కమనీయం - విద్యాధర్ మునిపల్లె

Kamaneeyam

ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించిన అతని మాటలకు రాగసుధ కంగుతింది. అతను అలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. అతని మాటలతో ఆమె ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా అనిపించింది. మెత్తటి దిండుతో మొహాన నొక్కిపట్టి ఊపిరాడ కుండా చేస్తున్న అనుభూతి. ఆమె కంటి వెంట అశ్రు ధారలు.. సమాధానం చెప్పాలంటే గొంతు పెగలనంత దుఃఖం. వారిద్దరి శ్వాసలు తప్ప మరేదీ వినబడనంత నిశ్శబ్దం.. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. రాగసుధ తన గొంతును సవరించుకుంటూ ఆ గదిలో బల్లమీద వుంచిన తన తల్లి రాజ్యలక్ష్మి ఫోటో ముందు పెట్టిన వయోలిన్‌ తీసుకుంది. అతను ఆమెని అలాగే చూస్తూ మెల్లిగా ఆమె వైపు నడక సాగించాడు.

*********

నారాయణయ్య వంశం వారు తరతరాలుగా హరికథా గానం చేస్తున్నారు. వారి వంశం హరికథా గానానికి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టింది పేరుగా వుండేది. ఆయన కథాగానం కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రోగ్రాము డేట్స్‌ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఒకరోజు అతను విజయ నగరంలో హరికథ చెప్పటానికి వెళ్ళి నప్పుడు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయించిన సుందరయ్య మూగ చెల్లెలు రాజ్యలక్ష్మి నారాయణయ్య హరికథా గానానికి ముగ్ధురాలై తన జీవితాన్ని అతనితో పంచుకుంటానని తన అన్న, వదినలతో చెప్పింది. నారాయణయ్య పేరు ప్రఖ్యాతలు తెలిసిన వాడు కావటం, పైగా అతని వంశ చరిత్ర గురించి అప్పటికే ఆంధ్రదేశమంతా తెలిసి వుండటంతో, సరస్వతీ పుత్రుడైన నారాయణయ్య తమ ఇంటికి అల్లుడు కావటం తమ అదృష్టంగా భావించారు సుందరయ్య కుటుంబీకులు.

ఆ విషయమే నారాయణయ్యకు చెప్పగా.. గతరోజు రాత్రి తనకథా గానానికి వయోలిన్‌ సహకారమందించే భూషయ్య ఏదో పని అత్యవసరంగా వుందని చెప్పి చక్కా వుండాయించటంతో అప్పటికప్పుడు తన చెల్లెలు రాజ్యలక్ష్మికి వయోలిన్‌ తెలుసని, కథ ఆగకుండా తన చెల్లెలు సహకరిస్తుందని చెప్పాడు. చేసేదేమీ లేని నారాయణయ్య రాజ్యలక్ష్మి వయోలిన్‌ సహకారం తీసుకోటానికి సిద్ధమయ్యాడు. అప్పుడే తెలిసింది రాజ్యలక్ష్మి ప్రావీణ్యం. ఎన్నో కచేరీలు చేసిన అనుభవమున్న దానిలా వాయించింది. నారాయణయ్య ఆనందంతో కథని మరింత రక్తి కట్టించాడు.

ఇలా రాజ్యలక్ష్మి సంగీతం గురించి తెలిసి వుండటంతో ఆమె సంగీతం ముందు మూగతనం కూడా మూగ పోవాల్సిందే అనుకున్నాడు నారాయణయ్య. అప్పటికే మూడు పదులు దాటి మూడేళ్ళయిన తను, రెండుపదులు దాటి రెండునెలలైనా అవ్వని రాజ్యలక్షితో వివాహానికి సమ్మతించాడు. రాజ్యలక్ష్మి, నారాయణయ్యల వివాహం అంగరంగ వైభోగంగా జరిపించారు.. వివాహ వేడుకల అనంతరం తన భార్య రాజ్యలక్ష్మిని తీసుకొని నారాయణయ్య తన స్వగ్రామమైన రాజాం వెళ్ళిపోయాడు.

నాటి నుండి నారాయణయ్య, రాజ్యలక్ష్మిల సంసారం సుఖవంతంగా సాగుతోంది. అతని గాత్రానికి ఈమె వయోలిన్‌ సహకారంతో నారాయణయ్యకి విశ్రాంతి చిక్కనంతగా కథాగానం చేస్తుండేవాడు. కాలం కలిసిరాకో.. దేవుడు కరుణించకో వీరికి పెళ్ళయి పదిహేనేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. ఆ వెలితి ఆ దంపతులిద్దరికీ వుంది. కొంతకాలం బాధపడ్డారు.. ఆబాధని అధిగమించారు. నిత్యం భగవన్నామ సంకీర్తనలతో వారిల్లు, వారి మనసులు పులకరిస్తున్నాయి.

ఏ భగవంతుడు కరుణించాడో కానీ పెళ్ళయిన పదహారేళ్ళకి రాజ్యలక్ష్మి కడుపు పండిరది. అదే రోజు నారాయణయ్యకి ఆదిభట్లవారి హరికథా కళాశాలలో ఆచార్యునిగా వుండి హరికథా కళారూపం నేర్పించమని అభ్యర్ధిస్తూ వర్తమానం అందింది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. .

కానీ రాజ్యలక్ష్మికి మాత్రం తన మూగతనం తన బిడ్డకు కూడా వస్తుందని భయపడిరది. నారాయణయ్య ఆమెతో.... ‘‘నువ్వురూపాన్నిస్తే, నేను నా గాత్రాన్నిస్తాను, మనిద్దరి రూపంతో పుట్టబోయే బిడ్డ భావితరానికి గొప్ప కళాకారుడో కళాకారిణో అవుతుంది’’ అంటూ ధైర్యాన్నిచ్చాడు.

వైశాఖమాసం వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు అన్నమయ్య జన్మించి విశాఖ నక్షత్రం జన్మలగ్నంలో ఆడశిశువు జన్మించింది. ఆమెకి వారు రాగసుధ అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తల్లీ, తండ్రులతో పాటు రాగసుధ కూడా చిన్ననాటి నుండి చిడతలు ధరించి శ్రావ్యంగా పాడుతూ నర్తించేది. రాగసుధని చూసి నారాయణయ్య దంపతులు మురిసిపోయేవారు.

అలా రాగసుధకి పదేళ్ళు వచ్చాయి. శివరాత్రికి మూడు రోజుల ముందే తన మేమగారింటికి వెళ్ళింది రాగసుధ. అప్పటికే రాజ్యలక్ష్మికి ఆరోగ్యం పాడైంది. కాన్పు సమయంలో వచ్చిన దగ్గు ఆమెని అప్పుడప్పుడూ పలకరిస్తూ వుండేది. ఇంగ్లీషు మందులు రాజ్యలక్ష్మి ఒంటికి సరిపడకపోవటంతో తనకు తెలిసిన చిన్న చిన్న చిట్కావైద్యా లతో నారాయణయ్య వైద్యం చేస్తుండే వాడు. అప్పటికి అది తగ్గేది. గత కొన్ని నెలలుగా రాజ్యలక్ష్మికి ఆ జబ్బు మరింత పెరిగింది. ఇంగ్లీషు మందులు వాడదామని నారాయణయ్య రాజ్యలక్ష్మిని బ్రతిమాలాడు. రాజ్యలక్ష్మి ససేమీరా అంది.. చేసేది లేక భార్యకి తన వైద్యాన్నే కొనసాగిస్తూ వచ్చాడు.

మహాశివరాత్రి రోజు శివాలయంలో భక్త మార్కండేయ హరికథాగానం చేస్తుండగా లింగోద్భవ కాలం ఆసన్నమైన తరుణంలో ఉత్సాహంగా నారాయణయ్య కథాగానం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ మార్కండేయునికి చిరంజీవత్వం.. ఇక్కడ రాజ్యలక్ష్మి శివైక్యం చెందటం రెండూ ఒకేసారి సంభవించింది. తనకి అప్పటిదాకా వాద్య సహకారం అందించిన భార్య రాజ్యలక్ష్మి ఎందుకు సహకరించటం లేదా అని చూశాడు. అప్పటికే రాజ్యలక్ష్మి చనిపోయింది. నారాయణయ్య బాధపడుతూ ఆమె ఆత్మకి అంతిమ వీడ్కోలు పలికాడు..

*********

ఆరోజు నుండి రాగసుధ తన తల్లి మరణానికి కారణం హరికథాగానమేనని గట్టిగా నమ్మింది. చిడతలు విసిరి కొట్టింది. గజ్జెలు తెంచి పారేసింది. జీవితంలో హరికథ నేర్చుకోను అని తేల్చి చెప్పేసింది. నారాయణయ్య రాగసుధని ఏమీ అనలేకపోయాడు. చిన్న తనంలోనే తల్లిలేని పిల్ల అయిందని గారాబం చేశాడు. వయసొచ్చాక తెలుసుకుంటుంది అనుకున్నాడు. రాజాం నుంచి నారాయణయ్య తన కుటుంబాన్ని విశాఖపట్నానికి మార్చుకున్నాడు.

రాగసుధ వయసుతోపాటే కళారూపం మీద ద్వేషం పెరిగిందేతప్ప తగ్గలేదు. తండ్రితో వాదనకు దిగేది. కాలం మారుతోంది. రాగసుధకి ఇరవైమూడేళ్ళు వచ్చాయి. నారాయణయ్య లో కూడా ఓపిక సన్నగిల్లుతోంది. సోషల్‌ మీడియా ప్రభావంతో కళారూపానికి రానురాను ఆదరణ తగ్గిపోతోంది. ఈ విషయమై రాగసుధ తరచూ తండ్రితో గొడవ పడుతూ వుండేది. ఒకరోజు అదే ఊరిలో వుంటున్న శ్రీరంగం శేషాద్రి భాగవతార్‌ అనే సంగీత విద్వాంసుడి కొడుకు విఠల్‌ హరికథారూపాన్ని నేర్చుకోటానికి నారాయణయ్యని ఆశ్ర యించాడు.

విఠల్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న నారాయణయ్య తన విద్యని అతనికి నేర్పించటానికి ఒప్పుకున్నాడు. విఠల్‌ సహజంగానే గాయకుడు... దీంతో అతనికి నారాయణయ్య వద్ద విద్య నేర్చుకోటానికి అట్టే సమయం పట్టలేదు. నారాయణయ్య అతనికి సాహిత్యాన్ని, ఆంగికాన్ని, అభినయాన్ని నేర్పించాడు.

ఇదిలా వుండగా విఠల్‌ ప్రతి రోజూ నారాయణయ్య ఇంటికి వచ్చిపోతుండే క్రమంలో రాగసుధతో పరిచయం ఏర్పడిరది. రాగసుధకి కూడా విఠల్‌ రాను రాను బాగా నచ్చేశాడు. విఠల్‌ ముఖ్యంగా కథాగానం నేర్చుకునేది తన తండ్రిలా హరికథలు చెప్పుకోటానికి కాదని, కేవలం తన జాబ్‌ స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ పొందటానికే ననీ తనకి అర్థమైంది. పైగా విఠల్‌ లో వుండే వినయం.. అతని సంస్కారం రాగసుధకి అతనిమీద ప్రేమను మరింతగా పెంచాయి. రాగసుధకి విఠల్‌ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటం సరిపోయేది. అతను వచ్చే సమయానికంటే ముందే అతని చిడతలు తుడిచి శుభ్రం చేసేది.. అతని సాధనకి ఎలాంటి ఆటకమూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేది.

ఒకరోజు నారాయణయ్య ఏదో పనుండి గాజువాక వెళ్ళి వున్నాడు. అది తెలియని విఠల్‌ సాధన కోసం గురువు ఇంటికి వెళ్ళాడు. గురువు లేడని తెలుసుకున్న విఠల్‌ ఇంటిదారి పట్టాడు. రాగసుధ అతన్ని వారించింది. తన తండ్రి వచ్చేస్తాడని.. వుండమని చెప్పింది.

అలా మొదలైన వారి సంభాషణలో రాగసుధ తన మనసులోని ప్రేమని విఠల్‌ కి తెలియజేసింది. విఠల్‌ ముందు కంగు తిన్నాడు.. అప్పటికే రాగసుధ గురించి ఆమె తండ్రిద్వారా కొంత తెలుసు కున్నాడు. ప్రతి రోజూ గమనిస్తున్నాడు. కనుక ఆమె మనస్తత్వం తెలుసుకున్న విఠల్‌ సున్నితంగా తిరస్కరించాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. విఠల్‌ కూడా రాగసుధని పెళ్ళిచేసుకోటానికి తనకి ఎలాంటి అభ్యంతరమూ లేదని తమ ఇంటికి కోడలుగా రావాలంటే ఏదో ఒక వారసత్వ కళారూపం నేర్చుకోవాలని కండిషన్‌ పెట్టాడు. తమ కుటుంబంలోకి కోడలుగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వారసత్వ కళారూపం తెచ్చుకున్నవారే అని నువ్వుకూడా నీ కుటుంబ వారసత్వం గా వస్తున్న హరికథ కళారూపం నేర్చుకుంటేనే పెళ్ళి సాధ్యమని చెప్పాడు. అతని నోటి నుండి అలాంటి మాట వస్తుందని ఆమె ఊహించలేదు.. మెల్లెగా తేరుకున్న తను తన తల్లి ఫోటోదగ్గర వున్న వయోలిన్‌ అందుకొని కళారూపం ద్వేషించటానికి కారణం చెప్పుకొచ్చింది.

అంతా విన్న విఠల్‌ ‘‘ లింగోద్భవ కాలంలో పరమశివుని కథకి సహకరిస్తూ, నటరాజు నాట్యమాడే రంగస్థలంపై ఊపిరి వదలటమంటే నటరాజులో విలీన మవ్వటమేనని, శివుని ఆజ్ఞవచ్చింది కనుకనే అలా జరిగింది’’ అని సర్ది చెప్పాడు.

‘‘ కళారూపాన్ని ద్వేషించే నువ్వు కళారూపం నేర్చుకునే నన్ను ఇష్టపడు తున్నావు. అంటే కళని ద్వేషించటం లేదు. మీ అమ్మగారు దూరమయ్యారని ఎవరిని అనాలో అర్థంకాక నీ కోపం కళారూపం మీద చూపిస్తున్నావు. నువ్వు నీ తల్లిని నిజంగానే ప్రేమిస్తే ఆమె నీ కిచ్చిన రూపాన్ని, నీతండ్రి ద్వారా సంక్రమించిన గాత్రాన్ని వారిరువురి కలయికతో నీకు సంక్రమించిన నాట్యాన్ని మిళితం చేసే కథాగానాన్ని నేర్చుకోవాలి. అదే నీ తల్లికి నువ్విచ్చే ఘనమైన నివాళి..’’ అంటూ కనువిప్పు కలిగించాడు.

ఊరినుంచి వచ్చిన తండ్రితో కథాగానం నేర్చుకుంటానని చెప్పింది. తనకూతురు ద్వేషించే కళారూపం నేర్చు కుంటాను అన్నందుకు నారాయణయ్య సంతోషించాడు. అనతి కాలంలోనే రాగసుధ ఎంతో శ్రద్ధతో తండ్రి వద్ద కధాగానం నేర్చుకుంది.

విఠల్‌ నారాయణయ్యకి గురుదక్షిణ ఇది సరిపోతుందా అని అడిగాడు. ఇదంతా చేసింది విఠల్‌ అని తెలుసుకున్న నారాయణయ్య సంతోషించాడు. అదే సమయంలో విఠల్‌ రాగసుధ మనసులోని మాట చెప్పాడు. నారాయణయ్య సంతోషంగా రాగసుధని కన్యాదానం చేసేందుకు సంసిద్ధమయ్యాడు.

రాగసుధ తొలి కథాగానం అనంతరం తన భార్య రాజ్యలక్ష్మి శివైక్యం చెందిన అదే కళావేదికపై నవయువ కళాకారులైన విఠల్‌`రాగసుధలని నారాయణయ్య ఒకటిచేశాడు. తన కళావారసత్వాన్ని వారికి అనుగ్రహించినట్లుగా ప్రకటించాడు.

శుభం

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న