అమ్మా...? దెయ్యమా....? - పి. లక్ష్మీ ప్రసన్న

Ammaa dayyamaa

కరోనా కల్లోలం నుండి తేరుకొని అందరూ బయట ప్రపంచాన్ని చూస్తున్న రోజులు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలం పాటు పాఠశాలలు మూతపడి ఇంట్లో పిల్లలు చేసే అల్లరి వర్ణనాతీతం. ఇల్లు ఇల్లు పీకి పందిరి వేసే వాళ్ళు కొందరు. ఫోన్లకి, టీవీలకి అతుక్కునే వాళ్ళు కొందరు. ఇంటిలోనే బంధించేసామని తినకుండా బక్కచిక్కిన వాళ్ళు కొందరు. అతిగా తినేసి ఒళ్ళు పెంచిన వాళ్ళు కొందరు.

స్వేచ్ఛగా తిరిగే వాళ్లని నాలుగు గోడల్లో బంధిస్తే, హాస్టల్ వార్డెన్ లాంటి తల్లిదండ్రులకు చుక్కలతో పాటు నవగ్రహాలను సైతం చూపించేశారు అల్లరి పిల్ల పిశాచాలు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వాళ్ల దెబ్బలాటలు వేరే లెవెల్. కొట్టుకోవడం, తన్నుకోవడం, గిచ్చుకోవడం జుట్టు జుట్టు పీక్కోవటం, తర్వాత ఏమీ జరగనట్లు కలిసి ఆడుకోవడం. ఇవన్నీ చూసి జుట్టు పీక్కున్న అభాగ్యపు తల్లిదండ్రులు ఎందరో.

అందులో మాలతీ మాధవ్ ల జంట కూడా ఒకటి. మెల్లగా ప్రపంచం అంతా మామూలు అవుతున్న సమయంలో స్కూల్ తెరుస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఆ సందేశం చూడగానే మాలతి కళ్ళు మెరిసాయి. హమ్మయ్య పిల్లల్ని ఇంక స్కూల్ కి పంపించవచ్చు అనుకున్నది. మళ్ళీ ఉదయాన్నే వంట, లంచ్ బాక్సులు సర్దడం, స్కూల్ బ్యాగ్ లు సర్దటం. భర్తని ఆఫీస్ కి పిల్లల్ని స్కూల్ కి పంపడం మొదలయింది మునుపటి దీనచర్య మాలతికి.

ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న 11ఏళ్ళ కూతురు చాందిని క్రమం తప్పకుండా స్కూల్ కి వెళుతుంది శ్రద్ధగా చదువుకుంటుంది. కానీ థర్డ్ క్లాస్ చదువుతున్న 9ఏళ్ల కొడుకు చరణ్ మాత్రం స్కూలు ఎగ్గొట్టడానికి ప్రతిరోజు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కరెక్ట్ గా స్కూల్ బస్సు వచ్చేసరికి అర్జెంట్ బాత్రూం అని బస్సు వెళ్లేంత వరకు వచ్చేవాడు కాదు. ఒకరోజు కడుపు నొప్పి వస్తుంది అని, ఇంకో రోజు తల నొప్పి అని సాకులు చెప్పేవాడు. మరొక రోజు స్కూల్ బెల్ట్ సాక్సులు దాచేసి ఇంకొకసారి హోమ్ వర్క్ బుక్స్ కనిపించడం లేదని రకరకాల కారణాలు చెప్పి స్కూలు మానేసి, ఫోను, టీవీ చూస్తూ గడిపేస్తున్నాడు. ఇలా కాదని ఫోను టీవీ చూడకుండా కట్టడి చేసింది మాలతి. అయినా ఏమి మార్పు రాలేదు.

భర్తతో కొడుకు స్కూల్ మానేయటం కోసం వేస్తున్న పిచ్చి వేషాలు అన్నిటి గురించి చెప్పింది. మళ్లీ స్కూలు మానితే పనిష్మెంట్ ఇస్తానని గట్టిగానే భయం చెప్పాడు మాధవ్ ఎప్పుడూ ఏమీ అనని తన డాడీ కోప్పడేసరికి ఉక్రోషం వచ్చేసింది చరణ్ కి. మాలతీ దగ్గరికి వచ్చి "అమ్మ నేనూ, అక్క నీ బొజ్జ లోనుండి వచ్చామా" అని అడిగాడు

"అవును రా నీకెందుకు వచ్చింది ఆ డౌటు 9 నెలలు కష్టపడి మోసి కన్నాను మిమ్మల్ని "అన్నది మాలతి.

"అవును కదా! అలాంటప్పుడు నువ్వూ, నేనూ, అక్క ఒక ఫ్యామిలీ కదా. డాడీ ఎందుకు వచ్చారు మన ఫ్యామిలీలోకి" అన్నాడు.

అవాక్కయింది మాలతి. అంతలోనే తేరుకొని "డాడీ నిన్ను తిట్టారని మన ఫ్యామిలీనే కాదంటావా? పిచ్చి వేషాలు వేయకుండా వెళ్లి చదువుకో" అన్నది కానీ వాడి తిక్క ప్రశ్నకి నవ్వుకున్నది.

ఎంత చెప్పినా ఏదో వంక చూపి స్కూల్ ఎగ్గొడ్తూనే ఉన్నాడు చరణ్. ఆరోజు రాత్రి టీవిలో ఏదో దెయ్యం సినిమా వస్తుంది. పిల్లలు భయపడతారు వేరే ఛానల్ మార్చండి అన్నది మాలతి. మేము చూస్తాం మాకు భయం లేదు అన్నారు ఇద్దరూ. దుప్పటి ముసుగేసుకుని మరీ భయపడుతూనే సినిమా మొత్తం చూసేసాడు చరణ్.

మరుసటి రోజు కూడా మ్యాథ్స్ బుక్ కనిపించలేదని స్కూల్ మానేశాడు చరణ్. దాన్ని వెతికే క్రమంలో డైరీలో పేజీలు తిరగేసింది మాలతి. ఈ నెలలో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే స్కూల్ కి వెళ్ళాడు. ఎంతో బాగా శ్రద్ధగా చదువుకునేవాడు. ఈ కరోనా వల్ల ఇంటిలో ఉంటూ ఆటలు మొబైల్ గేమ్స్, కార్టూన్ చానెల్స్ మీద ఆసక్తి పెరిగి చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. పుస్తకాలన్నీ సర్దేసి స్నానం చేసి వచ్చి జడ వేసుకోవాలని జుట్టు దువ్వుకోసాగింది.

చరణ్ "మాలతిని చూసి ఏమిటమ్మా అది దెయ్యం లాగా ఉన్నావ్"అన్నాడు. అంతే మెరుపులాంటి ఆలోచన వచ్చింది మాలతికి. జుట్టు మొత్తం మొహం మీదకు దువ్వుకుని గొంతు మార్చి బేస్ వాయిస్ తో "చరణ్ చరణ్" అని పిలవ సాగింది మెల్లగా.

చరణ్ మాలతికి దగ్గరికి వెళ్లి "అమ్మ " అని పిలిచాడు. అయినా మాలతి కదలకుండా విగ్రహంలా నుంచుని చరణ్ అని పిలుస్తూనే ఉంది. భయపడుతున్నాడు చరణ్ అమ్మా అని గట్టిగా అరిచాడు. అంతే మాలతి ఏమీ ఎరగనట్లు జుట్టు అందంగా దువ్వుకుని జడ వేసుకొని వంటగదిలోనికి వెళ్ళిపోయింది. చరణ్ కి అంతా అయోమయంగా అనిపించింది. రాత్రి సినిమాలో చూసిన సీన్ లాగా ఉంది. బిక్కమొహం పెట్టేసాడు చరణ్. మాలతి తర్వాత ఏమీ జరగనట్లే మామూలుగా మాట్లాడు సాగింది.

కాసేపటికి ఇల్లు క్లీన్ చేస్తూ మాపింగ్ స్టిక్ ని చేత్తో పట్టుకుని తల కిందకి వాల్చి అలాగే కదలకుండా నిలబడిపోయింది మాలతి. చరణ్ పిలిచినా పలకట్లేదు కొంచెం కూడా కదలట్లేదు. చరణ్కి ఏం చేయాలో తెలియడం లేదు. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అమ్మకు ఏదో అయ్యింది అనుకున్నాడు. వాడి కంగారు చూసి నవ్వు ఆపుకుంటుంది మాలతి. అమ్మ అని గట్టిగా అరిచాడు. అంతే స్పృహలోకి వచ్చినట్లు నార్మల్ గా ఇల్లు క్లీన్ చేసేసి "చరణ్ భోజనం పెట్టైనా" అని అడిగింది మాలతి.

"వద్దమ్మా నాకు భయమేస్తుంది అమ్మ" అన్నాడు. ఏమైంది చరణ్ అని పక్కనే కూర్చుంది. దూరంగా జరిగి "నువ్వు పిలిచినా పలకట్లేదు కదలకుండా అలాగే నుంచున్నావు 10 మినిట్స్ కొంచెం కూడా కదలలేదు" అని చెప్పాడు.

"నేను ఉదయం లేచిన దగ్గర నుంచి నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఇంటి పని చేస్తున్నాను. నేను 10మినిట్స్ కదలకుండా ఉన్నానా? పిలిస్తే పలకలేదా నాకేమైనా చెవుడా?దెయ్యాల సినిమాలు చూడొద్దంటే చూసావు. ఇప్పుడు నేను కూడా దెయ్యలా కనిపిస్తున్నానా నీకు" అన్నది మాలతీ. నవ్వు అప్పుకుంటూ సాయంత్రం స్కూల్ నుంచి చాందిని వచ్చాక జరిగిందంతా చెప్పింది మాలతి. పెద్దగా నవ్వేసింది చాందిని.

సైలెంట్ గా ఉండు వాడు పడుకున్నాడు అన్నది మాలతి. కాసేపటికి చరణ్ లేచి విషయం మొత్తం చెప్పాడు అక్కకి. అంతా విని అమ్మకి దెయ్యం పట్టినట్టుంది అన్నది చాందిని. అంతే హడలిపోయాడు చరణ్. ఇప్పుడు అమ్మా... లేకపోతే దెయ్యమా ఎవరు అంటావ్ అక్క అన్నాడు.

"కదిలితే అమ్మ కదలక పోతే దెయ్యం అన్నది" చాందిని.

చరణ్ మాలతీనే చూస్తూ బుద్ధిగా చదువుకుంటున్నట్టు నటిస్తున్నాడు. మాలతి భర్త మాధవ్ కి విషయం అంతా ముందే మెసేజ్ చేసింది. "శాడిస్ట్ తల్లి వాడు భయపడతాడు" అని రిప్లై ఇచ్చాడు మాధవ్.

"సరే అయితే మీ కొడుకుని ప్రతిరోజు స్కూల్ కి పంపించే మార్గం ఇంకేదైనా చెప్పండి" అని మెసేజ్ పెట్టింది మాలతి.

మాధవ్ రాగానే అమ్మా కదలకుండా బొమ్మలాగా అయిపోయిందని, పిలిచినా పలకలేదని, వేరే గొంతుతో పిలుస్తుందని చెప్పాడు. అంతా విన్న మాధవ్ కూడా అమ్మకి దెయ్యం పట్టినట్లుంది అన్నాడు సింపుల్ గా.

అంతే చరణ్ తెగ భయపడిపోయాడు. వాడి అవస్థ గ్రహించి నిజం చెప్పేద్దామనుకున్నా. నెలకు తొమ్మిది రోజులు మాత్రమే స్కూల్ కి వెళ్ళిన వాడి అటెండెన్స్ గుర్తొచ్చింది మాధవ్ కి. ఏమీ భయపడక్కర్లేదు అందరూ ఉన్నప్పుడు నార్మల్గానే ఉంది కదా. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంది దెయ్యం. అమ్మకి తాయత్తు తీసుకొచ్చి కడతాను. మళ్లీ మామూలుగా అయిపోతుంది. అని చెప్పాడు మాధవ్.

ఆరోజు రాత్రి మాలతి దగ్గర పడుకోలేదు చరణ్. మాధవ్ దగ్గరే పడుకున్నాడు. మర్నాడు ఉదయం మాధవ్ ఆఫీస్ కి, చాందిని స్కూల్ కి రెడీ అవుతున్నారు. అప్పుడే నిద్ర లేచిన చరణ్ తో "చరణ్ నువ్వు ఈరోజు స్కూల్ కి వెళ్లకు ఇద్దరం కలసి మీ టాయ్స్ మొత్తం సర్దేద్దాం" అన్నది మాలతి.

"లేదు అమ్మ నేను స్కూలు మానను అక్కతో స్కూల్ కి వెళ్తాను అక్కతోనే వచ్చేస్తాను. అని గబగబా బాత్ రూమ్ వైపు నడిచాడు. తిక్క కుదిరింది వెధవకి అని నవ్వుకున్నారు ముగ్గురూ.

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao