చిరు తొండ నంబి (హరవిలాసం) - కందుల నాగేశ్వరరావు

Chiru Tonda Nambi

శ్రీనాథుడుహరవిలాస’ ప్రంబంధాన్ని కొండవీటిసీమను పాలించిన కొమరగిరి భూపాలునికి భాండాగార అధ్యక్షుడుగా నున్న తిప్పయ్యశెట్టికి అంకితమిచ్చాడు. తిప్పయ్యశెట్టి శ్రీనాథుడి బాల్య స్నేహితుడు. గొప్ప దాత. హరవిలాసము అనగా శివుని లీలలు. మొదటి విలాసములో తిప్పశెట్టి వాణిజ్యవంశమునకు మూలపురుషుడు, మహాశివభక్తుడు అయిన చిరు తొండ నంబి గాథను శ్రీనాథుడు రచించాడు. చిరుతొండనంబి దక్షిణాది నుండి ఉత్తరాది వరకు నున్న సర్వ వైశ్యగోత్రీకుల వారికి కూటస్థుడు. ఇది తమిళదేశంలో బాగుగా ప్రాచుర్యంలో నున్న ఒక శివ కథ.

తుంబురుడు అనే ప్రమథుడు:

దూర్వాసమహర్షి గొప్ప కోపిష్టి. ఆ మహాముని ఒకప్పుడు బదరికాశ్రమంలో ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడు మధ్యాహ్నకాలంలో పితృతర్పణం వదిలి, సంధ్యావందనం నిర్వర్తించాడు. దేవతార్చన ముగించుకొని పర్ణశాల బయట యాగంలో మిగిలిన ప్రసాదాలను లేడి పిల్లలకు తినిపిస్తూ అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.

కైలాసంలో ఉండే శివభక్తులను ‘శివగణాలు’ లేక ‘ప్రమథులు’ అని అంటారు. ఆ సమయంలో ఆకాశవీధిలో ‘తుంబురుడు’ అనే పేరుగల ప్రమథుడు సతీసమేతంగా విహారం చేస్తూ ఈ దృశ్యాన్ని చూసాడు. అంతటి మహాముని తన స్వహస్తాలతో లేడిపిల్లలపై చూపిస్తున్న వాత్సల్యానికి అబ్బురపడి సంతోషంగా చిటికలు వేశాడు. ఆ ధ్వనికి లేడిపిల్లలు బెదిరి అక్కడ నుండి పారిపోయాయి.

దూర్వాసమహర్షి ఆకాశం వైపు చూసాడు. సహజ కోపిష్ఠియైన దూర్వాసుడు కోపంతో ఊగిపోతూ తుంబురుని ‘నీవు మనుష్యలోకంలో జన్మించు’ అని శపించాడు. ప్రమథుడు భయంతో దిగి వచ్చి ముని కాళ్ళపై పడి ఇలా అన్నాడు. “స్వామీ! నేను ఏ దురుద్దేశంతోను చిటిక వేయలేదు. మీరు లేడిపిల్లలకు ఆహారం తినిపించడం చూసి ఆనందంతో అలా చేసాను. నన్ను క్షమించండి. మీ నోటి వెంట వచ్చిన శాపం వృధా పోరాదు, కావున నేను మానవుడిగా జన్మిస్తాను. కాని నేను శివభక్తుల వంశంలో పుట్టి శివభక్తుడిగా ఉండేటట్లుగా అనుగ్రహించండి. నాభార్యను మీ కోడలుగా తలంచి మీ ఇంట కొన్నాళ్ళు ఆశ్రయం ఇవ్వండి” అని ప్రార్థించాడు.

ఈ మాటలు విన్న దూర్వాస మహర్షికి తుంబురునిపై జాలి కలిగింది. ‘ఉదయం లేచిన వెంటనే నీవు ఎవరి మొహం చూసావయ్యా, అనవసరంగా నా శాపానికి గురయ్యావు? నీవు కోరినట్లుగా జరుగుతుంది. చింతించకు” అని చెప్పాడు.

చిరుతొండ నంబి జననం:

శాపవశాన్న తుంబురుడు ద్రవిడదేశమున, కామాక్షీదేవి ఏకాంబరనాథులకు నివాసమైన కాంచీపురములో గొప్ప ధనిక వైశ్యకులము నందు చిరుతొండనంబిగా పుట్టెను. తుంబురుని భార్య కూడా కొద్ది సంవత్సరముల తరువాత భూలోకమునకు వచ్చి కౌశిక గోత్రీకులైన వైశ్యుల ఇంట తిరువెంగనాంచిగా జన్మించి చిరుతొండనంబిని పరిణయమాడెను. ఆ దంపతులకు సిరియాళుడు అను కుమారుడు కల్గెను. ఆ పుణ్య దంపతులు శివార్చన యందు, శివభక్తులైన జంగమదేవారాధన యందు అనుదినము కాలము గడుపుచుండిరి. కాంచీపురంలో ఏడువాడలలో అందరూ వైశ్యులు నివసించేవారు. వారందరికీ బీరకాయపీచు వలె సంబంద బాంధవ్యాలు ఉన్నవి. పూర్వజన్మ సుకృతం వలన చిరుతొండడు శుద్ధ వీరశైవాచార పరాయణుండై జంగమదేవరలకు ఎప్పుడు ఏపదార్థము అడిగినా లేదనకుండా దానము చేయాలనే నియమం పాటించేవాడు.

మిండజంగము చెఱుకురసము కోరుట:

వీరశైవం ప్రాచుర్యంగా నున్న రోజుల్లో మిండ జంగములని కొందరుండెడి వారు. ఒకనాడు నున్నటి నుదిటిపై పచ్చి గంధము పూసుకొని, మెడలో శివలింగాన్ని ధరించిన ఒక మిండజంగము చిరుతొండని ఇంటికి వచ్చాడు. చిరుతొండని దీవించి, ఉపచారములను స్వీకరించి సుఖాసీనుండై ఇలా అన్నాడు. “కాంచీపురంలోని పాటిగట్టున పండిన చెరుకు రసము తూమెడు నాకు కావలెను. నా గురువు ఉపదేశము ప్రకారము నేను శివునకు అభిషేకము చేయవలసి ఉన్నది. కావున దానిని సమకూర్చు” అని కోరాడు. చిరుతొండనంబి అతిథికి కావలసిన వంటకాలు తయారు చేయమని తన భార్యకు పురమాయించాడు.

మనస్సులోనే ఒక తూముడు రసం కావాలంటే ఎన్ని చెఱుకుగడలు అవసరమౌతాయో లెక్క వేసుకున్నాడు. చెఱుకు తోటకు వెళ్ళి వంద ముదర గడలు అడిగినంత ఇచ్చి కొన్నాడు. వాటిని తాటితో గట్టిగా మోపు కట్టాడు. ఎంత ప్రయత్నించినా అతనొక్కడే ఆ మోపును ఎత్తలేక పోయాడు. వళ్ళంతా చెమటలు పట్టాయి. శివనామం స్మరించాడు.

ఆసమయంలో ఈశ్వరుడు కైలాసంలో పార్వతీదేవితో కలిసి నిండు సభలో అప్సరకాంతల నాట్యం తిలకిస్తున్నాడు. తన భక్తునికి సాయం చేయడం కోసం ఆ చెఱుకు తోటలో ఒక కూలివాడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చెఱుకు మోపును నంబి ఒకవైపు మహాదేవుడు రెండవ వైపు పట్టి ఇంటికి తీసుకు వచ్చారు. శివుడికి కూడా వళ్ళంతా చెమటలు పట్టాయి. మోపును ఇంటికి చేర్చిన తరువాత శివుడు అదృశ్యమయ్యాడు. చిరుతొండనంబి ఆ చెఱుకు గడల నుండి రసం తీసి తూమెడు మిండజంగానికి ఇచ్చాడు. జంగందేవర ఆ రసంతో శివుడికి అభిషేకం చేసి దీవించి వెళ్ళిపోయాడు.

పార్వతీ దేవి శివునిపై కోపగించుట:

కైలాసంలో నిండు సభలో అప్సరసల నాట్యం చూస్తున్న శివుని శరీరం చెమటతో తడిచింది. ఒకే సమయంలో శివుడు భూలోకంలో కూలివాని వలె చెఱుకు గెడలు మోస్తున్నాడు, అదే సమయంలో కైలాసంలో నాట్యం కూడా చూస్తున్నాడు. బరువు మోయడం వలన శివుని వంటికి చెమటలు పట్టాయి. ఇది చూసిన పార్వతీదేవి ఒక్కసారిగా ఈర్ష్యకు లోనయ్యింది. ఈ అప్సరకాంతలలో ఎవరినో చూసి శివుడు మోహించాడు. ఆ చెమట పట్టడానికి కారణం అదే అయివుంటుందని అనుకొంది. పార్వతీదేవి తన చేతిలోని తామరపువ్వుతో శివుని వక్షస్థలంపై కొట్టింది. ఈ చర్యతో ఆమెకు కోపం వచ్చిందని శివుడు గ్రహించాడు.

“ఏమమ్మా గౌరమ్మా! మనిద్దరి శరీరాలు ఒకటేకదా! మన గుండెలు పక్కపక్కనే ఉన్నాయి. నా గుండెలో ఏమైనా ఊహలు ఉంటే నీ గుండెకు తెలియదా! నాకు చెమట పట్టడానికి కారణం చెప్తాను, విను” అని భక్తుడైన చిరుతొండని కథను చెప్పాడు. పార్వతి అంతా విని “నేను నీ భక్తులైన చిరుతొండనంబిని, తిరువెంగనాంచిని చూసితీరవలయును” అని పట్టు పట్టింది.

కాంచీపురంలో మూడు వారములు అకాలవర్షం:

అప్పుడు ఈశ్వరుడు సభలో ఉన్న దేవేంద్రుడితో “కంచిలో ఇరువది యొక్క దినములు ఎడతెరిపి లేకుండా వర్షము కురిపించు. కంచి చుట్టూ మూడు యోజనముల దూరం వరకు ఈ వర్షం విస్తరించి ఉండాలి” అని చెప్పాడు. మేఘములకు అధిపతియైన ఇంద్రుడు మేఘములను ఆజ్ఞాపించాడు. కాంచీపురం చుట్టూ మూడు యోజనముల దూరం వరకు ఎడతెగని వర్షం కురవసాగింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వాననీరు కంచిలోని కామాక్షిదేవి, ఏకాంబరస్వాముల ఆలయాలను కూడా ముట్టడించింది. వాన కొద్దిగానైనా తెరిపి ఇస్తే ఊరు వదలి వెళ్ళిపోవాలని వేరే ప్రదేశాల నుండి వచ్చిన ప్రజలు, ఊరూరు తిరిగే సన్యాసులు మొదలైనవారు ఎదురు చూస్తున్నారు. కంచిలో జనం తెప్పలపై తిరుగుతున్నారు.

చిరుతొండనంబి వాకిట్లో రోజూ వేలకొద్దీ జంగములు వేచి ఉంటారు. వారికి భోజనము పెట్టకుండా నంబి ఎప్పుడూ భుజించడు. ఇంతటి వర్షంలో కూడా నంబి కుమారుడు సిరియాళుడు, దాది చందనిక పగలు రాత్రి వంట చేసి వారందరికీ భోజనం సిద్ధం చేసేవారు. ఎడతెగని వర్షం వలన చివరకు ఎండు కట్టెపుల్లలు నిండుకున్నాయి. అప్పుడు మోపుల కొలది ఇంట నున్న వస్త్రాలను నూనెలో ముంచి నిప్పు అంటించి వండి జంగములకు భోజనం పెట్టారు.

ముసలి జంగం – గుడ్డి భార్య:

ఇరువది రెండవ రోజు వాన వెలిసింది. నంబి రోజూ వలె జపతపాదులు పూర్తి చేసుకున్నాడు. శివునికి నైవేద్యం సమర్పించే ముందు జంగములకు భోజనం పెట్టడం నంబి ఆచారం. ఇంటి వరండాలోనికి వచ్చి చూసాడు. అక్కడ ఒక్క జంగం కూడా కనపడకపోవడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇంటిలోకి వెళ్ళి భార్యతో ఈ విషయం చెప్పాడు. “ప్రతి దినమూ వేలకొద్దీ మన వాకిట ఉండే జంగాలు ఒక్కరు కూడా ఈరోజు లేరు. శివభక్తులకు పెట్టకుండా, స్వామికి నైవేద్యం సమర్పించ కుండా మనం భోజనం ఎలా చేస్తాం. ఊరి లోనికి వెళ్ళి వెదికి ఎవరైనా జంగం దేవరను తీసుకు వస్తాను. నీవు ఈలోపల వంట తయారు చేయించు” అని చెప్పాడు.

అంతటి పెద్ద నగరంలో ఎంత వెదికినా ఒక్క జంగం కూడా కనపడ లేదు. వెదికిన చోటనే మరల మరల వెదికాడు. ఫలితం లేకపోవడంతో ఊరి బయటకు వచ్చాడు. ఒక పాడు పడిన గుడిలో ఒక వృద్ధ జంగము, వాని గుడ్డి భార్య కనపడ్డారు. చిరుతొండనంబికి ప్రాణం లేచి వచ్చింది.

ముసలి జంగము పెట్టిన దారుణ నియమం:

చిరుతొండడు ఆ ముదుసలి జంగంతో “స్వామీ మీరిద్దరూ మా ఇంటికి భోజనమునకు రావలెను. నా భార్య నేను రోజూ మీలాంటి జంగందేవరలకు అతిథి సత్కార్యములు చేయకుండా భోజనం చేయము” అని విన్న వించాడు.

ముసలి జంగం తలకాయ ఊపుతున్నాడు, నోరు కదుపుతున్నాడు, కాని మాట సరిగ్గా రావడం లేదు. చివరకు ఇలా చెప్పాడు “నేను సంవత్సరం నుండి ఉపవాస దీక్షలో ఉన్నాను. ఈ వ్రతదీక్షకు ఉద్యాపన చేసి భుజించాలంటే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఎవరైనా గృహస్థు మాకు మాంసాహారం పెట్టాలి. అది మానవ మాంసం అయి ఉండాలి. ఆ మనిషి క్షత్రియ బ్రాహ్మణ వైశ్యులలో ఒక్కడై ఉండాలి. బ్రహ్మచారి యువకుడు అందగాడు ఏ రోగము లేనివాడు అయి ఉండాలి. ఆ యువకుడిని వాని తల్లి తండ్రి చంపి, వాని మాంసము నాకు వండి పెట్టాలి. నీవు నీ కొడుకు నా పంక్తిని భోజనంచేయాలి అన్నాడు”.

నంది ‘మహా ప్రసాదమని’ తన పేరు, కులము, గోత్రము చెప్పి ‘నేను నా ఇంట మీ వ్రతమునకు ఉద్యాపన చేసెదను. మా ఇంటికి రండు’ అని చెప్పాడు. అప్పుడు ముసలి జంగం “ నేను చెప్పిన నియమం నీ భార్యకు చెప్పు. నీ ఇంటికి వచ్చిన తరువాత కాదంటే కుదరదు. ఆమె కూడా ఈ నియమానికి ఒప్పుకుంటే వచ్చి అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు” అని చెప్పాడు. నంది ఇంటికి వెళ్ళి భార్యకు విషయం చెప్పాడు. తిరువెంగనాంచి “శివయోగి శివునితో సమానం. వారి కోరికను శివాజ్ఞగా స్వీకరిద్దాం. మీరు వెళ్ళి జంగందేవరను తీసుకు రండి” అని చెప్పింది. దాది చంద్రికతో కలిసి ఏర్పాట్లు మొదలు పెట్టింది.

శిరుయాళుని శివభక్తి:

నంది ఇంటికి వెళ్ళిన తరువాత కపటవేషధారి యైన శివుడు జఠాధారియైన జంగంగా తన రూపం మార్చుకొని శిరియాళుడు చదువుకుంటున్న ఆచార్యుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో శిరియాళుడు తోటి విద్యార్థులతో కలిసి ‘నీలకంఠ స్తవం’ పఠిస్తున్నాడు. బాలుని పక్కకు పిలిచి “నీవు చిరుతొండ నంబి కుమారుడవే కదా! పాపాత్ముడైన నీతండ్రి నిన్ను చంపి ఒక ముసలి జంగానికి ఆహారంగా ఇవ్వబోతున్నాడు. అలాంటి దానవుడి నుండి నీవు ఎక్కడికైనా పారిపోయి నీ ప్రాణాలు రక్షించుకో. ఆలస్యం చేయకు” అని చెప్పాడు.

ఆ మాటలు విన్న శిరియాళుడు చెవులు మూసుకొని “శివ శివా! మీలాంటి పెద్దలు ఇలా మాట్లాడడం తగదు. ‘పరోపకారార్థ మిదం శరీరం’ అనే మాట వినలేదా. ఒక శివయోగి వ్రతానికి ఈ నా శరీరం ఉపయోగపడడం నా భాగ్యం. నా తండ్రి ఇది నాకిచ్చిన గొప్ప అవకాశం” అని చెప్పాడు. ‘వీడు తండ్రి కంటె గొప్పవాడు’ అనుకొని జటాధారి జంగం వేషంలోని నీలకంఠుడు బాలుడికి మూర్ఛ తెప్పించి అదృశయమయ్యాడు. తరువాత ఉపాధ్యాయుడు ప్రణవ మంత్రం చెవిలో చెప్పి నుదుటన విభూతి రాసి శిరియాళశెట్టికి సృహ తెప్పించాడు.

పార్వతీదేవి బాలింతరాలు వేషంలో వచ్చి తిరువెంగనాంచికి పుత్రమోహము కలుగజేయుటకు ప్రయత్నించుట:

చిరుతొండనంబి మరల ఊరిబయట పాడుపడ్డ దేవాలయం వద్దకు వెళ్ళి, కుష్టువ్యాధిగ్రస్తుడైన కపటవృద్ధ జంగమును వేషములోనున్న చంద్రశేఖరుని తన వీపుపై మోపి, రాజమార్గంలో ఇంటికి తీసుకు వచ్చాడు. గుడ్డి అవ్వ రూపంలో ఉన్న పార్వతీదేవి తన భర్త చేయిపట్టి నడిచింది. ఏకాంతంలో శెట్టి దంపతులు వారికి స్నానాదులు గావించి నూతన వస్త్రములు కట్టబెట్టారు.

ఇంతలో నుదుట బస్మం ధరించిన ఒక పదహారు సంవత్సరాల బాలింత తిరువెంగనాంచి వద్దకు తన చిన్ని శిశువుకు పాలు కావాలని వచ్చింది. పాలుపోయించుకున్న తరువాత ఆమె తిరువెంగనాంచితో “ఏమమ్మా! నీవు నీ కుమారుని చంపి ఒక కపట జంగానికి ఆహారంగా పెట్టబోతున్నావని అందరూ అనుకుంటున్నారు. అది నిజమా! ఏమిటో ఆవగింజంత విభూతి రాసుకుంటే గుమ్మడికాయ కాయంత వెర్రి పుడుతుంది అంటారు. అలాంటి పిచ్చి పని చేసి నీ కొడుకును బలి చెయ్యవద్దు” అని చెప్పింది.

ఆ మాటలకు తిరువెంగనాంచి “అమ్మా! శివునకు, శివయోగికి బేధం లేదు. మన ప్రాణాలు శివుని ఆధీనంలో ఉంటాయి. శివుడే అన్నింటికీ కర్త, కర్మ, క్రియ. శివుడే భోక్త. అయినా నీవు బాలింతరాలవు. ఈ విషయం ఆలోచించి మనస్సు పాడుచేసుకోకు. నీకు ఎప్పుడు పాలు కావల్సినా రా” అని చెప్పి ఆమెను సాగనంపింది.

సిరియాళుని కోసి వండి శివయోగికి వడ్డించుట:

ఆచార్యగృహంలో విద్యాభ్యాసం చేస్తున్న శిరియాళుడు కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు. కంచిలో ఎడతెగని వానలున్నాయని మేనత్తలు పంపిన తినుబండారాలు తేనెలో ముంచి తినిపించారు. తలకి సంపంగి నూనె రాసి, వంటికి పసుపుగంధాలు పట్టించి వేడి నీటితో స్నానం చేయించారు. మడిబట్ట కట్టి నుదుట విభూతితో నామాలు పెట్టారు. అప్పుడు తల్లితండ్రులు “కుమారా! వ్రతదీక్షలో నున్న ఒక భైరవయోగికి నీ శరీరమాంసంతో వంట చేసి భోజనం పెడుతున్నాము. నీ మనస్సులో ఈ ప్రపంచాన్ని వదలి పోతున్నందుకు ఏమైనా బాధ పడుతున్నావా?” అని అడిగారు.

అప్పుడు సిరియాళుడు “తండ్రీ! నీవంశంలో పుట్టిన నాకు సంసార మాయ కొంచెం కూడా లేదు. శివునకు, శివయోగికి తప్పక మాంసాహారమవుతాను” అన్నాడు.

తల్లి శిరియాళుని తన వడిలో పండుకొన బెట్టుకొనెను. చందనిక బాలుని తలను చేతితో పట్టుకొనెను. శిరియాళుడు చిరునవ్వు నవ్వుతూ ‘ఓం నమశ్శివాయ’ అని పంచాక్షరి జపిస్తున్నాడు. చిరుతొండనంబి కత్తితో కొడుకు మెడ కోసెను. అతని మాంసమును పసుపు, మిరియము, జీలకర్ర, ఉల్లి, యింగువ, నేయి, పెరుగు మొదలైన ద్రవ్యములు వేసి రకరకాలుగా వండారు. చారు, వడియాలు, పాయసం మొదలైనవి చేశారు.

శివయోగిని పిలిచి పూజ చేసారు. అరటి ఆకులో అన్నీ వడ్డించి ఆరగించమన్నారు. అప్పుడు శివయోగి ‘తల మాంసం ఏది? దాచుకున్నారా? నా వ్రతభంగమైంది’ అని లేవబోయాడు. అంతలో చందనిక వేరొక పాత్రలో దానిని తెచ్చి వడ్డించింది. అప్పుడు శివయోగి “సరే నీవు, నీకుమారుడు వచ్చి నా పంక్తిలో కూర్చొని భోజనం చెయ్యండి. మగబిడ్డ లేని ఇంట నేను భోజనం చెయ్యను” అన్నాడు. చిరుతొండనంబి నెమ్మదిగా వచ్చి పక్కన కూర్చున్నాడు. “నా కుమారుడు ఎక్కడికో ఆటకు వెళ్లాడు. వాడు వచ్చేసరికి వంటకాలు చల్లారిపోతాయి. మీరు మొదలు పెట్టండి” అన్నాడు.

అప్పుడు శివయోగి సరే పిలువుము. వాడు వచ్చేకనే భోజనం మొదలు పెడతాను” అన్నాడు.అప్పుడు తిరువెంగనాంచి “కుమారా! ఎక్కడ ఉన్నావు. చిట్టి కన్నా! రారా! తొందరగా రా!” అంటూ పలుమార్లు కొడుకును పిలిచెను. అట్లు పది దిక్కులయందు ఆమె పిలువగా సిరియాళుడు వచ్చెను. వాని వళ్ళంతా మిరియాలు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, పెరుగు వాసన వేస్తోంది.

అంతట ముసలి జోగి మెడలో పాము, తలలో చంద్రుడు, నొసట మూడవ కన్ను, వంటికి విభూతి పూసుకున్న మహేశ్వరునిగా మారిపోయెను. ముసలి అవ్వ పార్వతీ దేవిగా మారింది. చిరుతొండనంబి, తిరువెంగనాంచి, చందనిక, సిరియాళుడు అందరూ పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి భక్తితో స్తుతించిరి.

“చిరుతొండనంబి! నీవు శాపవిముక్తుడవైనావు. నీవు పూర్వ జన్మలో కైలాసంలో నాదగ్గర ఉండే ప్రమథుడివి. దుర్వాసనని శాపం వలన ఈ మానవ జన్మ నెత్తావు. నీ భార్య తిరువెంగనాంచి గంధర్వ కన్య. నీ దాది చాందనిక ఒక అప్సరస.నీ కుమారుడు సిరియాళుడు స్వయానా కుమారస్వామి. వీరు ముగ్గురు వేర్వేరు కారణాల వలన మానవ జన్మ ఎత్తారు. మీరందరూ నాతో కైలాసానికి రండి” అన్నాడు.

అప్పుడు చిరుతొండనంబి “స్వామీ! కంచిలో ఏడు వాడలలో నున్న వేయిగోత్రాలవారమూ కలిసిమెలిసి ఉన్నాము. వీరందరినీ వదలి నేను మీతో కైలాసమునకు రాలేను. వీలైతే అన్ని ఇండ్లలోని వారిని మీతో తీసుకు వెళ్ళండి. లేనిచో ఇక్కడే ఉండి అందరమూ కలిసి యధావిధిగా మీ పూజలు చేసుకుంటాము” అని వేడుకొన్నాడు. చంద్రశేఖరుడు కరుణించి కంచిలోని ఆ ఏడు వాడలలోనున్న వేయిగోత్రములలోని మేలైన వైశ్యపెద్దలను తీసుకొని సతీసమేతుడై కైలాసం చేరుకున్నాడు. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు ఉన్న వైశ్యులందరికీ ఈ చిరుతొండనంబి మూలపురుషుడు.

శివభక్తుడైన చిరుతొండనంబి చరిత్ర చదివినా, విన్నా, వ్రాసినా పుత్రపౌత్రాభివృద్ధి, ధనకనకవస్తువాహన సమృద్ధి, ఇష్టకార్యసిద్ధి సమకూరును.

*శుభం*

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న