నిత్య సంగ్రామం - టి. వి. యెల్. గాయత్రి.

Nitya sangramam

ఆఫీసు నుండి కొంచెం లేట్ గా వచ్చింది భార్గవి. ఆమె పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తోంది. అప్పటికే పిల్లలిద్దరు భోజనాలు చేసి నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్నారు. భర్త శేఖర్, అత్తగారు సరళ ఇంకా భోజనం చెయ్యలేదు.

"నేనొచ్చే దాకా ఆగటం దేనికి? మీరు పెందలాడే తినాల్సింది. ఆలస్యంగా భోజనం చేస్తే మీకు అరగదు కూడాను."అంది భార్గవి అత్తగారినిద్దేశించి.

"ఫర్వాలేదులే!ఏమిటి ఇంత ఆలస్యం?"అంది సరళ కోడలికి కంచం పెడుతూ.

"ఏముంది? క్రింద వాళ్ళు పని సరిగ్గా చెయ్యక పొతే వాళ్లకు క్లాసు పీకి వచ్చేసరికి ఇంత లేట్ అయింది." అంటూ బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది.

భార్గవిది ఆఫీసులో పెద్ద పొజిషన్ అవటం వలన ఆమెకు బాధ్యతలు ఎక్కువే వుంటాయి. ఇంట్లో భర్త శేఖర్ సహాయం చేయటం,అత్తగారు సరళ పిల్లల్న చూసుకోవటం, ఇంటిని చక్కబెడుతుండటం వలన భార్గవికి ఇంటి గురించి బెంగలేదు. కాని ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ఆఫీసులో సమస్యలు ఎక్కువే వస్తుంటాయి.

"ఏమిటీ విషయం? ఏమన్నా ప్రాబ్లం గా వుందా?" శేఖర్ అడిగాడు.

"ఏం చేయను? క్రమశిక్షణతో పని చేసే వాళ్ళు తక్కువ. కంపెనీలో వందమంది వైస్ ప్రెసిడెంట్లకి ఇరవై మంది మాత్రమే ఆడవాళ్లు ఉన్నారు. అంటే ఎనభై మంది మగవాళ్ళు. నిష్పత్తి మరీ అధ్వాన్నం. మా డైరెక్టర్ లలో మొత్తం ఇరవై మందిలో నలుగురం మాత్రమే ఆడవాళ్ళం వున్నాము. అంతా మగవాళ్ళు ఆధిపత్యం. వాళ్ళతో నెగ్గుకు రావటం చాలా కష్టంగా వుంది. నా క్రింద నా కంటే పెద్దవాళ్ళు పని చేస్తున్నారు. వాళ్లకి నేను ఆడదాన్నని, వయసులో చిన్న దాన్ననీ, నా మాట ఎందుకు వినాలనీ పట్టుదలగా ఉంటుంది. వాళ్ళ చేత పనిచేయించేసరికి తల ప్రాణం తోకకు వస్తోంది. అనుకున్న సమయంలో పని కాకపొతే నాకు చెడ్డ పేరు వస్తుంది. వారం తర్వాత సి ఇ ఓ విజిట్కూడా వుంది.అదీ ప్రాబ్లమ్ "అంది భార్గవి కాళ్లకు కొబ్బరినూనె పట్టిస్తూ.

శేఖర్ ఆమె చేతిలో నూనె సీసా తీసికొని ఆమె పాదాలకు మృదువుగా వ్రాస్తూ ఆలోచిస్తున్నాడు. భార్గవి చాలా తెలివైన మహిళ. చిన్నప్పటి నుండి కష్టపడి పని చేసే మనస్తత్వం. అందుకే నలభై రెండేళ్లకే డైరెక్టర్ స్థాయికి వచ్చింది.చాలా చైతన్యవంతంగా ఉండే భార్య అంటే శేఖర్ కు చాలా ప్రేమ.

"ఏమిటి ఆలోచిస్తున్నారు?" భార్గవి ప్రశ్న విని తలెత్తి చూసాడు శేఖర్.

"కష్టంగా ఉంటే కొన్ని రోజులు మానేయరాదు. కొంత విశ్రాంతి తర్వాత ఇంకో కంపెనీలో చేరుదువుగాని."

"ఎక్కడైనా చాకిరీ తప్పదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే కుక్క చాకిరీ అని అర్థం. ఒక టైమ్ గియుము ఉండదు. రాత్రి పగలు ఒకటే పని. పొజిషన్ వేరైనా పని మారదు." నిస్పృహగా అంది భార్గవి.

"పోనీ కొద్దిరోజులు సెలవు పెట్టు. పిల్లల్ని తీసికొని ఎక్కడికన్నా తిరిగివద్దాము. కాస్త రిలాక్స్ గా ఉంటుంది."అనునయంగా అన్నాడు శేఖర్.

"మీ కెలా వుంది పని?"భార్గవి ప్రశ్నకు నవ్వాడు శేఖర్.

"మా కంపెనీలో మాత్రం సమస్యలు తక్కువలేవు. ఈ మధ్య లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి కదా! ఆ టెన్షన్ తో చాలా మంది పని మీద దృష్టి పెట్టలేక పోతున్నారు. వాళ్ళ చేత చేయించుకోవటం చాలా కష్టంగా వుంది."

"పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి " నవ్వింది భార్గవి.

ఊ.. అలాగే వుంది. చెప్పటం మరిచాను. సుధాకర్ ఫోన్ చేసాడు. వాళ్ళ చెల్లెలి పెళ్లి కుదిరిందట. అందరినీ రమ్మన్నాడు. వచ్చే నెల్లో పెళ్లి. ఇంకా పదిహేనురోజులుంది. అందరం వెళ్దాము. " అన్నాడు శేఖర్.

"అలాగే "అంది భార్గవి.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకోవటంతో పిల్లల బాధ్యత తల్లి సరళదే. అయితే సరళ కూడా పిల్లల్ని అర్థం చేసుకునే మనస్తత్వం. కొడుకు కోడలి పని వత్తిడి ఆమెకు తెలుసు కాబట్టి పిల్లలకు ఆమె సాయంగా ఉంటోంది.

పదిహేనురోజుల తర్వాత శేఖర్ బంధువు అయిన సుధాకర్ చెల్లెలి పెళ్లికి అందరూ వెళ్లారు. పెళ్ళిలో ఎవరి వయసు వాళ్ళతో వాళ్ళు కబుర్లలో పడ్డారు. పిల్లలు అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. అత్తగారు పెద్దవాళ్ళ మధ్య కూర్చుని మాట్లాడుతూ వుంది. శేఖర్ తన బంధువులతో, ఫ్రెండ్స్ తో కబుర్లలో వున్నాడు. భార్గవి కూడా అక్కడ తన ఈడు వాళ్ళతో ముచ్చట్లాడుతోంది.

"నీకేం వదినా! డైరెక్టర్ ఉద్యోగం. లక్షల్లో జీతం. చక్కగా ఏ లోటూ లేదు. హాయిగా సంపాదించుకుంటారు. ఎక్కడికైనా జామ్మని తిరుగుతారు. నా బ్రతుకు చూడు! మా అయన సంపాదన మాత్రమే. ఆచితూచి ఖర్చుపెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్దామంటే ఇంట్లో అత్తగారు, మామగారు. వాళ్ళని వదిలేసి వెళ్ళేది లేదు. ఎప్పుడూ ఇల్లు పట్టుకొని వెళ్ళట్టమే!" నిస్పృహగా మాట్లాడింది మేనత్త కూతురు రమణి.

"నేను పిల్లలు పుట్టేదాకా ఉద్యోగం చేశాను. తర్వాత మానేశాను. ఏం చేస్తాం? పిల్లల్ని క్రష్షుల్లో ఎంతకాలం పెట్టి ఉద్యోగం చేస్తాను? మా అత్తగారు వచ్చినా ఆటుపుల్ల ఇటు తీసి పెట్టదు. చిన్నప్పుడు ఆవిడ ఉమ్మడికుటుంబంలో పడిపడి చేసిందట! అందుకని ఇప్పుడు కొంచెం పని కూడా చెయ్యకూడదని సిద్ధాంతం. కోడళ్ళే ఇంట్లో పని చేసి, ఉద్యోగాలు చెయ్యాలి లేకపొతే ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకోవాలి! ఇదీ ఆవిడ చట్టం! ఎవరైనా పిల్లల్ని చూసుకుంటే నేను మాత్రం నీలాగా పెద్ద పొజిషన్ కే వచ్చుండే దాన్ని కాదూ..." పిన్ని కూతురు సరోజ మాట్లాడుతుంటే పెద్దమ్మ కూతురు సుష్మ చికాగ్గా మొహం పెట్టింది.

"నా సంగతి చూడండే! నేను చచ్చీచెడి ఉద్యోగం చేస్తున్నా! ఏదీ! ఆ మేనేజరు వెధవ నాకు నాలుగేళ్ల నుండి ప్రమోషన్ ఇవ్వటంలేదు. గానుగెద్దులా వుంది నా పరిస్థితి. ఉద్యోగం మానుకోలేను.. అలా అని ఈ బండ చాకిరీ చెయ్యలేను."అంది.

"మీదంతా ఒక ఎత్తు. నా పని వుంది చూడు! మా బాస్ ఒక కీచకుడు. వాడి దగ్గర పని చెయ్యటం ఎంత కష్టమో తెలుసా! వెధవ చూపులూ, వెధవ వాగుడూ భరించలేక పోతున్నాము ఆడవాళ్ళము. ఇంకో కంపెనీకి మారదామని ఇంటర్యూలకు వెళుతున్నా!" చిన్న మామయ్య కోడలు ఉష మాటలకు అందరూ సానుభూతిగా చూశారు.

"ఏమిటి భార్గవీ! మౌనంగా వున్నావు? " సుష్మ అడగటంతో చిన్నగా నవ్వింది భార్గవి.

"ఉద్యోగం చెయ్యటం అంటే ఏదో పద్మవ్యూహంలోకి రోజూ వెళ్లిరావటమే. అలా అని మానేసి కూర్చుంటే ఎలా జరుగుతుంది? పిల్లల్ని మంచి చదువులు చదివించాలని, మనం పెద్దయ్యాక సౌకర్యంగా డబ్బుకు పిల్లల మీద ఆధారపడకుండా వుండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరం అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా సంపాదించాల్సిందే. కష్టనష్టాలు భరించటం తప్పటంలేదు... ఈ బాధలు, సమస్యలు నిత్యం మనల్ని క్రుంగ దీస్తున్నాయి. కానీ పరిష్కారం కనిపించటం లేదు..."

"అవును భార్గవీ! సంపాదిస్తున్నామన్న మాటేగానీ మనశ్శాంతి ఉందా మనలో ఎవరికైనా? ఆఫీసుల్లో సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఓపిక ఉండటం లేదు. ఇంకా ఇంకా పని చెయ్యాలని ఛాలెంజెస్, టార్గెట్లు ఎక్కువ అవుతున్నాయి. మనకున్న తెలివితేటలకు అసలు గుర్తింపు రావటం లేదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి మనల్ని వెనక్కు నెట్టేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఆడవాళ్లకు సపోర్టు ఇవ్వాలంటే మనసు రాదు. ఎంత జాగ్రత్తగా వున్నా కూడా ఎప్పుడైనా పనిలో పొరబాట్లు జరుగుతుంటాయి. ఆఫీసులో ఎంత మాట పడాలో! చులకనగా తీసిపడేస్తుంటారు... ఇలా ఎంతకాలం నెట్టుకురాగలం?" సుష్మ మాటలకు అవునన్నట్లు తల ఊపారు అందరు.

"మీరు అందరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. నా సంగతి చూడండి! గవర్నమెంట్ ఉద్యోగం. గొడ్డు చాకిరీతో పాటు జీతాలు సరిగ్గా రావు. ప్రతి రోజూ మేనేజర్ దగ్గర్నుంచి కొలిగ్స్ దాకా ఆధిపత్యం చలయించే వాళ్ళే. దానికి తోడు ట్రాన్స్ఫర్ లు వుంటాయి. పిల్లల చదువులు చూసుకుంటూ ఎలా చెయ్యాలో అర్థం కాదు. పొయ్యిలో పడి కాలుతున్న ఫీలింగ్ వస్తోంది."చిన్నత్త కూతురు పద్మతన బాధ వెళ్ళబోసుకుంది.

"మన పరిస్థితి ఇలా వుంది. మన పిల్లల గురించి ఆలోచిస్తే ఇంకా దిగులు పుట్టుకొస్తుంది. అమ్మానాన్నలతో గడపాల్సిన టైం లో వాళ్ళు సెల్ ఫోన్లలో గడుపుతున్నారు. మనం డబ్బు సంపాదిస్తున్నాము కానీ మన పిల్లలకు సరిఅయిన గైడెన్స్ దొరుకుతుందా? వాళ్ళ ప్రవర్తన ఎలావుందో? ఎలా తయారవుతున్నారో? మనకే తెలియని పరిస్థితి.... దౌర్భాగ్యమైన పరిస్థితిలో పిల్లలు వున్నారనిపిస్తోంది.."రమణి దిగులుగా చెప్పింది.

ఈ లోపల భోజనాలకు పిలుపు రావటంతో అందరూ కబుర్లాపి భోజనాలకు కదిలారు. రాత్రి తిరిగి వచ్చాక శేఖర్ తో పెళ్ళిలో జరిగిన సంభాషణ అంతా చెప్పింది భార్గవి.

"నేటి మహిళకు పిల్లలు, సంసారం, ఉద్యోగం వీటిలో ఏది ముఖ్యం? ఏది కాదు? మూడూ ముఖ్యమైనవే భార్గవీ! నేటి ఆధునిక మహిళ ప్రతి రోజూ ఒక యుద్దాన్ని ఎదుర్కొంటోంది. నిత్య సంగ్రామంలో ఆఫీసులో సమస్యలు, ఇంట్లో బాధ్యతలూ రెండింటినీ సమన్వయం చెయ్యాలంటే కత్తిమీద సాము. ఇంట్లో ఎక్కువ సపోర్ట్ అవసరం. అందరికీ సహకరించే భర్త, పాజిటివ్ గా ఆలోచించే అత్తగారు, మామగార్లు, సర్దుకుపోయే పిల్లలూ ఉండరు. ఇక ఆఫీసులో ఎంత మందికి స్నేహపూరితమైన వాతావరణం ఉంటోంది? నువ్వు చెప్పావు చూడు! మీ ఆఫీసులో ఇరవై మంది డైరెక్టర్ లలో నలుగురే ఆడవాళ్లు వున్నారని. ఒక మగవాడికి ఇంట్లో భార్య అన్నీ చూసుకుంటూ, అమర్చిపెడుతుంటే అతడు పనిలో నైపుణ్యం చూపగలడు. అతడి నైపుణ్యాన్ని, సమర్ధతను బట్టి ప్రమోషన్లు వస్తాయి. అంతకంటే ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ నైపుణ్యంతో ఆడవాళ్లు పని చెయ్యగలరు. కానీ అన్ని కుటుంబాల్లో ఒక మగవాడికి లభించే సపోర్టు ఆడవాళ్లకు లభించదు. ఇంటినీ, పిల్లల్ని దిద్దుకొని బయటకు వెళ్లి ఒక స్థాయికి మించి పని చెయ్యాలంటే ఓపిక ఉండదు. దాంతో పని మీద శ్రద్ధ తగ్గటం జరుగుతోంది. అదీ కాక స్త్రీ పురుష వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ వుంది. అది పైకి కనిపించకుండా ఉండే భూతం. దాన్నుండి తప్పించుకున్నా కీచకులు అక్కడక్కడా వాళ్ళ రాక్షసత్వం చూపిస్తూనే వుంటారు. ఇవన్నీ దాటుకొని ఉన్నత పదవుల్లోకి రావటం ఆడవాళ్లకు అంత సులభం కాదు కదా!ఏమంటావు?.. " ఆగాడు శేఖర్.

'నిజమే 'అన్నట్లుగా తలపనికించింది భార్గవి. శేఖర్ సపోర్టు, అత్తగారి సాయం, బుద్దిగా నానమ్మ దగ్గర చదువుకునే పిల్లలు లేకపోతే తను ఈ పొజిషన్ కి రావటం చాలా కష్టం. నిత్య సంగ్రామం చేస్తూ, ప్రతినిమిషం ధైర్యం చెప్పుకుంటూ ఆడవాళ్లు ఎంతో మంది వీరోచితంగా పోరాడుతున్నారు. ఓడిపోతున్నా, గెలిచినా కూడా సమరం అన్నది ఆగటంలేదు. క్షణం క్షణం ఓర్పును కూడతీసుకుంటూ ఆధునిక మహిళ ప్రయాణిస్తూనే వుంది. భార్గవి కనులనుండి వెచ్చని కన్నీరు వుబికి వచ్చింది. భూదేవికి సమానమైన ఓర్పు వున్న తన తోటి మహిళామణులకు సాంత్వనగా కన్నీరు బుగ్గలమీద జారింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న