ప్రయాణం - వెంపరాల దుర్గ ప్రసాద్

Prayanam

అన్నయ్య వాళ్ళింట్లో చాలా కోలాహలంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు , మనవ లతో

చాలా హడావిడి నడుస్తోంది. మా వదిన చాలా కలుపుగోరు మనిషి . ఫంక్షన్ కి మూడు రోజులు ముందే నువ్వు, అనిత ఉండి తీరాలి అని చెప్పడంతో ఓ వారం ఆఫీసుకు సెలవు పెట్టి, ఈరోజే గుంటూరు నుండి విజయవాడకు వచ్చాను.

మా అన్నయ్యకు, నాకు 10 సంవత్సరాల గ్యాప్ వల్ల అన్నయ్య అంటే భయం, భక్తి కూడా.

అనితకు కూడా మా వదిన అంటే అభిమానం. ఆవిడ చూపించే ఆప్యాయతకి ఎవరైనా లొంగిపోవాల్సిందే.

ఇంతకీ విషయం ఏమిటంటే మా అన్నయ్య రెండో కూతురికి మగ పిల్లవాడు పుట్టి మూడు నెలలు అయింది. మరో మూడు రోజుల్లో బారసాల.

ఈ మూడు రోజులు గ్యాప్ లో నేను మరో ప్రయాణం పెట్టుకున్నాను. ఈరోజు NIGHT కి హైదరాబాద్ వెళ్ళాలి. మా కజిన్ కూతురు పెళ్లి మర్నాడు ఉదయం హైదరాబాద్ లో.

ఇంట్లో ఫంక్షన్ వంకతో మా అన్నయ్య ఆ ఫంక్షన్ మానేశాడు కానీ నేను మాత్రం అటెండ్ అయి వద్దామని గోదావరి ఎక్స్ప్రెస్ కి రిజర్వ్ చేయించుకున్నాను. పెళ్లి నుండి చుట్టాల కార్లో విజయవాడ వచ్చేస్తాను... అదీ నా PROGRAM.

ఎక్కడున్నా కుదురుగా ఉండనని మా ఆవిడ సాధిస్తూ ఉంటుంది. కానీ...కొన్ని సోషల్ ఆబ్లి గేషన్స్ వదులుకోలేము కదా.

రాతిరి భోజనాలయ్యాయి, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. రాతిరి 10 దాటితే అన్నయ్య , వదిన పడుకుండిపోతారు. అన్నయ్య గారి కూతుళ్లు,అల్లుళ్లు టీవీలో సినిమా చూస్తున్నారు. అన్నయ్య కొడుకు రాజేష్ మేడ మీద గిటార్ PRACTICE చేస్తున్నాడు. ఇద్దరు FRIENDS కూడా వచ్చారు. వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడికి మ్యూజిక్ లో ప్రవేశం ఉంది. మర్నాడు కాలేజీలో ఏదో కల్చరల్ PROGRAM ఉందిట, అందులో వీడి ప్రదర్శన ఉంటుంది.

నా బ్యాగ్ సర్దేసి, వాటర్ బాటిల్ తో సహా రెడీగా పెట్టింది అనిత.

నేను, అనిత కూడా హాల్లో పిల్లలు పెట్టిన సినిమానే చూస్తున్నాం. 11:35 అయింది నేను టీవీ చూస్తూ టైం మర్చిపోయాను,

మా వదిన ముందుగా చెప్పి పెట్టి ఉందేమో రాజేష్ కిందకి దిగి వచ్చాడు.

“ బాబాయ్..పదా? నిన్ను బండి ఎక్కించి రమ్మంది అమ్మ” ...అంటూ నా బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు వాడు.

అప్పటికి సోఫాలో నిద్రలో జోగుతోంది అనిత. రొజూ అంతసేపు మెలకువగా ఉండడం తనకి అలవాటు లేదు.

నా మొబైల్ టేబుల్ మీద ఉండాలని చూశాను. కనపడలేదు. నేను వెతుక్కోవడం చూసి మా అన్నయ్య గారి పెద్దమ్మాయి చింటూ గాడి దగ్గర ఉన్న నా మొబైల్ లాక్కుని నాకు ఇచ్చింది. చింటూ గాడికి మొబైల్ లో ఆటలాడుకోవడం సరదా. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మొబైల్ పని అయినట్టే. నేను గమనించుకోలేదేమో, వాడు దానిని ఓ పట్టు పట్టాడు. ఈ హడావిడి కి అనిత కి మెలకువ వచ్చింది.

“బయలుదేరుతున్నారా” అంది నిద్ర కళ్ళు నులుముకుంటూ.

“ఆ...నేను బయలుదేరుతున్నా , నువ్వు గదిలోకి వెళ్లి పడుకో” అన్నాను.

రాజేష్ వాకిట్లో బండి స్టార్ట్ చేయడంతో బయటకు వచ్చేసాను. నాతో బాటే బయటికి వచ్చిన అనిత, “సరే ఉంటాను, వెళ్ళాక ఫోన్ చేయండి... హ్యాపీ జర్నీ” అని చెప్పి లోపలికి వెళ్ళింది.

మోటార్ సైకిల్ మీద వెళుతుండగా మాటల్లో తెలిసింది రాజేష్ PRACTICE మధ్యలో వచ్చాడని, నన్ను బండెక్కించి వెళ్ళాక మళ్ళీ మరో గంట PRACTICE చేసుకోవాలిట.. వాడు హడావిడిగా ఉన్నాడు.

“అదేంటి రా నాన్నా... నువ్వు ముందు చెప్పి ఉంటే, నేను “OLA” బుక్ చేసుకునేవాడినిగా, నీకు ఇబ్బంది ఉండేది కాదు” అన్నాను.

“పర్లేదు బాబాయ్, ఎంతసేపు... నిన్ను దింపి వెళ్ళిపోతాను” అన్నాడు వాడు.

ఇంతలో స్టేషన్ వచ్చింది. నాకు పెద్దగా లగేజ్ లేదేమో నెమ్మదిగా నడుస్తున్నాను...వాడు వస్తాడని.

వాడు మోటార్ సైకిల్ పార్క్ చేసుకుని వచ్చాడు. అప్పుడు చూశాను ఎదురుగా రైల్వే టైం 11:55 అయిపోయింది . ఒక్కసారిగా కంగారు వచ్చింది. .

సినిమాలో లీనమైపోయి టైం చూసుకున్నాను కాదు, పోనీ అనిత అయిన హెచ్చరించిందా అంటే, తను నిద్రపోయింది అనుకున్నాను.

“బాబాయ్... అదిగో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే నీ గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది...కదిలిపోతోంది”,... పరిగెట్టు అని అంటూ వాడు పరిగెత్తాడు. నేను వాడి వెనకే కంగారుగా పరిగెత్తాను.

ప్లాట్ఫామ్ మీదకి చేరిపోయాం. బండి నెమ్మదిగా కదులుతోంది.. అదృష్టవశాత్తు నా కోచ్ ఎస్ 7 ఎదురుగా ఉంది.

“బాబాయ్ బ్యాగ్ ఇవ్వు... నేను పట్టుకుంటా ,నువ్వు ఎక్కాక అందిస్తాను” అన్నాడు వాడు.

వాడికి ఇచ్చి గబుక్కున ఎక్కేసాను.

“ అమ్మయ్య ఎక్కేసావు కదా ! ఇదిగో బ్యాగ్” అంటూ అందించాడు

బ్యాగు చేతికిచ్చి , BYE చెప్పి వాడు వెళ్ళిపోయాడు.

... కంపార్ట్మెంట్లో అందరూ నిద్రలో జోగుతున్నారు

బ్లూ లైట్ వెలుగులో నా బె ర్త్ చూసుకుని, బ్యాగ్ కింద పెట్టుకుని పైకెక్కి పడుకున్నాను. మొబైల్ తీసి చూసాను కదా అందులో బ్యాటరీ చార్జి 5% ఉంది. చింటూ గాడు గేమ్స్ ఆడేసి ఛార్జ్ మొత్తం అవగొట్టాడు. చ..చ ముందే చూసుకుని వాడి దగ్గర మొబైల్ లాక్కుని జేబులో పెట్టుకుని ఉండాల్సింది అనుకున్నాను.

సరే ఏం చేస్తాం, ఛార్జ్ పెట్టుకుందామని బ్యాగ్ సైడ్ అర లో వెతికా,

చార్జర్ సాధారణంగా అక్కడే పెడుతుంది అనిత. గుండె దడ దడ లాడింది... చార్జర్ పెట్టడం మర్చిపోయినట్టుంది అనిత.

ముందు చూసుకోకపోవడం నాదే తప్పు... అనుకుని, చేసేదేమీ లేక నిద్రకు రెడీ అయిపోయాను.

ఓ గంట ప్రశాంతంగా పడు కున్నానో లేదో ఎవరో వచ్చి లేపడంతో మెలకువ వచ్చింది

చూస్తే ఎదురుగా.. “టికెట్”.. అన్నాడు టీ టి ఈ. మొబైల్ తీసి టికెట్ చూపిద్దామని చూస్తే మొబైల్ డెడ్ అయిపోయింది. అర్థమైనట్లుంది ఆ టీ టి ఈ కి, పర్లేదు లెండి పేరు చెప్పండి అన్నాడు తను తన చార్ట్ కేసి చూసుకుంటూ...

“ఎస్. రామారావు” అన్నాను నేను..

కాదే... ఇక్కడ ...కే. నగేష్ అని ఉంది.... మీరు వైజాగ్ ఏనా వెళ్లేది ? అన్నాడు.

నాకు నిద్రమత్తు వదిలిపోయింది...అంటే నేను హైదరాబాదు వెళ్లే గోదావరి బదులు వైజాగ్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేనా ... అనుకుంటూ ఉంటే.. మీరు ఏలూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న కే నగేష్ కాదా? అని మళ్ళీ అన్నాడు .

అప్పుడు జరిగిన విషయం చెప్పెను....

ఇవాళ ఈ TRAIN ఓ అరగంట లేట్ గా వచ్చింది , మీ బండి 6 వ PLATFORM లో వుంది విజయవాడ లో అప్పుడు... అన్నాడు విసుగు గా.

ఇంక ఏమి చెయ్యాలి... అన్నట్లు చూసాను..

“అయితే ఏలూరులో ఎక్కాల్సిన నగేష్ ఎక్క లేదన్నమాట ... మీరు ఒక పని చేయండి...ఏలూరు దాటి పది నిమిషాలు అయింది, నెక్స్ట్ స్టేషన్ తాడేపల్లిగూడెం లో దిగిపోయి...వెనక్కి వెళ్ళండి” అన్నాడు టీ టి ఈ. అలా అని, తన బెర్థ్ దగ్గరకి వెళ్ళాడు.

అంత MIDNIGHT మళ్ళీ తాడేపల్లిగూడెం దిగి వెనక్కి వెళ్లినా, నా బండి అందదు.. నేను హైదరాబాదులో పెళ్లికూడా అందుకోలేను. అలాగని తెల్లవారుజామున పడుతూ లేస్తూ విజయవాడ వెళ్లి అభాసు అవడం ఎందుకు అనిపించింది....

ఓ పని చేస్తే.... వైజాగ్ వెళ్ళిపోతే.... మనసులో వైజాగ్ అనగానే సుధాకర్ గాడు గుర్తొచ్చాడు.

వాడిని కలిసి చాలా ఏళ్లయింది . పైగా వాడిని కలిస్తే నాలుక తడుపుతాడు.

విచిత్రమైన ఆలోచనలు కలుగుతున్నాయి. వాడు నాలా అప్పుడప్పుడు దొంగతనంగా తాగడు రోజూ దాదాపు రెండు పెగ్గులు వేసుకొందే నిద్ర రాదు వాడికి. నాలాంటి FRIENDS కలిస్తే ఇంక పండగే.

పైగా....ఊర్లోకి వెళ్ళాక మా మరదలు ఇంటికి వెళ్లినట్టు ఉంటుంది. ఇక్కడ మా ఆవిడ చెల్లెలు రాధిక గురించి చెప్పాలి.

తను వైజాగ్ లోనే ఉంటుంది గత నెలలో వాళ్ళ అమ్మాయి పెద్దమనిషి అయితే అనితని పంపించి నేను వెళ్లలేదు... ఆఫీస్ INSPECTION ఉండడం వలన కుదరలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించడానికి వీలు చిక్కి వచ్చేనని అబద్ధం ఆడేయొచ్చు...అనిపించింది మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో భోజనం చేసి సుధాకర్ కి ఫోన్ చేస్తే... వాడు ఆఫీస్ నుంచి వచ్చే టైం కి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు.

రాత్రి కి వాళ్ళ ఆఫీసు గెస్ట్ హౌస్ లోనే మా మందు పార్టీ ఏర్పాటు చేయగలడు. ఇలా ఆలోచించిన నాకు... అదే బెస్ట్ అనిపించింది.

ఇంతలో టీ టి ఈ, మళ్లీ ఇటువైపు వచ్చాడు. జేబులో నుంచి 500 తీసి అతని చేతిలో పెట్టి ...సార్ నేను వైజాగ్ వెళ్ళిపోతాను ..టికెట్ రాసేయండి అన్నాను...

విచిత్రంగా చూసి సరే TICKET దిగేటప్పుడు అడగండి అని 200 చేతిలో పెట్టి వెళ్లిపోయాడు TICKET ఇవ్వడు అనమాట... అనుకున్నాను.

ఆ ఏలూరులో ఎక్కాల్సిన నగేష్ రాకపోవడం వల్ల, BERTH ఖాళీగా ఉండవల్ల, నాకు ఇవాళ వైజాగ్ ప్రయాణం పట్టింది అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.

తెల్లారింది ..TRAIN వైజాగ్ లో ఆగిపోయింది... స్టేషన్ కోలాహలానికి మెలుకువ వచ్చింది.. గబగబా రైలు దిగి ...రాధిక వాళ్ళ ఇంటికి ఆటో చేయించుకుని వెళ్లేను .

నేను వెళ్లేసరికి ... రాధిక, భర్త సురేష్ ఇద్దరూ ముందు హాలులో టీవీ చూస్తున్నారు. గేటు చప్పుడికి గుమ్మం వైపు తిరిగింది రాధిక. రాధిక ముఖంలో ఆందోళన, ఆశ్చర్యం కలగలిసిన భావాలతో పరుగున వచ్చింది..

“ బావా ... నువ్వు బాగున్నావా ? ఏంటి ఇలా వచ్చావ్? నువ్వు హైదరాబాద్ వెళ్ళేవు అంది అక్క “ ...అంటూ చేతిలో BAG అందుకుంది..

మా తోడల్లుడు నాకేసి వింతగా చూస్తున్నాడు. నాకు అర్థం కాలేదు... నేను వస్తానని వాళ్లు ఊహించరుగా అందుకే అయి ఉంటుంది ఆనుకున్నాను. అప్పుడు రాధికను క్లియర్ గ

గమనించేను. రాధిక మొహం వాడి పోయి వుంది.... ఏడ్చిన గుర్తులు, . కళ్ళు వాచి ఉన్నాయి..

కూర్చో బావా... అని మంచినీళ్లు పట్టుకొచ్చి., అప్పుడు అసలు విషయం చెప్పింది. ....

బావా నువ్వు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ లో వెళ్లేవని తెలిసింది. గోదావరి ఎక్స్ప్రెస్ ఖమ్మం దాటిన 20 నిముషాలకి పట్టాలు తప్పింది. ముఖ్యంగా ఎస్-7 భోగి బాగా డామేజ్ అయింది అందులో ప్రయాణికుల్ని WARANGAL గవర్నమెంట్ HOSPITAL కి తరలించారు. మీ అన్నయ్య గారి పిల్లలు తెల్లవారి వరకు సినిమాలు చూస్తున్నారట టీవీలో స్క్రోలింగ్ లో ఈ ప్రమాద వార్త విని కంగారుపడి అక్కను లేపి ఈ విషయం చెప్పారట... అది నీకు చాలా సార్లు ఫోన్ చేసిందట నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందట. నువ్వు ఎస్-7 బోగీలోనే వెళ్ళావని అది నిర్ధారించుకుని....

నీవు ఏమైపోయావో అని అప్పటినుంచి ఏడుస్తూనే ఉంది. ఇప్పటికి రెండుసార్లు స్పృహ తప్పిందట కూడా. దాన్ని ఊరుకో పెట్టడం ఎవరి వల్ల కావట్లేదు..

మేము కూడా ఈరోజు బయలుదేరి విజయవాడ వద్దామని అనుకుంటున్నాం. .. అందుకనే టీవీలో యాక్సిడెంట్ వివరాలు తెలుస్తాయని స్క్రోలింగ్, మరియు మెయిన్ న్యూస్ మార్చి మార్చి చూస్తున్నాం...

ఉండు బావా ఒక్కసారి వీడియో కాల్ చేద్దువు గాని దానికి...

పిచ్చిది ఎంత తల్లడిల్లిపోయిందో ....అంటూ తన ఫోన్ నుంచి వాళ్ళ అక్కకి వాట్సాప్ కాల్ చేసింది ..

అనిత మొహం నన్ను చూడగానే వెలిగిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తోంది నమ్మలేనట్లు.

అనిత నిజంగానే పీక్కుపోయింది ...ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి పోయి ఉన్నాయి.

జరిగిన విషయం చెప్పాను... అనితలో చాలా రిలీఫ్ వచ్చింది.

అప్పటికే మా అన్నయ్య, వదిన, తను కారులో WARANGAL చేరిపోయారుట. WARANGAL HOSPITAL లో చేర్చబడిన రైలు ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటున్నారట..

మా అన్నయ్య, వదిన కూడా సంతోషంగా మాట్లాడారు. వాళ్లందరి ముఖాల్లో రిలీఫ్..

అప్పుడు చెప్పాడు అన్నయ్య... S-7 భోగి తిరగ తిరగబడడం లో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయని, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయని... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసిందట. ఆ హాస్పిటల్లో చేర్చిన ప్రయాణికుల ఆచూకీ వెతుకుతూ ఉంటే నా ఆచూకీ దొరకపోవడంతో మరింత ఆందోళనగా ఉన్నారుట. ఈ సమయంలో అనిత మరోసారి స్పృహ కోల్పోయిందిట.

అన్నీ వింటుంటే నాకు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది ... అంటే ప్రయాణంలో పొరపాటు నా LIFE కాపాడింది అన్నమాట... అనుకున్నాను..

నా భార్య ని చూస్తే జాలేసింది.. వెంటనే బయలుదేరి వెళ్లిపోవాలనిపించింది.

అనితకు ఫోన్లోనే ధైర్యం చెప్పి... వెంటనే ...ఏ బండి ఉంటే ఆ బండిలో

బయలుదేరి వచ్చేస్తాను అన్నాను

మా తోడల్లుడు సురేష్ రైల్వేలో DRM ఆఫీస్ లో పనిచేస్తూ ఉండడంతో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి

CHAIR CAR టికెట్ సంపాదించగలిగాడు.

భోజనం చేసి విజయవాడకి రత్నాచల్ లో తిరిగి ప్రయాణం అయిపోయాను.

ఇంత హడావిడి జరిగాక ఇంక సుధాకర్ గాడి కి ఫోన్ చేయాలనిపించలేదు.

.............................................సమాప్తం ..........................

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao