కేశవ మూర్తికి హటాత్తుగా మెలకువ వచ్చింది. భార్య భానుమతి పోయిన ఈ మూడు నెలల కాలంలో ,ఆయనకు ఏ రోజూ సరిగా నిద్ర లేదు.పట్టినా కలత నిద్ర.నే మంచినీళ్ళు తాగి అలా దివాన్ మీద కూర్చుని , ఆ కలని గుర్తు చేసుకో సాగారు కలలో భానుమతి ఏడుస్తోంది. ఎందుకు? తాను కదా ఏడవాల్సింది. ఒక్కరోజు అనారోగ్యం పాలవని మనిషి , ఏభై ఆరేళ్లైనా నిండని మనిషి, ,,నిద్రలో నే తాను ప్రక్కన నిద్ర పోతూ వుండగానే , ఒకమాట, ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోయిందేమిటి? అరవై రెండేళ్ల కేశవ మూర్తికి , కన్నీరు ఆగలేదు. ఆయన బాధ. ఎదిగి, పెళ్లిళ్లు అయిపోయిన కొడుకుల తో పంచుకొలేడు. ప్రస్తుతం శ్రీకాంత్, ఇంట్లో ఉన్నాడతను. పెద్ద కొడుకుది మంచి ఉద్యోగమే, కోడలు కూడా చిన్న ఉద్యోగమేదో చేస్తున్నది. పదేళ్లు, ఎనిమిదేళ్ల పిల్లలున్నారు కొడుకు కు .పిల్లల బెడ్రూమ్ వాళ్లకు వదిలేసి తాను హాల్ లో సర్దుకొన్నాడు. కాని కోడలు ఇంట్లో వున్న్నంత సేపు, సెలవుల్లో, హాల్ లో వుండటం ఇబ్బందే
. మళ్లీ కల గుర్తుకు వచ్చింది. కలలో భాను ఏడుస్తున్నది
పెళ్ళయిన దగ్గరనుంచి ఆమెని ఎప్పుడూ తిట్టి ఎరగడు పద్దెనిమిదేళ్లకే , తండ్రిపోయిన సంవత్సరం లోనే పెళ్లి చేయాలని, ఆమె అన్నలు మేనమామ ద్వారా అతని దగ్గరకు వచ్చారు. తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి.
అదొక మధుర జ్ఞాపకం అతనికి. తెల్లగా,పొడువుగా వున్న భానుమతి ఎంతో నచ్చింది అతనికి. క్లర్క్ స్థాయిలో మొదలైన
ఉద్యోగ ప్రస్థానం బాగానే ముగిసింది. . తల్లి,తండ్రి, తన ఇద్దరు అక్కలు , అన్నా,వదిన అప్పుడప్పుడు వచ్చేవారు. అందరితో కలుపుగోలుగా ఉండేది తాను బాగానే వుంటాడు తప్పితే తాను అందగాడు కాదు. జాజి పువ్వు లాంటి భార్య అంటే మొదటి చూపులోనే ఎంతో ఇష్టం కలిగింది తాను కొంచం రంగు తక్కువ కూడా. తను. వీలున్నప్పుడల్లా పనుల్లో సాయం చేసేవాడు. బజారు పనులు వీలున్నప్పుడల్లా చేసేవాడు లేకపోతే ఆమె చేసుకొనేది
ఎంతో ఇష్టంగా , ప్రేమగా ఉండేది తనంటే , పిల్లలంటే. అన్ని భాద్యతలు తీరాయి అనుకొ ని వెళ్లిపోయిందా ? రిటైర్డ్ లైఫ్ ఎంత బాగా ప్లాన్ చేసుకొన్నాడు! ఆ రోజు కూడా, బాధ్యతలన్నీ తీరాయి, ఇంక అందరు బంధువుల ఇళ్ళకీ, యాత్రలకి వెళ్లి హాయిగా గడుపుదామని చెప్పిన మనిషి , తననిలా ఒంటరి వాణ్ని చేసి వెళ్లిపోయిందేమిటి? తనకు ఆమె తప్పవేరే ప్రపంచం లేదు. ఆఫీస్ అవగానే సరాసరి ఇంటికెళ్లిపోయేవాడు. తోటపని, బజారు పని కలిసే చేసుకొనేవాళ్ళు.తన భాదలు, సుఖాలు ఆమెతోనె పంచుకొనేవాడు.
ఇంటి కోసం స్థలం కొన్నప్పుడు, మొక్కలు పెంచుకోవాలని ఎంత సంబరపడింది!
రెండు బెడ్రూమ్ లు హాల్, వంటిల్లు కట్టినందుకు పెద్ద రాజభవనం కట్టించి ఇచ్చినట్టు ఎంత సంబర పడి పోయింది. పెద్దవాడు హైదరాబాద్ లో చిన్నవాడు శ్రీకర్ ఉద్యోగరీత్యా నార్త్ లో వున్నాడు. కోడళ్లు ఎలా వున్నా ఏమి అనేదికాదు.
సెల్ ఆన్ చేసి ఆమె ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి చూపులకి పంపిన ఫొటోతో సహా , అన్ని అకేషన్స్ కి తీసిన ఫొటోస్ వున్నాయి. చూస్తుండగానే,కన్నీటితో ఫోటోలు మసకబారిపోసాగాయి.
ప్రక్కనే పడుకుని వుంది, ఆమె శ్వాస ఎప్పుడు ఆగి పోయింది తెలియనంత మొద్దు నిద్ర పోయాడు తాను.? ఎంత దౌర్భాగ్యుడు, కన్నీళ్లతో చెంపలుతడిసి పోతున్నాయి. ఎప్పటి కో నిద్ర పట్టింది
"హాల్ల్లో పడుకున్న వాళ్లు ఎనిమిదైనా లేవకపోతే ఎంత ఇబ్బంది, నా కవతల ఆఫీస్ టైం అవటం లేదు, లేపండి నాన్న ని" కోడలి గొంతు బిగ్గరగా వినపడుతోంది. ఉలిక్కిపడి లేచాడు మూర్తి
కొడుకు దగ్గరకు వచ్చి యేదైనాట్లాడతాడు అనుకొన్నాడు. శ్రీకాంత్ తండ్రి దగ్గరకు వచ్చి," రాత్రి నిద్ర పట్టలేదా నాన్నా?" మాట్లాడకుండా లేచి , హాల్ లో వున్న బాత్రూమ్ లోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చాడు. కాఫీ ఇచ్చింది కోడలు , అది భానుమతి ఇచ్చే కాఫీలా లేదు. టిఫిన్, భోజనం టేబుల్ మీద పెట్టా ను, తర్వాత తినండి" ఆ మాటల్లో సౌమ్యత లేదు నిట్టూర్చాడు మూర్తి.
రోజులు నిస్సారంగా గడుస్తున్నా. విశ్రాంతి వుంది ప్రశాంతంగా లేదు.కల వచ్చిన వారానికి సాయంత్రం పార్క్ కి వెళ్ళాడు. అక్కడ అతనికి స్నేహితులెవరూ లేరు. వెళ్లిన అరగంట కే వెనక్కి వచ్చి, ఫ్లాట్ ముందు బెల్ నొక్కబోయి ఆగిపోయా డు కోడలి మాట వినిపించింది,
"ఆయన చిన్న కొడుకు యు ఎస్ లో చదవడానికి స్టడీ లోన్ తీసి మళ్లీ తానే రిటైర్ అవగానే కట్టారు కదా. ఇప్పుడు అతను ప్రేమించినదాని కోసం వెనక్కి వచ్చాడు. నార్త్ కోడలు ఈయనను చూస్తు౦దాఁ? మనమే కదా చూడాల్సింది? ఆ ఇల్లు అమ్మి డబ్బు ఇమ్మనండి. మీ తమ్ముడు వాటా కోస్తే ఎవరి చదువులకు ఎంతయ్యిందో లెక్క తేల్చమనండి "
శ్రీకాంత్ నచ్చ చెబుతున్నట్టుగా అంటున్నాడు " అమ్మ పోయి మూడు నెలలు కాలేదు, ఇప్పుడు కొత్త ఇంటికి ఏం తొందర వచ్చింది.? నేనిప్పుడేమి మాట్లాడను ఆయనతో ఖచ్చితంగా తేల్చివేసాడు కొడుకు.
"కనీసం మీకెంత, శ్రీకర్ కి ఎంత ఖర్చు పెట్టారు అదైనా అడిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో పదిహేను లక్షలను ఇవ్వమనండి
శ్రీకాంత్ కి బాగా కోపం వచ్చినట్టు వుంది. " చెబుతుంటే అర్థం చేసుకోకుండా కొత్త ఫ్లాట్ అంటూ గోల చేస్తావేంటి" సహనం కోల్పోయినట్టుగా అరిచా డు. విజయ ఇల్లు అమ్మెయ్యమని అన్యాపదేశంగా ఆం టూనే వున్నది.
వెనుతి రి గి వెళ్లి , క్రింద వున్న బెంచి మీద కూర్చున్నారు. ఆయనకి కోడలి మీద కోపం రాలేదు. ఇంతకాలం వాళ్లు ఒకరకమైన ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడ్డారు. విజయ ప్రైవసీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతోందని ఆయనకు అర్థమై౦ది.
ఇల్లు అమ్మే సి ఇస్తే, ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటె ? ఆయన హఠాత్తుగా తన ఇల్లు గుర్తుకు వచ్చింది. అవును, ఇల్లు , భానుమతి పోగానే వచ్చేసాడు కొడుకు దశ దిశ కర్మ అయిపోగానే,. అప్పుడు కలిగిన వ్యధ ఒంటరిగా ఉండనివ్వక, కొడుకు దగ్గరకు వచ్చేలా చేసింది.
నాన్న " అన్న శ్రీకాంత్ పిలుపు విని తలెత్తి చూశారు ఆయన
."ఎనిమిదయింది నాన్న, మీరు ఇంతవరకు రాలేదని కంగారు వేసింది."
"యేదో రా, అలా కూర్చుండిపోయాను " నిర్వేదంగా అన్నారు.
“నాన్నా,” కొడుకు గొంతులో బాధ గమనించి, " ఏమి లేదు నాన్నా, పద అంటూ బయలుదేరారు.
రెండురోజుల తర్వాత "ఇంటికెళ్లాలని వుంది శ్రీకాంత్ " అన్నారు కొడుకు తో.
శ్రీకాంత్ " అదేమిటి నాన్న, నువ్వు ఒక్కడివే ఎలా వుంటావు? ఆందోళన గా అన్నాడు.
“ఇల్లు ఎలా ఉందొరా. లంచ్ అయ్యాక వెళ్తాను. "
"విజయా, ఇలా రామ్మా, రెండు లాంగ్ నోటుబుక్స్ ఆమె చేతిలో ఉంచుతూ అన్నారు, "మీ అత్తయ్య ఇద్దరు కొడుకులకు ఎవరి ఖర్చు ఎంతయిందో రాసి పెట్టింది అమ్మా, శ్రీకాంత కీ 6 లక్షలు తక్కువ ఇచ్చాను, ఇంకా ఆఫీస్ నుండి కొంత రావాలి, రాగానే పంపుతాను, పిల్లల పేరున వెయ్యి, "
వంచిన తలెత్త లేదు విజయ.
తండ్రి రెండు రోజుల క్రితం విజయ మాటలు విన్నాడేమో అని అనిపించింది. తండ్రిని వుండ మని ఆడగ టానికి సంశయించి ఏమి మాట్లాడ లేక పోయాడు.శ్రీకాంత్.
*** *** ***
నాలుగు గంటల కల్లా ఇంటికి చేరాడు గేట్ తీసి లోపలికి అడుగుపెట్టగానే మనసంతా వేదనతో నిండిపోయింది. కళ్ళు నీటిపొరలు కమ్మి , పరిసరాలు మసకగా కనిపించాయి. ఇంటి తలుపు తీసి, భారమైన హృదయంతో లోపలికి వెళ్లి, అన్ని కిటికీలు,తలుపులు తెరిచారు. ఆమె బీరువా తెరచి,ఆమె చీరల దొంతర చూసాడు. ఎంతో నీటుగా సర్దుకొంది ఆమె. ఒక చీర తీసి, గుండె లకు హత్తుకొని వెల్లువలా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక, నేలమీదపడి ఏడ్చాడు. కొంచం సేపయ్యాక తేరుకొని వెనక పెరటిలోకి వెళ్లాడు.
పెరటిలో భార్య ప్రాణ సమానంగా పెంచుకొన్న మొక్కలు వడలిపోయిన కనిపించాయి. పెద్ద మొక్క లైన మామిడి, సపోటా నిమ్మ,ప్రాణాలతో వున్నాయి. ఆమె ప్రాణమైన జాజి, మల్లె, విరజాజి , గులాబీ మొక్కలు వాడిపోయి వున్నాయి.
పనిమనిషి సాయమ్మకి ప్రతినెలా జీతం పుంపుతూనే వున్నాడు. ఫోన్లో అడిగితే ఆమె ఏవొ కుంటిసాకులు చెప్పింది. మూర్తి ఆమెని ఏమి అనలేదు, వెంటనే వచ్చి ఇ ల్లు క్లీన్ చేయమన్నాడు.
ఆమె వచ్చే లోగా మొక్కల దాహార్తి తీరి, జీవo పోసుకొనేలా నీళ్ళు పెట్టాడు
సాయమ్మ తో ,ఇల్లు, వాకిలి శుభ్రం చేయించి, గిన్నెలు మళ్లీ కడిగిం చి, రోజూ పనిలో కి రమ్మనమని చెప్పాడు. ఆమెని ఆయన ఏమి అనలేదు,భానుమతి కిష్టమైన తోటను,ఇంటినీ వదిలేసి వెళ్ళిపోయిన తాను పరాయి మనిషిని ఏమనగలడు?
ఆ రాత్రి బాగా అలసిపోయాడేమో , పనిమనిషి వచ్చి తలుపు తట్టేదాకా మెలకువ రాలేదు. టిఫిన్ బయట చేసి, పచారి సామాన్లు, కూరగాయలు కొన్ని తెచ్చుకొని వంట చేశాడు. మనసులో చెప్పలేని దిగులు, మాటి మాటికి భానుమతి, ఆమె మాటలు గుర్తుకు .రాసాగాయి. మనసు కూడ తీసుకుంటూ నెమ్మదిగా వంట ముగించాడు. రెండు గంటలప్పు డు భోజనానికి కూర్చున్నాడు. ఒంటరిగా కూర్చొని , గొంతులో దుఃఖం గూడుకట్టు కొని ముద్ద మింగుడు పడలేదు.కాస్త అన్నం తిని లేచాడు. హాల్ లో వాలు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అలా నిస్సారంగా పది రోజులు గడిచాయి. రోజూ వంటచేసుకొన్నా, తినలేక పోయేవాడు. ఆ రోజు అలాగే ఏదో తితిన్నాను అనిపించి , వాలు కుర్చీలో కూర్చున్నాడు.
అమ్మా" అంటూ ఆగకుండా ఎవరో పిలుస్తున్నారు. చిన్న పిల్లాడి గొంతు లా వుంది. లేచి తలుపు తీసాడు. యెదురుగా ఏడేళ్లు వుంటాయేమో , మాసిన దుస్తుల, దీనంగా నిలబడి వున్నాడు.
"ఆకలేస్తోంది అయ్యగారు, కొంచం అన్నం పెట్టండి: లోతుకు పోయిన కడుపు ని చొక్కా ఎత్తి, చూపించాడు. వాడి వయిపు ఒక నిమిషం చూసి, " వుండు, అంటూ ఒక కాటన్ టవల్, సోప్ ఇచ్చి " కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని రా " అని చెప్పి పె రటిలోకి వెళ్లి అరటి ఆకు కోసుకొని వచ్చి హాల్ లో వేసి ": రా, కూర్చో: అన్నాడు.
వండిన అన్నం ఆకు మీద వేసి, తాను కొనుకొచ్చిన టమాటా పచ్చడి, నెయ్యి వేశాడు. నెయ్యి వద్దండి అయ్యగా రు "
తిను, పచ్చడి లో నెయ్యి వేసుకోకపోతే ఎలా తింటా వు?
వాడు తల వంచుకొని కూర్చున్నాడు. కళ్ల నుండి కన్నీళ్లు రాలి అన్నంలో పడసాగేయి. ఆయనకు తెలియదు, వాడు సరిగ్గా అన్నం తిని యెన్ని రోజులైందో!
ఏడవకు" అన్నం తిను" చొక్కతో కళ్ళు తుడుచుకొని అన్నం గబ, గబా తినసాగేడు.నెమ్మదిగా తిను" ఆర్ద్ర౦ గా అన్నారు
తర్వాత కూర అన్నం, పెరుగు అన్నం తో పాటు రెండు అరటి పళ్లు ఇచ్చి, తినేలా చూశారు.
ఆకు పడేసి , చేతులు కడుక్కొ ని వచ్చి, ఆయన ఎదురు గా నించున్నాడు. కూర్చో " నీ పేరేమిటి?
రవి కిరణ్ అయ్యగారు "
వాడు చెప్పిన దాని బట్టి పట్టపగలు తాగి వచ్చిన తండ్రి తో, తల్లి గొడవపడింది . ఆతను తోసిన తోపు కి రోటి మీద పడిప్రాణాలు పోగట్టుకొంది. పోలీసుల భయo తో పారిపోయిన తండ్రి తిరిగి రాలేదు. 6 నెలలుగా వాడిని ఆదుకొనే వాళ్లు లేక, అడుక్కుతినలేక యాతన పడుతున్నాడు. నిండా ఏడేళ్లు లేవు, హఠాత్తుగా ఆయనకు అనిపించింది వాడి దుఃఖం ముందు తనదెంత?
' అయ్యగారు, ఆకులు అవి శుభ్రం చేస్తాను, చెట్లకు నీళ్ళు పోస్తా బజారు పనులు చేసిపెడతా, ఒక్కపూట అన్నం పెడితే చాలు ఈ వరండా లో పడివుంటా "చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు.
గబుక్కున వంగి వాడి చుట్టూతా చేతులు వేసి , హృదయానికి హత్తుకొన్నాడు.ఆయన కళ్ను ఆగకుండా వర్షిస్తున్నాయి. ఆ పసివాడి వయసెంతని? భార్య మరణoతో ఘనీభవించిన ఆయన హృదయం కరిగి కన్నీరుగా ప్రవహించింది. కనీసం తాను 62 ఏళ్ళు అన్ని బంధాలలోనో మాధుర్యాన్ని అనుభవించాడు. వాడి వయసుకు ఎంత వ్యథ ఒంటరి తనఁ నెమ్మదిగా తేరుకొని, వాడి కన్నీళ్లు తుడిచి, అన్నాడు, " రవీ , నాకు నువ్వు ఏమీ పని చేయనవసరం లేదు. నాకు తోడుగా వుండు, అమ్మమ్మ లేదు, నిన్ను చదివిస్తాను, వుండి పోతావా నాతో "
వాడు మళ్లీ ఆయన్ను చుట్టేసి గట్టిగా ఏడవసాగాడు.
గంట తరువాత రవి శుభ్రంగా ,తలారా స్నానం చేసి, ఆయన మనవడి బట్టలు లూజు గా వున్నా వేసుకొన్నాడు. వాడి కి కావాల్సిన బట్టలు, చెప్పులు. కావలిసినవన్నీ కొన్నాడు. షాపింగః అయ్యే సరికి రాత్రి ఎనిమిదయింది. మంచి హోటల్ లో భోంచేసి , చివరగా ఐస్ క్రీమ్ ఇప్పించాడు. వాడి సంతోషం ఆయనకు ఎంతో శాంతిని కలిగించింది.
*** *** ***
మర్నాడు ఊర్లో పేరెన్నికగన్న స్కూల్ కి తీసుకెళ్ళి, సెకండ్ క్లాస్ లో చేర్చారు. స్కూల్ డ్రస్, షూస్,బుక్స్ అన్ని కొన్నాడు. ఆ పసివాడు సంతోషానికి అంతే లేదు. మాటి, మాటికి బుక్స్ తీసి చూసుకొంటున్నాడు. ఆ రోజు ఆయన వాడితో పాటు కడుపు నిండా తినగలి గారు
కేశవ మూర్తికి ఇప్పుడు రోజులెలా గడుస్తున్నా యో తెలియటం లేదు. ఉదయాన్నే లేవటం, రవి తో కలిసి మొక్కలకు నీళ్ళు పోయటం, వంట చేసుకోవటం, వాడిని స్కూల్ కి పంపించాక, విశ్రాంతి తీసుకోవటం, సాయంకాలాలు పార్క్ కి లేదా మార్కెట్ కి వెళ్లడం, అన్నీ రవి తోడు రాగా చేస్తున్నారు. వాడు క్విక్ లెర్నర్ , తన నిర్ణయం వాడి విషయం లో సరైనదని తెలుస్తున్న కొద్దీ ఆయనకి ఎంతో తృప్తి కలుగుతోంది. ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు, " ఎందుకు నాన్నా, ఈ వయసులో ఈ అబ్బాయి భాద్యత నీకు? అమ్మ జ్ఞాపకం రా ఈ ఇల్లు, నాకూ వాడు బరువు కాదు, , అమ్మ లేని ఈ జీవితానికి వాడు ఒక తోడు, అంతే".
చాలా రోజుల తర్వాత తెల్లవారుఝమున భానుమతి కనిపించింది. అతని తలమీద చేయి వేసి నిమురుతూ అన్నది, " కలత పడకండి , ప్రశాంతంగా వుండండి, నేను వెళ్తానుఇక, తలుపేసుకోండి “భాను, వెళ్ళకు " , గట్టిగా అరుస్తూ లేచాడు. అరిచానను కొన్నాడు. కాని నోటిలోoచి చిన్న శబ్దం కూడా ర్రాలేదు. తల తిప్పి చూశాడు, రవి ప్రక్క మంచమీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మంచి నీళ్ళు తాగి, కలలో భానుమతిని గుర్తుచేసుకున్నారు. ఏమన్నదీ ఆమె, కలత పడవద్దు, ప్రశాంతంగా ఉండమన్నది రెండు బంగారు గాజులు మధ్య ఎర్రని మట్టి గాజులు ఆమె ముఖంలో చిరునవ్వు హఠాత్తుగా ఆయనకు గుర్తుకువచ్చింది, అవును , ఆమె చనిపోయిన రోజు కోరా కలర్ బెంగాలీ కాటన్ చీర, ఎర్రజాకెట్ వేసు కొంది రాత్రి అలాగే కనపడింది అంటే ఆమె ఇంక తనకు కనబడదు. అని. తనని మరిచిపోయి, ఆ పసివాడి తో మిగిలిన జీవితాన్ని సాగించామన్నదా, తన జ్ఞాపకాలతో భాదపడవద్దని , లేదా తన కుప్రాణప్రదమైన ఇంట్లోనే తాను జీవిస్తున్నందుకు సంతోషపడి, వెళ్తున్నాను అని చెప్పిందా?అందుకే వెళ్తున్నాను, నా జ్ఞాపకాల తలుపులని మూసివేయమని చెప్పిందా , అంటే ఆమె ఇంక తనకు కనబడ దని అర్ధమయ్యింది. కంటివెంట కారుతున్న నీటిని తుడుచుకొని నిద్ర కుపక్రమించారు ఆయన