“తాతయ్యా..!” అని పిలుచుకుంటూ.. ముఖంలో పుట్టెడు సందేహం పెట్టుకొని వచ్చింది నా మనుమరాలు వెన్నెల. చిట్టి చేతుల్లో ‘బాలల కథల పుస్తకం’ ఉంది. ఆ లేత చేతుల మెరుపుల్లో పుస్తకం ప్రకాశిస్తోంది. ఆ దృశ్యం చూడగానే చటుక్కున వెన్నెలను నా హృదయానికి హత్తుకోకుండా ఉండలేక పోయాను.
అమెరికా నుండి గతవారమే ఇండియాకు వచ్చింది వెన్నెల. తెలుగు పుస్తకాలు చదవడంలో ఆసక్తి చూపుతోంది. నేను అమెరికాలో ఉండగా.. మన తెలుగు భాష, భాష యొక్క గొప్పతనాన్ని వెన్నెలకు బోధించిన ఫలితమది.
“ఏంటమ్మా!” అంటూ మురిపెంగా మూతి సాగదీసి అడిగాను.
“తాతయ్యా.. కథలు చదువుతున్నాను. కథల్లో పక్షులు జంతువులు మనలా మాట్లాడుతున్నట్టు రాసారు. ఎక్కడైనా పక్షులు గానీ, జంతువులు గానీ మాట్లాడుతాయా!” అంటూ అమాయకంగా అడిగింది. “ఇటీజ్ టూ మచ్” అని కళ్ళు పెద్దవిగా చేసుకుంది.
వెన్నెల సందేహం సరియైనదే.. కాని తన సందేహం తీర్చాలి. ఎలా?.. అని మమసులో అనుకోగానే తళుక్కున ఒక మెరుపు మెరిసింది. వెంటనే.. ఉర్దూ భాషలో చెప్పాను. తనకేమీ అర్థం కాలేదన్నట్టుగా పెదవులు వెనక్కి విరిచి.. తల అడ్డంగా ఊపింది.
“అర్థం కాలేదు కదమ్మా! ఎందుకు కాలేదంటే.. నేను మరో భాషలో చెప్పాను. ఆ భాష తెలిసిన వారికే అర్థమవుతుంది. అలాగే పక్షులు, జంతువులు గూడా తమ, తమ భాషల్లో ధ్వనులు చేస్తాయి. వాని ముఖ కవళికలు, కదలికలను రచయితలు ఊహించుకుంటూ, అర్థం చేసుకుని రాస్తారు. ఇలా రాయడం కొన్ని వేల సంవత్సరాల క్రితమే గొప్ప పండితుడైన విష్ణుశర్మ ప్రారంభించారు.
ఒక రాజు ఎంత ప్రయత్నించినా విద్య అబ్బని తన కుమారులకు విద్య చెప్పుమని విష్ణుశర్మను వేడుకుంటాడు. అప్పుడు విష్ణుశర్మ పిల్లలకు కథల రూపంలో చదువు చెబితే వింటారని గ్రహించాడు. దానికి పిల్లలకు ఇష్టమైన పక్షులు, జంతువులు మాట్లాడుకున్నట్లు చెబుతూ .. పంచతంత్రం అనే గ్రంథాన్ని రాసారు. అది నేటికీ ఎంతో పేరు గాంచింది. ప్రపంచ దేశాలన్నీ తమ తమ భాషల్లోకి ఆ గ్రంథాన్ని అనువదించాయి. చిన్నయ సూరి అనే పండితుడు ‘నీతి చంద్రిక’ అని తెలుగులో అనువదించారు.
ఆమధ్య కాలంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి అనే ప్రముఖ కవి పుష్పాలు తనతో మాట్లాడినట్టుగా గేయాలు రాసాడు. దేవునికి సమర్పిద్దామని పువ్వులను కోయబోయిన కవికి గాలికి ఊగుతున్న పువ్వులు తనతో.. మా ప్రాణము తీయకని మొర పెట్టుకున్నట్టు ఊహిస్తూ.. ‘పుష్ప విలాపము’ అనే గ్రంథాన్ని రాసారు. ఆ గేయాలను స్వర్గీయ ఘంటసాల గారు ఆలపించి సజీవం చేసారు.
‘రవి గాంచని చోటు కవి గాంచును’ అన్నట్టు కవులు, బాలసాహితీ వేత్తలు తమ రచనల్లో పక్షులను, జంతువులను, పుష్పాలను సమస్త జీవరాసుల హృదయాలలోకి తొంగి చూస్తున్నారు.. వానిని కథలుగా రాస్తున్నారు.
ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను వెన్నెలా.. “ అంటూ గొంతు సవరించకుని తిరిగి చెప్పసాగాను.
“తెల్లవారు ఝామున కోడిపుంజు కొక్కొరోకో!.. అని కూస్తుంది కదా!.. అంటే దాని భాషలో తెల్లవారుతోంది నిద్ర లేవండి.. అని అర్థం” అనగానే వెన్నెల కళ్ళు బండి గీరల్లా గుండ్రంగా తిప్పుతూ..
“ఒకే.. తాతయ్యా..! అర్థమయ్యింది” అంటూ చదువుకునే గదిలోకి పరుగు తీసింది.
నా మనుమరాలి సందేహం తీరినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. *