"చూసారా! పక్కింటి సుశీల కొత్త రవ్వల నెక్లెస్ కొంది. గర్వంగా మా అందరికీ చూపిస్తూ తెగ నీలిగింది. మీరు నాకు రవ్వల నెక్లెస్ కొంటానని మాటిచ్చి రెండేళ్ళు దాటిందిగానీ ఇంతవరకూ ఆ మాటే ఎత్తడం లేదు. సుశీలవాళ్ళ ఆయనకి భార్యంటే ఎంత ప్రేమో తెలుసా! ఆమె ఏ చిన్న కోరిక కోరినా వెంటనే తీరుస్తాడు. మీరూ ఉన్నారు ఎందుకు?" భర్తని ఈసడిస్తూ అంది సుగుణ.
"అవునే! వాళ్ళాయన పాపారావు దండిగా లంచాలు దండుకుంటాడు, మరా డబ్బులేం చేసుకుంటాడు? లంచాలు తీసుకొని భార్యకి రవ్వల నెక్లెసేమి ఖర్మ, ఏడంతస్థుల మేడ కూడా కొనగలడు. అవినీతి నిరోధక శాఖకి చిక్కి ఉద్యోగంలోంచి సస్పెండ్ కూడా అయ్యాడొకసారి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా!" చెప్పాడు సుధీర్.
"అయితే మాత్రం! మన నియోజకవర్గం ఎం.ఎల్.ఏ.ని పట్టుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరలేదూ? మీరూ ఉన్నారు ఏం లాభం? భార్య కోరిన చిన్న కోరిక తీర్చడం కూడా చేతకాదు మీకు!" అంది సుగుణ భర్తని చిన్నబరుస్తూ.
ఆమె మాటలకి ఖిన్నుడైయ్యాడు సుధీర్. అయినా వెంటనే తేరుకొని, "అలా లంచం తీసుకోవడం నేరం. అవినీతి చేయడం దేనికి, మళ్ళీ తిరిగి ఉద్యోగం సంపాదించడంకోసం ఎవరో రాజకీయ నాయకుడ్నో, ఇంకెవర్నో పట్టుకోవడం దేనికి? అయినా ఉద్యోగం చేస్తున్నందుకు నిజాయితీగా పనిచేయాలి. అంతే! ఈ సమాజంలో గౌరవంగా బతకాలి అంటే నీతి నిజాయితీ ముఖ్యం. అయినా నీకు రవ్వల నెక్లెస్ కొనడానికి లంచం తీసుకోవాలా ఏమిటి? నీకు మాట ఇచ్చిన నాటినుండి నేను బ్యాంకులో నెలనెలా అయిదువేలు చొప్పున దాస్తున్నాను. వచ్చేనెల నా ఆరియర్స్ కూడా వస్తాయి. ఆ డబ్బులతో నీ పుట్టిన రోజుకి కానుకగా నెక్లెస్ తెస్తాను సరేనా! అంతేకాని మరెప్పుడూ నన్ను అవినీతిలోకి దించడానికి ప్రోత్సహించవద్దు." అన్న సుధీర్ మాటలతో సుగుణకి భర్తపై గౌరవం రెట్టింపైంది. ఆ తర్వాత మరెన్నడూ ఆమె పక్కింటి సుశీల గురించి భర్త వద్ద ప్రస్తావించలేదు.
…………………………………..