అందరిలాగే, నేను కూడా భగవంతుడిని ప్రతీ రోజూ --
'అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పార్వతీ పతయే' --
అని త్రికరణ శుద్ధిగా ప్రార్ధిస్తూనే ఉన్నాను. అయినా నాకెందుకో - అంతటితో ఆగాలని లేదు.
ఆ నా ప్రార్ధన వినే భగవంతుడు, నా కోరికని తీరుస్తాడన్న నమ్మకం లేక కాదు.
అసలు మరణం ఎప్పుడు సంప్రాప్తమౌతుందో ముందుగా తెలిస్తే, ఇంకా ఉత్తమమని -- కొత్తగా ఆలోచన కలగడమే కారణం.
మన భారతీయ సనాతన ధర్మంలో మృత్యువుని 'మృత్యుదేవత' గా సంబోధిస్తాము కదా. అందుకే, ఆ దేవతని వేడుకుంటే, మరణం ఎప్పుడు సంప్రాప్తమౌతుందో తెలుసుకోవాలన్న నా కోరిక సఫలమౌతుందేమో అని, మిణుకు మిణుకు మంటున్న ఆశ.
అయితే - 'ఓరి వెర్రివాడా నేను కనిపిస్తే నువ్వు నావెంట రావలసిందే కదా, మరి నేను నా ఆగమనాన్ని నీకు ముందుగా ఎలా తెలియచేయగలను' అని మృత్యుదేవతకి అనుమానం రావచ్చు అనుకుంటా. దానికి కూడా నాదగ్గర ఒక పరిష్కారం ఉంది. మృత్యుదేవత నా కలలోకి వచ్చి, తన ఆగమన సమయాన్ని నాకు చెప్పవచ్చు కదా - అదీ తెలవారగట్ల వచ్చే కలలో. ఎందుకంటే, తెలవారగట్ల వచ్చే కలలు నిజమవుతాయి అని నమ్మకం.
మనల్ని తనతో తీసుకొని వెళ్ళడానికి మన దగ్గరికి వచ్చే వారెవరేనా సమయాభావంతో మన దగ్గర ఉండలేక, వారు వచ్చిన వెనువెంటనే వారితో మనల్ని తీసుకొని వెళ్తారు అని ముందుగా తెలిస్తే - వారి విలువైన సమయాన్ని కాపాడుతూ వారితో శీఘ్రంగా సులువుగా ప్రయాణం అవాలని, వారు వచ్చే సరికి మూటా ముల్లె సర్దుకొని తయారుగా మనం ఉండగలం కదా.
అలాగే - మృత్యుదేవత ఎప్పుడు మన దగ్గరకి వస్తుందో తెలిస్తే, ఆ సమయానికి తనతో మన ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకొని తయారుగా ఉండవచ్చు.
-2-
అంతే కాదు. ఏదో అనారోగ్య కారణం వలన ఆసుపత్రిలో, అందునా I.C.U.లో ఉండవలసిన అగత్యం కానీ ఏర్పడితే -- I.C.U.లో యంత్రాల మధ్యన, యంత్రాల్లా పనిచేసే వైద్య సిబ్బంది మధ్యన ఉండకుండా -- మృత్యుదేవత వచ్చే సమయానికి కాస్త ముందరగా, ఏవో బలమైన కారణాలతో పట్టుపట్టి ఇంటికి చేరుకొని, మనవారి మధ్యన ఉంటే అదొక తృప్తి.
అప్పుడు చుట్టూ ఉండే మనవారిని ప్రత్యక్షంగా చూస్తున్నా - మనసులో భగవన్నామం స్మరిస్తూ, మృత్యుదేవతతో చేయి చేయి కలిపి ఆనందంగా అనంత లోకాలకి ప్రయాణం సాగించవచ్చు.
ఇంకా నా ఆలోచనల పరంపరలో ఏముందంటే --
మన పిల్లలు వారి వారి పనులలో తిరుగాడుతున్నా, మలి వయసులో ఉండే మనం ఇంట్లో ఒంటరిగా ఉంటే -- 'మనం ఎలా ఉన్నామో' అన్న ఆలోచన వారిని భయపెడుతూనే ఉంటుంది.
అదే, మృత్యుదేవత ఆగమనం గురించి మనకు ముందుగా తెలిస్తే - ఏదో కారణం చెప్పి ఆ సమయానికి మన పిల్లలు మన దగ్గరే ఆ తుది ఘడియలలో ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవొచ్చు.
అలా చేయగలిగితే - --
మన ఆఖరి ఘడియలలో పిల్లల మధ్యన ఉన్నామన్న తృప్తి మనకు ;
మన ఆఖరి ఘడియలలో మన దగ్గర ఉన్నామన్న తృప్తి మన పిల్లలకి ;
మన ఆఖరి ఘడియలలో మన దగ్గర లేకపోతే కలిగే నిందలనుంచి పిల్లలకి విముక్తి. ఎందుకంటే --
‘మలి వయసులో ఉండే పెద్దవాళ్ళని ఒంటరిగా వదలి ఆ తిరుగుళ్లేమిటి’ అని ఈ పాడు లోకం
మన పిల్లలని నిందించక వదుల్తుందా?
అంతేకాదు, ఈ పాడు లోకం ఎవరికీ కనపడని మృత్యుదేవతని కూడా – ‘పిల్లలు దగ్గర లేనప్పుడు తీసుకొని పోకపోతే, వారు వచ్చేవరకూ ఆగకూడదా’ - అని నిందిస్తుంది.
మరొక ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే -
మన ఆలోచనలు మన చేష్టలు మనల్ని భగవన్నామ సంకీర్తనకి అంతో ఇంతో దూరంగానే ఉంచుతాయి అన్నది నిర్వివాదాంశం.
అదే, మృత్యుదేవత ఆగమనం ముందుగా తెలిస్తే, ఆ సమయానికి కొద్ది రోజుల ముందర - మన మనసుకి భగవన్నామ సంకీర్తన అలవాటు చేసి, అంత్య ఘడియలలో భగవన్నామం స్మరిస్తూ మృత్యుదేవతతో కలిసి మన ఆఖరి ప్రయాణం భక్తి పారవశ్యంతో సాగించవచ్చు.
-3-
ఇన్ని కారణాల వలన -- నాకిప్పుడు మృత్యుదేవతని ఆరాధించి ఆ దేవత అనుగ్రహంతో ఆ దేవత ఆగమనం ముందుగా తెలుసుకోవాలని ఆకాంక్ష పెరుగుతోంది.
మనసా వాచా కర్మణా మనము చేసే ఆరాధనకు కట్టుబడిన దేవతలు మన మీద వారి అనుగ్రహ వర్షం కురిపిస్తారని అత్యంత నమ్మకం నాకు. మన గురువులు గురుతుల్యులు కూడా అదే బోధించేరు.
ఆ ఆలోచనతో అదే నమ్మకంతో ఈ క్షణం నుంచీ నేను మనసా వాచా కర్మణా మృతుదేవతని ఆరాధిస్తాను.
ఆ ఆరాధనతో నా అభీష్టం నెరవేరేటట్టు మృత్యుదేవత అనుగ్రహం పొందగలనని పూర్తి ఆశతో నమ్మకంతో ఉన్నాను, నేను.
నా ప్రార్ధనని మన్నించి నా కోరికని తీర్చమని మృత్యుదేవతని వేడుకుంటున్న ఈ తరుణంలో, మరొక చిన్న కోరిక కూడా నా మదిలో మెదిలి, ఆ దేవత అనుగ్రహం కోరుకుంటోంది. అదేమిటంటే -
నన్ను అనుగ్రహించడానికి విచ్చేసే ఓ మృత్యుదేవతా -- దయతో – మంచి చలికాలంలో మాత్రం నా దగ్గరకు రాకు. ఎందుకంటే, నా అంత్య క్రియలలో పాల్గొనే నా సంతానం చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేసి అవస్థ పడితే, నా ఆత్మ ఘోషించక మానదు కదా.
ఏమిటీ హిరణ్యాక్ష కోరికలు అనుకోక -- అటు ఎండ తీవ్రత కానీ, ఇటు చలి తీవ్రతకానీ, అలాగే కుండపోతగా కురిసే వర్షం సమయంలో కానీ నా తలుపు తట్టక - నా పట్ల, నా పిల్లల పట్ల కాసింత అనుగ్రహం ప్రసాదించమని సాంజలి ఘంటించి మృత్యుదేవతని వేడుకుంటున్నాను.
నా ఈ కోరికల్ని తీర్చి - నా పట్ల, నా సంతానం పట్ల అనుగ్రహం ప్రసాదించమని -- భౌతికమైన కంటికి కనుపించని (ఆ మాటకి వస్తే, ఏ దేవతామూర్త్తి మాత్రం మన భౌతిక కంటికి కనిపిస్తారని?) మృత్యుదేవతని -- త్రికరణ శుద్ధిగా పదే పదే ప్రార్ధిస్తూ ఈ క్షణం నుంచే వేడుకుంటున్నాను.
నా ప్రార్ధన మన్నించే కరుణార్థహృదయం గల మృత్యుదేవత – నాతోబాటూ నా సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుందని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను.
--ఓం శాంతి—