ఉంగరం మహిమ - తాత మోహన కృష్ణ

Vungaam mahima

చాలా సంవత్సరాల క్రితం - ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. రాజు తెలివైన వాడే, కానీ బద్ధకం చాలా ఎక్కువ. ఉదయం లేటుగా లేస్తాడు. స్కూల్ కి లేట్ గా వెళ్తాడు. ఏ పని ఎలా చెయ్యాలో తెలుసు, కానీ పని చెయ్యడానికి బద్ధకం. ఇంట్లో ఎప్పుడు పని చెప్పినా, వాయిదా వేసేవాడు. రాజు చేత పనులు చేయించడానికి వాళ్ళ అమ్మ ఎన్నో సార్లు అరుస్తూ ఉంటుంది. కొన్ని సార్లు, ఎంత చెప్పినా రాజు పని చేయకపోతే, వాళ్ళ అమ్మే చేసుకునేది. రాజు గురించి వాళ్ళ అమ్మ చాలా దిగులు పడేది.

ఈ బద్ధకం చేత, రాజు కు ఎవరూ స్నేహితులు కూడా లేరు. రాజు మటుకు, పనులు చేయడానికి తనకి ఏదైనా అద్భుత శక్తి ఉంటే బాగుంటుందని కలలు కనేవాడు.

ఇలా ఉండగా, ఒక సారి, స్కూల్ నుంచి వస్తుండగా, దారిలో ఏదో మెరుస్తున్న వస్తువు కనిపించింది రాజు కు. దగ్గరకు వెళ్ళి చూసాడు. అది ఒక ఉంగరం. బాగా మెరుస్తుంది. అందులో ఏదైనా మహిమ ఉండవచ్చేమో నని తీసుకొని పెట్టుకున్నాడు.

ఉంగరం పెట్టుకున్న వెంటనే, ఒక గొంతు వినిపించింది.

"రాజూ! నేను ఒక గంధర్వుడను. నా కుమారుడు భూలోకం వచ్చినప్పుడు, ఈ ఉంగరం జారవిడిచాడు. ఇది మహిమ గల ఉంగరం. కోరిన పనులు కష్టపడకుండా తీరుస్తుంది. ఈ ఉంగరం నీకు ఉపయోగపడగలదు. పౌర్ణమి వరకు ఈ ఉంగరం భూలోకం లోనే ఉంటుంది. ఈ 3 దినాలు - నీవు ఉంగరం వాడుకోవచ్చు. 4 వ రోజు, ఉంగరం మాయమైపోతుంది."

ఉంగరం దొరికినందుకు రాజు చాలా సంతోషించాడు. గంధర్వరాజు కు కృతజ్ఞతలు చెప్పాడు.

రాజు ఉంగరం ఎలా పని చేస్తుందో, చూడాలనుకున్నాడు. ఉదయం లేచినవెంటనే, ఉంగరం తలచుకొని, బ్రష్ అంటే బ్రషింగ్, బాత్ అంటే బాతింగ్, ఈట్ అంటే ఈటింగ్, రెడీ అంటే రెడీ అవడం రాజు కి చాలా బాగుంది.

ఒక రోజు లేట్ గా లేవడం వలన, రాజు స్కూల్ కి వెంటనే వెళ్ళాలి అనుకున్నాడు. ఉంగరాన్ని తలచుకున్నాడు. వెంటనే స్కూల్ లో ఉన్నాడు.

వాళ్ళమ్మ, షాప్ కి వెళ్లి సరుకులు తెమ్మన్నది. ఉంగరాన్ని తలుచుకున్నాడు. వెంటనే పని అయిపోయింది.

స్కూల్ లో హోంవర్క్ ఇచ్చారు. సింపుల్ కూడికలు చేయడానికి కూడా ఉంగరం సహాయం తీసుకున్నాడు రాజు.

1 + 2 =? కి ఉంగరం వాడాడు.
5 - 2 =? ఉంగరం వాడాడు.
బయట వర్షం పడుతుందా? అని వాళ్ళమ్మ అడిగితే, ఉంగరం వాడాడు.
స్కూల్ కి టైం కి వెళ్ళడానికి ఉంగరం వాడాడు.
ఇంచుమించు అన్ని పనులకి ఉంగరం వాడాడు రాజు.

అన్నింటికీ ఉంగరం సహాయం తీసుకోవడం చేత, ఆలోచించడం మానేసాడు. మేధస్సు తగ్గిపోయింది. నడక లేదు. వ్యాయామం లేదు. పనులు చేసే విధానం కూడా మర్చిపోయాడు.

3 రోజులు అయిపోయింది. 4 వ రోజు ఉదయం లేట్ గా లేచాడు. లేచిన వెంటనే - బ్రష్ అన్నాడు - కానీ ఏమీ అవలేదు. చేతికి ఉంగరం కోసం చూసాడు, కానీ లేదు. అంతా అర్ధమయ్యింది.

ఉంగరం మహిమ లేకపోవడంతో, పనులు సొంతంగా చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. స్కూల్ కి లేట్ గా వెళ్ళాడు. ప్రిన్సిపాల్ తిట్టారు.

సరుకులు తేవడానికి చాలా ఆలస్యం అయ్యింది. అమ్మ కు కోపం వచ్చింది.

రోజూ ఉంగరం సహాయం తో చేసే పనులు చేయడానికి చాలా కష్టపడ్డాడు రాజు.

ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు, గంధర్వ గొంతు వినిపించింది.

"నాయనా! రాజూ! ఎలా ఉన్నావు?" నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది.

"మీ అమ్మ, గొప్ప దైవ భక్తురాలు. ఎప్పుడూ, నీ గురించే ఆలోచిస్తుంది. దేవుడిని ఎప్పుడు నీ గురించే, కోరుకుంటుంది. నిన్ను పరిక్షించ దలచి, నేనే ఈ ఉంగరం నీకు దొరికేటట్టు చేశాను. నువ్వు, ఏ మాత్రం మారలేదు. బద్ధకం వదలలేదు. నేను మీ అమ్మ నిత్యం కొలిచే శ్రీకృష్ణ పరమాత్ముడను. గంధర్వుడను కాను."

"నమో కృష్ణ! నమో కృష్ణ! నా కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడా? ఎంత అదృష్టవంతుడను!"

"ఇది మీ అమ్మ చేసుకున్న పుణ్యం నాయనా! ఆ మహా భక్తురాలు కడుపునా పుట్టడము, నీ అదృష్టం."

"నా భక్తురాలి బాధ చూడలేక, నీ బాగు కోసం తపిస్తున్న ఆమెకి సహాయం చేయడానికే నేను రావాల్సి వచ్చింది మరి!"

"ఒక విషయం చెప్పక తప్పదు. మనం చేయాల్సిన పనులు మనమే కష్టపడి చేసుకోవాలి. అప్పుడే తృప్తి కలుగుతుంది. పనులు అలవాటౌతాయి. శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది."

"ఆపద సమయాల్లో గాని, శక్తి కి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు గాని, మన ప్రయత్నం చేస్తూ, దేవుని మీద భారం వెయ్యాలి. దేవుడు సహాయం అందిస్తాడు. అంతే గాని, ప్రతి చిన్న విషయానికి, బద్దకం తో ఉండకూడదు."

"ఇకనైనా, నీ పనులు, ఇంటి పనులు బద్దకం వదలి చేస్కో. అవకాశం ఉంటే, వేరే వాళ్ళకి కూడా సాయం చెయ్యి. స్నేహితులు నీ జీవితం లోకి వస్తారు. శక్తి కి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు, నీ ప్రయత్నం చేస్తూ, దేవుని మీద భారం వెయ్యి. నన్ను తలుచుకో. నీకు తప్పక విజయం లభిస్తుంది."

రాజు తన తప్పు తెలుసుకున్నాడు. అమ్మ తన కోసం ఎంత తపిస్తుందో తెలుసుకున్నాడు. బద్ధకం వదలి, కష్టపడి చదువుకొని, అమ్మ కి సహాయం చేస్తూ, మంచి వ్యక్తిగా జీవితంలో స్థిరపడ్డాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న