ఒకసారి వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వానలు కురిసి , ముసురు పట్టేసరికి పొలాలు నీటిలో మునిగాయి. ఇళ్ళు తడిసి ముద్దయ్యాయి. ఊళ్లోకి నీరొచ్చి వీధులు బురదతో నిండాయి.
పొలానికి వెళ్లిన ఒక రైతు నీట మునిగిన పంట చేలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయిందన్న ఉక్రోషంతో ఆకాశం వైపు చూసి “ఛీ! చెత్త కాలం. పంటంతా నాశన మయ్యింది. ఈ కాలంలో అన్నీ కష్టాలే. జారు, బురద, ఇంటి గోడలు, పై కప్పులు కూలిపోవడం, పంటల నాశనం … అన్నీ ఇబ్బందే. ఇంత కూరమైన కాలం మరొకటి లేదు” అని అరిచాడు.
ఆ మాటలు విన్న వేసవి కాలం ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసిన వర్షాకాలం “ఎందుకా వెకిలి నవ్వు? పోయినసారి ఎండలు మండినప్పుడు నిన్నూ ఒకడు తిట్టాడు. నేను నీలా నవ్వలేదప్పుడు” అంది.
“నన్నెందుకు తిడతాడు. నేనేం అపకారం చేశాను” అడిగింది వేసవికాలం.
“ఒకడు వడదెబ్బ తగిలి స్పృహ తప్పాడు. లేచి కూర్చున్నాక ‘దరిద్రగొట్టు కాలం. ఒకటే మండే ఎండలు. చెరువులు, బావుల్ని ఎండబెట్టింది. ఒకటే వడగాల్పులు. ఎటూ వెళ్లలేము. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం లేదు’ అన్నాడు. అయినా నేను నీలా నవ్వలేదు” అంది వర్షాకాలం.
ఆ మాటలు విన్న శీతాకాలం నవ్వు ఆపుకోలేక వాటి ముందుకొచ్చింది. “అలా అన్నాడా?” అంది ఆశ్చర్యంగా.
“ఎందుకంత ఆశ్చర్యం? నవ్వు ఆపుకున్నది చాలు. నిన్నూ ఒకడు అన్నాడులే. నేను విన్నాను” అని చెప్పింది వేసవికాలం.
“నేనేం పాపం చేసాను?” అడిగింది శీతాకాలం.
“చలికి వణికిపోతున్న ఒకడు ‘ఇదేమిటమ్మా ఇంత చెత్త కాలం. తొందరగా పొద్దు పోతుంది. ఎప్పటికీ తెల్లారదు. ఒకటే వణుకు, జలుబు. ఏ పనీ చెయ్యకుండా వేడికోసం కాసుకుంటే పనులెలా అవుతాయి. ఈకాలం ఎంత తొందరగా పొతే అంత మంచిది’ అన్నాడమ్మా” చెప్పింది వేసవి కాలం.
వర్షాకాలం నవ్వాపుకోలేక “నీకూ అయిందా సత్కారం? అయితే మనం ఒకరి గురించి మరొకరు దెప్పుకోనక్కరలేదు” అంది.
వేసవికాలానికి కోపం వచ్చింది. “మనం దెప్పుకోవడం సంగతి అటుంచి మనల్ని దూషించిన మానవుల పని పడదాం. మన శక్తి చూపించి భూలోకాన్ని గడగడ లాడిద్దాం” అంది.
మిగతా రెండు కాలాలు “సరే. అయితే ఏమి చేద్దాము” అనేసరికి అటుగా వెళుతున్న ఓ మేఘం ఆ మాటలు ఆలకించి వారి దగ్గర ఆగింది.
“ఇదిగో కాలాలూ… ఒక మానవుడెవరో ఆవేశంలో పలికిన మాటలకు మొత్తం మానవజాతి మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్పు. ఎవరైనా జ్ఞానిని అడిగితే అతడూ ఇలాగే చెబితే అప్పుడు ఆలోచించండి” అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది.
మూడుకాలాలు కూడా ఆ మేఘం సలహాని పాటించి జ్ఞానిని కలవాలని నిర్ణయానికి వచ్చాయి. అవి భూలోకం వైపు చూసేసరికి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఒక వృద్ధుడైన ముని కనిపించాడు. మునిని కలసి పరిచయం చేసుకున్నాయి మూడు కాలాలు.
ముని వారితో “ముగ్గురూ ఒక్కసారే వస్తే మీ పనులెవరు చేస్తారు?” అని అడిగాడు.
అప్పుడు వేసవికాలం “రాక తప్పలేదు స్వామీ. మా వల్ల కీడు తప్ప ఉపయోగం లేదని మానవులు అనుకోవడం విన్నాము. మీవంటి జ్ఞాని అభిప్రాయం కోసం వచ్చాము” అని చెప్పింది.
“మీ వలన అనేక లాభాలున్నాయి. ఆవేశంలో ఎవరో పలికిన మాటలు మరచిపోండి” అన్నాడు ముని.
“మునీశ్వరా! లాభాలన్నీ కాకపోయినా కొన్నైనా చెబితే తిట్టారన్న బాధ మరచిపోతాము. మీ అభిప్రాయం చెప్పండి” అని అడిగింది వర్షాకాలం.
వేసవి కాలం వైపు చూసి ‘నువ్వున్నప్పుడు పగలు ఎక్కువ ఉండడంతో ఎక్కువ సేపు పనులు జరుగుతాయి. పెద్దపెద్ద కట్టడాలు, నిర్మాణాలు నిరాటంకంగా పూర్తి చేస్తారు. నీ కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి. ప్రయాణం చేయాల్సినవాళ్లు తొందరగా బయలుదేరి హాయిగా వెళ్లొచ్చు. మామిడిపండ్లు, పనసపండ్లు పండేది నీ కాలంలోనే” అని చెప్పాడు ముని . వేసవికాలం ఎంతో సంతోషించింది.
వర్షాకాలం వైపు చూసి “నీ కాలంలో రైతులు ఎన్నెన్నో పంటలు పండిస్తారు. చెరువులు, బావులు పూర్తిగా నిండుతాయి.ఏడాది పొడుగునా నీరు లేకపోతే మనుషులు బ్రతకగలరా?” అనగానే వర్షాకాలం కూడా ఆనందించింది.
మిగిలింది శీతాకాలం. తన గురించి ముని ఏమంటాడా అని ఆత్రంగా చూసింది. ముని దాని వైపు చూసి “నీ కాలంలో దుప్పటి కప్పుకుని హాయిగా ఎక్కువ సేపు నిద్ర పోవచ్చు. అటు వేడి ఎక్కువ కాకుండా, ఇటు నీరు ఎక్కువ లేకుండా ఉండే కాలం నీది. నీ కాలంలో జామపండ్లు, సీతాఫలాలు బాగా దొరుకుతాయి. మనుషులు పగలంతా బయట తిరిగినా హాయిగా ఉంటుంది” అని చెప్పగానే శీతాకాలం కూడా సంబరపడింది.
మూడు కాలాలు కలసి మునికి కృతజ్ఞతలు చెప్పుకుని బయలుదేరాయి.
“ఒక మానవుడెవరో పలికిన మాటలకు ప్రతీకారం తీర్చుకోకుండా మేఘం సలహా పాటించినందుకు, జ్ఞాని మాటల వలన తమ గొప్పతనం తెలుసుకున్నందుకు సంతోషంగా తమ విధులు నిర్వర్తించడానికి వెళ్లాయి.