నిర్ణయం - సీతాశర్మ మంథా

Nirnayam

బెల్ వినపడి తలుపు తీసేలోపు మరల ఇంకోసారి మోగింది. ‘ఎవరబ్బా, ఇంత కంగారుగా..నాకు వేరే పని ఏమీ లేదా ఏంటి?” అనుకుంటూ గాసుపొయ్య మీద ఉన్నవి పాడవ్వకుండా మంట తక్కువ పెట్టి నేప్కిన్తో చేయి తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసాను.

“నమస్తే అమ్మా! నా పేరు మూర్తి. మీరు నాకు రమ్మని ఫోన్ చేసారు కదా!” అన్నారు అవతలి వ్యక్తి.

ఆశ్చర్యపోయాను. నేనా, ఎప్పుడూ ఈ మనిషిని చూసిన గుర్తుకూడా లేదు. పోనీ ఇంటికి సంబంధించిన దేనిగురించైనా అంటే అదీ లేదాయె. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న ఊరిలో లేరు. ఆయన ఉద్యోగ రీత్యా వేరే ఊరు, పిల్లల చదువుకోసం నేను ఇక్కడ. నేనింకా అనుమానంగా చూసి ప్రశ్న వేసేలోపు అతనే చెప్పాడు.

“నేను మీ పై ఇంట్లో ఉండే వనజ తండ్రినమ్మా.”

ఓహ్! అర్థం అయ్యింది. పై ఇంట్లో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్న నంబర్ కాగితం మీద రాసిచ్చి, ఆయనకు ఫోన్ చేసి వెంటనే బయల్దేరి రమ్మనమని చెప్పిన సంగతి గుర్తు వచ్చింది. కానీ కాల్ చేసి వారం దాటినట్లే ఉంది. ఈయనకు ఇప్పుడు తీరిక అయినట్లుంది. మనసులో అనుకున్నా.

అతను నా మనసు చదివినట్లు…

“అప్పుడే రావల్సిందమ్మా. అర్జంటు పనిపడి రాలేక పోయినా. లోపలికి రావచ్చామ్మా?” నీరసంగా అడిగాడు.

అప్పుడు నా బుర్రకు తట్టింది. నేనింకా అతనిని బయటే నించోపెట్టి మాట్లాడుతున్నట్లు.

“అయ్యో, సారీ అండి. మీరని నాకు తెలియదు. లోపలికి రండి. మంచినీళ్లు తెస్తాను. కూర్చోండి.” అని తలుపు తీసి, అతను కూర్చున్నాక ఫేన్ వేసి లోపలికి వెళ్ళి గాస్పొయ్య అన్నీ ఆఫ్ చేసి, చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాను.

అతను గటగటా తాగేసాడు. జేబులోంచి రుమాల్ తీసుకుని మొహం తుడుచుకుని కంఠం సవరించుకున్నాడు. అతని వాటం చూసి చాలా అలసిపోయినట్లు నాకు అనిపించింది. ఇంకోక గ్లాస్ ఇస్తే అవికూడ తాగేసాడు. నాకు ‘పాపం’ అన్పించింది.

“ఈ మాత్రం నీళ్ళకు కూడ నా కూతురింట్లో మేము నోచుకోలేదమ్మా” అతని కంటిలో నీరు.

అంత పెద్దాయన అలా బాధ పడుతుంటే నాకుకూడ ఏమనలో తోచలేదు.

“మీరు మా వనజతో ఎప్పుడన్నా మాట్లాడతారామ్మా?” అడిగాడు అతను.

మాఇల్లు మొదటి అంతస్తులో వనజవాళ్ళు అద్దెకు ఉంటారు. ఒక సంవత్సరం క్రిందట అనుకుంట వచ్చారు. అత్తగారు, మావగారు, తను, వాళ్ళాయన, రెండేళ్ళ చిన్న పాప. టైమ్కు అద్దె ఇస్తారు. మా వారు కూడ ఇక్కడ ఉండక పోవడం వలన కాస్త సాయంగా ఉంటారన్నట్లు ఆ పోర్షన్ అద్దెకు ఇచ్చాం కానీ మాకూ వాళ్ళకు పెద్దగా పరిచయం పెరగలేదు. ప్రతి వీకెండ్ మా వారు రావడం, మేము మా పనుల్లో బిజీగ ఉండటం వలన పైన జరిగేది ఏదీ మాకు పెద్దగా తెలియదు.

“లేదండీ, తనెప్పుడూ మాకు కనపడదు. చాలా తక్కువగా కిందకు వస్తుంది. వెరీ రేర్. ఎక్కువ వాళ్ళ అత్తగారు, వాళ్ళాయన ఇద్దరే రోజూ కిందకు దిగడం, బజారు పనులు చేసుకోవడం చేస్తారనుకుంట. ఈ ఏడాది టైమ్లో తనను ఓ నాలుగుసార్లు చూసానేమో! చూసినప్పుడు కూడ మట్లాడదు. ‘అత్తయ్య పిలుస్తున్నారు’ అని వెళ్ళిపోయేది.

“అవునండి. అదే విషయం. పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు, ఏడాది పిల్ల. కానీ మా అమ్మాయి నోట్లోనించి ఒక్కమాట రానీయరు. చంటిపిల్లను బాగా చూసుకుంటారు. ఆ చంటిదాన్ని కూడ ఆ నానమ్మే దగ్గర ఉంచుకుంటుంది. బండెడు చాకిరి. పనిమనిషిని పెట్టరు. నేను వాషింగ్ మిషన్ ఇస్తానంటే, ‘అబ్బే, అన్నీ అలా కలిపి ఉతకడం మాకు ఇష్టం లేదంటారు’. ఆ అత్తగారు తిండి కూడ పెట్టదు నా కూతురికి. దానికి తోడు ఆడపడుచు కూడ అంతే! రెస్ట్ అని ఇక్కడికి వచ్చి నా కూతురితో అంత చాకిరీ చేయిస్తుంది,” మరల అతని కళ్ళల్లో నీరు తిరిగింది.

అందుకే లావుంది ఆ అమ్మాయి ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉంటుంది. నిరుడేడాది నేనొకసారి, “ఏంటమ్మా, డైటింగా? అంత సన్నంగా ఉన్నావు. చంటిపిల్లను చూసుకోవాలి కూడాను. బాగాతిను. దానికి తగ్గట్లుగ పని చేసుకో! ఒళ్ళు రాదులే,” అన్నాను.

ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. పక్కనున్న అత్తగారు, “అదేమీ లేదండీ. కొంతమంది కుంభాలు కుంభాలు తిన్నా ఒళ్ళు రాదు. దానికేం, బానే తింటుంది,” అంది.

ఇప్పడు ఆలోచిస్తే, నిజమే! మరీ పుల్లలాగ ఉంటుంది అందుకేనేమో! కొంచెం నేనుకూడ పట్టించుకోవాల్సింది. మరీ అలాగ వాళ్ళ కుటుంబవిషయాల్లో దూరిపోవడం నాకు నచ్చదు. అక్కడికీ ఆ అమ్మాయి ఫోన్ చెయ్యమంటే చేసాగా! ఇంట్లో ఎవరూ లేరేమో, ఫోన్ పనిచెయ్యడం లేదేమో అనుకున్నా కానీ..ఇంత జరుగుతోందని తెలియదు సుమీ..అయినా అంత ఆలోచించలేదు నిజానికి.

“మరీ నలభైనో నలభైరెండు కేజీలు బరువు ఉంటుందేమో అనిపిస్తోందమ్మా. నేను మా ఇంటికి తీసికెడతానని అడిగితే నా మొహం మీదే తలుపు వేసేసారమ్మా దుర్మార్గులు. నా కూతురు కూడ, ‘నువ్వు వెళ్ళిపో, నాన్నా. నేను బాగానే ఉన్నా’ అంది. నాకు అవమానం జరిగితే అది తట్టుకోగలదా? నా చిన్న కూతురి పెళ్ళి కుదిరింది. నేను దాన్ని బాగా చూసుకుంటానట. పెద్దదాన్ని చూసుకోనట. మా అల్లుడు, వాళ్ళమ్మ..ఆ మాట పదేపదే చెప్పి నా కూతురిని దెప్పుతారు. వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు. నేనెందుకు అలా చూస్తాను?” ఆయన తల పట్టుకున్నాడు.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారా? అనుకుంటాం గానీ పిల్లల్ని కనగలంకానీ వాళ్ళ రాతల్ని కనగలమా? నా ఇద్దరు కూతుళ్ళూ నా కళ్ళముందు మెదిలారు. ‘ దేవుడా! నా టైమ్ బావుండి నా పెళ్లి మంచి మనిషితో అయిపోయింది. వాళ్ళను జాగ్రత్తగా చూడు తండ్రీ!’ అనుకున్నాను.

“ఎంతో ఘనంగా చేసానమ్మా పెళ్ళి. ఇలాంటి వాళ్ళని తెలియదు. ఒక ముద్దు ముచ్చట, ఒక నగానట్రా, కనీసం సినిమా కూడ ఉండదమ్మా దానికి. పెళ్ళైన కొత్తలో ఒక్కసారి పుట్టింటి కి వచ్చి బాధ పడింది. ఏవో ఇలాంటి చిన్న చిన్నవాటిని పట్టించుకోకూడదని సర్ది చెప్పి పంపాం. నాదే తప్పు,” నుదురు కొట్టుకున్నాడు ఆయన.

నాకేం చెప్పాలో తెలియలేదు. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారాయె. ఇప్పుడిప్పుడు అన్నీ సమన్వయించుకుంటే అర్థం అవుతోంది. సినిమాలకు తల్లీకొడుకూ బైక్ మీద ఝాం అని వెళ్ళిపోతారు. ‘వనజ రాదా?’ అని నేనడిగితే ‘చంటిది సినిమా చూడనివ్వదు, దాన్ని వదిలి మా కోడలు రాదు’ అని అత్తగారు చెప్పేది. నిజానికి ఆ చంటిదానికి నాయనమ్మే ఎక్కువ అలవాటు. మరి రోజూ కొడుకు బైక్ మీద మనవరాల్ని కూడ తిప్పుతుంది కదా!

“ఫోన్ కూడ చెయ్యనియ్యరమ్మా, ఇంక ఇలా అయితే నా కూతురు నాకు దక్కదనిపిస్తోంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం చేద్దామంటే ఈ సంబంధం చెప్పిన, వాళ్ళ వాళ్ళే…విడాకులు ఇప్పించేయమంటున్నారు. చిన్నదాని పెళ్ళి అయ్యేవరకూ చూద్దామనుకున్నా కానీ అంతవరకూ ఆగేలాగ లేదు.” అన్నాడాయన.

నేను ఒకటే అనుకున్నాను. నాకు నిజంగా పూర్తి విషయాలు తెలియవు. కానీ ఇద్దరి ఆడపిల్లల తల్లిగా నా వంతు సహాయం చేద్దామనిపించింది.

“మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయకలిగేదైతే తప్పక చేస్తాను. ఇంతకంటే ఏం చెప్పను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే,” అని ఊరటనిచ్చాను.

“చాలా థాంక్స్ అమ్మా! అవసరమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఆ దేవుడు దాని మొహాన ఏం రాసాడో చూద్దాం,” అంటూ నేను ‘ఏమైనా తిని వెళ్ళండి’ అని ఎంత చెప్పినా వినకుండా అతను దండం పెట్టి వెళ్ళిపోయాడు.

************

ఇది జరిగి పది రోజులు పైన అయ్యింది. ఆ రోజు ఆదివారం. ఈయన కూడ ఇంట్లో ఉన్నారు. నల్గురం పెసరట్లు తింటూ మనకు పనికిమాలిన ప్రపంచలోని విషయాలు, పనికొచ్చే భవిష్యత్తు తాలుకు చర్చలు అన్నీ జరుగు తుండగా గేటు తీసుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. యూనిఫారం చూడగానే స్వతహాగా ఉండే కంగారుతో నేను ‘ఏమయ్యుంటుందబ్బా’ అని ఆలోచిస్తుండగా, అతను ఎడ్రస్ అడగడం, మా చిన్నది చెప్పి, పైకి చూపించడం అన్నీ అయ్యాయి.

ఇద్దరు ఆడ కానిస్టేబుల్స్, ఇద్దరు మగ కానిస్టేబుల్స్ టకటకా పై పోర్షన్లోకి వెళ్ళి వనజ భర్తను, అత్తగారిని జీపు ఎక్కించుకుని తీసికెళ్ళారు. కొంచెం సేపు తరువాత వనజ కూతురితో సహా తండ్రితో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి శారీరకంగా నీరసంగా ఉన్నా కళ్ళల్లో ఏదో తెగింపుతో కూడిన మెరుపు. నేను నోరు తెరుచుకుని ఈ రకమైన ముగింపుకు ఆశ్చర్యపోయాను.

*************

సాయంత్రం వరకూ రకరకాల పేపర్ల తాలూకు జర్నలిస్ట్ లు వచ్చి మమ్మల్ని ఏవేవో ప్రశ్నలు వేసారు. నా ఇల్లు, నా పిల్లలు ఈ రకంగా పేపర్‌లో రావడం నాకు ఇష్టంలేదు. మేము ఎవన్నా ఘనకార్యం చేసామా? మేము ఏమి చెప్పినా వాళ్ళకు తోచిందే వాళ్ళు రాస్తారనుకోండి, అది వేరే విషయం. పోలీసులకు మాత్రం నాకు తెలుసున్నంత వరకూ జరిగింది చెప్పాను.

ఈ లోపు ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ వనజను పిలిచి మాట్లాడిసోంది. ఎప్పుడూ తల వంచుకుని, అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్లు ఉండే అమ్మాయి కెమేరా ముందు పిల్లతో కూర్చుని నిర్భయంగా మాట్లాడుతోంది.

యాంకర్ అడుగుతోంది, “అసలు మీరు ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీకు కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి?”

“అంటే లేటెస్టు కష్టమా తల్లీ! లేదూ… ఎలాగూ కష్టాలు అలవాటయిపోయాయి కాబట్టి అలాగే పడుండాలనా? ఏవిటో ఈ యాంకరు ఉద్దేశ్యం?” నా పెద్ద కూతురి ఉవాచ.

‘నా బంగారు తల్లి, అన్నీ నా పోలికలే! నా కొచ్చిన ఆలోచనే దానికీ వచ్చింది’ అనుకున్నాను.

వనజ చెప్తోంది, “ఎప్పటికప్పుడు నా పాపను చూసుకుని, దాన్ని వాళ్ళు బాగానే చూస్తున్నారు కదా అని వాయిదా వేసాను. పని చెయ్యడానికి ఏమీ సమస్య లేదండీ, కానీ నన్నూ ఆ ఇంటి మనిషిగా చూడాలి కదా! కానీ వాళ్ళు పనిమనిషి గా, వంటమనిషిగా,ఇంకా నీచంగా చూసారు. కొంచెం ప్రేమ చూపిస్తే జీవితాంతం వారిని కళ్ళల్లో పెట్టుకుని చూసేదాన్ని.”

“మరి ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేసేంత నిర్ణయం ఎలా తీసుకున్నారు?” అడిగింది యాంకర్.

“మా నాన్న నన్ను చూడటానికి వస్తే నేనెక్కడ తనకు అన్నీ చెప్తానో అని ఆయనను ఇంటిలోకి కూడ రానియ్యలేదు మా అత్త. నన్ను ఫోన్ల్ లో మాట్లాడనియ్యక, పుట్టింటికి వెళ్ళనియ్యక నిర్భందించేసరికి మా నాన్నకు అనుమానం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు.”

“అంటే ఇది మీ నిర్ణయం కాదా?” యాంకర్ అనుమానం.

“ఇది పూర్తిగా నా నిర్ణయమే. పాపను మా అత్త తన దగ్గర పడుకో పెట్టుకుని, నేనంటే గౌరవం లేకుండా మాటలు నేర్పించి, నా విలువ తనకు తెలియకుండా చేస్తుంటే నేను తట్టుకోలేక పోయాను. వాళ్ళకు నా విలువ ఎటూ తెలియ లేదు. నా పాపను నాకు కాకుండా చేస్తారా? ఎట్టి పరిస్థితిలోనూ అలాగ జరగనివ్వను,” పాపను గట్టిగా హత్తుకుని చెప్పింది వనజ. ఆమె మాటల్లో స్థిరత్వం. భవిష్యత్ మీద ఆశ.

ఆమెకు ఏమీ ఫరవాలేదు ఇంక. ‘వనజా…వనజా…మీ వారికి తెలియదు నీ విలువా’…చప్పట్లు కొట్టాను. ఒక కూతురుగా, ఒక తల్లిగా ఆమె తీసుకున్న నిర్ణయం నాకు చాల నచ్చింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న