అందమైన ముంబై నగరం. ఎక్కడ చూసినా ప్రేమజంటలు తిరుగుతున్నాయి. విహారి తన భార్య నీహారికతో కలిసి ముంబై లోకి అడుగు పెట్టారు. ముందుగానే విహారి స్ట్రీవ్ మ్యాన్షన్ అనే హోటల్ లో హనీమూన్ సూట్ బుక్ చేసుకున్నాడు.
విహారి మనసు తను కోరుకున్న నిహారికతో పొందబోయే తొలిరాత్రి అనుభవాలకోసం తహతహలాడుతోంది. విహారి తన భార్యతో హోటల్లోకి అడుగుపెట్టాడు. రిసెప్షనిస్ట్ వీరిని నవ్వుతూ ఆహ్వానించారు. రూమ్ కీ ఇచ్చారు. వాళ్ళు రూమ్ లోకి అడుగుపెడుతూనే కిటికీలకున్న కర్టెన్స్ ఓపెన్ చేసిచూశారు..
విహారి నోట్లోంచి ‘‘ వావ్.. ముంబై అందాలు.. అద్భుతం. స్వర్గంలో వున్నట్లుంది.. నేనెప్పుడు ముంబై కి వచ్చినా ఈ హోటల్ లో ఈ రూమ్ నే ప్రిఫర్ చేస్తాను. చూడు ఇక్కడ నుండి ముంబై అందాలు ఎలా కనిపిస్తున్నాయో.. ’’
నిహారిక కూడా విహారి పక్కనే వచ్చి నిలబడి కిటికీలోంచి ముంబై వ్యూ చూస్తోంది..
‘‘ రాత్రిపూట అయితే ముంబై సిటీ ఇంకా బాగుంటుంది. టూ అవర్స్ లో నైట్ అవుతుంది. గెట్ రెడీ.. అలా నాలుగు వీధులు తిరిగొద్దాం.. ముంబై అందాలు చూసొద్దాం..’’ అన్నాడు నవ్వుతూ..
నిహారిక చిరునవ్వుతోనే సమాధానమిచ్చింది.
రాత్రి 12 గంటలు అయింది. వున్నట్లుండి హనీమూన్ సూట్ లోంచి తుపాకి పేలిన శబ్దం.
నిహారిక పెద్దగా అరుస్తూ.. సూట్ రూం లోంచి బయటికి పరుగెత్తుకొచ్చింది.
ఆమె దుస్తుల నిండా రక్తం. చేతికి పెద్దగాయం..
కాసేపట్లోనే పోలీసులు హోటల్లోకి చేరుకున్నారు.
సూట్ రూమ్ లోకి వెళ్ళిచూస్తే విహారిని తుపాకితో కాల్చారు. నిహారిక చేతికీ గాయమైంది. విండో పగల కొట్టుకొని హంతకుడు బయటికి వెళ్ళి వుండచ్చని పోలీసులు అనుమానించారు.
సిసిఫుటేజ్ చెక్ చేద్దామని సిఐ సీతారామ్ నాయక్ సిస్టమ్ ముందు కూర్చున్నాడు.
‘‘ హత్య జరగటానికి ముందు అరగంట నుంచి హత్య జరిగాక పావుగంట వరకూ సిసి టీవీలు పనిచెయ్యలేదు. అంటే వచ్చిన హంతకుడు జామర్స్ యూజ్ చేసి వుండాలి..’’ అని అనుకున్నాడు.
నిహారిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాడు సీతారామ్ నాయక్.. కొన్నాళ్ళు ఆమెని ముంబై లోనే వుండాలని కోరాడు సీతారామ్ నాయక్..
**********
విహారి ముంబై లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి ముంబై లో కూడా బ్రాంచెస్ వున్నాయి. పెళ్ళి చేసుకొని నిహారికను తీసుకొని ముంబై కి వచ్చేశాడు. విహారి మరణంతో నిహారిక అతని కంపెనీకి మేనేజింగ్ సిఇవో గా బాధ్యతలు తీసుకుంది. అయితే ఆమె కంపెనీని టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ముంబై బ్రాంచిని హెడ్ ఆఫీస్ గా మార్చుకొని బిజినెస్ రూల్ చేస్తోంది.. ఆరు నెలల్లో కంపెనీకి అనుకోని లాభాలు వచ్చిపడుతున్నాయి. ముంబై లో టాప్ టెన్ ధనవంతుల్లో లో వున్న విహారి ఆస్తుల్ని ఈమె ఆరునెలల్లో టాప్ టూ లిస్ట్ కి చేర్చింది. ఇప్పుడు విహారి ఆస్తులన్నీ కూడా లీగల్ గా నిహారక పేరుమీదికి మార్చబడ్డాయి.
**********
విహారి మర్డర్ కేసు ఎంతకీ తేలటంలేదు.. సీతారామ్ నాయక్ విహారి మర్డర్ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అప్పటికే పాతనేరస్తుల్ని ఇంటరాగేట్ చేసినా ఫలితంలేదు. వారెవ్వరూ కాదు.
సీతారామ్ నాయక్ విస్కీ గ్లాసులో పోసుకొని, సిగార్ వెలిగించి దమ్ము మీద దమ్ము లాగుతూ విస్కీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు.
నిహారిక చెప్పిన దాని ప్రకారం వచ్చింది ఒక్కడే... ముందు విహారిని షూట్ చేశాడు. తర్వాత అడ్డు వెళ్ళిన తనని చేతిమీద కాల్చాడు. వెంటనే కిటికీ పగలగొట్టుకొని పద్దెనిమిది అంతస్తులనుంచి కిందికి దూకేశాడు. అంటే ఇదంతా కేవలం ప్రీప్లాన్డ్ గానే జరిగి వుండాలి.. కిందికి దూకేసిన వాడు ఎటెళ్ళాడు.. అంత నేర్పుగా కిటికీలోంచి కిందికి దూకి బతికి బయటపడగలడా..? అసలు విహరిని చంపటానికి బిజినెస్ పరంగా ఏమైనా శత్రవులున్నారా.? అతనికి శత్రవులు లేరు. మరి ఎవరు చంపారు.? అంతగా ప్లాన్ చేసి మరీ విహారిని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది. ఒక వేళ నిహారిక కనుక తన భర్తని చంపి వుంటే హోటల్లో ఆయుధం వుండాలి కదా.. మొత్తం వెతికినా ఆయుధం దొరకలేదు. తుపాకీ పేలిన వెంటనే నిహారిక బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆయుధం దాచే టైం కూడా లేదు. పోనీ ఆయుధాన్ని ఎక్కడైనా దూరంగా విసిరేసిందా అంటే సరౌండింగ్స్ మొత్తం సెర్చ్ చేసినా ఆయుధం దొరకలేదు. ఇలా ఆలోచిస్తూ వుండిపోయాడు సీతారామ్ నాయక్.. అంతలోనే అతనికి కాల్ వచ్చింది.
‘‘ ఏంటి సార్.... నా భర్త చనిపోయి ఆరునెలలు దాటుతోంది. ఎవరు మర్డర్ చేశారో కనిపెట్టారా? ఇంకా నేనెంతకాలం ముంబై లో వుండాలి. నేను హైదరాబాద్ వెళ్ళాలి. ప్లీజ్ కేసుని త్వరగా సాల్వ్ చెయ్యండి. నా భర్తని చంపిన వాళ్ళని పట్టుకోండి.’’ అంటూ ఏడ్చేసింది..
‘‘ నాకు మీ బాధ అర్థమౌతుంది మేడం. మేమూ అదే పనిలో వున్నాం.. నేరస్తుడు క్లూస్ వదల్లేదు. మీరు చెప్పిన ఆధారాల ప్రకారం నేను కొంతమందిని ఇంటరాగేట్ చేశా.. కానీ వాళ్ళెవ్వరూ నేరం చెయ్యలేదు. బట్ మీరొకసారి స్టేషన్ కి రావాల్సి వుంటుంది. కేసులో కొన్ని అనుమానాలున్నాయి. మీరు మాత్రమే క్లారిఫై చెయ్యగలరు.’’ అన్నాడు సీతారామ్ నాయక్ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా..
‘‘ తప్పకుండా రేపు మార్నింగ్ ఎలెవన్ కి వస్తాను. ’’ అని కాల్ కట్ చేసింది.
**********
సీతారాం నాయక్ స్టేషన్ లో కూర్చొని కేసుని స్టడీ చేస్తున్నాడు. నీహారిక కారు స్టేషన్ ముందు ఆగింది. కారులోంచి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నీహారిక దిగింది. నాయక్ దగ్గరికి వెళ్ళి.. అప్పుడే నాయక్ వున్న గదిలో సీక్రెట్ కెమెరా ఆన్ అయింది. వాయిస్ రికార్డింగ్ కోసం సీక్రెట్ మైక్ కూడా ఆన్ అయింది. నాయక్ ఇవన్నీ ముందుగానే ఏర్పాటు చేశాడు.
‘‘ ఏంటిసార్.. రమ్మన్నారు.?’’ అన్నది నిలబడి.
కూర్చోమన్నట్లు కుర్చీ ఆఫర్ చేశాడు నాయక్.. నీహారిక కూర్చుంది.
‘‘ మీ భర్త మర్డర్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో మరొక్కసారి మీనోటినుంచి తెలుసుకుందామని’’ అన్నాడు..
ఇంతలో కానిస్టేబుల్ మాయ లోపలికి వచ్చింది. ఆమె దగ్గర నుంచి మొబైల్ ఫోన్, వాచ్, చైన్ లాంటివన్నీ కూడా తీసుకుంది.
‘‘ కంగారు పడకండి.. వెళ్ళేప్పుడు మీ వస్తువులు మీకిచ్చేస్తాం.. మీరు చెప్పండి ఆ రోజేం జరిగింది?’’ అన్నాడు నాయక్.
‘‘ ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను కదసార్..’’
‘‘ చెప్పారు.. కానీ మరోసారి చెప్పలేరా? అప్పుడు ఏమైనా కంగారులో పాయింట్స్ ఏమైనా మిస్ చేసి వుంటారు. మర్డర్ జరిగి దాదాపు 10 నెలలు కావస్తోంది. ఇప్పుడు మీరు బిజినెస్ ని కూడా చాలా బాగా డెవలెప్ చేశారు. సో మీ భర్త పోయిన బాధనుంచి కోలుకున్నారనే అనుకుంటా.. అందుకే బాగా కూల్ గా ఆలోచించి మరీ చెప్పండి.. ఆ రోజు ఏం జరిగింది? ’’
‘‘ ఆరోజు మా హనీమూన్. ప్రొసీడింగ్ కి వెల్తూ లైట్ ఆఫ్ చేశారు మా వారు. అంతలోనే ఎవరో వ్యక్తి కిటికీ దగ్గరున్న కర్టెన్ వెనుక నుంచి హటాత్తుగా బయటికి వచ్చి మా వారిని షూట్ చేశారు. నేను వెంటనే పెద్దగా అరుస్తూ ఆ వ్యక్తిమీద పడ్డాను. వెంటనే ఆ వ్యక్తి తుపాకితో నా చెయ్యిమీద కాల్చి కిటిలోంచి దూకి పారిపోయారు.’’
‘‘ చాలా చక్కగా చెప్పారు మేడం.. మీరు ఆ వ్యక్తి మీద పడ్డారు. అయితే ఆ వ్యక్తి ఆడా మగా..?’’
‘‘ గుర్తులేదు..’’ నిహారిక గొంతులో ఒకరకమైన జీర నోటీస్ చేశాడు నాయక్.
‘‘ నీహారిక గారూ.. నేరం చేసింది ఎవరో మీకు తెలుసు. ’’
‘‘ నాకు తెలీదు’’ అరిచింది.. కానీ ఆ అరుపులో నిజాన్ని దాస్తున్నట్లుగా వున్న కంగారు..
నాయక్ పక్కున నవ్వేశాడు...
నిహారిక సైలెంట్ అయింది.
వారి మధ్య మౌనం.. కాసేపటికి నీహారిక తలెత్తి నాయక్ ని చూస్తూ...
‘‘ ఎలా కనిపెట్టారు? ’’ అడిగింది
‘‘ చెప్పండి.. ఏం జరిగిందో... ఎవరా వ్యక్తి..’’
‘‘ నా భర్తని కాల్చింది నేనే.. నన్ను నేను కాల్చుకున్నాను. కిటికీలోంచి ఆయుధాన్ని బయటికి విసిరేశాను. ’’
‘‘ ఐ.సీ. మీరు మీభర్తని ఎందుకు చంపాలనుకున్నారు.?’’
‘‘ నాకు మగాళ్ళని పెళ్ళిచేసుకోవటం, వాళ్ళతో సెక్స్ చెయ్యటం నచ్చదు. బికాజ్ నేనొక లెస్బియన్ని. నా పరిస్థితి నేను ఎవ్వరికీ చెప్పుకోలేను. విహారి నాతో కాకుండా నా పేరెంట్స్ తో పెళ్ళిచేసుకుంటానని చెప్పారు. ఆస్తిపాస్తులుండటం వల్ల మావాళ్ళు కూడా అతనికిచ్చి పెళ్ళిచేశారు. ఆల్రెడీ నాకొక గర్ల్ ఫ్రండ్ వుంది. నేను తనకి అన్యాయం చెయ్యలేను. విహారికీ నాకూ ఈ విషయంలోనే హనీమూన్ సూట్ లో గొడవ జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను రివాల్వర్ దగ్గర పెట్టుకున్నాను. అతన్ని కాల్చి చంపేశాను.’’ అని చెప్పింది.
‘‘ మీరు అబద్ధం చెప్తున్నారు.’’
‘‘ వాట్ ’’ అన్నది కొంచెం కంగారుగా..
‘‘ ఆ హత్య మీరు చెయ్యలేదు. మీరు చేయించారు. మీరు లెస్బియన్ అన్న విషయం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్.. మా లేడీ కానిస్టేబుల్స్ శరీరాల్ని తడిమే మీ చూపుల్ని నేను ముందే పసిగట్టాను. కానీ నాకు అప్పుడు అర్ధంకాలేదు.. ఇప్పుడు టోటల్ క్లారిటీ వచ్చింది. ఆరోజు మీరు చెప్పింది నిజం. మీ భర్తని చంపాలన్న ఉద్దేశం మీకు లేదు.. కానీ మీరు ఎక్కడ మీ భర్తకి దగ్గరై తను అన్యాయమైపోతుందో అన్న భయంతో నీ బెడ్ పార్ట్నర్ ఆరోజు మీ సూట్ లోకి ప్రవేశించింది. మీ భర్తని తను పదిహేనడుగుల దూరం నుంచి కాల్చి చంపింది. అది మీరు ఊహించని సంఘటన. మీమీద ప్రేమతో.. అనుమానం మీమీదకి రాకుండా వుండటానికి తను మీకు ప్రమాదం లేకుండా మీ చేతిమీద కాల్చింది పదిహేనడుగుల దూరం నుంచే.. తను వచ్చిన దారిలోనే కిటికీ గుండా బయటికి వెళ్ళిపోయింది. యామై కరెక్ట్..’’ అన్నాడు సూటిగా ఆమెని చూస్తూ..
తల వంచుకుంది నీహారిక.. ఆమె కన్నీటి చుక్కలు రెండు నేలపై పడ్డాయి..
నాయక్ లేచి నిలబడ్డాడు..
‘‘ తనని వదిలెయ్యండి.. నన్ను అరెస్ట్ చెయ్యండి. ’’ అన్నది ఏడుపుగొంతుతో..
‘‘ ఇంత తేలిగ్గా మీరు ఒప్పేసుకుంటారని నేను అనుకోలేదు..’’ అన్నాడు నాయక్..
‘‘ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయట పడుతుంది.. పైగా మీరు అక్కడే వుండి చూసినట్లు చెబుతున్నారు. జరిగిందంతా అదే.. ’’ అన్నది నీహారిక నేరాన్ని అంగీకరిస్తున్నట్లుగా..
‘‘సారీ నీహారికా.. నేరం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్షార్హులే.. మీరు ఏ 2.. ఎ1 ఎవరో తెలియాలి. తెలుసుకోవటం నాకు పెద్ద కష్టమేం కాదు. పదిహేనడుగుల దూరం నుంచి నీ భర్త గుండెకి గురిపెట్టి కాల్చిన ఆమె, నీ ప్రాణానికి ప్రమాదంలేకుండా అంతే దూరం నుంచి కేవలం నీ చేతి కండలోకి మాత్రమే దూరేలా బుల్లెట్ కాల్చింది.. అంటే తను ప్రొఫెషనల్ షూటర్ అయి వుండాలి. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు లెస్బియన్.. తను తీసుకున్న స్టెప్ ని బట్టీ మీరు తనకింద వుండాలి. తను మీపైన వుండాలి. మగాడిలా... ’’ అన్నాడు నాయక్..
‘‘ స్టాపిట్.. నా ప్రైవేట్ విషయాలు మాట్లాడుతున్నారు.. ప్లీజ్ స్టాపిట్’’ అన్నది ఆవేశంగా.
‘‘ నీహారికా.. కేసు సాల్వ్ అయింది.. కాసేపట్లో తను నీ పక్క సెల్ లో వుంటుంది.’’ అంటూ నాయక్ అక్కడి నుండి లేచాడు. కానిస్టేబుల్ మాయ నీహారిక చేతికి బేడీలు వేసింది. సెల్ లో కూర్చోపెట్టింది.
**********
నాయక్ ఆలోచిస్తున్నాడు..
‘‘ నీహారికని ఎంత ఫోర్స్ చేసినా తన పార్ట్నర్ గురించి చెప్పదు. కానీ ఆమెని కనిపెట్టాలి.. విహారి-నీహారికలు హనీమూన్ సూట్ బుక్ చేసుకున్న విషయం నేరస్తురాలికి తెలిసే వుండాలి. వీళ్ళు బుక్ చేసుకున్న హోటల్లోనే తనూ దిగి వుండాలి. నీహారికని క్లీన్ గా అబ్జర్వ్ చేసేలా ఆమె ఏర్పాట్లు చేసుకొని వుండాలి. పద్దెనిమిది అంతస్తులనుంచి కిందకి దూకేంత పిచ్చిపని నేరస్తురాలు చెయ్యదు. ఎందుకంటే తనకి నీహారిక కావాలి. కిటికీ నుంచి నేరస్తురాలు పావుగంట సమయంలో తను తనున్న ప్లేస్ కి చేరుకొని వుండాలి. అంటే నేరస్తురాలు వీరి రూమ్ కి రావాలంటే సిసీ కెమెరాలను దాటుకొని రావాలి. హత్య చేయాలంటే ఆమెకున్న మార్గం కేవలం కిటికీ మాత్రమే. అలాంటి కిటికీలోంచి ఆమె రావటానిక్కానీ, పోవటానిక్కానీ 45 నిమిషాల టైం.. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే తను చాలా షార్ప్ షూటర్ అయివుండాలి. 15 అడుగుల దూరం నుంచి గుండెల్లోకి కాల్చగలదు.. అలాగే చెయ్యి ఎముక విరగకుండా ఎలాంటి డ్యామేజ్ కలగకుండా వుండేలా తన ప్రియురాలు నీహారికని కాల్చగలదు. హత్య జరగటానికంటే ముందే తను ఆ హోటల్లో దిగివుండాలి. ఇలా ఆలోచిస్తూ నాయక్ హోటల్లో విహారి తీసుకున్న హనీమూన్ సూట్ ని రకరకాల యాంగిల్స్ నుంచి పరిశీలించాడు.. విహారి హనీమూన్ సూట్ బుక్ చేసిన రోజు నుంచి హత్యజరిగిన రోజు వరకూ రిసెప్షన్ లో సిసి ఫుటేజ్ మొత్తం చెక్ చేశాడు.
అప్పుడే తనకి తెలిసిన ఇంట్రస్టింగ్ కేరెక్టర్ సీసీఫుటేజ్ లో కనిపించింది.
కానిస్టేబుల్ మాయ మాలిని పేరుతో వీరి సూట్ రూమ్ కి పక్కరూమ్ తీసుకుంది. అదికూడా విహారి-నీహారికల హనీమూన్ కి రెండు రోజుల ముందు.. అక్కడ నుంచే ఆమె విహారిని చంపటానికి ప్లాన్ సిద్దం చేసుకుంది. ఎటునుండి రావాలి.. ఎక్కడెక్కడ సిసి టీవీలున్నాయి. కిటికీలోంచి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది.. తిరిగి తను తన రూమ్ లోకి రావటానికి ఎంత టైం పడుతుంది అని పక్కాగా ప్లాన్ గీసుకుంది. విహారిని చంపేసింది. మాయ తీసుకున్న రూమ్ బాత్రూ కిటికీలోంచి విహారి రూమ్ ని క్లీన్ గా వాచ్ చెయ్యచ్చు. ఆయుధం కోసం హోటల్ చుట్టుపక్కల వెతుకుతారని తెలుసు.. లేదా హత్య జరిగిన ప్రదేశంలో వెతుకుతారనీ తెలుసు. ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ కోసం వెతుకుతారనీ తెలుసు.. కానీ ఏ ఒక్క క్లూ వదలకుండా మాయ జాగ్రత్తపడింది.
మాయ గురించిన డిటేల్స్ ఒక్కసారి వెనక్కి వెళ్ళాడు నాయక్. ఆమె షార్ప్ షూటర్. ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్. చదువు 10వ తరగతి కావటంతో కానిస్టేబుల్ గానే వుండిపోయింది. ఆమె అనుక్షనం నీహారికని అబ్జర్వ్ చేస్తోంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా నీహారికను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. స్టేషన్ లో కూడా ఇంటరాగేట్ చేస్తుంటే తను అక్కడే వుంది. నీహారిక ఇంటికి దగ్గర్లోనే తను చిన్న రూమ్ తీసుకొని వుంటుందని అతనికి తెలుసు. అది కూడా డిపార్ట్ మెంట్ పనిమీద.. నీహారిక ఇంటి మీద ఓ కన్నేసి వుంచమన్నప్పుడు మాయ ముందుకు వచ్చింది. అంటే డిపార్ట్మెంట్ డ్యూటీ పేరుతో నీహారికకు చాలా దగ్గరగా వుండేలా ఏర్పాటు చేసుకుంది. మైగాడ్ మాయ.. ఎంత మాయ చేశావే.. అనుకున్నాడు నాయక్..
కేసు పూర్తిగా విడిపోయింది.
మాయే నేరస్తురాలు.
వివరాలన్నీ సేకరించాడు నాయక్.. అక్కడి నుండి నిహారిక ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకుందామని వెళ్ళాడు. కానీ ప్రతి రోజూ రాత్రి 12 గంటల నుండి 20 నిమిషాల వరకూ ఫుటేజ్ ఎర్రర్ రావటం.. రికార్డ్ కాకపోవటం జరిగాయి. తెల్లారి 5గంటల సమయంలో సేమ్ టు సేమ్ 20 నిమిషాల వరకూ ఎర్రర్ వస్తోంది. అంటే కెమెరాలకి దొరక్కుండా రహస్యంగా వుండటానికి జామర్స్ వాడుతోంది మాయ.. కానీ జామర్ రేంజ్ కొంతవరకే అన్న విషయం మాయ మర్చిపోయింది. నిహారిక ఇంటికి దగ్గరలోని కొన్ని షాపుల్లోని కెమెరాల్లో మాయ నిహారిక ఇంటికి వెళ్ళటం.. తిరిగి వుదయాన్నే రావటం వంటివి రికార్డ్ అయ్యాయి. ఈ ఎవిడెన్సులతో మాయని నిలదీశాడు నాయక్.. మాయ ముందు నేరం అంగీకరించకపోయినా.. తర్వాత ఆధారాలు చూసి నేరాన్ని ఒప్పుకుంది. ఛార్జ్ షీట్లో మాయ ఎ1, ఎ2 నిహారికల పేర్లు చేర్చబడ్డాయి. కోర్టు వీరికి రిమాండ్ విధించింది.