ఆ రోజు గురువారం. మనవలిద్దరూ ఏడింటికే స్కూలు బస్సులో స్కూలుకు వెళ్ళిపోయారు. కొడుకు , కోడలు ఆదరాబాదరాగా టిఫిన్, కాఫీలు ముగించుకొని ఆఫీసులకు తొమ్మిది కాకుండానే వెళ్ళిపోవడంతో తుఫాను వెలిసినట్లయ్యింది. సరస్వతి తీరిగ్గా శ్నాన పానాదులు , టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఒక గంట పాటు పూజ చేసి, తర్వాత శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభిస్తుండగా మొబైల్ రింగ్ అయ్యింది. ఎవరిదీ తెలియని నెంబరు. అవతల్నుంచి చాలా ఆదుర్దాగా మాట్లాడాడు.
" అమ్మా, మీరు సరస్వతి గారేనా ?" అడిగాడు.
అవునని సమాధానం ఇచ్చింది సరస్వతి.
" అమ్మా, నేము వరంగల్ నుండి రామయ్యను మాట్లాడుతున్నాను.మేము పార్వతమ్మ గారి ఇంట్లో అద్దెకు వుంటున్నాము. పార్వతమ్మ గారు మీతో మాట్లాడాలంటే ఫోను చేస్తున్నాను. ఇదిగో ఆవిడతో మాట్లాడండి" అని గబ గబ మాట్లాడాడు.
కొంచెం నిశబ్దం తర్వాత " ఏమే సరస్వతి బాగున్నావా? అంటూ ఒకావిడ లోగొంతుకతో మాట్లాడిండి. నూతిలోంచి వస్తునట్లున్నాయి ఆ మాటలు.
ఆ గొంతుకను క్షణంలో పసిగట్టింది సరస్వతి. సుమారుగా ముప్ఫై ఏళ్ళు కలిసి మెలిసి తిరిగిన తన ప్రాణ స్నేహితురాలు పార్వతిదే ఆ గొంతు.దాదాపుగా పదేళ్ళ తర్వాత తిరిగి ఆ గొంతును వింటోంది.
సంభ్రమాశ్చర్యాలతో " ఏమే పార్వతీ, ఎలా వున్నావు?" అని అడిగింది సరస్వతి.
" ఏదో కొన ఊపిరితో చావలేక, బ్రతకలేక ఇలా జీవచ్చవంలా పడి వున్నాను. చూసేవాళ్ళు ఎవరూ లేక, చావు కోసం ఇలా ఎదురు చూస్తున్నాను. నేడో రేపో అన్నట్లు వుంది నా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక సాయం చెయ్యమని అడగాలని నీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను" ఆయాసపడుతున్నట్లు వున్నాయి ఆ మాటలు.
పార్వతి మాటలు వింటుంటే సరస్వతికి ఎంతో బాధ వేసింది. దాదాపుగా పదేళ్ళ తర్వాత తన ప్రాణ స్నేహితురాలు ఫోన్ చెయ్యడం ఒక ఎత్తయితే, కష్టాల కొలిమిలో కూరుకుపోయిన ట్లున్న ఆమె మాటలు తనకు మరెంతో కష్టం కలిగిస్తున్నాయి.
" చెప్పవే పార్వతి , ఏం చెయ్యాలో, నీ కోసం ప్రాణం అయినా ఇవ్వడానికి సిద్ధంగా సిద్ధంగా వున్నాను" చెప్పింది సరస్వతి..
"నా పరిస్థితి ఏమీ బాగోలేదు.నా అన్నవాళ్ళు ఎవరూ మిగల్లేదు. ఈ పరిస్థితిలో ఆకరు రోజుల్లో కొంత కాలం నా దగ్గర వుంటే నా వాళ్ళ మధ్య బ్రితికిన సంతృప్తి కలుగుతుంది. ఒకసారి రాగలవా" దీనంగా అడిగింది పార్వతి.
" అదెంత భాగ్యం? ఈ సనివారమే నీ ముంది రెక్కలు కట్టుకొని వాలుతాను" చెప్పింది సరస్వతి.
ఆ సాయంత్రం కొడుకు కోడళ్ళకు విషయం చెప్పి శనివారం వరంగల్ వెళ్ళనున్నట్లు చెప్పింది సరస్వతి. అంతేకాదు. అక్కడ స్నేహితులారిలో అవసరమైతే ఒకటి రెండు నెలలు గడపనున్నట్లు కూడా చెప్పింది. ఆ పెద్దావిడ వాలకం చూసి విస్తుపోవడం కొడుకు కోడళ్ళ వంతయ్యింది. ఆవిద ఆరోగ్యం అంతంత మాత్రం. మందులేసుకుంటేగాని ఒక్క క్షణం గడవదు. ఒకరి సాయం లేకుండా గడపైనా దాటలేదు. అటువంటిది తగదునమ్మా అంటూ పరుల బాధ్యత నెత్తిన వేసుకొని ఎప్పుడే కలిసి మెలిసి తిరిగిన స్నేహితురాలి కోసం వెళ్ళదం విచిత్రంగా అనిపించింది. వద్దని, అక్కడ ఒంటరిగా వుండలేవని ఎంతగానో చెప్పి చూసారు కాని సరస్వతి వినలేదు.
అనుకున్న ప్రకారంగా ఆ శనివారం ఉదయం బయలుదేరి వరంగల్ వెళ్ళింది సరస్వతి.
మంచంలో జీవచ్ఛవంలా పడి వున్న పార్వతిని చూస్తే ఆవిడకు దుఖమాగలేదు.
తనకు పదేళ్ళ వయస్సులో పార్వతి పరిచయమయ్యింది. ఖాజీపేటలో ఇద్దరి తండ్రులు రైల్వేలో పని చేసేవారు.రెండు కుటుంబాలవీ పక్క పక్క ఇళ్ళు. ఇద్దరిగా సుమారుగా ఒకటే వయస్సు. ఒకే క్లాసులో చదివేవారు. స్కూలుకు, ట్యూషనుకు కలిసి వెళ్ళడం, రావడం, కంబైండ్ స్టడీస్ చెయ్యడం వలన ఇద్దరికీ మంచి స్నేహం కుదురింది. హైస్కూలు దాటి కాలేజీలో కలిసి ఒకే గ్రూపు తో చదివారు. పార్వతికు ముందుగా పెళ్ళి అయ్యి భర్తతో వరంగల్ లో కాపురం పెట్టింది. అయినా తమ మధ్య స్నేహం ఆగలేదు. తనకు పెళ్ళయ్యి హైదరాబాద్ వచ్చేసింది. అయినా తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం,అడపాదడపా కలుసుకోవడం చేస్తుండేవారు. అలా ఇద్దరి స్నేహం దాదాపుగా ముప్ఫై సంవత్సరాలు నడిచింది. పార్వతికి ఒక్కడే కొడుకు. బెంగుళూరులో ఉద్యోగం రావడం వలన పార్వతి కుటుంబం బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యింది. సరస్వతి, భర్త హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ససర్వతి హైదరాబాద్ లో ఒక ప్రైవెట్ కాలేజీలో లెక్చెరర్ గా పని చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యింది.భర్త ఆర్నెల్ల క్రితం హృద్రోగంతో మరణించాడు.
దాదాపుగా పదేళ్ళ నుండి తమ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. పార్వతి భర్త కూడా నాలుగు సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుండి ఆవిడకు కష్టాలు మొదలయ్యాయి. కొడుకు, కోడలు ఆవిడను ఒంటరిగా వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. చూసేవాళ్ళూ లేక వరంగల్ వచ్చేసి అక్కడ తన స్వంత ఇంట్లో ఉంటోంది. పక్క పోర్షన్లో అద్దె కుండే రామయ్య కుటుంబమే తన బాగోగులు చూస్తొంది. భౌతిక సపర్యలు చేసేందుకు 24 గంటలు ఇంట్లో వుండే విధంగా ఒక ఆడ మనిషిని ఏర్పాటు చేసారు.
పార్వతికి ఇప్పుడు ఆర్ధికంగా లొటు లేకపోయినా చూసేవారు ఎవరూ లేరన్న కొరత వేధిస్తోంది. అప్పటి నుండి సరస్వతి తన అనారోగ్యాన్ని సైతం లెక్ఖ చెయ్యక రాత్రింబవళ్ళు పార్వతితో సమయం గడపసాగింది. చిన్ననాటి కబుర్లు చెప్పుకోవడం, మంచి సంగీతం వినదం, పురాణ కధలు వినిపించదం,తమకిష్టమైన సినిమాలు చూడటం, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం ఇలా అనుక్షణం ఆమెకు మానసికోల్లాసం కలిగేలా చూసుకోసాగింది.
అలా నెల రోజులు గడిచాయి. పార్వతి ఆరోగ్యంలో మంచి మార్పు వచ్చింది. ముఖ్యంగా మానసికంగా కోలుకుంది. మునపటి నిర్వేదపు చాయలు పూర్తిగా పోయాయి. కాస్త నవ్వడం, గట్టిగా మాట్లాడడం చేస్తోంది. ఎప్పుడైనా కొడుకు ఫోన్ చేస్తే నాకేంరా, నా స్నేహితురాలు ఇప్పడు నా పక్కన వుంటే నాకు కొండంత ధైర్యం గా వుంది. ఈ ఆఖరు నిమిషంలో నన్ను కనిపెట్టుకొని వుండడానికి ఆ దైవం పంపించిన దేవత నా సరస్వతి అని హుషారుగా చెప్పేది.
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. ఒక ఆరు నెలల పాటు తన ప్రాణ స్నేహితురాలి సమక్షంలో ఏంతో హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా గడిపిన పార్వతి ఒక రోజు స్నేహితురాలి ఒడిలో తల పెట్టుకొని చిరునవ్వుతో కన్ను మూసింది. ఎంతో తృప్తిగా తన ఆఖరి రోజులు గడిపేలా సహకరించిన సరస్వతికి ఎన్నో సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇప్పుడు తనకేమాత్రం బాధ లేదని ప్రమాణం చేసి చెప్పింది.తన ఇల్లు వాకిలి, సమస్తం ఒక వృద్ధాశ్రమానికి రాసి ఇచ్చేసింది.
బంధువులు, స్నేహితులు,అయినవారు కానివారు, అందరూ గంప గుత్తగా రాలిపోయాక, కనీసం కన్నీళ్లు పంచుకోటానికైనా
ఒకరు మన జీవితంలో వుండాలి . పోరుగువాడికి మేలు చేయడం అన్నది మనిషి నానాటికి మరిచిపోతున్న రోజులివి. మానవీయ విలువలను ఏమాత్రం పట్టించుకోని సమాజం తయారవుతోంది. నాగరికత వైపు అడుగులు వేస్తున్నాం.. సైన్సులో ఎంతో ప్రగతి సాధించాం అని చెప్పుకుంటున్న మనిషి... మనిషిగా ఉండటం మాత్రం మరిచిపోతున్నాడని సామాజిక శాస్త్రవేత్తలు, విశ్లేషకులు పేర్కొంటు న్నారు.శాస్త్ర, సాంకేతిక, వైద్య, న్యాయ తదితర రంగాల్లోని వృత్తి నిపుణుల్లో మానవీయ, సృజనాత్మక కోణాలు కనుమరుగవడంతో మన సమాజం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదన్నది నిష్ఠుర సత్యం.మనుషులకు ముందుగా మానవత్వం అవసరం. ఆ పైనే నైతిక విలువలు. మనుషుల్లో మానవత్వం పెరిగితే లోకం ఆనందంగా వుంటుంది.
అలా రక్త సంబంధం లేకపోయినా, తన స్నేహితురాలు తన ఆఖరి రోజులలో ఆనందమయమైన జీవితం గడిపేందుకు ఎంతగానో సహకరించిన సరస్వతమ్మ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచింది.