కృష్ణవేణి - విద్యాధర్ మునిపల్లె

Krishnaveni

రాత్రి 12 గంటలు

ఏరోజూ కూడా వారి జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ తండ్రీ కూతుళ్ళు అనుకోలేదు. ఎప్పుడో కాద నుకున్న వ్యక్తి తమ జీవితంలోకి వచ్చి అలజడి సృష్టిస్తాడని వారు ఊహించలేదు. ఎంతోమంది కడుపులుకొట్టి తినీ, తినక కూడబెట్టు కున్న ఆస్తులన్నీ ఎగరేసుకుపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ తండ్రీ కూతుర్లు మిగిలిపోయారు. తాము చేసిన పాపాలన్నీ వారి కళ్ళ ముందు కదలాడాయి. వారి ఆలో చనలు ముప్పైఐదేళ్ళు వెనక్కి వెళ్ళాయి.

***********

వెంకట్రావు ఎమ్మార్వోగా ఉద్యోగం చేస్తున్నాడు. అన్యాయానికి అతను పెట్టింది పేరు. డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసేరకం. ఎంతో మంది పేదల కడుపులు కొట్టి మరీ ఆస్తులు కూడబెట్టాడు. గవర్నమెంటు ఆస్తుల్ని తన పూర్వీకుల ఆస్తులని దొంగసర్టిఫికేట్లు పుట్టించేవాడు. అందిన కాడికి దోచుకుంటూ ఆస్తులు పెంచేసుకున్నాడు. అయితే ఎంత సంపాదించుకున్నా అతను తనకు సంబంధించిన వారెవ్వరికీ తెలీకుండా జాగ్రత్తపడేవాడు. అటు కన్న తల్లికి కానీ, కన్న కూతురికి కానీ ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్త పడేవాడు. వెంకట్రావు చాలా వరకూ గోప్యంగానే వుండేవాడు ఎందుకో.

***********

వెంకట్రావు ఒక్కగానొక్క కూతురు కృష్ణవేణి. కృష్ణవేణి పురిటిలో వున్నప్పుడే ధనుర్వాతం చేసి ఆమె తల్లి నాగవల్లి చనిపోయింది. అప్పటి నుంచి కృష్ణవేణిని ఆమె నాన్నమ్మ సుబ్బమ్మ పెంచుతోంది. ఇప్పుడు కృష్ణవేణి గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. తన కాలేజీలో చదువుతున్న మురళి అనే కుర్రాడితో ప్రేమలో పడిరది. వారి ప్రేమ పెళ్ళికి ముందే ప్రతిఫలాన్ని మోసేంతగా ఎదిగింది. కృష్ణవేణి ఐదో నెల కడుపుతో వుంది.

***********

సుబ్బమ్మ తన కొడుకు చేస్తున్న అన్యాయాలను, అక్రమ సంపాదనను చూస్తూ సహించలేక అప్పుడప్పుడూ కొడుకుని హెచ్చరించాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ సుబ్బమ్మ మాటలకి కానీ, ఆమెకి కానీ ఆ ఇంట్లో ఏమాత్రం గౌరవంలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెని ఆయింట్లో కాపలా కుక్కకంటే చాలా హీనంగా చూసే వారు. పేరుకే వయసులో పెద్ద.. అవసరమైతే సలహా అడిగేవారు. ఏదైనా చెప్పబోతే ఆమెని ఈసడిరచి అవమానించేవారు. అవి తట్టుకోలేక సుబ్బమ్మ ఎప్పుడూ బాధపడేది. ఒక్కోసారి తనకు చావుని ప్రసాదించమని దేవుడ్ని వేడుకునేది. అయినా సరే కుటుంబ పెద్దగా తన బాధ్యతని నిర్వర్తించే విషయంలో ఏనాడూ వెనకడుగు వెయ్యలేదు.

***********

1980 ఆగస్టు 19 సాయంత్రం 6 గంటలు

ఆ రోజు సుబ్బమ్మ కుటుంబంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.

కాలేజీ నుంచి ఇంటికొచ్చిన కృష్ణవేణి తన బుక్స్‌ టేబుల్‌ మీద పెట్టింది. ఆ పుస్తకాల్లోంచి మురళి ఫోటో కొంత బయటికి వచ్చింది. అది గమనించకుండా కృష్ణవేణి వంటగదిలోకి వెళ్ళింది.

అదే సమయంలో తోటలోంచి హాల్లోకి వచ్చిన సుబ్బమ్మ మనవరాలి పుస్తకాల్లోంచి బయటికి వచ్చిన ఫోటోని చూసింది. ఎవరో కనుక్కుందా మనుకుంది. అంతలో కృష్ణ వేణిహాల్లోకి వచ్చింది. ఆ ఫోటో చూపించి ఎవరని అడిగింది సుబ్బ మ్మ. కాబోయే వాడని సమాధాన మిచ్చింది కృష్ణవేణి. అదే సమయంలో కృష్ణవేణికి వాంతులు కావటంతో సుబ్బమ్మ కంగారుపడిరది. ఏం జరిగిందంటూ మనవరాలిని నిలదీసింది. కడుపుతో వున్నాని, ఐదోనెల అని చెప్పింది కృష్ణవేణి. దీంతో సుబ్బమ్మకి చేతులూకాళ్ళూ ఆడలేదు. కొడుకు వస్తే ఏం చేస్తాడో.. తలుచుకుంటుంటేనే భయమేసింది. అసలే అతనికి ముక్కుమీద కోపం వుంటుంది ి. తన మనవరాలిని చంపేస్తాడు. లేదా దాన్ని చంపి వాడూచస్తాడు. ఏం చెయ్యాలో అర్థంకాని సందిగ్ధంలో వుండిపోయింది సుబ్బమ్మ. మనవరాలి నుండి సవ్యమైన సమాచారాన్ని రాబట్టటం కోసం కాస్తంత సున్నితంగా అడిగే ప్రయత్నం చేసింది. కృష్ణవేణి సహజంగానే వున్న పొగరుతో సమాధానాలు కూడా అలాగే ఇచ్చింది.

అయితే అప్పటికే అక్కడికి వచ్చి విషయం విన్న వెంకట్రావు కూతురిని చంపేసేంతగా కొట్టాడు. సుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

‘‘ మనవరాలి బాగోగులు చూసుకోటం అంటే ఇదేనా? ఇంట్లో వుండి ఏం చేస్తున్నావ్‌. అదెక్కడ తిరుగుతోంది? ఏం చేస్తోంది.? ఏ వేళకి ఇంటికి వస్తుందిలాంటివి పట్టించుకోవా అంటూ తల్లి మీద కేకలేశాడు. ’’

కృష్ణవేణి మెల్లిగా తేరుకొని తను ప్రేమించిన మురళి గురించి చెబుతూ..

‘‘ నాన్నా అతని పేరు మురళి. నా కాలేజీలో నాతోనే చదువుతున్నాడు. అతనొక ధనవంతుడు. రోజుకొక కారులో తిరుగుతూ, నన్ను తిప్పుతుంటాడు. అతనికి ఎన్ని కార్లున్నాయో కూడా తెలీదు. అలాంటి వాడిని ప్రేమించి ధనవంతుల ఇంటికి కోడలుగా వెల్తున్నందుకు నువ్వు హ్యాపీ ఫీల్‌ అవుతావనుకుంటే.. ఇలా కొడతావా.? నేను వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను..’’ అంటూ రాద్ధాంతం చేసింది.

వెంకట్రావుకూడా అనునయంగా కూతుర్ని సముదాయిస్తూ..

‘‘పెళ్ళికాకుండా తల్లివయ్యావన్న ఆవేశంలోకొట్టాను బంగారం. అయినా అంత ధనవంతుడిరటికి కోడలుగా వెల్తుంటే నేనుమాత్రం ఎందుకు కాదంటాను. ’’ అన్నాడు.

‘‘ అరే.. అది కడుపుతో వుందిరా.! ’’ అంటూ ఏదో చెప్పబోయింది సుబ్బమ్మ.

‘‘ పెళ్ళికాకుండా కడుపుతో వుంటే ఏంటి? రేపు పెళ్ళయ్యాక కడుపురాదా.. అదేదో ముందే వచ్చింది. అయినా దానికి కాబోయే వాడేగా కారణం.’’ అంటూ కూతుర్ని ముద్దుచేశాడు. కృష్ణవేణి తన నాన్నమ్మ వైపు చూస్తూ కళ్ళెగరేసింది.. తన తండ్రి ఎప్పటికీ తననే సమర్ధిస్తాడన్న నమ్మకంతో..

వెంకట్రావు కృష్ణవేణితో...

‘‘ రేపే వెళ్ళి అబ్బాయి తల్లితండ్రులతో మాట్లాడదాం.. ’’ అని చెప్పాడు

ఆతర్వాత వెంకట్రావు, కృష్ణవేణిలు కలల్లో తేలిపోయారు. వారి మాటలు కోటలు దాటేస్తున్నాయి. మురళి ఆస్తి తమదైపోయి నట్లు, తాము కోటీశ్వరులై పోయినట్లు రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

వెంకట్రావైతే తను కొత్తగా వచ్చిన బెంజికారులో తన ఆఫీసుకు వెళుతున్నట్లు, తన పై అధికారులు కూడా అతని రాజసానికి అసూయ పడుతున్నట్లు ఊహించుకున్నాడు. అదేమాట కృష్ణవేణితో పంచుకుని పిచ్చిగా నవ్వేసుకున్నారు. ఇదంతా సుబ్బమ్మ ముందే జరుగుతోంది. ఈ తండ్రీ కూతుళ్ళ చేష్టలకి సుబ్బమ్మ ఆ ఇంట్లో తన స్థాయేంటో తెలుసు కనుక మౌనం వహించక తప్పలేదు.

***********

1980 ఆగస్టు 20 మద్యాహ్నం 2గంటలు.

అయితే ఆ తండ్రీ కూతుళ్ళ ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు.. మరుసటి రోజే తెలిసింది వారికి మురళి ఒక కారు మెకానిక్‌ కొడుకని. అతని తండ్రి వద్దకు వస్తున్న కార్లని టెస్ట్‌ డ్రైవ్‌ నిమిత్తం తీసుకొస్తున్నాడనీ.. ఆ కారులోనే కృష్ణవేణిని తిప్పుతున్నాడనీ. కృష్ణవేణికి అర్ధమైంది తను మోసపోయానని. ఆక్షణంలో ఆమె మనసు ముక్కలైంది. తన కడుపులో పెరుగుతున్న మురళి ప్రతి రూపాన్ని మోయాలంటేనే ఆమెకి కంపరంగా వుంది.

వెంటనే తండ్రి వెంకట్రావుతో కలిసి డాక్టరు దగ్గరికి వెల్దామనుకుంది. అయితే ఎమ్మార్వో అయివుండి తన కూతురు పెళ్ళికాకుండా నెలతప్పిందని తెలిస్తే తనపరువు పోతుందని, తన తల్లి సుబ్బమ్మనిచ్చి తన పేరు చెప్ప కుండా అప్పుడప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తున్న అబార్షన్‌ అనే కొత్త వైద్యవిధానం ద్వారా గర్భాన్ని తొలగించమని కొంత డబ్బిచ్చి పంపించాడు.

1980 ఆగస్టు 21 ఉదయం 11 గంటలు

సుబ్బమ్మ తన మనవరాలిని తీసుకొని హాస్పిటల్‌ కి వెళ్ళింది. అక్కడ పరీక్షచేసిన డాక్టరు సుబ్బమ్మతో...

‘‘ అమ్మాయికి ఐదోనెల నిండి ఆరోనెల వచ్చింది. ఇప్పటిదాకా ఏం చేశారు. అయినా ఈ టైంలో అబార్షన్‌ చెయ్యటానికి వీల్లేదు. అలా చెయ్యాలని చూస్తే బిడ్డ పరిస్థితి ఎలా వున్నా.. తల్లి ప్రాణానికి ప్రమాదం.’’ అన్నాడు డాక్టర్‌

‘‘ మీ బోడి హాస్పిటల్‌ కాకపోతే మరోటి? నాకు వెంటనే అబార్షన్‌ జరిగిపోవాలి.. నేను ఈ పాపాన్ని మొయ్యలేను’’ అన్నది కృష్ణవేణి సహజంగానే తనకున్న తలపొగరుతో..

‘‘ మీరు మా హాస్పిటల్‌ ని ఇన్సల్ట్‌ చేసి మాట్లాడుతున్నారు. నేనే కాదు ఎవరైనా మీకిదే చెప్తారు. అయినా కడుపు తెచ్చుకునేముందు ఆలోచించాలి. ఇన్నాళ్ళు కడుపు వుంచుకు న్నప్పుడు ఆలోచించాలి. ఇప్పుడొచ్చి లబోదిబోమంటే మేం మాత్రం ఏం చేస్తాం.’’ అన్నాడు డాక్టర్‌ చాలా సీరియస్‌ గా..

‘‘ పద నాన్నమ్మా.. లోకంలో ఇదొక్కటే హాస్పిటల్‌ అన్నట్లు.. బోడి హాస్పిటల్‌..’’ అంటూ కృష్ణవేణి తన నాన్నమ్మని తీసుకొని బయటికి నడిచింది.

సుబ్బమ్మవంక డాక్టరు చూసిన చూపుకి ఆమె మనసు చివుక్కుమంది. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. దారి పొడుగునా డాక్టరు చెప్పిన మాటలే చెవుల్లో మార్మ్రోగు తున్నాయి. ఆరోజు మరో నాలుగైదు హాస్పిటల్స్‌ తిరిగారు వారిద్దరూ.. అన్నిచోట్లా ఇదేమాట. ఏం చెయ్యలేక ఇంటికొచ్చేశారు.

విషయం తెలుసుకున్న వెంకట్రావు సీరియస్‌ అవుతూ...

‘‘ఇంతదూరం తీసుకొచ్చింది నువ్వు.. నువ్వు బ్రతికుంటే నా పరువు పోతుంది..’’ అంటూ మరోసారి తన బెల్టుని కృష్ణవేణి మెడకి కట్టి ఉరేయ బోయాడు. సుబ్బమ్మ అడ్డుకుంది.

‘‘కడుపుతో వున్న పిల్లని కూడా చూడకుండా ఏంటిరా నీ మూర్ఖం..’’ అంటూ వెంకట్రావుని అవతలికి లాగి పారేసింది.

వెంకట్రావు అడ్డమొచ్చిన తల్లి ని నానా మాటలూ అంటూ ఆకరిగా..

‘‘ ఇంటికి పెద్ద దిక్కని చెప్పు కోటం కాదు. అవసరం లో ఆదుకోవటమే పెద్దరికం. ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో చెప్పిచావు. ’’ అన్నాడు.

సుబ్బమ్మ మనసు గాయ పడినా అంతలోనే సర్దుకొని...

‘‘ ఎలాగూ ఇంతదూరం వచ్చింది కనుక.. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు కనుక వారిద్దరికీ ముడిపెట్టేసి దీని బతుకింతే అను కోవటం తప్ప మనం చేయగలిందేమీ లేదురా..’’ అన్నది.

దానికి కృష్ణవేణి అంతెత్తున తన నాన్నమ్మ మీద లేచింది.

‘‘ మురళి పేరు వింటేనే నాకు వాంతొస్తుంది. అలాంటి వాడి బిడ్డని నేను మోస్తున్నానంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా వుంది. వాడితో పెళ్ళి తప్ప మరేదైనా నాకు ఓ.కే’’ అన్నది.

అయితే ఆ కడుపు వుంచుకొని బిడ్డనికంటం తప్ప మరో మార్గం లేదని తేల్చిచెప్పింది సుబ్బమ్మ. ఆ సలహాని వెంకట్రావు కూడా సమర్ధిం చాడు. ఆరోజు నుంచి కృష్ణవేణి తన కడుపుని చూసుకుంటూ ప్రతిక్షణం తనలో తనే కుమిలి పోయేది. ఒకటి రెండు సార్లు మురళి పెళ్ళి చేసు కుంటానంటూ ఇంటికి వచ్చాడు. అతన్ని అవమానించి పంపేసింది కృష్ణవేణి. జీవితంలో మొహం చూపించద్దని తేల్చిచెప్పింది. మురళి నచ్చచెప్పాలని ప్రయత్నించాడు. సుబ్బమ్మకూడా కృష్ణవేణికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. కానీ కృష్ణవేణి మొండితనంవల్ల సుబ్బమ్మ ఏమీమాట్లాడ లేకపోయింది. మురళి కూడా మౌనంగా తలవంచుకొని బయటికి వెళ్ళి పోయాడు.

1981 జనవరి 10 రాత్రి 12 గంటలు

కృష్ణవేణి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే కాన్పుచేయించాడు వెంకట్రావు. ఆరోజే కృష్ణవేణికి పుట్టిన బిడ్డని రాత్రిపూట అందరూ నిద్రపోయాక కుప్పతొట్లో పడేయాలని వెంకట్రావు, కృష్ణవేణి అనుకున్నారు.

బిడ్డ పుట్టాడని తెలుసుకున్న మురళి తన భార్యకృష్ణ వేణిని బిడ్డని చూసిపోదామని వీరింటికి వచ్చాడు. ఈ తండ్రీ కూతుళ్ళ ఆలోచనని మురళికి సుబ్బమ్మ చెప్పింది. దీంతో మురళి బిడ్డని తనతో తీసుకెల్తానన్నాడు. వీల్లేదన్నారు తండ్రీ కూతుర్లు. దీంతో పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

బిడ్డనిప్పుడు తీసుకెళ్ళి ముందుముందు రోజుల్లో డబ్బులు కావాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తావంటూ వెంకట్రావు మాట్లాడాడు.

‘‘ మనీకి విలువిచ్చే మీకు అదే ముఖ్యం.. మనసుకి విలువిచ్చే నాకు మనసే ముఖ్యం.. ఈ బిడ్డకి తల్లి అవసరం లేకపోవచ్చు.. కానీ తండ్రి తోడు అవసరం. భవిష్యత్తులో ఈ బిడ్డ అవసరం మీకుండచ్చు.. మీకు అక్కరకి వచ్చేలా పెంచుతా.. ’’ అంటూ మురళి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళ బోతుండగా.. సుబ్బమ్మ మురళితో..

‘‘ఈ రాక్షసుల మధ్య వుండలేను. నా ఆకరిరోజులు ప్రశాంతంగా వుండాలంటే నేనూ నీతోనే వచ్చేస్తాను. నీలాంటి మంచి మనసున్న వారితో వుంటే నా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మనవడా నన్నూ నీతో తీసుకుపోతావా?’’ అని అడిగింది.

మురళి తనబిడ్డతో పాటు సుబ్బమ్మనీ తీసుకొని అక్కడి నుండి కదిలాడు.

***********

అలా ఆరోజు మురళి తీసుకు పోయిన తన కన్న కొడుకు కర్ణ ఈరోజు తిరిగి వచ్చాడు. అక్రమంగా తాత సంపా దించిన ఆస్తులన్నీ తనకే చెందుతాయని తాత, తల్లి చనిపోయారని డెత్‌ సర్టిఫికేట్లు కోర్టులో సబ్‌మిట్‌ చేసి కోర్టు తీర్పుని తీసుకొచ్చాడు.

తాము బ్రతికున్నామంటానికి ఎలాంటి ఆధారాలూ లేకుండా పక్కా ప్రణాళికతో కృష్ణవేణిని, వెంకట్రావుని అష్టదిగ్భందనం చేశాడు. ఏం చెయ్యలేని పరిస్థితి. వెంకట్రావు సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ మార్కెట్‌ రేటు ప్రకారం ఆరోజు విలువ 145 కోట్లు రూపాయలు. ఈవిషయం తెలుసుకున్న దగ్గర నుండీ వెంకట్రావు మనసు మనసులో లేదు. చూస్తూ చూస్తూ.. అక్కర్లేదని విసిరేసిన వాడు ఆస్తులకి వారసుడ్నంటూ రావటం, అన్ని ఆస్తులూ వాడివేనంటూ కోర్టు తీర్పునివ్వటం.. ఇవన్నీ కూడా వెంకట్రావుని,కృష్ణవేణిని కృంగదీశాయి. అప్పుడే వారి ఆలోచన ముప్పైఐదు సంవత్సరాలు వెనక్కెళ్ళాయి.

2015 నవంబరు 20 రాత్రి పూట 2 గంటలు

తాము చేసిన పాపాలన్నీ ఆ తండ్రీ కూతుళ్ళ కళ్ళముందు కదిలాయి. వెంకట్రావు తన తల్లి పట్ల చూపిన నిరాదరణ గుర్తుకొచ్చింది. తన కూతురు తన పట్ల చూపుతున్న నిరాదరణకి కారణం తను తన తల్లితో ప్రవర్తించిన విధానానికి పర్యవసాన మేననీ, ఎంతో మంది పేదల,ప్రభుత్వ భూముల్ని, ఆస్తుల్ని లాగేసు కున్న పాపమే తన మనవడు తన ఆస్తుల్ని లాగేసుకోవటమనీ కర్మ సిద్ధాంతం అతనికి అర్ధమైంది. అన్నింటి కంటే తన తల్లిని చూసి ఆమె పాదాలపై పడి తన తప్పుల్ని ఒప్పేసుకొని కన్నీటితో ఆమె కాళ్ళు కడగాలని నిర్ణయించు కున్నాడు. అలాగే కృష్ణవేణికూడా మురళి పట్ల ప్రవర్తించిన విధానం.. తన కొడుకు పట్ల తను చేసిన ద్రోహం గుర్తుకొచ్చాయి. తండ్రి చెప్పిన కర్మ ఫలితం ఇదేనంటూ అర్థమైంది. తండ్రీ కూతుళ్ళిద్దరూ ఒకరి నొకరు ఓదార్చుకున్నారు.

***********

2015 నవంబరు 21 ఉదయం 6 గంటలు..

ఈ తండ్రీ కూతుళ్ళ పరిస్థితిని రాత్రి నుండీ గమనిస్తున్న కర్ణ వారి మాటల ప్రకారం వారిలో మార్పు వచ్చిందని గ్రహించాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి మారానంటారు.. మార్పు వచ్చింది అంటారు.. మీ మార్పువల్ల ఉపయోగమేంటి? మనిషి చనిపోయింతర్వాత మీరు మారి వుపయోగమేంటి? ఎన్నిసార్లు తాతమ్మ నీకు దూరమయ్యానని బాధపడ్డాడో తెలుసా అని వెంకట్రావుని నిలదీశాడు. ఆమె ఆకరి క్షణాల్లో నిన్ను చూడాలని ఎంత తాపత్రయ పడ్డాడో తెలుసా? నీకు ఉత్తరం కూడా రాసింది. నువ్వా వుత్తరం కనీసం చూడలేదు.. అంటూ వెంకట్రావుమీదికి ఉత్తరం విసిరేశాడు. వెంకట్రావు కన్నీటితో ఆ ఉత్తరాన్ని చదివాడు.. తన తల్లి ఆమె ఆకరి క్షణాల్లో తనకోసం రాయించిన ఉత్తరం.. ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరంలో ఆమె తనని చూడాలని ఎంతలా కోరుకుంటుందో రాయించింది. ప్రతి పలుకులోనూ ఆమె ఆర్ధ్రత కొడుకుకోసం ఆమె మనసుపడే ఆరాటం తొణికిసలాడిరది. ఆకరి లైనులో ‘‘ ఒరేయ్‌ వెంకట్రావ్‌.. ఈ వుత్తరం నీకు అంది నువ్వు వచ్చేవరకూ ఆ భగవంతుడు నన్ను ప్రాణాలతో వుంచుతాడో లేదో నాకు తెలీదు.. నువ్వు వచ్చేసరికి నేను చనిపోతే నీచేతులతో నాకు తలకొరివి పెట్టి నన్ను పున్నామనరకం నుంచి తప్పించరా ’’ అని వేడుకుంది. అది చదివి వెంకట్రావు గుండె కరిగి కన్నీరైంది.

‘‘ పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన ఉత్తరం కూడా చూడటానికి కూడా టైంలేనంతగా సంపాదన... సంపాదన అంటూ పరుగులు తీశారే.. రేపోమాపో పోతావుగా అదంతా నీతో తీసుకుపోతావా? నీ కూతురిక్కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం కొన్నావో కూడా ఇప్పటికీ చెప్పలేదే.. ఏం చేసుకోటానికి నీ సంపాదన ’’ అంటూ కర్ణ అడిగిన ప్రతి పదం కూడా వెంకట్రావునీ, కృష్ణవేణినీ గుండెల్ని తాకాయి.

‘‘ ఎందుకమ్మా నువ్వేడుస్తున్నావ్‌.. మీ నాన్న నీకు తన ఆస్తుల సమాచారం ఇవ్వనందుకా..? లేక అన్ని ఆస్తులు నేను ఎగరేసుకు పోతున్నానందుకా?’’

‘‘ మీ నాన్న మంచి మనసుని అర్ధంచేసుకోలేకపోయినందుకు. నేను ఆయనపట్ల ప్రవర్తించిన తీరుకు.. ఒక్కొక్క సంఘటనే నాకు గుర్తుకొచ్చి ఇలా.. నేను వెంటనే మీనాన్నని చూడాలి. ఆయన్ని క్షమించమని అడగాలి.. నా మురళిని నేను కలవాలి..’’ అన్నది ఉద్వేగంగా..

‘‘ నేను వచ్చింది కూడా అందుకే.. ఆయన ఆకరి కోరిక తీర్చటానికే.. నాలుగు సంవత్సరాలుగా ఆయన అపోలోలో ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. నిన్న సాయంత్రం 5గంటలకి ఆయన కాలం చేశారు. ఆయన పోతూపోతూ నాతో అన్నమాట.. నాకు తల్లిగా నువ్వు ఆయన పార్ధివ దేహాన్ని చూడాలనీ, ఆయన భార్యగా అంత్యక్రియలు జరిపించాలనీ.. అందుకే నేను వచ్చాను. డబ్బు మదంతో కొట్టుకుంటున్న మీ బుద్ధిని సరైన దారిలో పెట్టటానికి నేనే నాకున్న పలుకుబడితో, హోదాతో నీ పెన్షర్‌ ఆపేయటం నుంచి మీ ఆస్తులు జప్తు చేయటం వరకూ అన్నీ అన్నీ నాలుగేళ్ళుగా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను.. మీ ఆస్తులన్నీ నా చిటికినవేలుపై వున్న వెంట్రుకతో సమానం. మీ డెత్‌ సర్టిఫికేట్స్‌, అన్నీ అబద్ధం. నాలుగేళ్ళుగా మీకు రావాల్సిన పెన్షన్‌ ఈరోజు 11 గంటలకల్లా మీ అకౌంట్‌ లో డిపాజిట్‌ అవుతుంది వెంకట్రావుగారూ.. పదిగంటల్లోగా నువ్వు పనిచేస్తున్న ఆఫీసుకి వస్తే నాన్నగారి పార్ధివ దేహాన్ని చూడచ్చు.. నువ్వు పనిచేస్తున్న కెకె.గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ ఆయన.. అందుకే ఎంప్లాయిస్‌ సందర్శనం కోసం అలా ఏర్పాటు చేశాను. కె.కె అంటే కర్ణకుమార్‌ నేనే.. భార్యగా వస్తావో, ఎంప్లాయ్‌ గా వస్తావో.. నీ ఇష్టం. పదిగంటలు దాటితే ఆయన ఆకరి చూపు నీకు దక్కదు. వెల్తున్నాను.’’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు..

అతను వెళ్ళిన వైపే ఆ తండ్రీ కూతుళ్ళు అలా చూస్తూ వుండిపోయారు..

శుభం

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న