పూర్వం రంగస్థలమనే అడవిలో ‘‘కళావతి’’ అనే ప్రాంతం వుంది. అక్కడ చాలా జంతువులు, పక్షులు నివసిస్తుండేవి. ప్రతి ఒక్క జంతువూ, పక్షి అప్పట్లో ఏదో ఒక కళారూపంలో నైపుణ్యం సంపాదించినవే.. వివిధ ప్రాంతాల్లో కళానైపుణ్యం సంపాదించిన జంతువులు, పక్షులు కళావతికి చేరుకొని అక్కడ తమతమ నైపుణ్యాన్ని ప్రదర్శించేవి.. క్రమంగా కాలం మారింది... బ్రతుకు తెరువుమీద ఆశపుట్టింది.. చాలా జంతువులు పొట్ట చేత్తో పట్టుకొని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.. అలా వెళ్ళిపోయిన వాటిలో ‘‘బుర్రలో’’ గుజ్జు కాస్తో కూస్తో వున్న గొఱ్ఱె కూడా ఒకటి. పాపం ఆ గొఱ్ఱె పొట్టచేత్తో పట్టుకొని భాగ్యావతి అనే ప్రదేశానికి చేరుకుంది.
ఆ భాగ్యావతి ప్రదేశంలో అనేకమైన జంతువులు రకరకాల వ్యాపారాలు చేస్తూ యాంత్రిక జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అలా వారిజీవితంలోకి ఈ బుర్ర వున్న గొఱ్ఱె ప్రవేశించింది తనకున్న పరిజ్ఞానంతో నాలుగు మంచి మాటలు చెప్పి నలుగురి మెప్పు పొందుతోంది. తను చెప్పే మాటలకి కాసులు కూడా వస్తాయని ‘‘కృష్ణ’’ అనే తెలివైన మేకపోతు చెప్పటంతో ఆ రోజు నుంచి ‘‘బుర్ర’’ వున్న ఆ గొఱ్ఱె, మేకపోతు జత కట్టి మాటలు అమ్ముకోవటం మొదలు పెట్టాయి. మేకపోతు తన తెలివి తేటలతో గొఱ్ఱె మాటలు అమ్మి సొమ్ము చేయటం మొదలు పెట్టింది. కాస్తో కూస్తో పలుకుబడి, కొంత డబ్బు వెనకేసుకుంది.
కొన్నాళ్ళకు ఉన్నట్లుండి ఆ గొఱ్ఱెకి తాను పుట్టి పెరిగిన ‘‘కళావతి’’ ప్రాంతాన్ని చూడాలనిపించింది. తను వయసులో వున్న రోజుల్లో రకరకాల కళారూపాలతో విలసిల్లిన ఆ నేల ఎప్పుడెప్పుడు చూడాలా అని తహతహ లాడింది. ఎప్పటికప్పుడు వెళ్ళాలని తన మనసులో వున్నా తన విద్యకు వున్న డిమాండ్ రిత్యా వెళ్ళటం కుదరటం లేదు... పాపం ఆ గొఱ్ఱె చాలా కాలం తన ప్రయత్నాన్ని వాయిదా వెయ్యసాగింది.
***********
రంగస్థలంలోని కళావతిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కళావతిలో వున్న కళలు ఆ నేలపై కనిపించటంలేదు. ఎక్కడి నుండో వచ్చి కళావతిలో ప్రదర్శనలిచ్చే వారు ఎక్కవయ్యారు. కానీ అలా కళాప్రదర్శనలు ఇచ్చేవారికి కనీస సదుపాయాలు కూడా చెయ్యలేని పరిస్థితిలో కళావతి వుంది. దీనిని గమనించిన గుంటనక్క తన కుటిల బుద్ధికి పదును పెట్టింది. ఎక్కడికో వెళ్ళి సొమ్ముచేసుకోవటం దేనికి ఉన్న నేలపైనే సొమ్ముచేసుకోవాలని భావించింది. కళావతికి దగ్గరలోనే ‘‘కొల్లనూరు’’ అనే వూరిలో తన గురువైన ఒక ముసలి నక్క, దాని కొడుకు సాయం కోరింది. ముసలి నక్క,కొడుకు నక్కా ఇద్దరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ముసలి నక్క కోరిక మేరకు అతని కొడుకునక్కని కళావతికి చేర్చాడు గుంటనక్క. అలా గుంట నక్క ద్వారా కొల్లనూరు నుండి కళావతికి చేరుకున్న కొడుకు నక్క, గుంటనక్కలు స్నేహం చేస్తూ ప్రాంతీయత, కళారూపాలు, వారసత్వం అంటూ అక్కడున్న జంతువులను, పక్షులను తమ ఉపన్యాసాలతో రెచ్చకొట్టారు. వారిని సంఘటితం చేశారు. సంఘటితం చెయ్యటం వరకూ బానేవుంది.. ఇక్కడ నుండే వారి కుటిలమైన పథకాన్ని అమలు చెయ్యటం మొదలు పెట్టారు.
బుర్ర వున్న గొఱ్ఱె మేకపోతుతో కలిసి తన మాటలద్వారా విశేషమైన ఖ్యాతిని, అశేషమైన ధనాన్ని సంపాదించుకున్నాయని ఈ రెండు నక్కలకూ తెలిసింది. ఇదే అదనుగా తమ కార్యాచరణను విస్తృతం చేశాయి. భాగ్యపురికి చేరుకొని తమ ప్రాంతంలో ప్రస్తుతం కళారూపాలు నేర్చుకునేవారేకాదు, ప్రదర్శించే వారికి కూడా సరైన సౌకర్యాలు చేయలేకపోతున్నామనీ రకరకాలుగా చెప్పి ముసలి కన్నీరు కార్చాయి.. అప్పటిదాకా తనకు బుర్ర వుంది అని అనుకుంటున్న ఆ గొఱ్ఱె వారి మాటలకు విలవిలలాడి తన వద్ద వున్న కొంత సంపదను వారికిచ్చి కళావతికి పూర్వ వైభవం వచ్చేలా కృషిచేయాలని, ఆ బాధ్యతని మీరే తీసుకోవాలని పంపింది. అప్పుడే కళావతిలోని గుంటనక్కకి మరో ఆలోచన వచ్చింది.. ఈ సొమ్ము మాత్రమే కాదు కళావతిలో తమ పేరు ప్రఖ్యాతలు ఇనుమడించాలన్నా, అక్కడ సొమ్ము పుట్టాలన్నా ఈ గొఱ్ఱెని అక్కడికి తీసుకుపోవాలని కొడుకు నక్కతో చెప్పింది. దీంతో కొడుకు నక్క కూడా సై అంది.. రెండు నక్కలూ కలిసి ముక్తకంఠంతో కళావతికి విచ్చేయమని సాదరంగా ఆ గొఱ్ఱెని ఆహ్వానించింది. ఎప్పటి నుండో తన మనసులో వున్న ఆలోచన ఈ రెండు నక్కల నోటా వచ్చే సరికి గొఱ్ఱె ఉబ్బి తబ్బిబ్బయింది. దాని ఆనందానికి అవధులు లేవు..
ఇది గమనించిన రెండు నక్కలూ గొఱ్ఱెకి చెరోవైపు చేరి ‘‘ గొఱ్ఱెగారూ.. మీరు పొరపాటున గొఱ్ఱెగా పుట్టారు... కానీ మీరు సింహం లాంటి వారు.. మీకు నాయకత్వ లక్షణాలున్నాయి. కనుక మీరే ఈ మహత్కార్యానికి నాయకత్వం వహించండి.. మీరూ గొఱ్ఱెల్లోనే సింహం లాంటి వారు’’ అని లేనిపోని మాటలు చెప్పాయి.
నిజానికి గొఱ్ఱె సింహం అవుతుందా...
గొఱ్ఱెల్లో సింహం వుంటుందా...
అందుకే పొగడ్త అనేది పన్నీటి వంటిది.. మీద చల్లుకోవాలే కానీ తాగెయ్యకూడదు కదా... కానీ గొఱ్ఱె రెండు గుంటనక్కల పొగడ్తలనే పన్నీటిని తాగేసింది.. దాంతో గుంటనక్కల మాటలు బాగా తలకెక్కాయి. తను గొఱ్ఱె అన్న విషయం మర్చిపోయింది.. సింహంగా భావించింది.. సంతోషంగా కళావతికి రావటానికి తన సమ్మతిని తెలియజేసింది.
********
‘‘కొల్లనూరు’’ చేరుకున్న రెండు గుంటనక్కలూ ముసలి నక్కని సమీపించి బుర్రలేని వెఱ్ఱి గొఱ్ఱె ఆగమనానికి ముహూర్తం నిర్ణయించమన్నాయి. ఆ ముసలి నక్క సంతోషంగా తమ ఆలోచనలు విజయవంతంగా కార్యరూపం దాల్చటానికి కావాల్సిన ముహూర్తాన్ని నిర్ణయించింది. రెండు గుంటనక్కలూ కూడా ఆనందంగా కళావతికి చేరుకున్నాయి. (ఇంకా వుంది.)
*******
కళావతి చేరుకున్న రెండు గుంటనక్కలూ కూడా ప్రపంచ పేరు ప్రఖ్యాతలు పొందిన కళావతి ముద్దుబిడ్డ అయిన గొఱ్ఱెని తిరిగి ఈనేలమీదికి తీసుకొస్తున్నామనీ, అందుకు కళావతి మొత్తం ఆనందంతో ఆహ్వానం పలకాలనీ, వివిధ కళారూపాలను ప్రదర్శించి ఆ గొఱ్ఱె మన్ననలు పొందాలనీ, అప్పుడే ఆ గొఱ్ఱె తిరిగి కళావతికి ఏదైనా చెయ్యగలడనీ ఉత్సాహ పరిచాయి. రెండు నక్కల పాచికలూ పారటంతో కళావతలోని జంతువులూ, పక్షలూ తమతమ శక్తి కొలదీ ఆ గొఱ్ఱెకి స్వాగత సత్కారాల నిమిత్తం తగినంత సమర్పించటంతోపాటు సేవలు కూడా చెయ్యటానికి ముందుకొచ్చాయి. పేరులోని కళావతి పేరు ఇనుమడించే విధంగా పెద్ద ఉత్సవం చేశాయి. ఉత్సవంలో పాల్గొన్న గొఱ్ఱె ఆనందానికి అవధులు లేవు. తెలివైనవాడిని అని నమ్మే ఆ గొఱ్ఱె తెలివి తక్కువ తనం అంతా కూడా అతి తెలివిగా బయటపెట్టుకుంటూ రెండు గుంటనక్కలనీ సభాముఖంగా అభినందనలతో ముంచెత్తింది. ఆ రెండు గుంటనక్కలూ తమ తెలివితో ఆ గొఱ్ఱెని సింహంగా అన్ని జంతువులనీ, పక్షులనీ నమ్మించాయి. అవి కూడా ఆనందంగా గొఱ్ఱెని సింహంగా ఒప్పుకున్నాయి. కళావతిలో జరిగిన ఉత్సవాన్ని రంగస్థలమనే అడవిలో మూలమూలలా వినిపించేలా ఈ రెండు గుంటనక్కలూ కూడా తగిన విధంగా పబ్లిసిటీ కూడా చేశాయి. దీంతో రంగస్థలంలో కళావతిపై అందరి చూపూ పడింది. ఎప్పుడెప్పుడు కళావతిలో తమతమ కళారూపాలు ప్రదర్శించాలా అని ఉవ్విళ్ళూరుతున్నాయి. సంవత్సరానికొక్కసారి నాలుగురోజులపాటు కళావతిలో కళాఉత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నది గొఱ్ఱె.. ఈ ఆలోచనరూపం దాల్చటానికి రెండు గుంటనక్కలకీ బాధ్యతలు అప్పగించి తిరిగి భాగ్యావతికి వెళ్ళిపోయింది గొఱ్ఱె..
*******
కథా నాయిక ప్రవేశం..
కథానాయిక ప్రవేశించలేదేంటా అని ఎదురు చూస్తున్నారు కదా.. కథా నాయిక వెనకాల చిత్రమైన ఫ్లాష్ బ్యాక్ వుంది.. అందుకే ఇప్పటి దాకా చెప్పకుండా ఆగాను. ఇప్పుడు చెప్తాను.. జాగ్రత్తగా చదవండి...
కళావతిలో చాలా కాలం నుంచి ‘‘సూర్యరేఖ’’ అనే కాకి వుండేది. పాపం ఆ కాకికి కూడా ఏదో ఒక కళారూపంలో ప్రావీణ్యం సంపాదించాలని కోరిక. కోకిలతనూ ఇద్దరూ నలుపే కదా పాటలు పాడదామని ప్రయత్నించింది. కానీ గొంతు సహకరించలేదు. కాకి తన జన్మకి బాధపడుతూ వుండగా కళావతి వేదికపై ఒక నెమలి నర్తించటం చూసింది. దాంతో కాకికి ఒక ఆలోచన వచ్చింది. నెమలి నర్తించే సమయంలో రాలి పడిన ఈకలని భద్రంగా దాచుకొని వాటిని అతికించుకుంటే తనూ నెమలి అయిపోతానని అతి తెలివికి పోయింది. అలాగే నెమలి నర్తనాన్ని యధాతధంగా మక్కికి మక్కీ సాధన చేసింది. కానీ పాపం అప్పటికే ఆ కాకి నడివయసుకు చేరుకుంది.
ఎంత నర్తించినా కాకి నెమలి అవుతుందా..? తను అతికించుకున్న నెమలి ఈకలతో ఆ కాకి నెమలిలా ముస్తాబైంది. తన అందాన్ని పదేపదే అద్దంలో చూసుకుంటూ మురిసిపోయింది. ఒకరోజు కళావతిలోని వేదికపై తానూ నర్తిస్తానని చెప్పి నర్తిస్తుండగా నెమళ్ళు కూడా ఆశ్చర్యంగా ఈ సూర్యరేఖ వైపు చూడటం మొదలు పెట్టాయి. వాటిలో అవి గుసగుసలాడుకున్నాయి. ‘‘ ఈ పక్షి ఏదో చూడటానికి కాకిలా వున్నా.. ఈకలు తమలా వున్నాయనీ... తమలాగే నాట్యం చేస్తోందని..’’ చెవులు కొరుక్కుంటున్నాయి. నాట్యం జరిగే సమయంలో కాకి కర్మకాలి ఆ ఈకలు ఊడిపోయాయి... దాంతో కాకి నిజస్వరూపం బయటపడింది. అప్పటి వరకూ ఆనందించి, చప్పట్ల కొట్టిన అన్ని జంతువులు కూడా కాకిని ఎగతాళి చేశాయి. ఆ అవమానాన్ని తట్టుకోలేక సూర్యరేఖ అక్కడి నుండి భాగ్యపురికి చేరుకొని కాకిగా పుట్టిన తను నెమలిగా మారేలా శస్త్ర చికిత్స చెయ్యమని డాక్టర్ కొంగ గారిని కోరింది. దీంతో కొంగ శస్త్ర చికిత్ససాధ్యం కాదు కానీ ఈకలు ఊడిపోకుండా వుండేలా చికిత్స చేస్తానని చెప్పి కాకిమీద జాలి చూపించి చిన్న పాటి చికిత్సతో నెమలీకలు కాకికి ఎప్పటికీ ఊడిపోకుండా వుండేలా అతికించి పంపించింది.
కొన్ని సంవత్సరాల చికిత్స పూర్తి చేసుకొని కాకినెమలిలా మారి భాగ్యపురి లో తిరుగుతున్న సూర్యరేఖని కొడుకు గుంటనక్క చూడగానే మనసు పారేసుకున్నాడు.. తన తియ్యటి మాటలతో సూర్యరేఖ మనసుని తెలుసుకున్నాడు. రంగస్థలంలోని కళావతి వేదికపై తన కళారూపం ప్రదర్శించాలని కోరిన సూర్యరేఖ కోరిక తీరుస్తానని, ప్రతిగా సహజీవనం చెయ్యాలని కోరాడు కొడుకు నక్క. దానికి సూర్యరేఖ కూడా తన ఆమోదం తెలియజేసింది. అలా తనకంటే వయసులో పెద్దదైన సూర్యరేఖని తన వెంటపెట్టుకొని కొల్లనూరు చేరుకున్నాడు కొడుకు గుంటనక్క. ముసలి నక్క కొడుకు నక్క చేసిన నిర్వాకానికి తిట్టి పోసింది. తన యవ్వనపు దూకుడుతో ముసలి నక్క నోరుమూయించాడు కొడుకునక్క. ఆ రోజు నుండి గొఱ్ఱె చెప్పిన సంవత్సరం ఎప్పుడొస్తుందా.. కళావతి వేదికపై తన ప్రియురాలు కళాప్రదర్శన ఎలా ఏర్పాటు చెయ్యాలా అని ఎదురుచూస్తున్నాడు. కళావతిలో తనకి జరిగిన అవమానాన్ని తన ప్రియుడైన కొడుకు నక్కకి చెప్పుకొని బాధపడింది. అందుకే కొడుకు నక్క తన తెలివితేటలతో ఈ సూర్యరేఖ పేరు ప్రఖ్యాతలు రంగస్థలం మొత్తం ఇనుమడించేలా బలవంతపు ప్రచారం చేశాడు. దీంతో రంగస్థలంలో ఏమూల విన్నా కూడా ఈ సూర్యప్రభ, కొడుకు నక్కల గురించే చర్చ నడుస్తోంది. (కొనసాగింపు వుంది.)
*******
పాఠకులకు ఒక సందేహం రావచ్చు.. మొదటి నుంచి సూర్యరేఖ అనే పేరుతో పరిచయమైన కాకినెమలి సూర్యప్రభ గా ఎలా మారింది అని.. సూర్యరేఖగా తను పొందిన అవమానాన్ని తన కాకిరూపంతో వదిలేస్తూ.. సూర్యరేఖ అనే పేరును వదిలించేసుకొని సూర్యప్రభ అనే కొత్తపేరుతో తన కళాప్రభ వెలిగిపోవాలని భావించింది. రకరకాల పేర్లు కాకినెమలి మదిలో మెదలుతుండగా... కొడుకు నక్క సూచనమేరకు సూర్యప్రభగా తన పేరు మార్చుకుంది. అలా కొడుకునక్క తన గాత్రంతో, సూర్యప్రభ తన నాట్యంతో కళాప్రదర్శనలు ఇవ్వటం మొదలు పెట్టారు. కానీ వీళ్ళ కర్మ ఏమో కాని కొడుకు నక్క గాత్రం అంతగా ఆకట్టుకోక పోవటంతో ముసలి నక్క సాయం కోరటం జరిగింది. అప్పటికే ముసలి నక్క వయసులో వున్నప్పుడు కళాకారుడిగా తను సంపాదించుకున్న పేరుని అడ్డం పెట్టుకొని కొడుకునక్క సూర్యప్రభతో రంగస్థలంలోని ప్రతిచోటా జంతువులను, పక్షులను చేరదీసి కళావిన్యాసం చేయసాగాడు. ముసలి నక్కకున్న పేరు ప్రఖ్యాతలతో కొడుకునక్క, సూర్యప్రభలు ఆ వైభవమంతా తమదే అన్నట్లుగా భావిస్తూ... మురిసిపోతూ సాటి కళాకారులైన జంతువులతో, జంతువులతో అహంకార సంభాషణలు చెయ్యటం మొదలుపెట్టారు. తోటి కళాకారులలో ఈనక్క, కాకినెమలిల పట్ల అసహ్యం, ద్వేషం పెరిగిపోసాగాయి.
ముసలినక్క వయసు అయిపోయినా తన చక్కటి ఊళతో నక్కగానం చేస్తూ శ్రోతలను ఉర్రూతలూగించాడు. కొడుకు నక్కకు మాత్రం గాత్రం సహకరించటంలేదు.. అతను ఊళవేద్దామని ప్రయత్నించిన ప్రతిసారీ గాడిద ఓండ్రుపెట్టినట్లుగా వస్తుండటంతో మధ్యమధ్యలో తండ్రి పాటకు అపశ్రుతిలా మారాడు. కొడుకుని ఏమీ అనలేక, కాకినెమలిని చూసి కంపరం తట్టుకోలేక ముసలి నక్క విలవిలలాడుతూ.. చివరికి కళ్ళుమూసుకొని గాత్రకచేరీలు చేసుకోసాగాడు.. పాపం ముసలినక్క.. అలా తన కళావిన్యాసం రంగస్థలం మూలమూలల్లోనూ చేస్తూ ఈనక్క బృందం పేరుప్రఖ్యాతలు తెచ్చుకొంది.. ఒక్క కళావతి ప్రాంతంలో తప్ప.
******
అనుకున్నట్లుగా వెర్రి గొఱ్ఱె నిర్ణయించిన సుముహూర్తం రానే వచ్చింది. మాఘ పౌర్ణమికి సరిగ్గా మాసముందనగా కార్యక్రమం నిర్వహించే బాధ్యతను గుంటనక్క, కొడుకునక్కల భుజస్కందాలపై వుంచింది వెర్రి గొఱ్ఱె. అప్పటికే రంగస్థలారణ్యంలోని తోటి కళాకారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటున్న కొడుకు నక్కపై వెర్రి గొఱ్ఱెకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ నక్క వుంటే తాము కళాప్రదర్శనలు చేయలేము అని. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాని వెర్రి గొఱ్ఱె తను గుడ్డిగా నమ్మిన గుంటనక్కను సంప్రదించింది. గుంట నక్క వెఱ్ఱిగొఱ్ఱెకు అభయమిచ్చింది. కొడుకు నక్కపై గొఱ్ఱె ముందు కోపం ప్రకటించింది. ‘‘ కళాకారుల్లో వీడు తప్పపుట్టాడు.. ఇతన్ని అజమాయిషీ చేసే సమూహం నుండి వెంటనే తొలగిస్తానని’’ ప్రగల్భాలు పలికింది..
పేరుకు తగ్గట్లే పాపం వెర్రి గొఱ్ఱె నమ్మేసింది. చిరునవ్వుతో బాధ్యతను గుంట నక్క చేతిలో పెట్టి తను సమయానికి వస్తానని చెప్పి గుంట నక్కని పంపించేసింది గొఱ్ఱె..
ఇదంతా గమనిస్తున్న మేకపోతు కృష్ణ గొఱ్ఱెతో ‘‘ ఇవన్నీ నీకు అవసరమా..? హాయిగా మాటలు అమ్ముకుంటూ మూటలు సంపాదిస్తున్నావు.. సంపాదించిన మూటలు దాచుకోకుండా.. కళావతి అనే ఊరిపేరులోతప్ప లేని కళని తిరిగి పునః ప్రతిష్ఠించాలని ఎందుకు పాకులాడతావని’’ నచ్చచెప్పింది.
అప్పటిదాకా తన మేలు కోరి, తన ఎదుగుదలకు కారణమైన తెలివైన మేకపోతు కృష్ణ చెప్పిన మాటలు గొర్రెకి నచ్చలేదు. ఎప్పటిలాగే తెలివిగా మాట్లాడుతున్నానని భావించిన గొఱ్ఱె.. ‘‘ మిత్రమా.. కృష్ణా ! ఇన్నాళ్ళూ నేను మాత్రమే మూటలు సంపాదించుకున్నాను.. జన్మనిచ్చిన నేల ఈ రోజు తన ఉనికిని కాపాడమని ఎదురుచూస్తోంది. ఆ నేలపై పుట్టిన వాడిగా అది నా ధర్మం.. ఈ విషయంలో నన్ను నువ్వు బలవంతం చెయ్యకు’’ అని చెప్పింది.
దానికి మేకపోతు కృష్ణ ‘‘ నిజమే మిత్రమా..? జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది. కానీ గుంట నక్కని నమ్మటం అంత మంచిది కాదు. గుంట నక్క తన తెలివితేటలతో, నీవు చెప్పే పదాలకంటే తీయని పదాలతో నీ మనసు దోచేసింది. అందుకే నామాటలు నీకు ఛేదుగా వున్నాయి. నిజం ఛేదుగానే వుంటుంది. అర్థం చేసుకో.. జాగ్రత్త ’’ అని చెప్పింది.
అందుకు గొఱ్ఱె తన కొమ్ములు ఎగరేస్తూ.. ‘‘ పిచ్చి కృష్ణా.. నువ్వూ .. నేనూ ఒకటేనా.. నేను కొమ్ములు తిరగిన గొఱ్ఱెని.. చూడు నా బుర్ర ఎంత గట్టిదో.. దీనితో బలంగా ఒక్కకుమ్ము కుమ్మితో సింహాలు కూడా చచ్చిపోతాయి. పైగా నేను గొఱ్ఱెల్లో పుట్టిన సింహాన్ని.. నాయకత్వ లక్షణాలు నాకు పూర్వజన్మనుండే అలవడ్డాయి. ఒక్కసారి నీ జ్ఞననేత్రం తెరిచి చూడు.. నీకూ నేను సింహంలాగా కనిపిస్తాను.. ఒక్కసారి మేముండే కళావతికి వచ్చి అడుగు.. నేను గొఱ్ఱెనో.. సింహాన్నో అక్కడున్న జంతువులూ, పక్షులే చెప్తాయి...’’ అని విర్రవీగుతూ... గుంటనక్క మాటలను మననం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది.
కృష్ణమేక ఆకాశంలోకి చూస్తూ... ‘‘ మిత్రమా.. నీలాంటి మూర్ఖులకి కాలమే సమాధానం చెబుతుంది. తీయనైన చెడు నీకు హాని చేయకుండా చూడాలని భగవంతుడిని ప్రార్థించటం కంటే ఇప్పుడు ఏమీ చెయ్యలేను. కానీ కాలం నీకు నేర్పించే గుణపాఠం నేర్చుకొని తిరిగి నా దగ్గరకే వస్తావని నీ మిత్రుడిగా ఆశగా ఎదురు చూస్తాను ’’ అని మనసులో అనుకుంది.. అక్కడి నుండి రాజసంగా వెళుతున్న గొఱ్ఱెని చూస్తూ తనలో తనే బాధపడింది.
నిజమైన మిత్రుడు అంటే ఈ మేకపోతు కృష్ణలాగే వుంటాడేమో.. మరి..
*****
భాగ్యపురిలో జరిగింది తెలుసుకున్న కొడుకునక్క వెర్రిగొఱ్ఱెమీద నిప్పులు చెరిగింది. ఏదేదో చేసేస్తానని కారాలు మిరియాలు నూరింది.. గుంటనక్క కొడుకునక్కతో.. .
‘‘ మిత్రమా.. నీకు ఒక నక్కకు వుండాల్సిన సహజలక్షణాలు ఏమయ్యాయి. అన్ని జంతువులకూ బలం వుంటే మనకి బుద్ధి బలముంటుంది. నీ మిత్రుడిగా నేను చేయగలిగింది చేస్తాను.. ఏం చెయ్యమంటావో చెప్పు ’’ అని కొడుకు నక్క కన్నీరు తుడిచింది గుంటనక్క.. ఇంకా కొడుకు నక్కతో ఇలా చెబుతోంది..
‘‘ మిత్రమా.. పెరుగుట విరుగుట కొరకే అన్న చందంగా.. పేరుతో పాటే నీకు అహంకారం వచ్చింది. ఆ అహంకారమే నీ బుద్ధిని ఒక మబ్బులా కప్పేసింది. నీకు లేని, నీకు రాని దానికోసం తాపత్రయపడుతూ తదేక ధ్యానంతో నీలోని వివేకాన్ని పూర్తిగా మర్చిపోయావు. నీ నక్క బుద్ధిని బయటపెట్టే సమయం ఆసన్నమైంది. అదే ఈరోజు నీ కొంపముంచి నిర్వహణ సమూహం నుండి తొలగిపోయేలా చేసింది. నువ్వు కానీ ఈ నిర్వహణ సమూహంలో వుంటే చూసేవారు, అనేవారు అనేకమాటలు అంటారు.. తమలో తము అనుకుంటారు. కనుక నీ అంతట నువ్వు తప్పుకో.. నీవాడిగా నేను ఏం చెయ్యాలో.. ఎలా చెయ్యాలో చేస్తాను. నన్ను నమ్ము’’ అని ఊరడించింది.
నీకేం కావాలో కోరుకో... అని గుంటనక్క కొడుకు నక్కకి వరదహస్తం ఇచ్చింది.
కొడుకు నక్కకి అజమాయిషీ సమూహం నుండి తప్పుకోమనటంతో ఏడుపు తన్నుకొచ్చింది. గుంటనక్క చెప్పినట్లు వినక తప్పని పరిస్థితి ఆ నక్కకి దాపురించింది. విధిలేక తన సమ్మతిని అసమ్మతితో తెలియజేసింది.
‘‘ ప్రియమైన మిత్రమా గుంటనక్కా.. నీకై నువ్వుగా వరం ఇస్తానన్నావు కనుక అడుగుతున్నాను.. నా ప్రియమైన సూర్యప్రభతో ఈ రంగస్థలారణ్యానికే తలమానికమైన కళావతి కళావేదికపై నా గాత్ర సంగీతానికి తన నృత్యప్రదర్శన ఏర్పాటు చెయ్యి. ఎక్కడైతే తన రూపానికి అవమానం జరిగిందో అక్కడే తనకి పట్టాభిషేకం జరగాలి. ఆ పట్టాభిషేకం ఈ రంగస్థలారణ్యమంతా మారుమ్రోగిపోయేలా ప్రచారం జరగాలి.. అదే నేను నా ప్రియమైన సూర్యప్రభకిచ్చే ప్రేమ కానుక.. ’’ అన్నది కొడుకునక్క..
తన మిత్రుడు కొడుకు నక్క పూర్తిగా అబద్ధమైన కాకినెమలిని ఇష్టపడుతున్నాడనీ, ఆరాధిస్తున్నాడనీ గుంట నక్కకి అర్థమైంది. సహజమైన నక్క తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి ప్రేమపాఠాలు చెబుతోందని ఇది తమ నక్క జాతికే అవమానమని తోటి నక్కగా కొడుకు నక్కకి గుణపాఠం నేర్పాలని భావించింది. ‘‘ కాలం నేర్పే పాఠంకోసం ఎదురు చూసేవాడు సామాన్యుడు. కానీ నక్కలు అలా కాదు.. కాలాన్నే తమకి అనుకూలంగా మార్చుకోగలవు.. తన మిత్రుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ మత్తుని వదిలించాలని’’ గట్టి నిర్ణయం తీసుకుంది గుంట నక్క..
**********
మాఘపౌర్ణమి రానే వచ్చింది. ఎన్నో జంతువులు, పక్షులు రంగస్థలారణ్యానికే తలమానికమైన కళావతి కళావేదికపై తమతమ ప్రదర్శనలు అత్యద్భుతంగా ప్రదర్శించేందుకు వచ్చాయి. గుంట నక్క వంతుల వారీగా ఒక్కొక్కరినీ పిలుస్తోంది.. వారు వారు వేదికపైకి వచ్చి తమతమ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. వేదిక చుట్టూ చేరిన తోటి జంతువులు, పక్షులు అన్నీ ఆ కళాప్రదర్శనలను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు... అంతలో గుంటనక్క వేదికపైకి తన ప్రియమైన మిత్రుడు కొడుకు నక్కనీ, సూర్యప్రభనీ వారి కళావిన్యాసం చేసేందుకు ఆహ్వానించాడు..
ఇక్కడ సూర్యప్రభకి చిన్న ఆటంకం ఏర్పడింది.. చిన్న ఫ్లాష్ కట్..
తన ప్రియమైన కొడుకునక్కకి అజమాయిషీ సమూహంలో చోటు దక్కనందుకు బాధపడింది సూర్యప్రభ.. తనకోసం కొడుకు నక్క చేసిన త్యాగానికి పొంగిపోయింది. ఎలాగైనా ఆ కొడుకునక్క త్యాగానికి కృతజ్ఞత చూపించాలని భావించింది. ప్రదర్శన రక్తి కట్టించాలని డాక్టర్ కొంగ తనకు ఇచ్చిన నెమలి డ్రస్సుని ఒకటికి రెండు సార్లు పరీక్షించింది. డ్రస్సు ఊడిపోకుండా కట్టుకునే దారాలు ఎవరో తెంచేశారు. శరీరానికి అంటించుకునే బంక సీసాని మాయం చేశారు. ఏం చెయ్యాలో అర్థంకాని అయోమయమైన పరిస్థితుల్లో కాకినెమలి సూర్యప్రభ వుంది.
గుంటనక్కకి విషయం అర్థమైంది.. తనలో తనే నవ్వుకుంది.. ఏమీ తెలియని దానిలా మరోసారి సూర్యప్రభ, కొడుకు నక్కలని వేదికమీదికి ఆహ్వానించి కళావిన్యాసం చేయమని పదేపదే పిలుస్తోంది.
కొడుకు నక్క సూర్యప్రభని తొందరచేసే క్రమంలో ఆమె వున్న గదిలోకి వచ్చి చూసేసరికి అక్కడ ఎప్పుడూ చూసే సూర్యప్రభకి బదులుగా ఒక ముసలి కాకి కనిపించింది.. కొడుకు నక్కకి విషయం అర్ధంకాలేదు.. ఆలోచించే తీరికా లేదు.. సూర్యప్రభ ఏమైందని అడిగాడు.. ముసలి కాకితో.. ముసలి కాకి కొడుకు నక్కతో సూర్య ప్రభ స్నానం ముగించుకొని వస్తుంది.. ఈలోగా వెళ్ళి వేదికపై గాత్రకచేరీ చెయ్యమని పంపించేసింది. చేసేది లేక కొడుకు నక్క అసహనంగా అక్కడి నుండి బయల్దేరుతూ సూర్యప్రభని త్వరగా వేదికపైకి రమ్మని కాకికి చెప్పి వెళ్ళిపోయాడు.
చేసేది లేక తన నెమలి డ్రస్సు ఊడిపోకుండా వుండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నర్తించాలని నిర్ణయించుకొని డాక్టర్ కొంగ చెప్పినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొంత సొంత తెలివితేటలు వాడి ఆకాకి నెమలి లా అలంకరించుకొని అలాగే వేదికపైకి వచ్చింది సూర్యప్రభలా... ఆమెని చూస్తూనే కొడుకు నక్క చిరునవ్వు నవ్వాడు. సూర్యప్రభ రాజసంగా కులుకుతూ వేదికపైకి వచ్చింది.
అప్పటికే రంగస్థలారణ్యంలో వీరి కళావిన్యాసం గురించి తెలిసి వుండటంతో రంగస్థలారణ్యంలోని అన్ని జంతువులూ, పక్షులూ కళావతి వేదిక చుట్టూ గుంపులుగా చేరిపోయాయి..
కొడుకు నక్క ముసలి నక్క గాత్రానికి తన గార్ధభస్వరంతో వంతపాడుతున్నాడు.. సూర్యప్రభ తన్మయత్వంతో నెమలిలా నాట్యం చేస్తోంది.. నక్కల గాత్రకచేరీకి సూర్యప్రభ నాట్యం... అమోఘంగా సాగిపోతోంది. అన్ని జంతువులూ, పక్షులూ తన్మయత్వంతో ఊగిపోతున్నాయి. అలా నాట్యం చేసే క్రమంలో నెమలి డ్రస్సు పూర్తిగా ఊడిపోయింది.. సూర్యప్రభ తన నిజస్వరూపమైన సూర్యరేఖగా మారిపోయింది. అంతే అప్పటిదాకా ఆస్వాదించిన జంతువులన్నీ కూడా ఒక్కసారిగా కాకిని చూసి పకపకా నవ్వేశాయి.. ఆ నవ్వులేవీ సూర్యరేఖకి పట్టలేదు. గాత్రం ఆపేశాయి తండ్రినక్కా, కొడుకునక్కా.. అప్పటికి కానీ సూర్యరేఖ ఇహంలోకి రాలేదు. సిగ్గుతో ఏడుస్తూ నిలబడింది. కొడుకు నక్క సిగ్గుతో తల వంచుకున్నాడు.. ముసలి నక్క కొడుకు నక్కని మనసులోనే తిట్టిన తిట్టు తిట్టుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. తండ్రి వెనుకే కొడుకు వెళ్ళిపోయాడు..
వేదికపై సూర్యరేఖ మాత్రమే నిలబడి వుంది. అన్ని ప్రదర్శనలూ వీక్షిస్తున్న వెర్రి గొఱ్ఱె రాజసంగా సింహంలా వేదికపైకి వచ్చి నిలబడి చప్పట్లు కొట్టి సూర్యరేఖతో.. ‘‘కాకిగా పుట్టి.. నీ జాతి లక్షణాలను పూర్తిగా మరచిపోయి నెమలిలా అమోఘంగా నర్తించావు. చూసే మమ్మల్ని అందరినీ కూడా నెమలి అనే నమ్మించావు.. నిజమైన కళాకారిణి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించగలగటం.. ఇక్కడ కళారూపాలు ప్రదర్శించిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జాతి లక్షణాలను విడనాడకుండా తమతమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. కానీ ఈ కాకి అలా కాదు. అందుకే ఈ కాకి ఉత్తమమైన కళాకారిణిగా బహుమతినిస్తున్నాను..’’ అన తన న్యాయనిర్ణయాన్ని తెలియజేసి తగిన రీతిగా బహుమానం ఇచ్చాడు.
అప్పటి వరకూ తన రూపాన్ని మాత్రమే ఇష్టపడి మోహించిన కొడుకు నక్క తనకి అవమానం జరగగానే అక్కడి నుండి వెళ్ళిపోవటంతో సూర్యరేఖ తన మనసులోంచి కొడుకునక్కని చెరిపేసింది. తనను తనుగా గుర్తించిన వెర్రి గొఱ్ఱెని ఆ నిమిషం నుండి ఆరాధించటం మొదలు పెట్టింది. అయితే తక్కిన జంతువులూ, పక్షులు గొఱ్ఱె న్యాయ నిర్ణయాన్ని తప్పు అని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. గుంట నక్క అక్కడి నుండి చల్లగా జారుకుంది. దీంతో విసిగి పోయిన గొఱ్ఱె ఇక నుంచి మాఘపౌర్ణమి ఉత్సవాలు కళావతిలో జరపనని చెప్పి సూర్యరేఖని తనతో తీసుకొని భాగ్యపురివైపు అడుగులు వేస్తున్నాడు గొఱ్ఱె. సూర్యరేఖ మౌనంగా గొఱ్ఱెని అనుసరించింది. అబద్ధమైన సూర్యప్రభ అనే బ్రతుకు కంటే నిజమైన సూర్యరేఖగా బ్రతకాలని నిర్ణయించుకుంది కాకి.
అప్పటి వరకూ అదను కోసంచూస్తున్న గుంటనక్క కొడుకు నక్క దగ్గరికి వెళ్ళి సూర్యరేఖని చూపిస్తూ.. ‘‘చూశావా మిత్రమా..! ఎంతైనా కాకి కాకే కానీ నెమలి కాలేదు.. కాకి తన బుద్ధిని చూపించింది. నిజం చెప్పాలంటే జంతువులు ఏనాటికైనా తమ జాతి జంతువుతోనే జతకట్టి సుఖంగా వుంటాయి కానీ పక్షులతో కాదు... ఈ నిజాన్ని నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నా.. కానీ నువ్వు స్థిరం లేకుండా ఆకాశంలో కాసేపు, చెట్లమీద కాసేపు, నేలమీద కాసేపు స్థిరత్వం లేకుండా సంచరించే కాకిని నెమలి అని భావించి ప్రేమించావు.. అదే నిజమని ఆరాధిస్తున్నావు.. నీ కళ్ళకు కమ్మిన మాయపొరని విడగొట్టాలని అనుకున్నాను. కానీ కాలమే నీ కళ్ళకు కట్టిన గంతలను తొలగించింది.. జంతువులెప్పుడూ స్థిరంగా నేలమీదే వుంటాయి. అదే నిజం.. కానీ పక్షులు అస్థిరాన్ని నమ్ముతాయి.. అస్థిరాన్ని నమ్ముకొని నీకు నువ్వే మోసపోయి ఒక అబద్ధానికి ఊడిగం చేశావ్.. ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయని భావిస్తాను.. ’’ అన్నది గుంట నక్క ఉద్వేగ భరితంగా..
కొడుకు నక్కకి కనువిప్పయి గుంటనక్కని ఆలింగనం చేసుకుంది. కొడుకు నక్కలో వచ్చిన మార్పుకి సంతోషించింది ముసలి నక్క.. ఒక మంచి ముహూర్తం చూసి ముసలినక్క తమ జాతిలో ఉత్తమమైన ఆడనక్కని చూసి కొడుకు నక్కకి వైభవంగా పెళ్ళి చేసింది. రంగస్థలారణ్యంలో కళావతి వేదికపై ఎప్పటిలాగే మాఘపౌర్ణమి ఉత్సవాలు జరుగుతునే వున్నాయి.. గొఱ్ఱె సాయంతో కాదు.. గుంటనక్క మిత్రుల యుక్తితో... కళావతి పౌరుల శక్తితో...
భాగ్యపురి పొలిమేరల్లో కృష్ణ గొఱ్ఱె రాకకోసం ఆనాటి నుండి ఎదురు చూస్తూనే వున్నాడు.. గొఱ్ఱె కృష్ణ మేకను చూస్తూనే వేగంగా వెళ్ళి ఆలింగనం చేసుకొని ‘‘ మిత్రమా ! స్నేహధర్మంగా నువ్వు చెప్పిన మాటలు నేను పెడచెవిన పెట్టాను. నాకు అంతా అర్థమైంది.. ఇక నేను కళావతి వైపు కన్నెత్తి కూడా చూడను.. నీ మాటే నాకు శాసనం ’’ అంటూ మోకరిల్లింది. కృష్ణమేక మిత్రుడిని ఆనందంగా లేవనెత్తి భాగ్యపురిలోకి తీసుకెళ్ళింది. సూర్యరేఖ భాగ్యపురి దాకా గొఱ్ఱెతో వెళ్ళి అక్కడి నుండి తన దారి తను చూసుకుంది. తన మనసులో ‘‘ ఆనందింప చేసే అబద్ధంకన్నా.. నిప్పులా కాలే నిజమే మిన్న... ఎందుకంటే నిజమే శాశ్వతం కనుక.. కాకిగానే ఈ కాస్త జీవితం గడుపుతాను’’ అనుకుంటూ.. చీకటిలోకి వెళ్ళిపోయింది.
కథ కంచికి ... మనం ఇంటికి..
*******
ఈకథలో నీతి : ఎన్ని ధర్మాలున్నా స్నేహధర్మాన్ని మాత్రం విడనాడకూడదు.. ఇక్కడ కృష్ణ కానీ, అక్కడ గుంట నక్కకానీ ఎవరి స్నేహితులకోసం వారు పాకులాడారు. ఆనందంలో వెంటవుండే స్నేహితుడు కాదు.. ఆపదలో కూడా వెంటవుండే స్నేహితుడే నిజమైన స్నేహితుడు.
స్నేహితుల దినోత్సవం రోజు ఒక మిత్రుడు నాకు పంపిన కొటేషన్ చదివాక నాకెందుకో ఒక కథ రాయాలనిపించింది. దానికోసమే పరవస్తు చిన్నయసూరిగారి పంచతంత్ర కథను ఇన్స్పిరేషన్ గా జంతువులు, పక్షులతో మిత్రలాభం, మిత్రభేదం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటూ రాసుకున్నదే తప్ప మరేదీ కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను..