భోజన పదార్ధాలు వారికి అర్పించింది. వారందరూ ఆ కాస్త అన్నం తిని వెయ్యేళ్ళు చల్లగా వుండమని ఆశీర్వదించారు. వెళ్ళేముందు ఆ సాధువు దేవయ్యను మనస్పూర్తిగా ఆశీర్వదించి ఈ విధంగా అన్నారు. అతిధులను ఆదరించడం అనేది మన భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంసం. తైత్తరీయోపనిషత్ లో గృహస్థుడు ఏవిధంగా ఉండాలి అన్నదానికి సంపూర్ణ వివరణ ఇవబడింది. తన ఇంటికేతెంచిన ఏ అతిధికైనను ప్రతికూల సమాధానమీయకూడదు. ఆదర భావముతో అతిధి సత్కారము చేయాలి. నికృష్టభావముతో మర్యాదా రహితముగా అతిధిని చూస్తే అట్టిఫలమే మనకు తిరిగి లభిస్తుంది. దీనిని గ్రహించి ఏ మానవుడు అయితే విశుధ్ధ భావముతో అతిధి సత్కారము చేస్తాడో అతడు సర్వోత్తమ పొందగలడు.

గృహస్థు తన ఇంటికి వచ్చిన ఏ అతిధినయినా నిరాదరింపకూడదు.. ప్రేమ, మర్యాద, శ్రధ్ధ, సత్కార భావములను కలిగిఉండాలి. అట్లు అతిధులను సేవించాల్సిందే అన్న విషయం సదా గుర్తుంచుకో. దాని నిమిత్తము గృహస్థు అధికాహారమును ఏదో విధముగా సేకరించి ఉంచుకోవాలి. ఇక్కడ ఏదోవిధముగా అనగా అర్ధం న్యాయసమ్మతముగా ఆర్జించినది అని అర్ధం చేసుకోవాలి. తన ఇంటికేతెంచిన అతిధిని శ్రధ్ధతో, ప్రేమతో ఆహ్వానించి అర్ఘ్యపాద్యోచితాసనాదుల నర్పించి, అన్నము పెట్టాలి. అట్లు శ్రధ్ధాపూర్వకముగా అతిధిని సేవించు గృహస్థుకూడ అంతటి ప్రేమ మర్యాదలతో కూడిన ఆహ్వానమును, అన్నాదులను పొందుతాడు. ఈ విధంగా సత్కర్మలను ఆచరించి జీవితంలో ఆనందంతో పాటు భగవంతుని కృప కూడా సంపాదించుకో. ..

ఏం చిత్రమో, ఆనాటి నుండి దేవయ్య జీవితంలో అనేక ముఖ్యమైన ఘటనలు జరిగాయి. కూరగాయలకు మంచి లాభాలు రాసాగాయి. పొదుపు చేసిన మొత్తంతో ఆవులు, గేదెలను కొని, వాటితో లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేయసాగారు దేవయ్య దంపతులు. ఆ ఊరిలోని వారే కాక పొరుగూర్ల నుండి ప్రజలు దేవయ్యను పూజాది దైవ కార్యాలకు ఆహ్వానించడమే కాక మంచి సంభారాలను కూడా సమర్పించుకునేవారు. ఎంత సంపద వచ్చినా గర్వాహంకారాలకు తావియ్యక సంతృప్తిగా జీవనం సాగించారు దేవయ్య దంపతులు.

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao