మిస్సింగ్ - విద్యాధర్ మునిపల్లె

MIssing

సంయుక్త తన ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరింది. క్యాబ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తోంది. క్యాబ్ వచ్చి ఆమె ముందు ఆగింది. అయితే ఆమె క్యాబ్ ఎక్కలేదు. అంతలోనే ఆమెకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఆన్సర్ చేసింది. అక్కడి నుండి వేగంగా కదిలింది.

--------

సంయుక్త అక్క నీరజ హడావుడిగా పోలీస్టేషన్ కి వెళ్ళింది.

ఎస్సై ఇంకా రాలేదు. రైటర్ కూర్చొని వున్నాడు.

నీరజ చేతులు వణుకుతున్నాయి.. చాలా కంగారుగా వుంది.. ఆమెని చూస్తూనే రైటర్...

‘‘ మేడం ముందు మీరు స్థిమిత పండండి. కానిస్టేబుల్ వాటర్ ఇవ్వండి ఈవిడికి.. ’’ అన్నాడు రైటర్.. కానిస్టేబుల్ వాటర్ తెచ్చి ఇచ్చాడు.. నీరజ వాటర్ తాగింది..

‘‘ ఇప్పుడు చెప్పండి మేడం.. ఏమైంది?’’

‘‘ నా చెల్లెలు సంయుక్త.. తను ఒక సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ గా జాబ్ చేస్తోంది. బి షిఫ్ట్ పూర్తి చేసుకొని రాత్రి 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది. నిన్న రాత్రి రాలేదు.’’

‘‘ షిఫ్ట్ కంటెన్యూ చేస్తుందేమో.. లేదా లేట్ అయ్యి ఫ్రండ్ దగ్గరికి వెళ్ళిందేమో’’

‘‘ లేదుసార్.. అలాంటిదేమైనా వుంటే నాకు కాల్ చేసి చెప్తుంది. కానీ రాత్రి నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ’’ నాకెందుకో భయంగా వుంది సార్..

‘‘ భయపడకండి.. తను పనిచేస్తున్న ఆఫీసుకి ఫోన్ చేశారా?’’

‘‘ చేశాను సార్.. అక్కడ కూడా లేదని చెప్పారు. మీరే ఎలాగైనా నా చెల్లెల్ని కనిపెట్టాలి సార్’’ అన్నది ఏడుస్తూ..

రైటర్ కేసు రాయించుకున్నాడు. ఆమె ఇచ్చిన వివరాలు తీసుకొని.. ఫోటో ఫైల్ చేసుకున్నాడు.

‘‘ మేడం ఎస్సైగారు వచ్చేదాకా అలా కూర్చోండి’’ అన్నాడు రైటర్..

--------

డంపింగ్ యార్డ్ లో అన్ ఐడెంటిఫైడ్ బాడీలు నాలుగు దొరికాయి.

మూడు బాడీలు బాగా కుళ్ళిపోయి వున్నాయి. ఎప్పుడు హత్యజరిగిందో కూడా అర్ధంకాని విధంగా వున్నాయి.

ఒక బాడీ మాత్రం హత్య చేయబడి ఎక్కువసేపు కూడా కాలేదు.

వాటికి పంచనామా చేస్తున్నాడు ఎస్సై రంజిత్ కుమార్.

ఫోరెన్సిక్ విభాగం వివరాలు సేకరిస్తున్నాయి.

ఇంతలో రంజిత్ కుమార్ కి ఫోన్ వచ్చింది.

కాల్ అటెంట్ చేశాడు.. రంజిత్ కుమార్..

‘‘ హలో సార్.. ఒకమ్మాయి మిస్సింగ్ కేసని వచ్చింది. మీరు అన్ ఐడెండిఫైడ్ బాడీలు దొరికాయని డంప్ యార్డ్ కి వెళ్ళారు కదా.. నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను. ఈ ఫోటో తాలూకు బాడీ వుందేమో కన్ఫర్మ్ చేస్తారా.? వాట్సప్ చేశాను సార్..’’ అంటూ రైటర్ గడగడా చెప్పేశాడు.

రంజిత్ కుమార్ తనకి వాట్సప్ లో వచ్చిన ఫోటో చూశాడు.

వెంటనే రంజిత్ కుమార్ రైటర్ కి ఫోన్ చేశాడు.. ‘‘ ఆ అమ్మాయితో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ని ఇచ్చి డంపింగ్ యార్డ్ దగ్గరికి పంపించు..’’ అని కాల్ కట్ చేశాడు.

-----------

సంయుక్త డెడ్ బాడీ ఐడెంటిఫై అయింది. అలాగే మిగతా నాలుగు డెడ్ బాడీలు కూడా వేర్వేరు ఆఫీసుల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వని తెలిసింది. అయితే ఎవరు? ఎందుకు? వీళ్ళని హత్యచేశారు. చంపేవాళ్ళు వాళ్ళ నరకయాతన చూపిస్తూ.. చివరికి తలపగలకొట్టి చంపేశాడు. చనిపోయిన వీళ్ళంతా కూడా బ్రతికుండగానే నరకం చూశారని పోస్టుమార్టం నివేదికలు తెలియజేశాయి.

నేరస్తుల్ని పట్టుకోవాలనీ, వాళ్ళని నడిరోడ్డుమీద ఉరితీయాలని... కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపారేయాలని జనం గొడవ చెయ్యటం మొదలు పెట్టారు. రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా ఇదే చర్చ... అయినా నైట్ షిఫ్ట్ కి వెళుతున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ మిస్సింగ్ లు ఆగలేదు. అవి జరుగుతునే వున్నాయి. జనం పోలీసుల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. దోషుల్ని పట్టుకోమని గొడవ చేస్తున్నారు. రంజిత్ కుమార్ ని స్పెషల్ ఆఫీసర్ గా రిక్రూట్ చేశారు. అనుమానమొచ్చిన ప్రతి వెహికల్ ని చెక్ చేస్తునే వున్నారు. డంపింగ్ యార్డ్ దగ్గర భారీ పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు. అయినా డంప్ యార్డులో బాడీలు దొరుకుతునే వున్నాయి.

అన్ని కంపెనీలకూ నైట్ షిఫ్ట్ లు క్యాన్సిల్ చేయమని పోలీసు శాఖ హెచ్చరికలు చేసింది..

నాలుగు వారాలపాటు ఎక్కడా కూడా ఎలాంటి బాడీలు దొరకలేదు. నేరస్తులు సైలెంట్ అయ్యారనే అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే మరో క్రైం న్యూస్ వెలుగులోకి వచ్చింది.

పెద్దపెద్ద వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోంచి పెద్దమొత్తాలు మిస్సవుతున్నాయని.. బ్యాంకు అధికారులు కూడా ఆ డబ్బు ఏ అకౌంట్లోకి వెల్తోందో గుర్తించలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు.

ఇప్పుడు హాట్ టాపిక్ డబ్బుల మిస్సింగ్ అయింది..

మిస్ అయిన వాళ్ళ డెడ్ బాడీలు ఈసారి డంపింగ్ యార్డు నుండి నగరంలోని డ్రైనేజీల్లో దొరుకుతున్నాయి. పోలీసులకి ఈ కేసు పెద్ద సవాలైంది. మీడియా, జనాలు పోలీసు శాఖని దుమ్మెత్తి పోస్తున్నారు.

బ్యాంకు సర్వర్లని ఎవరో హ్యాక్ చేశారని.. కోట్ల రూపాయల నగదు గుర్తుతెలియని ఖాతాల్లోకి వెళ్ళిపోతోందని.. ఆ ఖాతా ఎక్కడుంది? ఎవరు దీనిని ఆపరేట్ చేస్తున్నారు.. వంటి అంశాలేవీ వెలుగులోకి రావట్లేదని బ్యాంకు అధికారులు గోలపెట్టేస్తున్నారు. తమ నగదుకి రక్షణలేదంటూ బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరారు. తమ డబ్బు తమకిచ్చేయమంటూ గొడవ చేస్తున్నారు. బ్యాంకుల వద్ద హై టెన్షన్ నెలకొంది. డబ్బుల షార్టేజ్ వల్ల బ్యాంకులు పోలీసుల్ని శరణువేడాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఖాతాదారుల్ని చెదరగొట్టారు.

అసలు దోషి తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడు ఎవడు? ఎక్కడున్నాడు? ఎందుకిదంతా చేస్తున్నాడు.. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా పోలీసు ఉన్నతాధికారులకి కూడా అందటంలేదు. సెంట్రల్ నుంచి వచ్చిన స్పెషల్ అధికారులు కూడా ఈ విషయంలో విఫలమయ్యారు.

‌------

పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో పెద్ద ఎత్తున సీక్రెట్ మీటింగ్ జరుగుతోంది.. అందరు అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఢిల్లీ ఆఫీసరు లోకల్ పోలీసుల్ని ఏకిపారేస్తున్నాడు. బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. సాఫ్ట్ వేర్ డిజైన్ చేసిన మ్యాటినోవా కంపెనీ ఇంజనీర్లు కూడా తమ శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నారు.

తమ ఫైర్వాల్ ని బ్రేక్ చేసి తమకి తెలీకుండా డార్క్ నెట్ వెబ్ ద్వారా లోపలికి జొరబడిన ఆ దొంగల కోసం వేటాడుతున్నారు. కానీ అవతల వున్న హ్యాకర్స్ సామాన్యులు కాదుకదా..

రంజిత్ కుమార్ బుర్రవేడెక్కి పోయింది.. బాల్కనీలోకొచ్చి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. ఒకపక్క మిస్సింగ్ కేసుకు తోడు ఇప్పుడు బ్యాంకులో నగదు మిస్సింగ్ కేసు.. మెంటలెక్కిపోతోంది అతనికి. అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది..

ఇవి రెండు కేసులు కావు.. ఒకదానితో ఒకటి సంబంధముంటే.. అన్న ఆలోచన వచ్చింది. హటాత్తుగా మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు..

‘‘ సార్.. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. మనం వీటిని రెండు కేసులుగా చూస్తున్నాం.. కానీ ఒకదానికొకటి సంబంధముందని నాకు అనిపిస్తోంది.. ’’ అన్నాడు.

ఢిల్లీ ఆఫీసర్ శుక్లా.. సీరియస్ గా.. ‘‘ అసలే కేసు తేలక మేం తలలు పట్టుకుంటే రెండింటికీ సంబంధం వుందంటావేంటి? నోరుమూసుకొని బయటికి నడు’’ అన్నాడు సీరియస్ గా..

‘‘ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్.. మీకే అర్థమౌతుంది.. సార్.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ మిస్ అవుతున్నారు. ఇదే సమయంలో బ్యాంకు సర్వర్ హ్యాక్ అయింది. పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సెషన్స్ జరుగుతున్నాయి. వీటిని చేయాలంటే హ్యాకర్లు మాత్రమే చేయాలి. అంటే సాఫ్ట్ వేర్ బాగా తెలిసిన వాడే చెయ్యాలి.’’

‘‘ అయితే ’’ అన్నాడు శుక్లా..

‘‘ సార్ నాకు గంట టైం ఇస్తే.. నేను ఈ కేసుని సాల్వ్ చేస్తాను.. ఇప్పటిదాకా ఏఏ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మిస్ అయ్యారో.. వారంతా ఏ ఏ సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారో డేటా మొత్తం తెప్పిస్తాను. వీరందరికీ కామన్ పాయింట్ ఎక్కడో వుంటుంది. ఆ కామన్ పాయింట్ లోనే మనకి కావాల్సిన నేరస్తుడు కూడా వున్నాడు.’’ అన్నాడు రంజిత్ కుమార్..

‘‘ ముందు నువ్వు ఆ పనిలో వుండు. మేం మాపనిలో వుంటాం.. కేసు ఈ రోజు తేలలేదనుకో.. ’’ అంటూ శుక్లా చెబుతూనే వున్నాడు.. రంజిత్ కుమార్ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు..

-----------

రంజిత్ కుమార్ తన ఆఫీసులోని కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. మిస్సింగ్ అయిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేశారు లాంటి డేటాని మొత్తం స్టడీ చేస్తున్నాడు. మిస్సింగ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ‘‘మ్యాటినోవా’’ కంపెనీలో జాబ్ చేసిన వాళ్ళే..సో మ్యాటినోవా సాఫ్ట్ వేర్ కంపెనీలోనే అసలు దొంగ వుండచ్చు. లేదా అక్కడి నుండి రాజీనామా చేసి బయటికి వచ్చిన వాడెవడైనా కావచ్చు.. వెంటనే తనకు తెలిసిన హ్యాకర్ సంజయ్ ని లైన్ లోకి తీసుకున్నాడు రంజిత్ కుమార్.

మ్యాటినోవా కంపెనీ సర్వర్ లోకి ఎంటర్ అవ్వమన్నాడు.సంజయ్ పేరు మోసిన హ్యాకర్. అతను కంపెనీ సర్వర్ లోకి డార్క్ వెబ్ ద్వారా ఎంటర్ అయ్యాడు. చనిపోయన సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పనిచేసిన టైంలో వున్న వారందరి లిస్ట్ బయటికి తీయించాడు. అందులో జాబ్ వాళ్ళంతట వాళ్ళుగా మానేసి వెళ్ళిపోయిన వారి లిస్ట్ బయటికి తీయించాడు. వారిలో చనిపోయిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా మరో పది మంది ఇంజనీర్లు కూడా వున్నారు. ప్రస్తుతం వీరు ఎక్కడ పనిచేస్తున్నారో కనుక్కోమని కానిస్టేబుల్స్ ని పంపించాడు.

కానిస్టేబుల్స్ వెళ్ళారు.. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని రంజిత్ కి అనిపిస్తోంది.. వీళ్ళంతా చిన్న చిన్న చేపలు.. అసలు తిమింగలం ఒకవేళ మ్యాటినోవాలోనే వుంటే. అన్న ఆలోచన అతనికి వచ్చింది.. ఎవరా తిమింగళం.. అంటూ ఆలోచన చేసింది..

మ్యాటినోవా కంపెని హిస్టరీని బయటికి తీశాడు.. మ్యాటినోవా కంపెనీ ఫౌండర్ సిఇవో.. జగదీష్ నారాయణ్ నెలక్రితం చనిపోయాడు.అతని కొడుకు వసంత్ నారాయణ్ సిఇవోగా బాధ్యతలు తీసుకున్నాడు. అతను బాధ్యతలు తీసుకున్న పదిహేనోరోజు మొదటి మిస్సింగ్ కేసు నమోదైంది.. ఆ తర్వాత నుంచి మిస్సింగ్స్ జరుగుతునే వున్నాయి. వసంత్ నారాయణ్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మాయమయ్యాయో లేదో ఒకసారి చూసి చెప్పమని సంజయ్ ని అడిగాడు.

‘‘ అతని అకౌంటులో కూడా డబ్బులు మాయమయ్యాయి. అయితే కేవలం లక్షరూపాయలు మాత్రమే.. ఏ అకౌంటుకి ట్రాన్సఫర్ అయ్యాయి.. చూసి చెప్తాను సార్.. ’’ అంటూ అతను కంప్యూటర్ మీద వేళ్ళు కదిలిస్తున్నాడు. తను చేస్తున్న పనికి అవతలి హ్యాకర్లు కూడా అడ్డుతగులుతున్నారని.. తనని ట్రేస్ చేయ్యటానికి రకరకాలుగా ట్రై చేస్తున్నారని సంజయ్ కి అర్థమైంది. వారికి దొరక్కుండా సంజయ్ ఫైర్ వాల్స్ క్రియేట్ చేసుకుంటూ అవతలి వారి ఫైర్ వాల్స్ ని బ్రేక్ చేస్తూ లోనికి ఎంటర్ అవుతున్నాడు.

‘‘యస్.. సార్ .. కనుక్కున్నానుసార్.. మీ అనుమానం నిజం. ద్రోహి మ్యాటినోవా కంపెనీ సిఇవో వసంత్ నారాయణ్.. అతను తన అకౌంట్లో డబ్బులు కేవలం లక్షరూపాయలు మాత్రమే మాయం చేశాడు. కానీ స్విస్ బ్యాంకులో ని తన అకౌంటుకి డబ్బుల్ని సీక్రెట్ గా తరలించాడు. వీటిని ఏ బ్యాంకులు కూడా గుర్తించలేని విధంగా సాఫ్ట్ వేర్ తో మాయచేశాడు సార్. ’’ అన్నాడు సంజయ్ ఉత్సాహంగా..

‘‘ వెరీ గుడ్ నాకు డేటా మొత్తం సాఫ్ట్ కాపీ ప్రిపేర్ చెయ్యి.. ఈ విషయం మన మధ్యనే వుంచు.. ఇప్పుడు నేరస్తుల సర్వర్ ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడినుండి ఆపరేట్ చేస్తున్నారో లొకేషన్ ఫైండవుట్ చెయ్యగలవా’’ అని అడిగాడు రంజిత్ కుమార్..

‘‘ తప్పకుండా సార్.. వాళ్ళు ప్రస్తుతం యూజ్ చేస్తున్న వైఫై డిజిపి ఆఫీస్ సార్.. కాసేపట్లో పోలీస్ సర్వర్ కూడా వాళ్ళు హ్యాక్ చెయ్యబోతున్నారుసార్.. అక్కడున్న వాళ్ళు మీకు సహకరించటానికి రాలేదు.. మీ సర్వర్ ని హ్యాక్ చెయ్యటానికి వచ్చారు. మీరు వేసే ప్రతి మువ్ తెలుసుకోటానికి వచ్చారు. ’’ అన్నాడు సంజయ్..

రంజిత్ కుమార్ వెంటనే డిజిపి ఆఫీసుకి ఫోన్ చేసి అక్కడున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని కస్టడీలోకి తీసుకోమన్నాడు. తను బయల్దేరి వస్తున్నానని నేరస్తుడు దొరికాడని చెప్పాడు.

----

ఇన్వెస్టిగేషన్ సెల్ లో వసంత్ నారాయణ్ కూర్చున్నాడు. పోలీసులు సేకరించిన ఆధారాలు చూసి అవాక్కయ్యాడు. నేరం ఒప్పుకున్నాడు. తనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని హ్యాకర్లుగా మారమని కోరాననీ, వాళ్ళు ఒప్పుకోలేదని, తనపేరు వాళ్ళు బయటి పెడతారేమో అనే భయంతో వాళ్ళని చంపేశాననీ చెప్పాడు. తను చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా ఒప్పుకున్నాడు. రంజిత్ కుమార్ ని ఉన్నతాధికారులు అభినిందించారు. రంజిత్ కుమార్ కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరు పరిచాడు. కోర్టు వసంత్ నారాయణకి రిమాండ్ విధించింది.. కేసు నడుస్తోంది...

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao